Site icon Sanchika

బహుమతి పొందిన కథల విశ్లేషణ-4

[వివిధ పత్రికలు/సంస్థలు నిర్వహించిన పలు పోటీలలో బహుమతి పొందిన కథలను సంక్షిప్తంగా విశ్లేషిస్తున్నారు వసుంధర.]

[dropcap]క[/dropcap]థలంటే ఉపేక్ష ఉన్నవారికి కూడా బహుమతి కథలంటే ఆపేక్ష ఉండడంవల్లనేమో – చదివిన వెంటనే అభిప్రాయమడిగితే నిరాశతో కూడిన నిట్టూర్పు సాధారణం. నోటిమాటకు అక్షరరూప మిచ్చినప్పుడే విమర్శకు సార్థకమూ, విలువా. ఐతే ఇక్కడ వెలిబుచ్చే అభిప్రాయాలు మా అభిరుచికి మాత్రమే పరిమితమనీ, ఆయా కథలపై తీర్పు కాదనీ పాఠకులకు మనవి.

~

శ్రీజ్యేష్ఠ (ఆగస్ట్ 24, 2018)

అమ్మా మా ఇంటికి రావద్దు: స్వతంత్రంగా ఉంటూ ఏదో సాధించాలన్న తపనతో పెళ్ళి చేసుకోలేదు శిరీష. మూడు పదుల వయస్సుకే వైభవజీవితాన్ని స్వంతం చేసుకున్న ఆమె – భర్త లేకుండా కృత్రిమ గర్భధారణ చేసి కన్న కొడుకు సుమన్. అతణ్ణి పెంచి పెద్దవాణ్ణి చేసి విద్యాబుద్ధులు నేర్పించింది కానీ తండ్రి లేకపోవడాన్ని దౌర్భాగ్యంగా భావిస్తూ కుమిలిపోయాడన్న విషయం చాలా ఆలస్యంగా తెలుసుకుంది. అప్పటికి సుమన్ ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనీ – తన పిల్లలు తలిదండ్రులిద్దరి ప్రేమనూ అనుభవిస్తూ పెరగాలనీ కలలు కంటున్నాడు. సుమన్ తల్లిని మళ్లీ తన ఇంటికి రావద్దని ఉత్తరం వ్రాయడం కథకి ముగింపు. కథాంశం గొప్పది. పిల్లల మనస్తత్వాన్ని హృద్యం చేస్తుంది సుమన్ తల్లికి వ్రాసిన లేఖ. కథనం వ్యాసంలా కాక సన్నివేశాల సమూహంగా రూపొందితే బాగుండేదనిపించినా, సందేశం సమకాలీనులందరికీ మార్గదర్శిని.

వల్లూరు శివప్రసాద్ (ఆగస్ట్ 31, 2018)

ది ఓత్‍: కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ చక్రవర్తి – నీతికీ, నిజాయితీకీ, పేషెంట్ల అవసరానికీ ప్రాధాన్యమిస్తూ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. మిత్రుడు ప్రదీప్ కొత్తగా హాస్పిటల్ ప్రారంభిస్తూ తనని బ్రతిమలాడితే అక్కడ చేరాడు. హాస్పిటలుకి పేరొచ్చేక – ప్రదీప్‌లో వ్యాపారదృక్పథం పెరగడాన్ని గమనించి – డాక్టరుగా తను తీసుకున్న ఓత్ గుర్తు చేసుకుని ఆ ఉద్యోగానికి రాజీనామా చెయ్యడం కథకి ముగింపు.  ఎన్నుకున్న కొన్ని సన్నివేశాలు రోగులకు హెచ్చరిక. సందేశమే కథ అనిపించే కథనంవల్ల కథ పేలవమైనా, సందేశం పలుమార్లు వినిపించేదే ఐనా – సమకాలీనంగా అత్యవసరమైన కథాంశమిది.

పుట్టగంటి గోపీకృష్ణ (సెప్టెంబర్ 14, 2018)

చిరంజీవి: ‘అసలయిన ఇండియన్‌కి మరణం లేదు. అతను చిరంజీవి. ఎందుకంటే అతను మరణించేక కూడా పోరాడుతూనే ఉంటాడు’ – అన్న వ్యాఖ్య వెనుక ఉన్న ఓ వీరసైనికుడి కథ ఇది. అందుకు ఎన్నుకున్న వాతావరణం, సన్నివేశాలు, కథనం – కథను విశిష్టం చేశాయి.

సుగుణ-రాజేష్ (సెప్టెంబర్ 28, 2018)

దృష్టి: ‘సివిల్ ఇంజనీరింగ్ భాషలో ‘నీతి, నిజాయితీ, క్రమశిక్షణ – ఈ మూడూ ఇటుక, సిమెంటు, ఇసుకల లాంటివి. వీతిలో దేనిలో తేడా వచ్చినా మానవజీవితం అనే భవనం కుప్పకూలిపోతుంది’ – అన్న ఆదర్శం కథాంశం. సన్నివేశాలు ఊహకందేవే ఐనా కథనం ప్రతిభావంతం.

సింహప్రసాద్ (అక్టోబర్ 5, 2018)

పైకప్పు: భాగ్యవంతుడు మెహతా కోసం హంసభవన్ అనే భవంతిని అద్భుతంగా కట్టించాడు ఆర్కిటెక్ట్ మనోజ్. అంతకు మించిన సంతృప్తి – పేదలకోసం చౌక ఇళ్లు కట్టినప్పుడు కలిగిందతడికి. పాత సీసాలో పాత సారాలాంటి కథనంలో – మనోజ్ భార్య సునంద, కూతురు హంసినిల పాత్రలు నాటకీయంగానూ, వాస్తవదూరంగానూ అనిపిస్తాయి. ప్రబోధం, సందేశం మెచ్చుకోతగ్గవి.

శివకుమార్ ఆదెళ్ల (అక్టోబర్ 19, 2018)

నేర్చుకుంటా: రచనలు ఎలా, ఎందుకు చేయాలి – అన్న సందేశం కథాంశం. పేలవమైన ముగింపుతో సందేశమే కథగా మారి ఉండకపోతే – కథనం బాగుందనే చెప్పాలి.

జాస్తి రమాదేవి (అక్టోబర్ 26, 2018)

చిగురంత ఆశ: కొడుకు క్రిష్ణని కులవృత్తిలో పెట్టాలని మంగలి వెంకన్న ఆశ. క్రిష్ణ కులవృత్తిని కాదని, కష్టపడి చదివి, పెద్ద ఉద్యోగస్థుడై అమెరికాలో స్థిరపడ్డాడు. అతడు నెలనెలా తనకి పంపే డబ్బుతో క్రిష్ణ పేరిట ఫౌండేషన్ ఏర్పాటు చేసి, పేద విద్యార్థుల చదువుకి వినియోగించాడు వెంకన్న. అలా చదువుకున్నవారందరూ ఆ ఫౌండేషన్‌ని బాగా వృద్ధి చేసి – వెంకన్న ఊళ్లో క్రిష్ణ పేరిట ఇంజనీరింగ్ కాలేజి నెలకొల్పి, ప్రారంభోత్సవానికి క్రిష్ణనే ఆహ్వానిస్తారు. జరిగింది గ్రహించిన క్రిష్ణ – తన తండ్రి కులవృత్తి చిహ్నాలున్న పెట్టెని అపురూపంగా దాచుకోవడం కథకి ముగింపు. జీవితంలో పైకి వచ్చినవారు – అలాంటి అవకాశాన్ని మరెందరికో కల్పించాలన్న సందేశానికి ఎన్నుకున్న సన్నివేశాలు, పాత్రల్ని కథనం సమర్థించ లేకపోయింది. ముగింపు పేలవమైనా శైలి కథను ఇంచుమించు చివరిదాకా చదివిస్తుంది.

రవళి (నవంబర్ 2, 2018)

ఆదిశక్తి: వ్యవహారజ్ఞతలో గృహిణి సామర్థ్యాన్ని నిరూపించడం కథాంశం. తెలివి, అధికారం, అనుభవం, న్యాయశాస్త్ర పరిజ్ఞానం కంటే – నిజాయితీ, మానవత్వం, ఆత్మీయతా భావాలు రంగరించడమే గృహిణి సామర్థ్యానికి కారణమని నిరూపించడానికి ఎన్నుకున్న సన్నివేశాలు మరీ బలంగా లేకపోయినా, వాస్తవంగానూ హృద్యంగానూ ఉన్నాయి.

స్వాతి వారపత్రిక నిర్వహించిన కామెడీ కథల పోటీలో బహుమతి పొందిన కథలుః

కె.కె. రఘునందన (అక్టోబర్ 10, 2018)

ఇల్లు మారి చూడు: అపార్టుమెంట్లో ఉండే బుచ్చిబాబు – కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. ఇక్కణ్ణించి అక్కడికి మారే సన్నివేశమే ఈ కథ. బుచ్చిబాబు, భార్య వరాలమ్మ, బామ్మ తులసమ్మ, ఇంకా బుచ్చిబాబు పిల్లలు, పేకర్స్ అండ్ మూవర్స్ కంపెనీ ఉద్యోగులు – ఆ సన్నివేశాన్ని రసవత్తరం చేసిన పాత్రలు. సంభాషణల్లో అలవోకగా ప్రవహించిన హాస్యం – కథనానికి పుష్టినిచ్చింది.

తులసి బాలకృష్ణ (అక్టోబర్ 19, 2018)

బ్రో..చే.. వారెవరురా?!: సదానందం కారు కొన్నాడు. కారుమీద ‘నన్ను చూసి ఏడవకురా’ అని వ్రాయించడంలో అతడు కారు కొన్న ఉద్దేశం తెలిసిపోతుంది. కానీ అతడికి ఎదురైన అనుభవాలన్నీ – తనని చూసి తనే ఏడ్వాల్సిన పరిస్థితుల్ని కల్పిస్తాయి. అతడా వ్రాత చెరిపించడం కథకి ముగింపు.  సందేశం అంతర్లీనమైన ఈ కథలో సన్నివేశాలు కొత్తగా, వాస్తవంగా ఉన్నాయి. కథనం వాటిని రసవత్తరం చేసింది.

ఇంద్రగంటి నరసింహమూర్తి (అక్టోబర్ 26, 2018)

మూగనోము: వాగుడుకాయ వామనరావు ఇష్టపడి విశాలాక్షిని చేసుకున్నాడు. ఆమె తను చెప్పేది వినడమే తప్ప – ఎక్కువగా మాత్లాడపోవడం నచ్చక – భార్యని కూడా వాగుడుకాయ చెయ్యడం కోసం హోమియోపతి మందు కూడా తీసుకుంటాడు. నిజానికి విశాలాక్షి కూడా వాగుడుకాయ. తల్లి సలహామీద భర్తని అవగాహన చేసుకుందుకు ఆరు నెల్లు మూగనోము పట్టిందంతే!  ఆ తర్వాత ఆమె విజృంభణకు బిత్తరపోయిన వామనరావు – ఆమె వాగుడు తగ్గించడానికి హోమియోపతి మందు తీసుకోవడం కథకి ముగింపు. హాస్యం, కథనం సరిజోడై నడిచిన కథనం అభినందనీయం. ఎటొచ్చీ కథలో డాక్టరు అడిగినప్పుడు వామనరావుకి భార్య అభిరుచులు ఒక్కటి కూడా తెలియవని తెలుస్తుంది. వాగుడుకాయలు తమ గురించి చెప్పుకోవడమే కాదు, ఎదుటివారి గురించి తెలుసుకుందుకు కూడా ప్రయత్నించాలనీ, అప్పుడే ఎదుటివారి నోటి ముత్యాలూ రాలుతాయన్న సందేశం అందబోతోందనిపించింది. అలా జరిగితే కథ మరింత రసవత్తరమూ, ప్రయోజనాత్మకమూ అయ్యేదేమో!

తిరుమలశ్రీ (నవంబర్ 2, 2018)

కిరాక్ పార్టీ: కేంద్ర ప్రభుత్వాధికారి రాఘవేంద్ర తన ఇరవైఐదవ మారేజ్ యానివర్సరీకి కిరాక్ పార్టీ ఏర్పాటు చేశాడు. అంటే ఆహ్వానితులందరూ జంతు, పక్షుల వేషాల్లో రావాలి. అది అవకాశంగా తీసుకున్న ఇద్దరు దొంగలు తోడేలు, దొంగ వేషాలు వేసుకునొచ్చి ఆ ఇంటిని దోచుకోబోతే, అది ముందే పసికట్టిన ఓ పోలీసు అధికారి పెద్దపులి వేషంలో వచ్చి వాళ్ల ఆట కట్టించడం కథాంశం. కిరాక్ పార్టీలో వివిధ జంతు, పక్షుల వేషధారుల విన్యాసాలు నిండిన కథనం ఆసక్తికరంగా అనిపించదు. కథారంభంలో – పిల్లి వేషంలో ఉన్న భార్యని కార్లో ఎక్కించుకుని, ఎలుక వేషంలో ఉన్న భర్త డ్రైవ్ చేస్తూ పార్టీకి తీసుకెడుతున్నప్పుడు – దారిలో ట్రాఫిక్ పోలీసు అటకాయిస్తాడు. అతణ్ణి వదుల్చుకుందుకు – రెండు వేల రూపాయల నోటొకటి రహస్యంగా చేతిలో పెట్టబోతే – ‘నువ్విచ్చే బోడి రెండు వేలకి సీక్రెసీ ఒకటా’ అని బాహాటంగానే తీసుకుని వాళ్లని వదిలేస్తాడతడు. తల్చుకుని తల్చుకుని నవ్వేలా చేసే ఈ ఒక్క జోక్ పాఠకుల్ని చాలాసేపు వెన్నాడుతుంది.

ద్విభాష్యం రాజేశ్వరరావు (నవంబర్ 9, 2018)

రుబ్బురాయి-ఐశ్వర్యారాయి: భర్త భజగోవిందంతో గొడవపడ్డ ఎదురింటి సుందరి అతడిమీదకు అప్పడాల కర్రని విసిరింది. అది తనింటి వసారా కిటికీలోంచి చూసిన సుబ్బలక్ష్మ్కి – ఆ విషయాన్ని వీధంతా టాంటాం చేసింది. అందుకు భజగోవిందం సుబ్బలక్ష్మి భర్త అబ్బునాథాన్ని నిలదీశాడు. ఆ సమయానికి అక్కడున్న అబ్బునాథం మిత్రుడు కాలజ్ఞానం – సమయస్ఫూర్తితో గొడవ పెరక్కుండా కాపాడేడు. కాలజ్ఞానం ఇచ్చిన సలహాతో – అబ్బునాథం ఆ కిటికీ దగ్గర కూర్చుని సుందరి అందాల్ని చూస్తున్నట్లు భార్య దగ్గర బిల్దప్ ఇచ్చాడు. దాంతో సుబ్బలక్ష్మే పూనుకుని తనింటి వసారా కిటికీని శాశ్వతంగా మూయించివెయ్యడం కథకి ముగింపు. సన్నివేశాలన్నీ పాతవే, ఊహకందేవే. కథనం బాగుంది.

ఆకురాతి భాస్కర్ చన్ద్ర (నవంబర్ 16, 2018)

లచిందేవి లైను తప్పింది: కోట్ల ఆస్తికోసం లక్షలు ఇమ్మని అడిగే ఈమెయిల్సు మోసం కథాంశం. పాత సీసాలో పాత సారా. ఈ మొబైల్సు యుగంలో ఇంకా వేటి గురించి తెలియనివారుంటే వారికి తప్ప – ఇతరులకి కిక్ ఇవ్వని కథనం.

పి. లక్ష్మీశారద (నవంబర్ 23, 2018)

గ్రూపు జోలికెళ్లద్దురో: అంతర్జాల విస్తరణతో – సామాన్యజనం వాట్సాప్, ఫేస్బుక్ వగైరా గ్రూపుల్లో చేరి అదో వ్యసనంగా కాలం గడపడం కథాంశం. ఎన్నుకున్న సన్నివేశాలు, ముగింపు బాగున్నప్పటికీ – కథనం వాటికి పూర్తి న్యాయం చేకూర్చలేదు.

పసుపులేటి తాతారావు (నవంబర్ 30, 2018)

ముచ్చుమొహం: ఆధునికతపై మోజున్న ఓ బామ్మ, ఆధునికతపై మోజున్న ఓ భార్య, తను ఆధునికంగా ఉండకపోయినా భార్య మోజుకి తల వంచే భర్త – ఈ మూడు పాత్రల మధ్య నడిచిన ఓ సన్నివేశం కథాంశం. సంభాషణలు, సన్నివేశాలు, కథనం – వీటిమధ్య సమన్వయం లేక కథ పేలవమైనా – విడివిడిగా అవి బాగున్నాయి.

స్వర్ణప్రసాద్ (డిసెంబర్ 7, 2018)

వంటింటి రామాయణం: భర్తకు వంటింటి పట్ల ఆసక్తి పుట్టేందుకు భార్య ఓ చిట్కా వేసింది. అది తెలిసేక భర్త అదే చిట్కాతో భార్యని వంటింటివైపు నడిపించడం కథాంశం. చిట్కా బాగుంది. కథకి పెట్టిన పేరు బాగుంది. భర్త మనస్తత్వాన్ని మరింత సహజంగా చిత్రించి, కథనాన్ని మరింత ఆసక్తికరం చేసి, ముగింపులొ కొసమెరుపును అందిస్తే – కథ ఇంకా బాగుండేది.

గంటి భానుమతి (డిసెంబర్ 14, 2018)

కథ సుఖాంతం: రిటైరయ్యేక శ్రీహరికి ఏదైనా వ్యాపారం చెయ్యాలనిపించింది. గోధుమపిండి తయారు చేసి అమ్మాలనుకుని ఆ వ్యాపార రహస్యాల్ని కనుక్కుంటాడు. ఆ వయసులో తీర్థయాత్రలు చేసుకోక, ఎందుకొచ్చిన వ్యాపారం అని గ్రహించేక – ప్రాణం సుఖంగా ఉండి కథ సుఖాంతం కావడం కథకి ముగింపు. సన్నివేశాలు కొత్తవి. ముగింపు బాగుంది. కథనంలో బిగి ఉంటే కథ ఇంకా బాగుండేది.

స్వాతి వారపత్రిక నిర్వహించిన సాహస కథల పోటీలో బహుమతి పొందిన కథలుః

మొండెపు ప్రసాద్ (నవంబర్ 9, 2018)

నిజమైన సాహసం: తాము టెన్తు దాకా చదివిన ప్రభుత్వ పాఠశాల – విద్యార్థులు లేక మూతబడేలా ఉన్నదని తెలుసుకున్న కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు – ఆ బడిని నిలబెట్టడానికీ, అభివృద్ధి చెయ్యడానికీ చేసిన కృషి కథాంశం. వేరే కథ లేకున్నా – ఇందులోని ఆదర్శం, సందేశం అత్యావశ్యకం, అభినందనీయం.

సింహప్రసాద్ (నవంబర్ 16, 2018)

చిరుత: మంచినీటి బావిలో చిరుతపులి పడింది. అటవీ అధికారులకి తెలియబరిస్తే – వాళ్లొచ్చేదాకా అది బ్రతికుంటుందన్న నమ్మకం లేదు. అదక్కడే చచ్చిపోతే, ఊరి జనాలకి త్రాగునీరు లేకుండా పోతుంది. ఈలోగానే ఎవరైనా పూనుకుని బయటకు తీసి రక్షిద్దామంటే – అది క్రూర జంతువు. ఈ మీమాంసే కథాంశం. గ్రామీణ వాతావరణం కథకి పుష్టినిచ్చింది. కథనం బాగుంది. ముగింపు సహజంగానూ, సబబుగానూ ఉంది.

సాయిరాం ఆకుండి (నవంబర్ 23, 2018)

మా డాడీ హీరో: సైనికుడిగా రణరంగంలో రాణించాలని ప్రణీత్ కోరిక. ఒక దాడిలో కాలుకి గాయమైతే తర్వాత నయమైనా – అతణ్ణి ఆఫీసు పనులకి పరిమితం చేశారు అధికారులు. బడి వేడుకల్లో అతడి కుమార్తె వేదికమీద ఉండగా, అగ్నిప్రమాదం జరిగితే, ఆమెను రక్షించుకుందుకు ప్రాణాలకి తెగిస్తాడతడు. అతడు రక్షించింది వందననే ఐనా – ఆమె ఇంకా వేదికమీదనే ఉన్నదని అబద్ధం చెబుతుంది అతది భార్య వందన. దాంతో అతడు ఒకరి తర్వాత ఒకరుగా మొత్తం పిల్లలందర్నీ రక్షిస్తాడు. భర్త సామర్థ్యంమీద ఆమెకు నమ్మకం. ఆ మేరకు సాహసం వందనదే ఐనా, ‘మా డాడీ హీరో’ అని ఆనంది అనడం కథకి ముగింపు. ఆరంభంలో – కథకి అంతగా అవసరం కాని విశేషాలకి ప్రాధాన్యమివ్వకుండా, బడి వేడుకలనే కథాంశంగా మలచి ఉంటే – కథనం ఆసక్తికరమై, కథను విశిష్టం చేసేది.

అనామకుడు (నవంబర్ 30, 2018)

స్త్రీసాహసం: ‘ఆడదానికి పెళ్లే ఒక సాహసం’ – ఇదీ కథాంశం. అందుకు ఎన్నుకున్న సన్నివేశాలు గొప్పగా ఉన్నాయి. కొసమెరుపుతో మరింత రాణించేదనిపించినా కూడా ముగింపు విశిష్టం. కథ మొదలెట్టగానే ఈ కథ ఇలా ఉంటే బాగుణ్ణనీ, అలా ఉండకపోతే – అలా ఉండేలా మేమో కథ వ్రాయాలనీ అనిపించింది. ఆ అవకాశం కథకులు మాకివ్వలేదు.

బలభద్రపాత్రుని ఉదయశంకర్ (డిసెంబర్ 7, 2018)

అడవిని కాచిన వెన్నెల: ఆటవికుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని, ఆటవిక సంపదని దోచుకునే మాఫియాపై జర్నలిస్టు కౌముది ఒంటరిపోరాటం కథాంశం. పాత సీసాలో పాత సారా అనిపించే కథనం. కథకి పెట్టిన పేరు బాగుంది.

శాంతారాం సూరపు (డిసెంబర్ 14, 2018)

సాహసయాత్ర: గోదావరి వరదలో ఓ నావ. అందులో యశస్వి, అతడి పిల్లలు ఇద్దరు. ముగ్గురికీ నావ నడపడంలో అనుభవం లేదు. వారు ముగ్గురూ క్షేమంగా ఒడ్డుకు చేరిన విధం కథాంశం. పెద్దగా కథ లేకపోయినా – ఉన్న కథకు తగిన వాతావరణం, పాత్రలు, సన్నివేశాలు, కథనం – కొంత పుష్టినిచ్చాయి.

ముసునూరి సుబ్బయ్య చౌదరి (డిసెంబర్ 21, 2018)

ఉధృతి: గోదావరి మధ్య లంకలో వ్యవసాయానికి పూనుకున్న ఆధునిక కుటుంబం – వరద బీభత్సాన్ని ఎదురుకోవడమే కాక, ప్రాణాలకు తెగించి ఆపదలో ఉన్న ఓ వ్యక్తిని కాపాడి ఆదుకోవడం కథాంశం. ఇతివృత్తంలో నవ్యతతో పాటు – కథకు తగిన వాతావరణం, సన్నివేశాలు, కథనం ఈ రచనకు కొంత పుష్టినిచ్చాయి.

గొర్లి శ్రీనివాసరావు (డిసెంబర్ 28, 2018)

పవర్ స్టేషన్‍: ఒడిశాలో తాల్చేర్‌లో థెర్మల్ పవర్ స్టేషన్ – కథకి వేదిక. అక్కడ పల్విరైజర్ యంత్రం లోపల మంటలొస్తే – ఆ ప్రమాదాన్ని ఆపడం కథాంశం. పాఠకులకు థెర్మల్ పవర్ స్టేషన్ పనితీరు గురించి సరళంగా వివరించిన ఈ ప్రయోజనాత్మక రచనలో – వాతావరణం, సన్నివేశాలు, పాత్రచిత్రణ, నవ్యత, కథనం  – కథను విశిష్టం చేశాయి.

ద్విభాష్యం రాజేశ్వరరావు (జనవరి 11, 2019)

కడుపుకోత: ఓ స్కూలు బస్సులో ఆయా రాజమ్మ. ఆ బస్సు ప్రమాదానికి గురైంది. అప్పటికి బస్సులో మిగిలిన నలుగురు పిల్లల్నీ రక్షించడానికి, ఆమె ప్రదర్శించిన సమయస్ఫూర్తి కథాంశం. నేటి నిర్లక్ష్య, స్వార్థపూరిత వాతావరణంలో – ఎందరికో స్ఫూర్తిదాయకం కాగల రాజమ్మ అంకితభావం అత్యవసరం.   సన్నివేశాలు, నవ్యత, కథనం – కథకి పుష్టినిచ్చాయి.

స్వాతి వారపత్రిక నిర్వహించిన సరసమైన కథల పోటీలో బహుమతి పొందిన కథలుః

గంటి రమాదేవి (జనవరి 25, 2019)

మధురం! మధురం: ‘నిరీక్షణలోనూ, ఓర్పులోనూ బాధ ఉంది. ఐతే వాటి ఫలితాన్ని మించి మధురమైనది ఏదీ లేదు’ అన్న కథాంశం గొప్పది. అందుకు తగిన సన్నివేశాలు, కథనం లేక ముగింపు పేలవం అనిపించినా –  శైలి చదివిస్తుంది.

డా. దుగ్గరాజు శ్రీనివాసరావు (ఫిబ్రవరి 1, 2019)

తేడా: ఆమెకి యాబై ఏళ్లు దాటాయి. పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని దూరంగా వెళ్లిపోయారు. భర్తకింకా సర్వీసుండి బిజీ. ఆమెకి మాత్రం జీవితం నిస్సారమైంది. దాంపత్య జీవితం ఆసక్తికరంగా మనోహరంగా చేసుకోలేకపోతున్నందుకు వ్యాకులపడుతూ, తేడా నాలో ఉందా అని మథనపడుతుందామె. పూర్వంలాగే కట్టూబొట్టూ విషయంలో శ్రద్ధ వహించి తనని తాను ఆకర్షణీయంగా మలచుకోవాలని ఆమె గ్రహించడం కథకి ముగింపు. వయసు మీరిందనుకునే వారికి, ముఖ్యంగా మగువలకు మంచి సందేశాన్నిచ్చే ఈ కథకి ఎన్నుకున్న సన్నివేశాలు సబబుగా ఉన్నాయి. కథనం పుష్టినిచ్చాయి.  చక్కని సభ్య శృంగార కథ ఇది.

స్వర్ణప్రసాద్ (ఫిబ్రవరి 8, 2019)

పంచకల్యాణి: గ్లామర్ తగ్గిపోతుందన్న బెంగతో భర్త సుబ్రహ్మణ్యాన్ని దగ్గరకు రానివ్వదు పంకజం. తొలిరేయి ఏకాంతంలో అతడు చొరవగా తాకితే మండిపడుతుంది. ఒకసారి టివిలో వస్తున్న సినిమాలో హీరో హీరోయిన్ల శృంగార విన్యాసాలు చూసినప్పుడు ఆమెకి వళ్లు వేడెక్కుతుంది. అప్పుడు భర్త చొరవ చేస్తే, ఆ తొలి పురుషస్పర్శకి వళ్లు జివ్వుమనగా, అతడికి లొంగిపోవడం కథకి ముగింపు. పంకజం మనో విశ్లేషణ వాస్తవంగా ఉన్నా – తొలిరేయి ఏకాంతంలో భర్త స్పర్శకి స్పందించలేదన్న కథకులు, మరో సందర్భంలో అతడి చొరవకామె లొంగుబాటుకి కారణం తొలి పురుషస్పర్శ అనడం సరికాదనిపిస్తుంది. సందర్భానుసారంగా ఎవరినైనా దేనితోనైనా పోల్చే హక్కు కథకులకి ఉన్నా – ఇక్కడ ఆడదాన్ని పంచకల్యాణి గుర్రంతో పోల్చిన తీరు హుందాగా లేదు. శృంగార సన్నివేశాలు, వర్ణనల్లో కాస్త ఎక్కువైన వేడికంటే – సినిమాలో హీరో హీరోయిన్ల శృంగార విన్యాసాలు, ప్రవరాఖ్యుల్ని కూడా చలింపజేస్తాయన్న చమత్కారానికి ప్రాధాన్యమిస్తే – కథ ఎక్కువ బాగుండేదేమో! ఇలాంటి ఇతివృత్తంతో – డిసెంబర్ 8, 1995 స్వాతి వారపత్రికలో సరసమైన కథగా వచ్చిన మా ‘పొగరుబోతు గుర్రం’ తరహా ఈ కథకి, శీర్షికకి ఎక్కువ న్యాయం చేసేదనిపించింది.

తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి  (ఫిబ్రవరి 15, 2019)

బహుమతి: కొత్త జంటకు – శృంగారం పట్ల అవగాహన కలిగించడం పెద్దల కర్తవ్యమన్న సందేశం కథాంశంగా గొప్పది. ఐతే మీడియా, అంతర్జాలం ప్రాబల్యంతో జ్ఞానాన్నీ, పరిజ్ఞానాన్నీ, ప్రపంచజ్ఞానాన్నీ తమ గుప్పెట్లో ఉంచుకుంటున్న నేటి తరానికి ఆ అవసరముందా అన్నది ప్రశ్నార్థకం.  ‘చెట్టు విత్తనంనుంచి ఎదిగేటప్పుడు శబ్దం చెయ్యదట, విరిగి పడేటప్పుడే ఫెళఫెళమంటుందిట’, ‘చెట్టు పువ్వులిస్తుంది, మకరందాన్నిస్తుంది, కాయలిస్తుంది, పళ్లిస్తుంది, నీడనిస్తుంది, చల్లగాలినిస్తుంది. నువ్వూ అన్నీ ఇస్తావు’ లాంటి చతుర శృంగార వ్యాఖ్యలు కథనానికి పుష్టినిచ్చాయి.

అప్పరాజు నాగజ్యోతి (ఫిబ్రవరి 22, 2019)

మనోభిరామం: అభిరాంకి మనోజ్ఞతో పెళ్లయింది. తొలిరాత్రి ఆమె తీసుకున్న చొరవ నచ్చక, ఆమె శీలాన్ని శంకించడం కథాంశం. ‘ఒకసారి ఈ మగాడు నావాడు అన్న భావన మనసులో కలిగేక, ఏ ఆడదీ పక్కమీద అనవసరపు సిగ్గుల్ని ప్రదర్శించదు’ అన్న చక్కని అవగాహన కథకి ముగింపు. అందుకు ఎన్నుకున్న సన్నివేశాల్లో వాస్తవం కంటే, వేడికే ప్రాధాన్యమిస్తూ కొనసాగింది కథనం.

కె.కె. భాగ్యశ్రీ (మార్చి 1, 2019)

నీ కోసం ప్రత్యేకం: భార్య దివ్య అంగాంగ ప్రదర్శనకు అనువైన దుస్తులు ధరించి పార్టీలకు వచ్చి ఆధునికంగా కనబడాలని కాశ్యప్ కోరిక. ఆమె ఒప్పుకోలేదని అతడికి కోపం. అలా పార్టీకి వచ్చిన సమీర విషయంలో దుష్పరిమాణాలతో అతడికి కనువిప్పు కావడం కథకి ముగింపు. తక్కువ దుస్తులు ధరించడమే స్వేచ్ఛ అనే భావన నేటి మహిళల్లో ప్రబలుతున్న ఈ రోజుల్లో – అందాల ప్రదర్శన ‘నీకోసం ప్రత్యేకం’ అన్న భావనని ప్రేయసీ ప్రియుల్లో ప్రోత్సహించే ప్రయత్నమీ కథ. సన్నివేశాల్లో నవ్యత లేకపోయినా, సందేశం ఆలోచించతగ్గది.

జాస్తి రమాదేవి (మార్చి 8, 2019)

సిగ్గూ పూబంతి: పిల్లలు పెళ్లిళ్లయి కాపురాలు చేసుకుంటున్నా – భర్తకి ఇంకా ఆ యావ పోకపోవడం సిగ్గు పడాల్సిన విషయంగా భావిస్తుంది సీత. అలా వారి మధ్య పెరిగిన దూరం – వయసుకే కానీ, మనసుకి ముసలితనముండదని ఆమె గ్రహించడం కథకి ముగింపు. కథాంశం ముఖ్యంగా నేటి వృద్ధులకు అవసరమైనది. అందుకు ఎన్నుకున్న సన్నివేశాల్లో కొన్ని సున్నితంగానూ, కొన్ని ఎబ్బెట్టుగానూ అనిపించినా – వాస్తవదూరం మాత్రం కాదు. కథనంలో మరికాస్త బిగి ఉండొచ్చు.

శాంతారాం సూరపు (మార్చి 15, 2019)

ఎన్నెల్లో ఎల్లోరా: ప్రేమకు ఎల్లలు లేవన్న ఉదాత్త సందేశం కథాంశం. బాగా చదువుకున్న ఓ యువతి విహారయాత్రకి వెళ్లి  – చందు అనే టూరిస్టు గైడుని చూస్తూనే ప్రేమించి పెళ్లికి సిద్దపడడం కథ. సన్నివేశ కల్పన అందుకు తగినట్లుగా లేక – కథనం కథనంగానే మిగిలిపోయి కథని అవాస్తవం చేసింది.

పాండ్రంకి సుబ్రమణి (మార్చి 22, 2019)

అందాలకు కోణం అనేకం: సత్ప్రవర్తనకు పేరుపడ్డ భీమరాజు అనే యువకుడు, మాధురి అనే యువతికి జిమ్‌లో ఫిట్నెస్ ట్రయినింగ్ ఇవ్వాల్సివస్తుంది. ఆ సమయంలో ఇద్దరూ ఆవేశపడి ఒకరినొకరు కోరుకుని పెళ్లి చేసుకోవాలనుకోవడం కథకి ముగింపు. కథనం శరీరవర్ణనకూ, శృంగార భావనకూ పరిమితం కావడంవల్ల – రచయిత ఏ ఉద్దేశంతో ఈ కథ వ్రాసినదీ తెలియదు. సాన్నిహిత్యానికి అవకాశముండే కళల్లో, క్రీడల్లో – ఇలా జరిగే అవకాశమున్నదన్న హెచ్చరికని కథాంశంగా తీసుకుని ఉంటే – ఈ కథకు ప్రయోజనముండేది. ఇటీవల – నటనలో శిక్షణకోసం గురువుముందు శిష్యులందరూ – ఆడా మగా అన్న భేదం లేకుండా – పై దుస్తులు తీసివెయ్యాలన్న విషయం వివాదాస్పదం కావడం గమనార్హం.

ఇందూ రమణ (మార్చి 29. 2019)

దొంగ చూపులు: దంపతుల మధ్య శృంగారం పూర్తిగా చీకటికీ, ఏకాంతానికీ పరిమితం కావాలని గట్టిగా నమ్మే భార్గవ వ్యక్తిత్వం కథాంశం. బయట భార్య సుభద్రని కూడా పరాయి ఆడదానిలా చూసే అతణ్ణి క్రమంగా తనకు అనుగుణంగా మార్చడం కథాంశం. ఈ కథలో కట్టుకున్న భార్య అందాల్ని నేరుగా కాక దొంగ చూపులతో ఆస్వాదించే భార్గవ మనస్తత్వం వాస్తవమే ఐనా కథల్లో అరుదు. అందుకు కథకుల్ని అభినందించాలి. సమస్యకు లభించిన పరిష్కారాన్ని సమర్థవంతంగా ప్రదర్శించకలేకపోయినా కూడా – కథనం కథకు పుష్టినిచ్చింది.

(సశేషం)

Exit mobile version