Site icon Sanchika

బాల మనసు

[dropcap]బా[/dropcap]ల ఇంటిలో రకరకాల చెట్లు ఉన్నాయి. అందమైనవి కొన్ని, వాసన కలవి కొన్ని, అలంకారానికి మాత్రమే పనికి వచ్చేవి ఇలా రకరకాలుగా ఉన్నాయి.

ఒకనాడు నాయనమ్మ గుడికి వెళదామని పువ్వులు కోసుకు రమ్మని, కొంచెం ఎక్కువగా తెమ్మని చెప్పింది.

బాల ఉత్సాహముగా అన్ని రకాల పూలు కోసేసింది. పూలు కొయ్యటం బాలకి భలే సరదా. అన్నిరకాల పూలు కోసి పెద్ద పళ్ళెం నింపేసింది. అది దేముడు పూలకోసం సీతమ్మ కొన్న అతి పెద్ద పూల పళ్ళెం.

ఏ రకానికి ఆ రకం పూలు విడివిడిగా కోసేటప్పుడే పెట్టుకోవచ్చు. బుట్టయితే అన్ని కలిసిపోతాయి కదా. పూలు కొయ్యటం అయ్యింది.

బాల పూలబుట్ట తీసి, కొబ్బరికాయ(ఇంటిదే), అగరువత్తులు, కర్పూరం ఇలా దేముడికి అవసరమైనవన్నీ పెట్టింది. ఇక మిగిలింది పూలు సద్దటమే మిగిలింది.

బాల పూల పళ్ళెం దగ్గరకు వెళ్ళింది. బాల దృష్టి మొదట మల్లెపూల మీద పడింది. అబ్బ తెల్లగా, సువాసనలీనుతూ ఎంత బాగున్నాయో! అందులో అవి దొంతరమల్లి. వీటితో పూలజడ వేయించుకుంటే ఎంత బాగుంటుందో. వేయించుకుని చాల రోజులయ్యింది కుడా. మల్లెపూలు తీసి పక్కకు పెట్టేసింది.

పక్కనే ఎర్రగులాబీలు కనిపించాయి. పూల జడ మద్యలో పెట్టికుడితే తెలుపు, ఎరుపు ఎంత అందంగ ఉంటుంది జడ. గులాబీలు పక్కకేట్టింది.

బంగారు రంగులో చామంతులు కనిపించాయి. రోజూ యూనిఫారం ఉంటుంది. రేపు అంటే శనివారం మాత్రమే మాములు డ్రెస్ వేసికోవచు. కొత్త ఎల్లో సిల్క్ లంగా ఉంది అది రేపు వేసుకోవాలని అనుకుంటోంది కదా; అది వేసుకుని చామంతి పూల జడ వేసుకుంటే? భలే ఉంటుంది. చామంతులు కూడా పక్కకెళ్లాయి.

కనకాంబరాలు దేముడు కెట్టరట. నానమ్మ చెప్పింది. పైనించి అక్కకు అవంటే చాలా ఇష్టం. తనకు అక్కంటే ఇష్టం. అందుకే అవి అక్కకు ఉంచింది.

సన్నజాజులంటే తమ క్లాసు టీచర్‌కి చాలా ఇష్టం. తానంటే కూడా. అమ్మచేత మాల కట్టించి తీసుకెళ్ళి ఇస్తే ఆ ఇష్టం మరింత పెరుగుతుందేమో కదా. పక్కకు నెట్టింది.

మందారాలు ఇద్దామంటే ఎలా, అమ్మకి ఇష్టమైన శుక్రవారం కదా. లక్ష్మి దేవికి మందార మాల వేస్తుంది కదా. అవి అమ్మకి కావాలి అవీ పక్కకి వెళ్ళాయి.

విరజాజులు మిగిలాయి. భలే ఉన్నాయి. కాని ఎక్కువ పూయవు, లెక్కల టీచర్‌కి తానంటే ఇష్టం లేదు. తప్పులు చేస్తుంది ఎప్పుడూ అని కోప్పడుతుంది. ఆవిడ తలలో ఎప్పుడూ ఈ పూలే చూసేవాళ్ళు. తరువాత మానేసింది. ‘ఈ పూలతీగ చచ్చిపోయిందండి’ అని తెలుగు టీచర్‌కి చెప్పి బాధపడింది. దండకట్టి ఇస్తే తనని కోప్పడటం మానేస్తుందా? ఇచ్చి చూద్దాం పక్కకు పెట్టింది.

“బాలా అయ్యిందా?” ఉలిక్కిపడింది. పళ్లెం చూస్తే ఖాళీ అయ్యింది. మరి గుడికి ఏమి తీసుకెళ్ళాలి?

దొడ్డివైపు పరిగెత్తింది. ఏమైనా పూలు మిగిలాయి ఏమో చూద్దామని. అన్నిచెట్లు ఖాళీగా ఉన్నాయి. ఏమి చెయ్యాలి? బాల కళ్ళు మెరిసాయి.

“తొందరగా రా, మళ్ళీ గుళ్ళో రద్దీ పెరిగి పోతుంది.”

‘వస్తున్నా బామ్మా’ అంటూ పరిగెత్తింది బామ్మ రెండో అరుపుకి బాల.

పూలబుట్ట వంక, బాల వంక మార్చి, మార్చి చూసింది బామ్మ. అందులో కొబ్బరికాయ మొదలైనవాటితో పాటు అందానికి గోడవారగా వేసిన కాగితంపూలు నిండుగా ఉన్నాయి.

Exit mobile version