బహుముఖ ప్రజ్ఞాశాలి కీ. శే. యామిజాల పద్మనాభస్వామి గారు

0
2

[dropcap]ఉ[/dropcap]త్తరాంధ్రలో కవుల సంఖ్య ఎక్కువ. చాలా కారణాల వల్ల వీరిలో చాలామంది ప్రజానీకానికి చేరువ కాలేకపోయినారు. అదీగాక ఆ రోజుల్లో పురాణ ప్రవచనాలు వినిపించటానికి టివి చానళ్ళు లేవు. ఆంధ్రప్రభ, ఆంధ్ర పత్రిక వంటి పేపర్లు మాత్రమే ఉండేవి లేదా శ్రీరామ నవమి పందిళ్ళలో పండితులు, కవులు వారి పురాణ ప్రవచనాలను వినిపించేవారు.

అట్టి వారిలో కవికులతిలక, అభినవ వాల్మీకి వంటి బిరుదులు పొందిన యామిజాల పద్మనాభస్వామి గారు ఒకరు. ఈయన విజయనగరం జిల్లా, గరుగుబిల్లి మండలం, శివరాంపురం గ్రామంలో 1915, జూన్ 12వ తేదీన కామేశ్వరి, లక్ష్మీనరసింహశాస్త్రి దంపతులకు జన్మించారు. ఈయన తండ్రి లక్ష్మీనరసింహశాస్త్రి నిరతాన్నదాతగా ఆ ప్రాంతంలో ప్రసిద్ధుడు. యామిజాల పద్మనాభస్వామి చాలా చిన్నవయసులోనే ఇంటివద్ద ఉండి దేవులపల్లి సీతారామశాస్త్రి గారి వద్ద కాళిదాస త్రయం అభ్యసించాడు. తన స్వగ్రామానికి సమీపంలో ఉన్న జామిలో మోతికుర్తి సత్యనారాయణశాస్త్రి వద్ద కౌముది నేర్చుకున్నాడు. 1930లో కడియం వెళ్లి చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి వద్ద రెండు సంవత్సరాలు శిష్యరికం చేసి కవిత్వ రహస్యాలు తెలుసుకున్నాడు.

1933లో విజయనగరం ప్ర్రాచ్యకళాశాలలో చేరి 1938 వరకు అక్కడే చదివి ప్రాచ్యభాషా పట్టాను పొందాడు. ఆ సమయంలోనే గంటి సూర్యనారాయణ శాస్త్రిగారి తెలుగు జెండా అనే పక్ష పత్రికలోనూ, కళ్యాణి అనే మాస పత్రికలోనూ రచనలు చేసేవారు. ఆదిభట్ల నారాయణదాసు గారిని సేవించి జ్యోతిష శాస్త్ర పట్టులెన్నో గ్రహించాడు. ఆదిభట్ల నారాయణదాసు గారు ఈయనను కావ్యకంఠ గణపతిమునికి పరిచయం చేయగా అతనికి శుశ్రూష చేసి మంత్రశాస్త్రం నేర్చుకున్నాడు. చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారిని కూడా గురువుగా స్వీకరించారు. గాంధీజీ ప్రభావం, తెన్నేటి విశ్వనాథం బాంధవ్యం ఈయనను స్వాతంత్ర్యోద్యమం వైపుకు ఆకర్షించింది. స్వయంగా రచించిన దేశభక్తి గేయాలను, పద్యాలను పాడుతూ స్వైరవిహారం చేస్తున్న ఈయనను ప్రాచ్యకళాశాల నుండి తొలగించారు. ఆ సందర్భములో జైలుకు కూడా వెళ్లారు. ఆ విషయము తెలిసిన ఆదిభట్ల నారాయణ దాసుగారు జైలు నుంచి విడిపించుకొని వచ్చారు,

కానీ ప్రతిభావంతుడిని పోగొట్టుకోవడం ఇష్టం లేక తిరిగి విద్యార్థిగా చేర్చుకున్నారు. విశ్వదాత కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఈయనకు నెలనెలా విద్యార్థి వేతనం ఇచ్చేవారు. ఇతని కవితాశక్తి గురించి విన్న జయపురం మహారాజా ఇతడిని ఆహ్వానించి తన సంస్థానంలో ఆస్థానకవిగా నియమించాడు. అమరజీవి పొట్టి శ్రీరాములు వెంట కొంతకాలం తిరిగి హరిజనసేవకు నిధులు సేకరించారు. 1948లో మద్రాసులోని శ్రీరామకృష్ణ విద్యాసంస్థలలో ఆంధ్రోపాధ్యాయుడిగా ప్రవేశించి 1974లో పదవీ విరమణ చేశారు. ఆ విధముగా 1948 నుండి 1997 వరకు మద్రాసులోనే ఉన్నారు. ఈయన సంపాదకత్వంలో మద్రాసు నుండి అమృతవాణి అనే సాహిత్య మాస పత్రిక కొన్నాళ్లు వెలువడింది. అలాగే ఆంధ్ర ప్రభ న్యూస్ పేపర్లో పనిచేస్తూ ఆంధ్ర భారతాన్ని తెలుగులో పాఠకులకు పరిచయము చేశారు.

అటు ఆకాశవాణి, ఆంధ్ర ప్రభ, పత్రిక, భారతి, చిత్రగుప్త వంటి పత్రికలు వారి రచనల కోసము ఎదురు చూసేవి. ఆ విధముగా 1933లో పట్టిన కలాన్ని 1998 వరకు విడువకుండా రచనా వ్యాసంగము చేశారు. నిష్ఠాగరిష్టమైన నిరాడంబర జీవితము, నిర్మోహమాటమైన వాగ్విలాసము వీరి ప్రత్యేకతలు. ఇంటి నిండా, అటక నిండా పుస్తకాలే. పుస్తకాలే వారి సహచరులు. ప్రతిరోజు నిత్య అనుష్ఠానము తరువాత రచన వ్యాసంగము. ఈయన రచించిన అనేక రచనలలో కొన్ని: ఏకాంతసేవ (స్తోత్ర కావ్యం), శ్రీకృష్ణరాజ స్తవము, విక్రమ ప్రకృతి, శ్రీరామచంద్ర శతకము, సూర్యశతకము (ఆంధ్రీకరణము), శ్రీ మహాభాగవతము (సరళ వచనము), దేవీ భాగవతము (సరళ వచనము), వాల్మీకి రామాయణం (సరళ వచనము), కుమార సంభవము (వచనం), లక్ష్మీ నరసింహ పురాణము, శ్రీ భీమేశ్వర పురాణము, ఏకాదశీ మాహాత్మ్యం, శ్రీ వేంకటేశ్వర సహస్రము, సూర్య సహస్రము, సుబ్రమణ్య సహస్రం వంటి ఎన్నో పౌరాణిక రచనలు. పూర్ణ పురుషుడు (ఆదిభట్ల నారాయణదాసు జీవితచరిత్ర) మొదలైనవి ఈయన రచనలలో కొన్ని.

ఒక పక్క సంస్కృత సాహిత్య అనువాదము, మరొక పక్క స్వీయ కావ్యాలు, మరోపక్క బాల సాహిత్యము ఇలా ఎన్నో రకాల ప్రక్రియలలో రచనలు చేస్తూ ఆబాల గోపాలాన్ని ఆకట్టుకొనేవారు. స్వీయ రచనలలో ఆంధ్ర కేసరి పట్టాభి రాజాజీ వంటి ప్రముఖుల జీవిత చరిత్రలను రచించారు. టిటిడి వారి కోరిక మీద కాశీ ఖండము, ఏకాదశి మహత్యము, విశ్వ గుణాదర్శము రచించారు. వీటిని టిటిడి వారు ముద్రించారు. వీరికి కవిరత్న, కవికులతిలక, అభినవ వాల్మీకి అనే బిరుదులు కలవు.

శ్రీ కంచికామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు వీరికి కుమార సరస్వతి బిరుదు ప్రదానము చేశారు. ఒకే చేతి మీదుగా ఒకే శైలిలో తెలుగు వచన రచనలుగా తెలిగించిన మరో వ్యాస మహర్షి పద్మనాభ స్వామి గారు నిజముగా సరస్వతి పుత్రులే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here