[dropcap]కు[/dropcap]టుంబ కథా చిత్రాలకు తెలుగులో ఒకప్పుడు మంచి ఆదరణ ఉండేది. కొంత విరామం తరువాత మళ్ళీ ఈ మధ్య కాలంలో ఆ ట్రెండ్ లోకి తెలుగు సినిమా వస్తున్నట్లు కనిపిస్తుంది. ఉత్తమ కుటుంబ కథా చిత్రాల ప్రసక్తి వచ్చినప్పుడు వినూత్నమైన చిత్రంగా మాత్రం ‘బాంధవ్యాలు’ను పరిగణించాలి. దీనికి 1968లో నంది అవార్డు లభించింది. ఈ సినిమాకు ఎస్.వీ. రంగారావు గారే దర్శకత్వం వహించడం ఒక విశేషం.
ఇది ఒక కుటుంబ కథ. కుటుంబ పెద్దను సినిమాలో అన్ని పాత్రలు పెద్దయ్య అనే పిలుస్తారు. భార్య మరణించాక గుడ్డి కొడుకుతో మిగిలిపోతాడు ఆయన. ఆ కొడుకుకి చాపలు నేసే పని నేర్పిస్తూ ఆ యువకుడిని తన డబ్బు తాను సంపాదించుకునేలా తీర్చిదిద్దాలని అతని ప్రయత్నం. పెద్దయ్య తమ్ముడు చిన్నయ్య అమాయకుడు, లౌక్యం లేనివాడు. అతని భార్య సావిత్రి. వారి ముగ్గురు పిల్లలని పట్నంలో చదివిస్తూ ఉంటారు. వీరందరి మధ్య ఉండే ప్రేమాభిమానలు ఈ సినిమాకు కథావస్తువు. ఉమ్మడి కుటుంబంలో అందరూ ఒకే రకంగా ఉండరు. వీరందరినీ ఒకే గూటి క్రింద ఉంచడం పెద్దయ్య పని. పొలం పనులు అన్నీ తానే నిభాయిస్తూ కుటుంబంలో ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా చూస్తుంటాడు పెద్దయ్య. అతని ఆరోగ్యం మునుపటిలా లేదని, మనిషిలోని ఓపిక తగ్గుతుంది అని మరదలు గమనిస్తుంది. ఈ సినిమాలో ముఖ్య విషయం ఈ బావా మరదళ్ళ మధ్య ఉండే అనుబంధం. తన కుటుంబానికి పెద్దయ్యే పెద్ద దిక్కని అతను బావుంటే తామంతా బావుంటామని అందుకని అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె తల్లడిల్లిపోతూ ఉంటుంది. తన భర్త పెద్దగా సమర్థుడు కాడని, మంచివాడయినా అమాయకుడని అన్న నీడన తప్ప బ్రతకలేడని ఆమెకు తలుసు.
ఇంటి విషయాలన్నీ తానే చూసుకుంటూ భర్తను కుటూంబాన్ని పెద్దాయన సహాయంతో లాక్కువస్తుంది. బస్తీలో విలాసాలకు అలవాటు పడిన చిన్నయ్య పిల్లలు ఒకో క్లాసు మూడు సార్లు ఫెయిల్ అవుతూ విలాసంగా డబ్బు ఖర్చు పెడుతూ జల్సాగా బ్రతుకుతుంటారు. వారి చదువు మాన్పించమని పెద్దయ్య ఎంత చెప్పినా చిన్నయ్య వినడు. అతనికి పిల్లలపై గుడ్డి ప్రేమ. ఏ నాటికైనా వారు గొప్పవారవుతారని అతని ఆశ. పిల్లల గురించి అన్నీ తెలిసిన అతని భార్య మాత్రం భర్త గుడ్డి ప్రేమను విమర్శిస్తూనే ఉంటుంది. ఆ పిల్లలే తమ భవిష్యత్తు తరం అని వారిని ఒక దారి చేయాలని పెద్దయ్య తాపత్రయపడుతూ ఉంటారు.
మళ్ళీ పరీక్ష ఫెయిల్ అయి ఈ సారి కారు కొనిస్తే పాస్ అవుతాం అంటారు ఆ కుమారులు. మళ్ళీ తండ్రిగా వారి మాటల మాయలో పడిపోతాడు చిన్నయ్య. ఆ ఇంటి ముందు నివసించే రాజనాల దొంగ వ్యాపారాలు చేస్తూ ఉంటాడు. అతని తమ్ముడు చంద్రమోహన్ అన్న పొడ గిట్టక విడిగా ఉంటుంటే చూసి తమ ఇంటికి తీసుకు వస్తాడు పెద్దయ్య. చంద్రమోహన్ చిన్నయ్య కూతురు లక్ష్మిని ప్రేమిస్తాడు. రాజనాలకు ఈ కుటుంబ అనుబంధాలు చూస్తే చాలా కోపం. పనికి రాకుండా పోతున్న చిన్నయ్య కొడుకుల కారు పిచ్చి కనుక్కుని వారికి దొంగ కారు అమ్ముతాడు. ఆ కారు కోసం చిన్నయ్య అప్పు చేసే పరిస్థితి వస్తుంది. చిన్నయ్య తనకు తెలీయకుండా అప్పు చేసాడని పెద్దయ్యకు తెలిసినా ఊరి వారి ముందు చులకన అవడం ఇష్టం లేక, తమ్మ్జుడిని చులకన చేయడానికి మనసు రాక, చిన్నయ్య తనకు చెప్పే అప్పు తెచ్చాడని ఊరి వారి నోరు మూయిస్తాడు. ఇంటికి వచ్చి తమ్ముడిని మందలిస్తాడు. అయితే తమ్ముడి కొడుకులు రాజనాల మాట నమ్మి ఆస్తి పత్రాలపై సంతకాలు చేసారని పెద్దయ్యకు తెలిసినప్పుడు అతనికి ఇంటి భవిష్యత్తు ప్రశ్నార్థకంలా కనిపిస్తుంది. ఊరంతా ఆశ్చర్యపోయేటట్లు ఆస్తి పంపకానికి పెడతాడు. తమ్ముడు బ్రతిమాలినా వినడు. మంచి పొలం, రొక్కం తన పేర ఉంఛుకుని బీడు భూమి ఇల్లు తమ్ముడిని అప్పజెపుతాడు. అన్న అంతర్యం చిన్నయ్యకు అర్థం కాదు.. చిన్నయ్య కొడుకులు ఇంటి నుండి వెళ్ళిపొమ్మన్నారని పెద్దయ్య పొలంలోని కొష్టంలోకి తన బిడ్డతో వెళ్ళిపోతాడు.
మరదలు మాత్రం బావగారు ఏదో ఉద్దేశంతోనే ఇది చేసారని నమ్ముతుంది. అతని భోజనావసరాలు చూడడానికి పొలం వెళుతుంది. అక్కడ బావగారికి, అతని కొడుకుకి అన్నం కలిపి తినిపించే సీన్ సినిమాలో ముఖ్య ఘట్టం. చివరకు రాజనాల చిన్నయ్య కొడుకులను కోర్టుకు లాగడం, వారి పేర ఉన్న ఆస్తి తనకు పనికి రాదని తెలిసి రాజనాల నిరాశపడడం, అతని మోసాన్ని పెద్దయ్య చదివించిన హరనాధ్ లాయర్‌గా రుజువు చేసి జైలు పాలైన చిన్నయ్య పిల్లలను విడిపించుకు రావడం సినిమా కథ.
ఉమ్మడి కుటుంబాలలో సంబంధాలను చూపించిన గొప్ప చిత్రం ఇది. ఆఖరున కొంత సాగతీత అనిపించినా, వ్యక్తుల మధ్య అనుబంధాలను బాగా చూపించారు దర్శకులు. బావగారు మరదలు కలిసి ఇల్లు నడపడం, ఇంటిని సమర్థించుకురావడం, వారి మధ్య ఉన్న అనుబంధం చాలా గొప్పగా ఉంటుంది. ఇంటి పెద్దగా పెద్దయ్యకు విశ్రాంతి ఇవ్వాలని పనులు చెప్పకుండా మరదలు ఉంటే, తనను వేరు చేసారని బావగారు పడే బాధ, చాలా కుటుంబాలలో పెద్ద వయసు వ్యక్తులు కుటుంబం పై చూపే కోపాన్ని గుర్తుకు తెస్తుంది. పెద్దవారిని పనులు మానుకొమ్మన్నప్పుడు తమను కుటుంబం వేరు చేసిందని, తమ ప్రాపకం పోయిందని పెద్దలు బాధపడడం సహజంగా జరిగేదే. ఆ భావాన్ని చక్కగా చూపిన సినిమా ఇది. అలాగే తమ్ముడి పిల్లలకు ఆస్తి మిగిలించాలని ఆ వయసులో పెద్దయ్య చూపే తెగువ సమయస్ఫూర్తి అప్పటి ఉమ్మడి కుటుంబాలలోని పెద్దలను గుర్తుకు తెస్తుంది.
నాగయ్య గారు ఆచార్యుల పాత్రలో కనిపిస్తారు. బావగారు నీరసించిపోతున్నారని అతనికి మందు ఇమ్మని, ఆయన క్షేమంగా ఉండడంలోనే తమ కుటుంబ శ్రేయస్సు ఉందని అతని వద్ద మరదలు బాధపడుతున్నప్పుడు ఆచారి గారు పెద్దయ్యకు విశ్రాంతి ఇవ్వమని చెబుతాడు. అదే ప్రయత్నం ఆమె చేసినప్పుడు అలిగి ఇల్లు వదిలి ఆ అచారి దగ్గరకే వస్తాడు పెద్దయ్య. తనను వెతుక్కుంటూ వచ్చిన తమ్ముడు మరదలు తనకు విశ్రాంతి ఇవ్వడానికి తపిస్తున్నారని, తన క్షేమం కోసం పాటు పడుతున్నారని తెలుసుకుని అలకమాని వారిని అక్కున చేర్చుకునే సీన్ సినిమా మొత్తానికి ముఖ్యమైన ఘట్టం. వేర్లు పోయిన తరువాత అన్నదమ్ములిద్దరూ ఒకరికోసం ఒకరు తపించిపోవడం, తన పిల్లలు అన్నని అవమానిస్తారని, అన్నని ఇంట్లోకి తమ్ముడు రానివ్వకపోవడం ఇలాంటి కొన్ని సీన్లు ఉమ్మడి కుటుంబాలలోని ప్రేమలను చూపిస్తాయి.
పెద్దయ్య ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నప్పుడూ బ్యాక్‌గ్రౌండ్ పాటగా వచ్చే “మంచితనానికి ఫలితం వంచన” చాలా పాపులర్ పాట అలాగే “హావాయి తువాయి”, “అటు గంటల మోతలు గన గన” అనే పాటలు కూడా రేడియోలో అప్పట్లో ఎక్కువగా వచ్చేవి. పెద్దయ్య చదివించిన హరనాధ్ తక్కువ కులానికి చెందినవాడు. అతన్ని అవమానిస్తూ రాజనాల అతని కులాన్ని తూలనాడే సీన్‌లో కులం అన్నది పల్లెటూర్లలో ఎంత ముఖ్య పాత్ర వహించిందో అర్థం అవుతుంది. కులం తక్కువ సన్యాసి అని రాజనాల హరనాధ్‌ను తిడుతున్నప్పుడు, అతన్ని చెట్టు క్రింది ప్లీడర్ అని అవమానిస్తున్నప్పుడు “ఏ ప్లీడర్ అయితే ఏమయ్యా నాకు ఇచ్చారుగా నల్ల కోటు” అంటూ నిమ్న కులస్తుల బాగు కోసం అమలులో కొస్తున్న హక్కుల గురించి ప్రస్తావిస్తాడు హరనాధ్. కులం తక్కువ సన్యాసి అని అవమానిస్తే “అది మర్చిపోయే ఇప్పటి దాకా మర్యాదగా మాట్లాడాను రా కులం గల గాడిదా” అంటూ హరనాధ్ బదులివ్వడం ‘పోరా’ అంటూ ఎదురు తిరగడం జరిగే సీన్‌లో మారుతున్న సమాజ పరిస్థితులు, తమ హక్కులు గుర్తించి అగ్రకులస్తుల అహంకారాన్ని ఎదిరిస్తున్న వర్గపు భావజాలం పరిచయం మవుతుంది. అంతకు ముందు వచ్చిన సినిమాలలో ఇలాంటి సంభాషణ కనిపించదు.
ఈ సినిమా తమిళంలో వచ్చిన కన్ కంద దైవం సినిమాకు తెలుగు రీమేక్. తమిళంలో కూడా పెద్దయ్య పాత్రను ఎస్.వీ.ఆర్. గారే చేస్తే కోడలి పాత్రను పద్మిని గారు పోషించారు. సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు దర్శకత్వం వహిస్తూ ప్రొడ్యూసర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు ఎస్. వీ. ఆర్. ఈ కథ పట్ల వారి కంత నమ్మకం. ఇక మరో గమనించాల్సిన విషయం ఏంటి అంటే సినిమాలో పాత్రల అసలు పేరులు వినిపించవు. పెద్దయ్య ఊరందరికీ పెద్దయ్యే, చిన్నయ్య అందరికీ చిన్నయ్యే, ఇక మరదలిని అమ్మా అనే అందరూ సంబోధిస్తారు. పేర్లు కన్న బాంధవ్యాల గొప్పతనం ఎంత బలంగా ఉంటుందో ఈ ప్రయోగంతో చెప్పే ప్రయత్నం చేసారు దర్శకులు. దీని వల్ల ఆ కుటుంబంతో ప్రేక్షకులు కూడా కనెక్ట్ అవుతారు. ఇప్పటికీ తెలుగులో మంచి కుటుంబ కథా చిత్రంగా బాంధవ్యాలు గురించే చెబుతారు. ఉమ్మడి కుటుంబంలో విశిష్టంగా ఏర్పడే అనుబంధాలు, ఎవరి యోగ్యతను బట్టి పనులను సంభాళించుకునే గుణం, దినం కన్నా తరం గడవడం గురించి ఆలోచించే పెద్ద మనుష్యులు కనిపించే చిత్రం ‘బాంధవ్యాలు’.