Site icon Sanchika

‘బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి’ పుస్తకావిష్కరణ వార్త

[dropcap]పా[/dropcap]లమూరు సాహితి ఆధ్వర్యంలో తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 128వ జయంతి సందర్భంగా మే 28 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కాళోజీ హాల్‌లో జరిగిన ‘బహుముఖ ప్రజ్ఞాశాలి సురవరం ప్రతాపరెడ్డి’ గ్రంథావిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి విచ్చేసారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో పరిశోధనరంగంలో విశేష కృషి చేసిన సురవరం తెలుగు సాహిత్యంలో అగ్రగణ్యుడని కొనియాడారు. ఎంతో విలువైన సాహిత్యాన్ని సమాజానికి అందించిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. మొదటి సార్వత్రిక ఎన్నికలలో వనపర్తి జిల్లా నుంచి మొదటి శాసనసభ్యుడిగా ఎన్నికైన సురవరం పరిశోధనరంగంలో విశేష కృషి చేసారన్నారు. ఆంధ్రుల సాంఘీక చరిత్ర ఆయనకు గొప్ప పేరును తీసుకువచ్చిందన్నారు. ఆయన పరిశోధన నేటి తరానికి అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు.

గౌరవ అతిథిగా విచ్చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సురవరం సాహిత్యాన్ని అందరూ చదవాలని సూచించారు.

ప్రత్యేక అతిథి, స్పెషల్ గ్రేడ్ డిప్యూటి కలెక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహా రెడ్డి మాట్లాడుతూ సురవరం ఒక పక్క పరిశోధన రంగంలో కృషి చేస్తూనే మరోపక్క సృజనాత్మక రంగంలో అపూర్వమైన రచనలు చేసారన్నారు. ముఖ్యంగా మహిళా చైతన్యం గురించి అనేక రచనలు చేశారన్నారు. గోల్కొండ పత్రిక సంపాదకుడిగా సమాజాన్ని చైతన్యవంతం చేశారన్నారు.

సభకు అధ్యక్షత వహించిన ప్రముఖ న్యాయవాది వి. మనోహర్ రెడ్డి మాట్లాడుతూ సురవరం ప్రతాపరెడ్డి పయనించిన బాటలో నేటి కవులు, రచయితలు నడవాలన్నారు.

గ్రంథ సంపాదకులు డాక్టర్ గంటా జలంధర్ రెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లాలో పుట్టిన సురవరం ప్రతాపరెడ్డి గొప్ప వ్యక్తి అని, ఆనాటి నిజాం కాలంలో తెలుగు భాషను రక్షించడానికి విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహించారన్నారు. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని సూచించడమే కాకుండా తీర్మానం చేసిన కాపీని సభలో ప్రవేశపెట్టారు. సురవరం చేసినంత పరిశోధన మరెవరూ తెలుగు సాహిత్యంలో చేయలేదన్నారు. అలాగే పాలమూరు సాహితి ఆధ్వర్యంలో తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని సంస్థ అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ డాక్టర్ జి.చిన్నారెడ్డికి పాలమూరు కవులు, రచయితల పక్షాన ఒక వినతిపత్రాన్ని అందజేశారు.

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని వక్తలు ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ సంగీత నాటక అకాడమి తొలి చైర్మన్ బాద్మి శివకుమార్, రాష్ట్ర ప్రభుత్వ కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వర రెడ్డి, కాంగ్రెస్ యువనేత ఏ.పీ. మిథున్ రెడ్డి, లుంబిని పాఠశాల డైరెక్టర్ కె.లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version