[box type=’note’ fontsize=’16’] “ఈ చిత్రంలో మొదటి సగం నవ్వుల నావలో, రెండో సగం ఎమోషన్లలో సాగిపోతుంది. యెప్పుడూ వొకే రకమైన చిత్రాలంటే విసుగు అనేవాళ్ళు దీన్ని చూడవచ్చు” అంటున్నారు పరేష్ ఎన్. దోషి “బధాయీ హో” చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]
[dropcap]పె[/dropcap]ళ్ళీడు వచ్చిన కొడుకు వున్న దంపతులకు మరో సారి తల్లిదండ్రులయ్యే పరిస్థితి వస్తే యెలా వుంటుంది?! ఇప్పుడంటే కుటుంబ నియంత్రణ పధ్ధతులు జనాల్లో బాగా ఇంకిపోయాయి కాబట్టి ఇలాంటి పరిస్థితులు చూడము, కాని వో రెండు తరాల కిందటి వరకూ ఇది మామూలే. తల్లీ కూతుళ్ళు వొకే సారి కడుపుతో వుండడం, మొదటి ఆఖరి బిడ్డల మధ్య యెడం ఇరవై పాతికేళ్ళు యెడం వుండడం కూడా చూశాము. అయితే అప్పట్లో అది అంతటా వున్నదే కాబట్టి యెబ్బెట్టుగా అనిపించలేదు. కాని రోజులు మారాయి కాబట్టి ఇప్పుడు జనాలు కనుబొమలు యెగురవేస్తారు. కొన్ని విషయాల్లో మార్పులొచ్చినా కొన్ని భావజాలాల్లో రాలేదు. సెక్సు గురించి తెలుసుకున్న కొత్తలో కుతూహలంతో పాటు అసహ్యం లాంటి భావన కలగడం, అందరూ చేస్తుండొచ్చు కాని మా అమ్మ అలా కాదు అనుకోవడం వగైరా. వొక కారణం యేమిటంటే అప్పట్లో సెక్సు గురించి సమాజంలో బాహాటంగా చర్చలు జరిగేవి కావు, పైపెచ్చు అదో పాపపు కార్యంగా నటించేవారు పెద్దలు, పిల్లల యెదుట. కొంత మందికి అపరాధ భావన, ఇంకొంతమందికి మానసిక సమస్యలూ వచ్చేవి ఆ కారణంగా. ఇప్పుడైతే సెక్స్ విషయంలో సమాజం చాలా open అయ్యింది, అయినా యే ఇంట అయినా ఇలాంటి సంఘటన జరిగితే ఆ కుటుంబంలో వారికీ, చుట్టుపక్కలవారికీ అంతా చోద్యమే, యెగతాళే.
నడి వయసులో స్త్రీ గర్భం దాల్చితే అది అందరూ వింతగా చూడటం యెందుకంటే అది వాళ్ళ సక్రియ సెక్సు జీవితాన్ని సూచిస్తుంది కాబట్టి. ఆ వయసు రాగానే ఇక అలాంటి జీవితానికి స్వస్తి చెప్పి, వేరువేరుగా పడుకుంటారని భావించడం, అలా కాని పక్షంలో ఛ ఛ సిగ్గుండొద్దు అనుకోవడం ఇలా తయారయ్యింది సమాజం. ముందు యెలా స్పందించినా త్వరగా వాస్తవాన్ని అంగీకరించింది రెనీ నే. నకుల్ తో అంటుంది రేపు మనకు పెళ్ళి గనుక జరిగితే నలభై యేళ్ళకే సెక్స్ మానేసి పిల్లల పెంపకంలోనే పూర్తిగా మునిగిపోతామా? నా వల్ల అయితే కాదు అంటుంది.
కొన్ని సన్నివేశాలు వూహించదగ్గవే అయినా కొన్ని మాత్రం చాలా బాగా వచ్చాయి. చుట్టాలింట పెళ్ళికెళ్ళినపుడు అక్కడి ఆడవారు ప్రియంవదను యెడా పెడా మాటలంటుంటే, యెప్పుడూ కోడలిని కసురుతూ వుండే సురేఖా సిక్రీ ఆమె పక్షం తీసుకుని దెబ్బలాడుతుంది. తనకు ఆసుపత్రిలో అడ్మిట్ చేసినపుడు అన్నీ మంచం మీదే జరుగుతున్నప్పుడు తనకు అన్ని రకాల సేవలూ, మలమూత్రాలు యెత్తడం, స్నాలాలు చేయించడం సమస్తం ప్రియంవదే చేసింది దగ్గరుండి. మీరు చుట్టం చూపుగా చూసి వెళ్ళారు, మీరా సంస్కారం గురించి మాట్లాడేది అంటుంది. ఇదంతా తన మనసులోనే వున్నా యెప్పుడూ బయటపెట్టలేదని కూడా అంటుంది, ఇంతకంటె మంచి కోడలు తనకు దొరకదని కూడా అంటుంది. అయినా భార్యా భర్తల మధ్య సెక్స్ వుండక మరో చోట వుంటుందా, దీనికి సంస్కార లేమి అంటారా, ఇదేనా మీరు చెప్పేది అని నిలదీస్తుంది. నకుల్ కి మొదట్లో తల కొట్టేసినట్టు అనిపించినా, రెనీ ఇంట ఆమె తల్లి మాటలు వినడం జరుగుతుంది. ఆమె రెనీ తో జితూ కుటుంబం గురించి నీచంగా మాట్లాడుతూ ఆ పాప పుడితే అది నకుల్-రెనీల నెత్తిన భారమవుతుంది అంటుంది. తమ్ముడో చెల్లెలో నాకు కదా కలిగేది, ప్రేమగా చూసుకుంటాను అంటాడు. ఆ యెరుక వచ్చాక అంతా మారిపోతుంది. అన్న దమ్ములు దగ్గరవుతారు. పాప పుడితే ముందు నకుల్ యెత్తుకుంటాడు సంబరంగా, గుల్లర్ సిగ్గు, సంతోషం, సంకోచం అన్నీ కలగగా అన్న చాటు దాక్కుంటాడు. ఇంటర్వెల్ తర్వాత ఇలాంటి కొన్ని సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి.
ఈ చిత్రానికి నాయికానాయకులు సాన్యా, ఆయుష్మాన్లు. కానీ వాళ్ళ మధ్య రొమాన్సు కంటే జీతూ-ప్రియంవదల మధ్య పాత కాలం నాటి పధ్ధతుల్లో దొంగ చూపులు, ఓర చూపులు, ముసిముసి నవ్వుల రొమాన్సు యెక్కువ. నేపథ్యంలో పాత పాటలు. అది యెబ్బెట్టుగా కాకుండా చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది. అద్భుతంగా నటించిన గజరాజ రావు-నీనా గుప్తాల కారణంగా. మండి,త్రికాల్ ల కాలం నాటి అందమైన నటి ఈ మధ్య రావడం లేదేమిటా అనుకుంటే, మొన్న వీరే ది వెడింగ్ లో కనబడింది, చిన్న పాత్రలో. ఈ సినెమాలో తన నటన సంపూర్ణంగా చూపించే అవకాశాన్ని సద్వినియోగపరచుకుంది. ఇక సురేఖా సిక్రీ గురించి ప్రత్యేకంగా యేం చెప్పాలి! సినెమా సగం ప్రాణం ఆమె నటనలోనే వుంది. మంచి మంచి చిత్రాలు ఒప్పుకుంటూ ఆయుష్మాన్ ఖురానా బంగారు బాట వేసుకుంటున్నాడు. చాలా తక్కువ వ్యవధిలో చాలా వైవిద్యభరితమైన పాత్రలు అదీ చాలా బాగా చేసి తనని తాను నిరూపించుకున్నాడు. వీళ్ళందరి సహకారం వుండబట్టి అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం బలపడింది. ఇదివరకు Ad films తీసిన అమిత్ కి క్లుప్తత అంటే చెప్పించుకోవాల్సిన పని లేదు. ముప్పై సెకన్లలో ఏడ్ తీసి కథ చెప్పి మెప్పించడం తెలిసినవాడికి పెద్ద చిత్రాలు తీయడం కష్టం కాదు. రెండు గంటల ఈ చిత్రంలో మొదటి సగం నవ్వుల నావలో, రెండో సగం ఎమోషన్లలో సాగిపోతుంది. రెండూ చేసి మెప్పిస్తాడు. వీటి మధ్య నడివయసు జంట సెక్స్ జీవితం గురించిన మనలో చాలామంది మెదళ్ళలో పట్టిన బూజు దులిపే పనికూడా. ఇక కథ వొక పంజాబీ కుటుంబంలో కాబట్టి ఆ వాతావరణానికి తగ్గట్టుగా సాంప్రదాయికంగా కొన్ని పంజాబీ పాటలు పెట్టాడు. అన్నీ బాగున్నాయి.
యెప్పుడూ వొకే రకమైన చిత్రాలంటే విసుగు అనేవాళ్ళు దీన్ని చూడవచ్చు. నచ్చుతుంది.