Site icon Sanchika

బాటసారి

[శ్రీ శంకరప్రసాద్ రచించిన ‘బాటసారి’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]నురాగపు రహదారిలో
అహర్నిశలు నా పయనం
నా గమ్యం తారతమ్యం లేని
మానవత్వం సమానత్వం

అడవులు దాటి కొండలు ఎక్కి
వాగులు దాటి సుదీర్ఘ పయనం చేసా
ప్రేమ పచ్చిక మైదానం అదిగో
అవతల ఉంది ఆనంద పురం

పురములో ప్రవేశిస్తే ఎదురుగా
గుడి అది మా నాన్న ఒడి
గుడిలో దేవత అమ్మ మా అమ్మ
పురోహితుడు నా హితుడు అన్న

గుడి గంటలు మోగించా
అమ్మ కన్నులు తెరిచింది
ఊరి జనమంతా నా చుట్టాలే
ఆనంద పురం ఒక ప్రేమ గోపురం

నా గమ్యం చేరానా నేను
చుట్టు ముట్టిన చుట్టాలు
చెట్ట పట్టాలేసుకొని నా చుట్టూ
నృత్యం చేస్తుంటే వివశత్వం

ఇలలో ఈ కలల వాకిలిలో
ముగ్గు వేసింది ఎవరో
బహుదూరపు బాటసారి
దిగిన ఆ ముగ్గు నీ చిరునవ్వు

 

Exit mobile version