Site icon Sanchika

బహుమతి పొందిన కథల విశ్లేషణ-2

[వివిధ పత్రికలు/సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి పొందిన కథలను సంక్షిప్తంగా విశ్లేషిస్తున్నారు వసుంధర.]

[dropcap]క[/dropcap]థలంటే ఉపేక్ష ఉన్నవారికి కూడా బహుమతి కథలంటే ఆపేక్ష ఉండడంవల్లనేమో – చదివిన వెంటనే అభిప్రాయమడిగితే నిరాశతో కూడిన నిట్టూర్పు సాధారణం. నోటిమాటకు అక్షరరూప మిచ్చినప్పుడే విమర్శకు సార్థకమూ, విలువా. ఐతే ఇక్కడ వెలిబుచ్చే అభిప్రాయాలు మా అభిరుచికి మాత్రమే పరిమితమనీ, ఆయా కథలపై తీర్పు కాదనీ పాఠకులకు మనవి.

~

రాజీ (రావులపాటి వెంకట రామారావు) (నవ్య వీక్లీ ఫిబ్రవరి 28, 2018)

రిటైర్డ్ హెడ్ మాస్టర్ రవీందర్ రావుకి భార్య పోయేక అనుబంధాలపైన విరక్తి పుట్టింది. అమెరికాలో ఉంటున్న కొడుకు సురేష్ ఎంత బ్రతిమాలినా అతది దగ్గరకు వెళ్లడు. కోడలు తనని తండ్రిలా భావిస్తుందని తెలిసినా, మనవడికి తనంటే చాలా ఇష్టమని తెలిసినా వెళ్లడు. చివరికి మనవడు బ్రతిమాలితే రాజీపడి తన విరక్తిని చంపుకోవడం కథకి ముగింపు. కథాంశం పాతదే అయినా, రవీందర్ రావు విరక్తి సిద్ధాంతంలో కొత్తదనం ఉంది. ఐతే ఆ సిద్ధాంతం విషయమై తండ్రీకొడుకుల మధ్య జరిగిన చర్చలు – సుదీర్ఘం, చర్వితచర్వణం అనిపిస్తాయి. కొంత విసుగ్గానూ తోచవచ్చు. వాటిని కుదించి 2-3 పేజీల మినీ కథగా మలిస్తే బాగుండేదేమో!

నవ్య వీక్లీ- బలివాడ కాంతారావు స్మారక కథల పోటీలో బహుమతి పొందిన కథల సంక్షిప్త పరిచయం

నక్కా విజయరామరాజు (జూలై 11, 2018)

నియత్: ‘మాటకు ప్రాణము సత్యము’ అన్న సుమతీ శతక పద్యాన్ని అక్షరాలా జీర్ణించుకున్న ఓ కలియుగ మహానుభావుడి కథ ఇది. చిన్న బాలుడి చేత ఉత్తమ పురుషలో చెప్పించిన కథనం రచయిత నేర్పుకీ, ప్రతిభకీ అద్దం పట్టింది. ప్రత్యక్షంగా ప్రబోధమూ, పరోక్షంగా సందేశమూ ఈ కథను ప్రయోజనాత్మకం చేయడం గమనార్హం.

మన్నెం శారద (జూలై 18, 2018)

ఒక వంతెన కూలడానికీ, ఇసుక మాఫియాకీ ఉన్న సంబంధం కథాంశం. ఇతివృత్తంలో నవ్యత లేకపోయినా, కథనం ప్రతిభావంతం.

గొర్లి శ్రీనివాసరావు (జూలై 25, 2018)

గంగ సాగర్‍: వృద్ధాప్యంలో తలిదండ్రుల్ని వదుల్చుకోవాలనే పిల్లల స్వార్థం, క్రూరత్వం కథాంశం. నేపథ్యం, కొన్ని సన్నివేశాలు కొత్తగా ఉన్నా – అంతరార్థం పాతది, మనో విశ్లేషణ కృతకం. కథనం సాధారణమైనా – అవ్వా, మనవళ్ల అనుబంధాన్ని మాత్రం హృద్యం చెయ్యగలిగింది.

జాస్తి రమాదేవి (ఆగస్ట్ 1, 2018)

నాన్న అంతే..: తండ్రి తనకేమీ ఇవ్వలేదని వాపోయే ఓ తనయుడికి కనువిప్పవడం కథాంశం. సన్నివేశాలు, పాత్రచిత్రణ కృతకం. కథనం సాధారణమైనా – సందేశం అవశ్యం.

బాచి (ఆగస్ట్ 8, 2018)

పసుపు తాడు: పుట్టుకతోనే గర్భసంచీ లేకపోవడంవల్ల, మాతృమూర్తిని కాలేకపోతున్నానని వాపోయే ఓ సుధేష్ణ కథ ఇది. సన్నివేశాలు, పాత్రచిత్రణ కృతకమైనా కథాంశం కొత్తది. ముగింపు పేలవం.

గోగినేని మణి (ఆగస్ట్ 15, 2018)

పిచ్చుక గూడు: ‘దాచుకోవటంకంటే, పంచుకోవటంలోనే అనందం ఉంది’, ‘సంతృప్తి అనే తరువుకి మాత్రమే, సంతోష సుమాలు విరివిగా పూస్తాయి’ – అనే సందేశం కథాంశం. సందేశం కోసమే కథ అల్లడం వల్ల – సన్నివేశాలు, పాత్రలు కృతకమై కథనాన్ని సంతృప్తికరం చెయ్యడానికి అవరోధమౌతాయి.

కట్టా రాంబాబు (ఆగస్ట్ 22, 2018)

జీవనవ్యథ: ముసలి తలిదండ్రుల్ని కూడా దోపిడి చెయ్యాలనుకునే పిల్లల తీరు కథాంశం. కథనంలో తారసపడిన అనంతమ్మ, గంగారత్నంల కథలు వాస్తవానికి అద్దం పట్టి మనసుని కలచివేస్తాయి. వారి కథలు విని ఆత్మవిమర్శ చేసుకుని మారిపోయిన ఓ ‘దోపిడి పుత్రుడి’ మనోవిశ్లేషణ కృతకంగా ఉంది. ఎన్నుకున్న సన్నివేశాలు, కథనం – పాఠకులకి అసంతృప్తిని కలిగిస్తాయి.

పద్మా దాశరథి (ఆగస్ట్ 29, 2018)

నేను క్షమించలేదు: అనుబంధాలు, అనురాగాల పరంగా మధ్యతరగతి హిపోక్రసీ కథాంశం. మంచితనమే దురలవాటై దోపిడికి గురైన వాసు పాత్ర కథలలో అరుదైనా, వాస్తవం. అతడి భార్య సరోజ, ఆమె అన్నలు, తల్లి, తండ్రి వగైరా పాత్రలు – వారితొ కూడిన సన్నివేశాలు – అత్యంత సహజంగా రూపొందాయి. కథ చివర్లో పరుగందుకున్నట్లు అనిపించినా – ముగింపులో – ‘నేను క్షమించినట్లు నటించాను కానీ – నా అన్నల్నీ, వదినల్నీ, ఆఖరికి నా భర్తనూ కూడా క్షమించలేదు’ అన్న సరోజ మాటలు శీర్శికకు న్యాయం చేకూర్చడమే కాక – కథను విశిష్టం చేశాయి.

సలీం (సెప్టెంబర్ 5, 2018)

చెక్మేట్‍: తన కుటుంబం సాయంతో జీవితంలో ఎదిగిన అనిల్‌ని  – అభిరామ్ కోరిన కోరిక ఒక్కటే. చదరంగం జాతీయ పోటీల్లో ఫైనల్సులో తన చేతిలో ఓడిపొమ్మని. అనిల్ సరేనని అవకాశమిచ్చినా, ఉపయోగించుకోలేకపోయిన అభిరామ్ – తనని అనిల్ మోసగించాడనుకుంటాడు. అతణ్ణి దూరం పెడతాడు. అనిల్ తట్టుకోలేక తాగుడుకి అలవాటు పడి క్రమంగా ఆర్థికంగా కూడా పతనమౌతాడు. అభిరామ్‌కి తన తప్పు తెలిసి క్షమార్పణ అడగడానికి వెళ్లేసరికి – అనిల్ కేన్సరుతో చనిపోతాడు. ‘చెక్మేట్ చెప్పడంలో ఆలస్యం చేసి అప్పుడు ఫైనల్లో ఓడినట్లే, నీ మనసులో తిష్ట వేసుకున్న అనుమానానికీ చెక్మేట్ చెప్పడంలో ఆలస్యం చేశావ్’ అని అనిల్ తనని మందలిస్తున్నట్లు అభిరామ్కి అనిపించడం కథకి ముగింపు. అద్భుతం అనతగ్గ ఈ ముగింపు కోసం – కథనంలో ఎన్నుకున్న పాత్రలు, సన్నివేశాలు, మనోవిశ్లేషణ – అన్నీ కృతకం అనిపించడమే కాక – ముగింపుని కూడా పేలవం చేస్తాయి.

నవ్య వీక్లీ- డా. అమృతలత దీపావళి కథల పోటీలో విశేష బహుమతి పొందిన కథలు

నక్కా విజయరామరాజు (నవంబర్ 21, 2018)

ఇన్‍సైడర్‍: ‘ఇచ్చుటలో ఉన్న హాయి’ ఆనుభవిస్తూ, అందుకు మరెందరికో స్ఫూర్తి కలిగించిన నందిని కథ ఇది. సందేశం గొప్పదే కానీ అదే కథ కావడం కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. వరద బాధితుల్ని ఆదుకునేవారి కృషి వివరాలు మనసుని తాకడం, రక్తి కట్టిన కథనం – ఆ అసంతృప్తిని చాలావరకూ తొలగిస్తాయి.

పసుపులేటి సత్యశ్రీనివాస్ (నవంబర్ 28, 2018)

గంజా: అడవి జాతులవారిని నాగరికులు దోపిడి చెయ్యడం కథాంశం. ఇందులో ప్రేమ సన్నివేశాలు ఇమడలేదు. కథ పాతది. కథనం అనాసక్తికరం. అక్కడక్కడ మెరిసే రచనా ప్రతిభ ప్రశంసనీయం. అది మొత్తం కథకి విస్తరిస్తే బాగుణ్ణనిపించింది.

రావులపాటి వెంకటరామారావు (డిసెంబర్ 5, 2018)

డాక్టర్ శ్యామల: శ్యామల అనే పేద బాలిక – సేవాధర్మాన్ని పాటించే డాక్టరుగా ఎదిగి – పిన్నవయసులోనే కేన్సరుతో ముగియడం కఠాంశం. చెప్పుకోతగ్గ మలుపులు లేని వివరాల్ని అనాసక్త కథనంతో పాఠకుల ముందుంచడానికి – నేడు విరివిగా వస్తున్న బయోపిక్‍లు కానీ కారణం కాదు కదా అనిపిస్తుంది.

అనూరాధ (డిసెంబర్ 12, 2018)

బహుమతి: రమణి ప్రమాదంలో చనిపోయింది. తలిదండ్రులు ఆమె అవయవాల్ని దానం చేశారు. మరణశయ్య మీద ఉన్న కొందరు అలా తిరిగి ఊపిరి పోసుకుకుని కొత్త జీవితాల్ని బహుమతిగా పొందారు. ఆ ఆదృష్టవంతుల్ని ఏటా రమణి పుట్టిన రోజున ఆహ్వానించి – వారిలో కూతుర్ని చూసుకుంటారు ఆమె తలిదండ్రులు. సన్నివేశ కల్పన, కథనం మరింత మెరుగ్గా ఉండొచ్చనిపించినా, ఉదాత్తమైన కథాంశం మెచ్చుకోతగ్గది.

సలీం (డిసెంబర్ 19, 2018)

గాయం: మహిళలకు లైంగిక వేధింపులు కథాంశం. ఎన్నుకున్న సన్నివేశాలు, పాత్రచిత్రణ గొప్పగా ఉన్నాయి. కథనం బాగున్నా – ముగింపులో కొసమెరుపుంటే బాగుణ్ణనిపిస్తుంది.

సి. యమున (డిసెంబర్ 26, 2018)

కరిగిపోయిన కలలు: కలలు కనే మనస్తత్వం సూర్యానిది. అనుకున్నవి సాధించినా, అవరోధాలు ఎదురైనా నిరాశా నిస్పృహలకు గురికాకుండా – ముందడుగు వెయ్యడం అతడి అలవాటు. నేటి యువతరానికి అవశ్యమైన కథాంశమిది. సూర్యం పాత్ర గొప్పదే ఐనా – పాత్రచిత్రణకు కథనం పూర్తి న్యాయం చేకూర్చకపోయినా – అంతర్లీన సందేశంతో ఇది ఒక మంచి కథగా గుర్తుండిపోతుంది.

అన్నం శ్రీధర్ (బాచి) (జనవరి 2, 2019)

అమ్మే గెలిచింది: పదోన్నతి కోసం సాటి ఉద్యోగిని అనసూయమ్మని ఎసిబిని దురుపయోగం చేసి అపవాదుకు గురి చేశాడు డాక్టరు రంగారావు. కేసులో బలం లేకపోయినా ఆమెను నిర్దోషిగా ప్రకటించడానికి కొంత సమయం పట్టింది. ఈలోగా ఆమె మనోవ్యధతో మరణించింది. తర్వాత రంగారావు – క్రమంగా పతనమై, అయినవాళ్లందరికీ దూరమయ్యాడు. ముసలితనంలో పేషెంటుగా ఉన్నప్పుడు అనసూయమ్మ కూతురు హర్షిత అతడికి అంకితభావంతో వైద్యం చేసింది. తల్లిలాగే మానవత్వం మూర్తీభవించిన డాక్టరుగా హర్షిత కారణంగా ఆమె తల్లే గెలిచిందనడం కథకి ముగింపు. కథాంశం, కొన్ని సన్నివేశాలు పాఠకుణ్ణి వెంటాడుతాయి. ఈ కథలో ప్రస్తావించిన ఎసిబి వలలు – నేడు ప్రమాదకరమైన పెద్ద చేపల్ని వదిలి, సామాన్యమైన చిన్న చేపల్ని పడుతూ తమ ఉనికిని నిరూపించుకుంటున్నాయే తప్ప – తమ బాధ్యతకు న్యాయం చెయ్యకపోవడం తరచుగా జరుగుతున్నాయి. ఆ అంశానికి ప్రాధాన్యమిచ్చి – అనసూయమ్మ కథని దానికి అనుబంధం చేస్తే – కథనం మరింత రాణించేదనిపిస్తుంది.

జియో లక్ష్మణ్ (జనవరి 9, 2019)

బతికించే బతుకు: సెల్ఫీల వేలంవెర్రిలో – ప్రాణాల్నే పణంగా పెట్టే నేటి తరానికి హెచ్చరిక కథాంశం. అందుకోసం ఎన్నుకున్న సన్నివేశాలు పేలవంగా ఉన్నాయి. సెల్ఫీ కోసం కొడుకు సముద్రంలోకి చొరబడుతున్నప్పుడు – తండ్రి భయపడ్డం, తల్లి సరేననడం – అసహజం కాకపోయినా రచయిత వివరణ ఇవ్వాల్సిన విశేషం. కొడుకుని రక్షించిన బిజినెస్‍మాన్ పాత్రని కథకోసం అతికించినట్లుంది. సందేశం అవశ్యమైనా – కథనంలో సృజన లేదనిపిస్తుంది.

రామా చంద్రమౌళి (జనవరి 16, 2019)

తపస్సు: ఆయన డిఫెన్స్ లాబొరేటరీలో సైంటిస్టు. ‘యుద్ధ సమయంలో అత్యంత కీలకమైన రాత్రి వేళల్లో రాడార్ సిస్టంలో పనికొచ్చే ఒక ప్రత్యేకమైన సిస్టంని తన టీం డిజైన్ చేసిన విజయం గురించీ, దేశ ప్రధానినుండి పొందిన ప్రశంస గురించీ’ ప్రస్తావించినప్పుడు తన పిల్లలతో ‘మీలో ఎవరూ జీనియస్ కాదురా’ అంటాడాయన. ఆయన పెద్ద కూతురు పిజిలో గోల్డ్ మెడలిస్ట్. కొడుకు ఎంటెక్ మెకానికల్ ఇంజనీర్. చిన్న కూతురు సుశీల సైకాలజీలో పిజి చేసి పెన్‍సిల్వేనియాలో పిహెచ్‍డికి అడ్మిషన్ సంపాదించింది. తండ్రి ఉద్దేశ్యంలో జీనియస్ అంటే ఏమిటో అర్థం కాక సతమతమయ్యేది. ఆమె అమెరికా వెళ్లి తన సబ్జక్టులో నిష్ణాతురాలై ‘ది పవర్ ఆఫ్ పాషన్’ అనే పుస్తకం రచిస్తే – దానికి ప్రపంచంలోనే విశిష్టమైన పురస్కారం లభించింది. అప్పటికామె తండ్రి ఎనిమిదేళ్లుగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నాడు, ఆ విజయాన్ని తండ్రితో పంచుకుందుకు సుశీల ఆ పుస్తకాన్ని మొత్తం చదివి వినిపించింది.  నాలుగు గంటలు ఆయన కదలకుండా శ్రద్ధగా ఆమె చదివి ఆమెని మెచ్చుకుంటాడు. జీనియస్ అంటే ఏమిటో సుశీలకి అప్పుడు అర్థమైందంటూ కథ ముగుస్తుంది. ఆ ముగింపే ఈ కథను, కథనాన్ని విశిష్టం చేసింది.

నవ్య వీక్లీ- రచయిత్రి శ్రీమతి కమలారాంజీ ఉగాది కథల పోటీలో బహుమతి పొందిన కథలు

సలీం (ఏప్రిల్ 10, 2019)

నీడ: ఆటోవాలా అమీర్, అందులో యాద్గిరి, రవి అనే ఇద్దరు ప్రయాణీకులు. ముగ్గురూ పరస్పరం అనుమానించుకుంటూ భయపడుతూ ప్రయాణం కొనసాగించడం కథాంశం. మానసిక విశ్లేషణకు ప్రాధాన్యమున్న లోతైన ఈ చక్కని సన్నివేశాన్ని రక్తి కట్టించడానికి కథనం సూటిగా ఉండాలి. అంటే కథ ఆటో ప్రయాణంతోనే మొదలవాలి. కానీ ఈ కథ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రవిని తల్లి ప్రయాణానికి సిద్ధం చెయ్యడంతో మొదలౌతుంది., అతడి బస్సు ఆలస్యంగా గమ్యం చేరడంతో, తనిల్లు చేరడానికి ఆటో దొరక్క కొంత దూరం నడిచేక, అప్పుడు ఆటో ఎక్కితే అందులో అప్పటికే యాద్గిరి ఉంటాడు. అప్పటికి మూడొంతుల కథనం అయింది. కథకి అంత ముఖ్యం కాని ఈ వివరాల్ని – ఆటో ప్రయాణం మధ్యలో సూచన ప్రాయంగా చెబితే సరిపోయేది.  కథకి పెట్టిన పేరు బాగుంది.

కన్నెగంటి అనసూయ (ఏప్రిల్ 17, 2019)

చినుకులా సాగి..: ఉడకబెట్టిన దుంపలు అమ్మే ఓ త్రివిక్రమ్, ఓ మంచి మేస్టారి ప్రోత్సాహంతో గొప్ప వ్యాపారి కావడం కథాంశం. ఇది చాలావరకూ త్రివిక్రమ్ బయోపిక్ అనొచ్చు. సందేశాన్నే కథగా మలచిన ఈ ప్రయత్నంలో నవ్యత కనిపించదు. సన్నివేశాలు, పాత్రచిత్రణ, కథనం – క్లాసు పుస్తకాల పాఠంలా అనిపిస్తాయి.

కాండ్రేగుల శ్రీనివాసరావు (ఏప్రిల్ 24, 2019)

జనయిత్రి: పుట్టగానే బాలి (ఆఫ్రికా) దేశస్థులు దత్తత తీసుకోగా అక్కడే పెరిగి పెద్దదైన రచేల్ – తన తల్లి వివరాలు తెలుసుకుని ఆమెని కలుసుకోవడానికి ఇండియా వస్తుంది. అప్పటికి పెద్దింటి కోడలిగా గుట్టుగా సంసారం చేసుకుంటున్న ఆమె తల్లి – సమాజంలో పరువు ప్రతిష్ఠలకు భంగమని భయపడి – కూతుర్ని చూడ్డానికి ఒప్పుకోదు. రచేల్ ఆత్మహత్య చేసుకుందామనుకున్న సమయంలో బాలినుంచి తలిదండ్రులు ఆమెకోసం పరితపిస్తూ ఫోన్ చేస్తారు. దాంతో మనసు మార్చుకున్న రచేల్ పెంచినవారికోసం తిరుగు ప్రయాణమౌతున్న సమయంలో కన్నతల్లి కూడా ఆమెను ఓసారి కలుసుకోవడం కథకి ముగింపు. ఆసక్తికరమైన ఈ కథాంశాన్ని – కుదించిన నవలికలా ప్రదర్శించింది కథనం. ఆ కారణంగా పాఠకులకి చాలా సందేహాలు కలుగుతాయి, కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి. రచేల్ మానసిక విశేషణ – పాత్రానుగుణంగా కాక రచయిత కోరినట్లు జరిగిందా అనిపిస్తుంది. రచేల్ కన్నతల్లి పాత్రచిత్రణ కూడా అసహజంగా అనిపిస్తుంది. కన్నతల్లిని చూడ్డానికి పెంచినవారి మమకారాన్ని కూడా కాదన్న రచేల్, కన్నబిడ్డకంటే సమాజానికే ప్రాధాన్యమిచ్చిన కన్నతల్లి ఉంటున్న వ్యవస్థపట్ల వ్యథ చెందిన సమయంలో, పెంచినవారి ఆత్మీయత ప్రాముఖ్యాన్ని గ్రహించడానికి మాత్రమే ప్రాధాన్యమిస్తే – ఇది చక్కని కథ అయ్యేది.

ఇందూ రమణ (మే 1, 2019)

మళ్లీ బ్రతకొచ్చు: కొడుకు పదవ పుట్టినరోజున తనకి ప్రమాదముందన్న జోస్యాన్ని నమ్మిన తండ్రి. ఉద్యోగరీత్యా వీలు కాకపోయినా ఆరోజు ఎలాగో వీలు చేసుకుని ఇంటికి వెళ్లబోతూ ఓ పేదబాలుడికి జన్మదిన కానుక ఇచ్చి, అతణ్ణి ప్రమాదంనుంచి రక్షించబోతూ తనే తీవ్ర ప్రమాదానికి గురౌతాడు. ‘అవయవ దానంతో నా కొడుక్కి చూపునీ, మరెందరికో కొత్త జీవితాన్నీ ఇస్తూ మళ్లీ నేను బ్రతకొచ్చు’ అని అతడి ఆత్మ అనుకోవడం కథకి ముగింపు. అంధుడైన కొడుక్కి – నేత్రదానం కోసం విశ్వప్రయత్నం చేస్తున్న ఓ మంచి తండ్రి – చివరికి తనే నేత్రదానమిచ్చే పరిస్థితి ఏర్పడ్డం – కథాంశం. కథనం, సన్నివేశాలు – ఈ కథాంశానికి న్యాయం చేకూర్చితే ఎక్కువ బాగుండేది.

డా. మద్దాళి ఉషా గాయిత్రి (మే 8, 2019)

అపార్ట్మెంట్‍: మిత్రని ప్రేమించి పెళ్లి చేసుకుంది స్నేహ. ఓ పాప పుట్టేక అపార్థాలతో విడిపోయారా దంపతులు. మిత్ర రాజీకి వచ్చినా స్నేహ సహకరించక విడిగా పాపతో ఉంటోంది. తానుండే అపార్ట్మెంట్లో – అన్యోన్యంగా ఉంటున్న ఓ వృద్ధజంటని చూసి – జీవితంలో తోడు అవసరాన్నీ, పాపకి తండ్రి అవసరాన్నీ గుర్తించిన  స్నేహ – మనసు మార్చుకుని మిరని మళ్లీ జీవితంలోకి ఆహ్వానిస్తే – అతడు సంతోషంగా తిరిగి రావడం కథకి ముగింపు. కథాంశం సమకాలీనం. సందేశం ముఖ్యమైనది. సన్నివేశ కల్పనలో కొత్తదనం లేదు. మానసిక విశ్లేషణలో లోతు లేదు. కథనంలో బలం లేదు.

వంజారి రోహిణి (మే 15, 2019)

ఆసరా: ప్రేమించిన అమ్మాయి తిరస్కరిస్తే, మతి చెడింది లాయర్ నిరంజన్‌కి. అయినవాళ్లు ఆదరించక వదిలేస్తే, కన్నతల్లి పేదరికం అనుభవిస్తూనే అతణ్ణి చూసుకుంటోంది. వాళ్లిద్దరూ అనాథలుగా చనిపోతే – చలించిపోయిన నవనీత అనే మధ్యతరగతి గృహిణి – అలాంటివారికి ఆసరాగా ఉండే అనాథాశ్రమాన్ని నెలకొల్పడం కథకి ముగింపు. కథనం, సన్నివేశాలు హృద్యం. నిరంజన్, నవనీతల కథలు, ఆసరా లేనివారి పట్ల సమాజానికి బాధ్యత ఉన్నదన్న సందేశం గొప్పగా ఉన్నాయి. ఎటొచ్చీ – ఈ మూడూ విడివిడిగానే ఉండి కథలో సమన్వయం కాలేకపోయాయి.

(సశేషం)

Exit mobile version