Site icon Sanchika

బహు దూరపు బాటసారి

(ఫ్రెంచ్ కవి నెరుడాగారి ఒక కవిత స్ఫూర్తితో శ్రీమతి మంగు కృష్ణకుమారి రాసిన కవిత.)

[dropcap]నా[/dropcap] దేహంతో కలిసిన నీ
సుకుమార దేహం ‘పార్థివం’
అయితే చూసి వణుకు వచ్చినా..
సజీవంగానే ఉన్న నిర్భాగ్యుడిని!

నేస్తమా! బతికే ఉంటాను!
కలలూ, నిజాలు కలబోసుకొని
‘నువ్వు లేకపోతే నేనో బొమ్మనే’
అన్న నేనే, నువ్వు లేవన్న పచ్చి
నిజాన్ని అరిగించేసుకొని మరీ
సజీవంగా ఉంటాను!

కలిసి పుట్టకపొయినా కలిసి
బతికేం! కలిసి తిరిగేం!
అయినా నువ్వు లేని నేను
జీవంతో ఉంటాను!

బంధం కన్నా బతుకే
గొప్పది కాబోలు!

ప్రాణానికి ప్రాణమైన పతి మరణ
వార్త వింటూనే ప్రాణాలు వదలిన
పద్మావతిని కాను నేను!

పరమపద సోపానంలో పెద్ద పాము పాలపడ్డ అభాగ్యుడిని

నువ్వెక్కిన నిచ్చెన నీవెనకే
ఎక్కలేని నిర్భాగ్యుడిని!

ఇంటిముందు ముగ్గూ
చెట్టుమీంచి కూసే కోయిలా పూలభారంతో
పారిజాతాలు అన్నీ అలాగే ఉంటాయి! నువ్వు ఉండవు!
నేను మాత్రం ఉంటాను.

బలమియ్యి స్నేహితురాలా!
నీ తలపుల బలంతో ఏనాటికయినా
తలుపులు మూసి నీ దగ్గరి చేరే
ప్రయాణంలో ఎదురయ్యే అలజడులు
తట్టుకుంటూ, జవాబులు ఇచ్చుకుంటూ
ఓ మనిషిలా బతికే బలమియ్యి.

తరవాత పందెంలో అయినా
నా పావుని పెద్దపాముని దాటనియ్యి.

నీ అడుగులతో నా అడుగుని
కలవనియ్యి..!

Exit mobile version