Site icon Sanchika

బ్యాక్ బెంచ్

[dropcap]స్కూ[/dropcap]ల్లో వందేమాతర గీతాన్ని శ్రావ్యంగా పాడుతున్నారు విద్యార్థులు. దానికి అనంతరం అసెంబ్లీలో ఆ రోజు వివిధ వార్తా పత్రికలలో వచ్చిన ముఖ్యమైన వార్తలను క్లుప్తంగా చదివారు. ఇక క్లాస్ రూమ్‌లో మాత్రం బ్లాక్ బోర్డ్ మీద మన దేశ నాయకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు చెప్పిన కొటేషన్లు మటుకూ ఎవరో ఒక విద్యార్థి వ్రాయటం తప్పనిసరి, ఇది ఆ రోజు వ్రాసిన బంగారుమాట.

“ఒక పుస్తకం వందమంది మిత్రులతో సమానం. కానీ ఒక మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం” – డా॥ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్

కాంతారావు టీచర్ ఇంగ్లీషు పాఠాన్ని వివరించి, అందరికీ అర్థమయ్యేలా చెపుతున్నాడు. అందరూ పాఠాన్ని శ్రద్ధగా వింటున్నారు. కానీ, ఎక్కడి నుండో బాతాఖానీ, గుసగుసలు విన్పిస్తున్నాయి. ఆయన పాఠం చెప్పటం మానేసి, కనుబొమ్మలు పెద్ద విచేసి, ఒక్కసారి అందరినీ సీరియస్‌గా చూచాడు.

అంతే! వెంటనే నిశ్శబ్దం. మళ్ళీ పాఠం చెప్పటం ప్రారంభించాడు. మళ్ళీ తమ స్వరాలను మార్చిన విద్యార్థుల ఇకఇకలూ…. పకపకలూ.. నవ్వులు… అదృశ్యంగా విన్పించాయి. ఈసారి క్లాసంతా తిరిగి, పరీక్షగా అందరి మఖాలనూ ఆగ్రహంతో చూచి, మళ్ళీ పాఠం చెప్పటం ప్రారంభించాడు.

కుక్క పిల్లవలే చక్కగా, క్యూట్‌గా మొరిగాడు ఒకడు. అచ్చం మేక అరుస్తున్నట్లే నీట్‌గా ఇమిటేట్ చేశాడు ఇంకొకడు. ఈ వెకిలి చేష్టలకు విసిగిపోయిన టీచర్ గట్టిగా ఏదో చెప్పబోయాడు. ఇంతలో…. ఠంగ్‌న ఫస్ట్ పిరియడ్ బెల్ కొట్టేశారు. “రేపు చెపుతానురా! మీ పని…” అంటూ ఆవేశంతో క్లాస్ రూమ్ నుండి బయటకు వెళ్ళిపోయాడు కాంతారావు టీచర్.

ఆ తరువాత తెలుగు క్లాస్. ఆ తెలుగు మాష్టారు వచ్చినట్టులేదు. అందుకే మన అల్లరి బ్యాచ్ పాడటం ప్రారంభించింది. బాలాజీ, సన్యాసి రాజు ఇద్దరూ కలసి ఏదో కొత్త సినిమా పాటకు డాన్స్ చేస్తున్నారు.

మీకన్నా మేమేమి తక్కువ? అన్నట్టు అబ్బాయిలకు తోడుగా, అమ్మాయిలు కూడా పాడుతున్నారు. స్టెప్పులు వేస్తున్నారు క్లాస్‌లో. కానీ ముందు బెంచీలో కూర్చున్న శ్రీరామ్ తేజ, ఉదయ్ బాబు, శివకుమార్, రవికుమార్‌లు మాత్రం వీళ్ల అల్లరిని లెక్క చేయకుండా బుద్ధిగా చదువుతున్నా, వారి చూపులు మాత్రం ఏమిటి ఈ గొడవ? అన్నట్టున్నాయి.

“మీరు కూడా రండిరా! డాన్స్ చేద్దాం!” అంటూ బ్యాక్ బెంచ్ చిక్కీల శ్రీనివాస్, బాలనాయుడు, చంద్రకాంత్ కేకలు వేస్తున్నారు. ఈ మధ్యలో చిక్కీల శ్రీనివాస్ మిమిక్రి చేయటం మొదలు పెట్టాడు. డైలాగులు విన్నవాళ్ళకు చిట్కాలు పంచుతున్నాడు.

“ఇదిగో! అందరూ నా పాట వినండి. నా పాట వింటే మీకు మామిడి తాండ్ర ఇస్తాను” అంది తాండ్ర తేజస్విని. స్నేహితులంతా ఆమెను తాండ్ర తేజస్విని అని ముద్దుగా పిల్చుకుంటూవుంటారు, ఎందుకంటే రోజూ క్లాస్‌కి మామిడి తాండ్ర తెచ్చి స్నేహితులందరికీ ఇచ్చి, తనూ నెమరేస్తూనే ఉంటుంది.

వెంటనే సన్యాసిరాజు… “తాండ్ర పాపారాయుడు మీ తాతగారా! తల్లీ?” అంటూ అల్లరి చేసి అందరినీ నవ్వించాడు. ఇలా సాగిపోతున్న వీరి అందమైన హైస్కూల్ జీవితంలో అల్లరిని భరించలేని టీచర్లు కూడా అనేక కష్టాలు ఎదుర్కొన్నారు.

తక్కువ మార్కులు వచ్చినందుకు సన్యాసిరాజు ముఖంపై ఆన్సర్ పేపర్లు కొట్టి, తిడుతూ, బెత్తంతో బాదేశాడు తెలుగు టీచర్. అయినా సన్యాసిరాజు ఏ మాత్రం సిగ్గుపడలేదు కనీసం బాధ కూడా పడలేదు.

లెక్కలు టీచర్ లెక్కలు సరిగా చేయని వారిపై డస్టర్ విసిరేవాడు. అలాంటప్పుడే బాలజీ తలకి గాయమై రక్తం ధారగా వచ్చి కళ్ళు తిరిగి క్రింద పడిపోయాడు. వెంటనే అతని తల్లితో పాటు కొంతమంది వచ్చి లెక్కలు టీచర్ని కొట్టడానికి సిద్ధపడ్డారు. “అంటే! మా అబ్బాయికి చదువు రాకపోతే చంపేస్తారా?” అంటూ లెక్కల మాష్టారిపై దాడిచేశారు. క్లాస్ లోని బెంచీలు,, కుర్చీలు విరిచేసి, బయటపడేసి నానా గొడవ చేశారు.

“ఇలాంటి చదువురాని మొద్దులతోనే మా స్కూలుకి చెడ్డ పేరు వస్తోంది. మా సూల్లో చదివేవారందరికి, అన్ని సబ్జక్టుల్లో ఫస్ట్ మార్కులే రావాలి. లేదంటే, మీ పిల్లలకు టి.సి. ఇచ్చేస్తాం! తీసుకుపోండి” అంటూ ఒక టీచర్ లెక్కల మాష్టార్ని సపోర్టు చేస్తూ గట్టిగా చెప్పాడు.

“పిల్లలకు చదువురావాలంటే కొట్టటం తప్పదు” అంటూ మొండిగా వాదించాడు లెక్కల టీచర్. దాంతో లెక్కల టీచర్ని సస్పెండ్ చేశాడు ప్రిన్సిపాల్. అలాగే విద్యార్థులను భయపెట్టకుండా, కొట్టకుండా చదువు చెప్పలేం! అంటూ పేరెంట్స్ మీటింగ్‌లో తేల్చి చెప్పేశాడు ఆచార్యుల మాష్టారు.

ఇక సైన్స్ టీచర్ వీళ్ళందికన్నా కొంచం నయమే అని చెప్పచ్చు. ఈక్వేషన్ తప్పుగా చెప్పిన వారిపై చాక్‌పీస్‌లను విసిరేవాడు. ఆ చాక్‌పీస్‌లను తెలివిగా, క్రికెట్ బాల్ లాగా క్యాచ్ పట్టే వాళ్ళు కుర్రాళ్లు. మొత్తానికి సైన్స్ టీచర్ పై అంతగా కంప్లైట్లు తక్కువే అని చెప్పాలి.

టీచర్లు అందరూ ఫస్ట్ బెంచ్‌లో కూర్చున్న వాళ్ళనే ఎప్పుడూ మెచ్చుకునేవారు. వాళ్ళకి పాఠం అర్థం కాలేదంటే మళ్ళీ చెప్పేవారు. ఒక వేళ వాళ్ళు తప్పుచెప్పినా ఏమీ అనేవారు కాదు. టీచర్ల అండ చూసుకొని శ్రీరామ్ తేజ, ఉదయ్ కుమార్, శికుమార్ మరియు రవి కుమార్‌లు గర్వంగా కాలర్ ఎగరేసి, మిగతా వారిని చిన్న చూపు చుసేవాళ్ళు. మీరంతా దద్దమ్మలురా! అన్నట్లుండేది వాళ్ళ బాడీ లాంగ్వేజ్.

మరి అమ్మాయిలకు ఇతర వ్యాపకాలు తక్కువ కాబట్టే క్లాసులో తేజస్విని, హరి ప్రియ, దీపిక, అశ్వని బాగా చదివేవారు, ఒక హిమబిందు తప్ప. హిమబిందుకి తాను అర్జంటుగా సినిమా యాక్టరై పోవాలని, ఎప్పుడు అద్దం చూసుకుంటూ మ్యాకప్ చేసుకునేది. తనకు తక్కువ మార్కులు వచ్చినందుకు ఏనాడూ బాధ పడలేదు. తనకెందుకు భయం? ఎప్పటికైనా సినిమా హీరోయిన్ అయితీరతాను అని కలలు కనేది.

ఎప్పుడూ ఆడుతూ, పాడుతూ తక్కువ మార్కులు వచ్చి కూడా చింత లేని చక్రవర్తుల్లా ఉత్సహంతో ఉండే వాళ్ళే ‘బ్యాక్ బెంచ్’ బాల నాయుడు, చంద్రకాంత్, చిక్కిల శ్రీనివాస్, బాలజీకి తోడుగా సన్యాసిరాజులు. మధ్య బెంచీలో కూర్చున బాబూరావు ఎప్పుడూ చదువుతూ ఉండేవాడు. అవి క్లాసు పుస్తకాలు కావు. లాంగ్ నోట్సు మధ్యలో డిటెక్టివ్ పుస్తకాలు. టీచర్లకు కూడా అసలు అనుమానమే వచ్చేది కాదు. ఎంతైనా గొప్ప నటుడు కదా బాబురావు. ప్రక్కనున్న మిడిల్ బెంచ్ మనోహర్ అతిగా ఆలోచిస్తూ….. “గత జన్మలో నేనే మార్కోపోలోని, నేనే పాహియాన్‌ని” అని వెర్రిగా కేకలు వేసేవాడు. మనోహర్ ఎవరికీ అర్థం కాని జీవి.

“మీరు చదువుకోకుండా, క్లాసులకు బంక్ కొట్టి సినిమాలు చూస్తే పరీక్షల్లో ఎలా పాస్ అవుతారు?” అని క్లాస్ టీచర్ కాంతారావు చెప్పేవాడు.. అయినా వింటేగా! పైగా “ఈ పనికారాని హిస్టరీ, తెలుగు గ్రామర్ మాకెందుకు సార్? మన బంగారు భూమిని నాశనం చేసేసి, ఇంకా ఇతర గ్రహాలపై ఏముందో అనే పరిశోధనలు ఎందుకు టీచర్?” అని క్లాసులో ఆవేశంతో ప్రశ్నంచాడు చిక్కీల శ్రీనివాస్. “అంటే ఈ భూగోళం పాడైపోయిందా! దీన్ని వదిలి మనం వేరే గ్రహాలకు వలస వెళ్ళిపోవాలా?” అంటూ బాలాజీ అవేశంగా ప్రశ్నించాడు. “ఎందుకు సార్ ఈ తెలుగు వ్యాకరణం, ఇంగ్లీషు గ్రామర్? మనం చేసే ఉద్యోగంలో అసలు ఉపయోగపడుతుందా!” అని టీచర్లకే ప్రశ్నల బాణాలను సంధించారు ‘బ్యాక్ బెంచ్’ విద్యార్ధులు.

“అందుకే మన విద్యా విధానం ఆదునిక కాలానుగుణంగా మారితీరాలి. అంతేకానీ ఆనాటి రాజుల కోటలు చూస్తూ, వాళ్ళ చరిత్ర చదివితే మనకేం వస్తుంది? మాకు లైఫ్ సైన్స్ బోధించండి సార్” అంటూ బాలనాయుడు ఆవేశంతో ప్రసంగించాడు క్లాసులో.

వీరి అస్త్రాలను తట్టుకోలేని టీచర్లు, సమాధానం చెప్పటానికి తికమకపడేవాళ్ళు. “దానికి మనమేమీ చేయలేం బాబు. సిలబస్ ప్రకారమే మేము పాఠాలు చెప్పాలి. ఒక వేళ మీరు చెప్పినట్లు సిలబస్ మార్చలంటే, ప్రభుత్వమే మార్చాలి. మీరు భవిష్యత్తులో నాయకులై, విద్యావేత్తలై కొత్త సిలబస్‌ను తయారు చేసి దానిని అమలు చేయటానికి కృషి చేయండి” అని సోషల్ టీచర్ జోగారావు గారు ముక్తాయించాడు.

అయినా క్లాసులో గొడవ చెయ్యిటం మానలేదు విద్వార్థులు. ఇక లాభం లేదని ప్రిన్సిపల్ రంగంలోకి దిగి “టీచర్లు చెప్పిన పాఠాలు వినక పోతే మిమ్మల్ని డిబార్ చేస్తాను” అంటూ హెచ్చరించాడు. ఆయన సూటిగా చెప్పిన మాటలతో గొడవ సద్దుమణిగింది. మళ్ళీ తరగతులు ప్రారంభించారు టీచర్లు. క్లాసు జరుగుతూ ఉంటే పిచ్చుకల కిచకిచలు అందరినీ అలరించాయి. కానీ ఒక పిచ్చుక మాత్రం కిచకిచలాడుతూ క్లాస్ కిటికీలలో అటూ ఇటూ తిరుగుతూనే ఉంది. ఆ పిచ్చుకను చూచిన హిందీ టీచర్ “ఏమే ఎక్కడికి వెళ్ళెను నీ నాథుడు?” అని అనగా “ప్రియురాలి కె పాస్ గయా హై!” అని సన్యాసిరాజు చెప్పటంతో క్లాసంతా నవ్వులతో మునిగిపోయింది.

హిందీ క్లాస్ అంటే అందరికీ సందడితో కూడిన పండగే. ‘షోలే’ అంటే ఏమిటి? ‘యాదోంకీ బారత్’ బోలేతో అర్థ్ క్యాహై? అసలు ‘బాబి’ కా అర్థ్ క్యాహై సాబ్ – అనే చిత్ర విచిత్ర ప్రశ్నల వర్షంతో హిందీ టీచర్‌కే సినిమాలు చూపించేవాళ్ళు. మోరల్ క్లాస్‌లో నీతి కథలు చెప్పటం, పాటలు పాడించటం, అప్పుడప్పుడూ నవారు కూడా నేయించేవారు. “అయినా ఈ కాలంలో నవారు మంచాలు ఎక్కడున్నాయి? డబుల్ కాట్లు దూసుకు వచ్చేశాయిగా!” అనే సటైర్లు ఉదయ్ బాబు, శ్రీరామ్ తేజలు విసురుతూ ఉండేవారు.

ఇక బిస్కట్లు బాగా లాగించచ్చు అనే బ్యాచ్ యన్.సి.సిలో జాయిన్ అయ్యారు. కానీ చంద్రకాంత్, చిక్కీల శ్రీనివాస్, సన్యాసిరాజు, బాలాజీలతో సహ అందరూ స్కౌట్స్‌లో చేరిపోయారు. స్కౌట్స్‌లో అయితే రోజుకోక వెరైటీ టిఫెన్సు తినొచ్చునట. ఒకరోజు పులిహోర, మరియొక రోజు హల్వా, ఇంకొకనాడు రవ్వకేసరీ, బిర్యానీలు కూడా లాగించవచ్చునని చిక్కీల శ్రీనివాస్ తీర్మానించాడు.

సాయంకాలం జనగణమన జాతీయగీత ఆలాపన. జనగణమన పాడేటప్పుడు కొంతమంది కళ్ళుమూసుకుంటున్నారే కానీ, నోరు తెరచి పాడటం లేదు. ఇది గమనించిన ఆచార్యులు గారు అందరిచేతా జాతీయ గీతాన్ని కంఠస్తం చేయించి, తప్పుల్లేకుండా క్రమశిక్షణతో పాడటం నేర్పించాడు. రిహార్సల్స్ దాదాపు పదిసార్లు పైగానే జరిగేవి.

“మనం జాతీయ గీతాన్ని ఆలపిస్తే ఒళ్ళు పులకరించి, దేశభక్తి ఉప్పొంగాలి! అర్థమయ్యిందా? అంతేకానీ చేపల బజార్ గొడవలాగా ఉండకూడదు” అని చెప్పేవాడు టీచర్. అందరూ రాగయుక్తంగా ‘జనగణమన’ పాడిన తర్వాతే లాంగ్ బెల్ మ్రోగేది. ముఖ్యంగా వందేమాతరం, జాతీయ గీతాల సుస్వర సంగీత భరితమైన రాగాలను, బాణీలను మార్చి అపస్వరాలతో పాడవద్దని హితవు చెప్పారు ఆచార్యుల మాష్టారు.

***

పబ్లిక్ పరీక్షలో ఫస్ట్ బెంచ్ బ్యాచ్ ఫసక్లాస్లో పాసై, ర్యాంకులు కూడా సాధించారు. మరి మిడిల్ బెంచ్ బాబూరావు, మనోహర్లు అత్తెసరు మార్కులతో గట్టెక్కేశారు. అమ్మాయిలలో హరిప్రియ ఫస్ట్ రాగా, మిగిలిన వారు సెకండ్ క్లాస్లో పాసైయ్యారు. హిమబిందు మాత్రం టెస్త్ క్లాస్ ఫెయిలైయ్యింది. అంటే సినిమాలలో హీరోయిన్‌గా తప్పక సక్సెస్ అయితీరుతుందని ఆమె బాయ్ ఫ్రెండ్స్ భాష్యం చెప్పారు.

ఒక్క బాలనాయుడు మాత్రమే బ్యాక్ బెంచ్ పరువు కాపాడి కాలేజీలో అడుగు పెట్టాడు. సీనియర్లు జూనియర్ల్ స్టూడెంట్లను ర్యాగింగ్ చేశారు. ఈ ర్యాగింగ్‌లో అవమానాన్ని భరించలేక తీవ్ర మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు ఒక విద్యార్థి. “ర్యాగింగ్ ఒక అనాగరిక, పైశాచిక ప్రవర్తన. కేవలం పరిచయం కోసం మాత్రమే మీకు ఫ్రెషర్స్ మీటింగ్‌కి పర్మిషన్ ఇచ్చింది కాలేజీ మేనేజ్‌మెంట్.” అంటూ ర్యాగింగ్ చేసిన వారిపై కఠినమైన శిక్షలు కూడా విధించింది ప్రభుత్వం. ఇంటర్మీడియట్‌లో బోస్‌బాబు, వంశీవర్మలు కొత్తగా చేరి, కాలేజీ ఫస్ట్ ర్యాంకులు కొట్టేశారు. దాదాపు ఇదే బ్యాచ్ కాలేజీలో డిగ్రీ వరకూ కంటిన్యూ అయింది.

పాపం బ్యాక్ బెంచ్ బ్యాచ్ మాత్రం రెండు, మూడు దండయాత్రలు చేసి మరీ కాలేజీ క్యాంపస్ చేరుకున్నారు. అప్పటికే తమ స్నేహితులంతా ముందుకు దూసుకు పోయారు. చాలామందికి ఉద్యోగాలు వచ్చేశాయి. తమ స్నేహితులందరికీ, ఉన్నత ఉద్యోగాలు వచ్చినందుకు ఒక ప్రక్క బాధగావున్న, ఇంకొకవైపు ఆనందంగా ఉంది. తక్కువ మార్కులు, ర్యాంకులు వచ్చిన వారిని కనీసం జాబ్ ఇంటర్వూకి కూడా పిలవటం లేదు. అలాంటప్పుడు ఇక ఏవరేజ్ మార్కుల వారి గతేంకాను? ఉద్యోగానికి ఫస్ట్ రాంకులే కావాలా! ఫస్ట్ మార్కుల అభ్యర్థులకే ఉద్యోగాలిస్తే, ఏవరేజ్ ర్యాంకుల వాళ్ళు త్రిశంకుస్వర్గ నిరుద్యోగులుగా మిగిలిపోవలసినదేనా పాపం! విద్యార్థులు అగమ్యగోచరంలో తిరుగుతున్నారు.

***

హైటెక్ స్పీడ్ గ్లోబలైజేషన్ చట్రంలో ఫస్ట్ ర్యాంకులు ఇరుక్కు పోయాయి. లక్షల్లో శాలరీలు తీసుకొని విలాసవంతమైన జీవితానికి, ఉద్యోగాలకు బానిసలైపోయారు నేటి రోబో యువతరం. అలా సీటుకి అతుక్కొని, అవిశ్రాంతంగా పనిచేయటంతో వారి శరీరాలు భారీగా తయారయ్యాయి. అన్ని ఆన్లైన్ ఉద్యోగాలే! అన్నీ కంపూటర్లే చేస్తాయి. మరి మనుషులు చేయవలసిన పనులేమిటి? అనే జటిలమైన ప్రశ్నలు నిరుద్యోగులను నిత్యం వేదిస్తూనే వున్నాయి.

ప్రపంచదేశాలలో ఐ.టి. రంగం ఒక్కసారిగా పతనమైపోయింది. కార్పోరేట్ కంపెనీలు ఆర్థిక ఇబ్బందులు భరించలేక వేలాది ఉద్యోగస్తులను టెర్మినేట్ చేశాయి. దానికి పర్యవసానంగా, లక్షల్లో నెలజీతాలు తీసుకొన్న ఉద్యోగస్థులు, ఆందోళనతో దిక్కుతోచని సుడిగుండంలో మునిగిపోయారు. ఎందుకంటే తాము ఇంతకాలం ప్రత్యేకమైన విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. ఖరీదైన ఇళ్ళు కొనుక్కొన్నారు. ఆ ఇళ్ళ కోసం బ్యాంకుల నుండి పెద్ద మొత్తాల్లో అప్పులు తీసుకున్నారు. అప్పుడు తీసుకున్న అప్పులు ఇప్పుడు నెలవారి లక్షల్లో వడ్డీతో సహ బ్యాంకులకు చెల్లించి తీరాలి.

అసలు ఉద్యోగమే లేదు. ఇంకా లోన్ ఎలా తీర్చాలి? అనే మానసిక ఆవేదనతో కొంత మంది ఆత్మహత్య చేసుకున్నారు. డబ్బు సంపాదించటమే తమ ధ్యేయమని, చివరకు తమ బంగారు జీవితాన్నే బలి చేసుకున్నారు. కానీ అటు స్కూల్లోనూ ఇటు కాలేజిలోనూ బ్యాక్ బెంచ్‌లో కూర్చొన్న ఏవరేజ్ స్టూడెంట్స్ మటుకూ తమ తరగతి పాఠాలతో పాటు జీవిత పాఠాలను బాగా చదువుకున్నారు.

బాలనాయుడు, చంద్రకాంత్, చిక్కీల శ్రీనివాస్ మరియు బాలజీలు నలుగురూ కలసి ఒక ‘ఫోర్ వరల్డ్’ అనే కంపెనీతో, మార్కెటింగ్ రంగంలో ప్రవేశించారు. ఇప్పుడు ఈ ‘ఫోర్ వరల్డ్’ మన భారతదేశంలోనే కాకుండా, అంతర్జాతీయ దేశాలలో మార్కెటింగ్‌ను విస్తృతంగాచేసి మిలియన్ల రూపాయలు లాభలు అర్జించింది.

ఉద్యోగస్థులకు మంచి జీతాలతో పాటు ఇతర అలవెన్లతో బోనస్ కూడా ఇస్తూ సంక్షేమం, అభివృద్ధి పథంలో ముందు వరసలోనికి ఇంత వేగంగా ఎలా వచ్చిందని ప్రముఖ టి.వి. యాంకర్ ప్రత్యేక ఇంటర్వూ చేస్తూ ‘ఫోర్ వరల్డ్’ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌ను ప్రశ్నించాడు.

“మా కంపెనీలో ఉద్యోగానికై ఫస్ట్ మార్కులు కాదు మాకు కావలసింది. డిగ్రీలో మార్కులు తక్కువైనా, మేము ఇచ్చిన పనిని సమర్థవతంగా చేయగల్గిన వారికే ఉద్యోగం ఇచ్చాం, వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చాం” అని నల్గురూ హుందాగా, విజయ గర్వంలో తెలియజేశారు. తదనంతరం మెరిటోరియస్ స్టాఫ్‌కి ప్రమోషన్లు, అవార్డులు ఇచ్చి “మార్కులు డబ్బులు కావు, ఉద్యోగమే జీవితం కాదు అనే సత్యాన్ని విద్యార్థులకు బోధించేవారే నిజమైన విద్యావేత్తలు” అనే సందేశానందించారు డైరెక్టర్లు.

“మరి మీ విజయ రహస్యం ఏమిటి?” అని మళ్ళీ ప్రశ్నించాడు టి.వి. యాంకర్.

“మా ‘బ్యాక్ బెంచ్’ మా విజయానికి కారణం” చెప్పారు.

ప్రెస్ మీట్ అనంతరం కాన్ఫరెన్స్ హాలులో అందరూ నిలబడి జనగణమన జాతీయ గీతాన్ని శ్రావ్యంగా ఆలపించారు.

జైహింద్

Exit mobile version