Site icon Sanchika

బాలా : బాలనెరపు

[box type=’note’ fontsize=’16’] “ఆయుష్మాన్ ఖురానా సినెమా అంటే కొంత విభిన్నంగా, సహజత్వానికి దగ్గరగా, మామూలుగా సినెమాల్లో కనబడని వస్తువుతో వొక చిత్రాన్ని ఆశించవచ్చు. కొన్ని లోపాలున్నా ఇది కచ్చితంగా మంచి సినెమానే.” అంటున్నారు పరేష్ ఎన్. దోషిబాలా‘ సినిమాని సమీక్షిస్తూ. [/box]

[dropcap]ఆ[/dropcap]యుష్మాన్ ఖురానా సినెమా అంటే కొంత విభిన్నంగా, సహజత్వానికి దగ్గరగా, మామూలుగా సినెమాల్లో కనబడని వస్తువుతో వొక చిత్రాన్ని ఆశించవచ్చు. ఎందుకంటే విక్కి డోనర్ మొదలు అతను విభిన్నమైన చిత్రాలే చేస్తున్నాడు. అందునా ఆ హీరోలు హీరోయిజం లేని, పైగా చెప్పుకోలేని బలహీనతలున్న హీరోలు. పెద్ద పెద్ద హీరోలు వెనుకంజ వేసే పాత్రలు. ఈ సారి కూడా అలాంటి చిత్రంతోనే మన ముందుకొచ్చాడు ఆయుష్మాన్. శతమానం భవతి. మిగతా సినెమాలతో పోల్చలేము కాని కొన్ని లోపాలున్నా ఇది కచ్చితంగా మంచి సినెమానే.

లఖ్‌నవు లో పుట్టిన బాలా (పెద్దయ్యాక ఆయుష్మాన్ ఖురానా) కి పుట్టినప్పుడే ఒత్తుగా జుత్తు వుండడంతో ఆ పేరు పెట్టారు. పూర్తి పేరు బాల్‌ముకుంద్ శుక్లా. నిజానికి బాల్‌ముకుంద్ అంటే చిన్ని కృష్ణుడు. కాని బాల్ అంటే మరో అర్థం జుత్తు అని. అలా మన హీరో స్కూల్ చదువు పూర్తి అయ్యేదాకా ఆ కేశ సంపదతో అందరినీ ఆకర్షించేవాడు. అదనంగా అతనికి షారుఖ్ నుంచి అమితాభ్ వరకూ అందరు నటులను అనుకరించే కళ వుంది. ఇంకేం అందరూ అతనికి పంఖాలే. అదే తరగతిలో లతిక (పెద్దయ్యాక భూమి పెడ్నేకర్) వో నల్ల పిల్ల. ఇక చెప్పేదేముంది, మన సమాజంలో, ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో ఈ రంగు పిచ్చి ఎక్కువున్న చోట, ఆమెను హేళనగా చూస్తారు. ఇక్కడ స్కూల్ వయసులో కొంత ఫుటేజ్ ఎక్కువ వున్నా దాని ముఖ్య ఉద్దేశ్యం ఈ జాడ్యం చిన్నప్పటినుంచే ఎదుర్కోవాల్సి వుంటుందీ అని చెప్పడానికి. అయితే పెరిగి పాతికేళ్ళు కూడా రాకుండానే బాలుడికి జుత్తు క్రమంగా బట్టతలగా మారుతుంది. అవును ఆ క్రమం కూడా కష్టపడి చూపించాడు, జాగ్రత్తగా గమనించాలే కాని. ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి కూడా తమ లుక్స్ పట్ల శ్రధ్ధ వుంటుంది. ఏమీ లేకపోయినా బట్టతల మాత్రం వుండకూడదు. అలాంటి వాళ్ళ కష్టాలు నేను చూశాను, మీరు కూడా చూసే వుంటారు. అకాల వృధ్ధాప్యం తెచ్చే బాల నెరపుకు ఎవరు మాత్రం భయపడరు, బెంగపడరు, కృంగిపోరు?! ఇలాంటి వాళ్ళని చూసి నవ్వి, ఆటపట్టించేవారు ఒక పక్కనుంటే, వీళ్ళ మీద వ్యాపారం చేసుకుని సొమ్ము చేసుకునే వారు కూడా వుంటారు. ఆ నూనె అని, ఆ జెల్ అని, హేర్ ట్రాన్స్‌ప్లాంట్ అనీ రకరకాలుగా మోసపుచ్చి సొమ్ము చేసుకుంటారు. అంతే కాదు మన దగ్గర ఉబోసగాళ్ళు ఎక్కువ. వాళ్ళ ఉచిత బోడి సలహాలు విని గుడ్డు సొన, గేదె పేడా, వీర్యం, ఇలాంటి లక్ష ఉపాయాలు పాటించినా ఫలితం వుండదు. ఆ పనికి తమ్ముణ్ణి పురమాయిస్తుంది తల్లి. వాడు అవన్నీ చేయ లేక, అతని తండ్రి ఈ కంపరం చూడలేక, వాసన భరించలేక అవస్తలు పడుతుంటే మనం మాత్రం కడుపు నెప్పి వచ్చేలా నవ్వుకుంటాం. ఏమాటకు ఆ మాట చెప్పాలి. ఆ సన్నివేశాలన్నీ సహజంగా, ఆ పాత్రల చిత్రీకరణ, వాళ్ళ మధ్య సంబంధాలు, ఆ యాస అన్నీ చాలా చక్కగా, తప్పు పట్టడానికి వీలు లేకుండా వున్నాయి. ఈ బట్టతల కారణంగా వివాహం కూడా సమస్య అవుతుంది.

ఇంతకీ ఇతను చేసే వుద్యోగం ఏమిటి? వొక ఫేర్‌నెస్ క్రీం కంపెనీలో సేల్స్ ట్రైనర్ గా. మగవాళ్ళకు బట్టతలంటే ఎలా భయమో, ఆడవాళ్ళకి ఆ నలుపన్నా అంతే భయం. వాడు వీడిని మోసం చేసి సొమ్ము చేసుకుంటే, వీడు ఆమెను మోసం చేసి సొమ్ము చేసుకుంటున్నాడు. ఇదొక ఛేదించకష్టమైన వలయం. లతిక ఇప్పుడు ఆత్మవిశ్వాసం కల లాయరు. తన మేనిఛ్చాయ కు విలువ ఇవ్వదు. కాని పెళ్ళి కావాలిగా. పిన్ని (సీమా పహ్‌వా) చాటుగా ఆమె ఫొటోలను తెల్లగా కనిపించేలా ఎడిట్ చేసి ఇన్స్టాగ్రాం లో ఆమె పేరుమీద పెడుతుంది. ఆ విధంగానైనా ఆమె నలుగురి దృష్టిలో పడి పెళ్ళవుతుందని. ఇదొక సమాంతర కథ.

ఇప్పుడు మన సమాజానికి పట్టిన కొత్త జబ్బు టిక్టాక్ కదా. దాన్ని కూడా వాడుకున్నారు ఈ సినెమాలో. లఖ్నవులో టిక్టాక్ రాణి అయిన పరి (యామి గౌతం) కొన్ని వీడియోలు బాలా తో కూడా చేసి వుంటుంది. ఆమెను ఇప్పుడు తమ కంపనీ మాడల్ గా తీసుకుని వో వ్యాపార ప్రకటనా చిత్రం తీయబోతున్నారు అని తెలిసేసరికి బాలా సంబరపడతాడు. ఆ క్రమంలో ఇద్దరి మధ్య చనువు పెరుగుతుంది. ఆ సరికి అన్ని ఉపాయాలూ చేసి, భంగపడి చివరికి వొక విగ్గుతో సాహచర్యానికి తలవంచుతాడు. ఇద్దరి ప్రేమా పెళ్ళి వరకూ వెళ్తుంది. అయితే పెళ్ళి లో తామిద్దరు ఎలాంటి హేర్ స్టైల్ చేసుకోవాలి అన్న విషయం మీద పరీకి కచ్చితమైన ఆలోచనలున్నాయి. బట్టలకంటే కేశాలంకరణే ముఖ్యం అంటుంది. బాలా గుండెలో రాయి పడుతుంది. మోసం చేయలేక, వున్న వాస్తవాన్ని ఆమెకు మెసేజ్ గా పంపుతాడు కాని అది మరొకరి మొబైల్ కు పొరపాటున వెళ్తుంది. అలా పెళ్ళైపోతుంది. పెళ్ళికి మర్నాడే నిజం తెలిసి, పరీ పుట్టింటికి వెళ్ళిపోయి విడాకులకు పూనుకుంటుంది.

వాళ్ళ పెళ్ళి నిలుస్తుందా, విడిపోతారా? లతికను చూడడానికి వచ్చిన కుర్రాడితో ఆమె పెళ్ళి అవుతుందా, లేక రంగు మీద మోహం వున్న అతని తల్లి దండ్రుల మాటలకు తల వొగ్గి అతను వద్దనేస్తాడా? లేక చివరికి బాలా లతికా వొక్కటవుతారా? చాలా రకాల ముగింపులు తోస్తాయి. కాని మనకు ముగింపు తో ఏం పని? తీసుకున్న సబ్జెక్ట్ కు న్యాయం చేశాడా లేదా అన్నది ముఖ్యం గాని.

ఇది వరకు “స్త్రీ” అన్న మంచి చిత్రం అందించిన అమర్ కౌశిక్ ఇది కూడా బాగా తీశాడు. అయితే స్త్రీ లో లా కాకుండా ఇందులో కొన్ని కొరుకుడు పడని విషయాలున్నాయి. నిరేన్ భట్ (కథ కూడా), ముప్పా రవి ల స్క్రీన్‌ప్లే గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా బాగా వ్రాశారు. ఆయుష్మాన్ ఖురానా నటన గొప్పగా వుంది. అతని పరిస్థితి చూస్తే జాలి, అతని నటన చూస్తే నవ్వూ వస్తాయి. పాటలూ సంగీతమూ బాగున్నాయి. జావేద్ జాఫ్రి, సౌరభ్ శుక్లా, సీమా పహ్వా,అభిషేక్ బెనర్జీ, యామి గౌతం ల నటన కూడా బాగుంది. అయితే వీళ్ళ పాత్రలు పూర్తిగా మలచబడలేదు. అన్యాయం అయిపోయిన పాత్ర లతికది. దాన్ని అలా పెట్టకుండా వున్నా బాగుండేది, లేదూ పెడితే సరిగ్గా తీర్చిదిద్ది వుంటే బాగుండేది. భూమి లాంటి మంచి నటికి తన ప్రతిభను చూపించుకోవడానికి వీలుండేది. అసలు ఆమె కనిపించిన ప్రతిసారీ తారు పూసిన ఆమె ముఖం చూస్తుంటే కడుపులో దేవినట్టు వుంటుంది. ఇలానా చూపించడం? రామ.

ఈ మధ్య హిందీ సినెమాలు వొక ప్రత్యేక టైర్ టూ పట్టణాల్లో తీస్తున్నారు. ఇందులో కథాస్థలం లఖ్నవు. అక్కడి భాష, యాస, కట్టుబాట్లు, వ్యవహారాలూ అన్న్నీ వాస్తవాన్ని ప్రతిబింబించేలా తీశాడు. దీని పర్యవసానంగా వొక కొత్త తరహా ఉద్యోగాలు సినెమా ఇండస్త్రి లో వచ్చాయి. అవి ఆ ప్రత్యేకమైన యాసలో సంభాషణలను పలికే తీరు నేర్పే రచయితలు. వ్రాసుకున్న సంభాషణలు సహజంగా వ్రాసే రచయితలు. ఇది శుభ పరిణామం. మనక్కూడా అలాంటి రోజు రావాలి. కొంత మార్పు వచ్చినా ఇంకా చాలా దూరమే ప్రయాణించాల్సి వుంది.

Spoilers ahead అంతా బానే వుంది గాని బాలా మొదటి రాత్రి అతను బాత్‌రూం లో మీమాంస పడుతూ జాప్యం చేస్తే, ఆమె త్వరగా రమ్మని పిలుస్తూ వుంటుంది. తీరా అతను వచ్చేసరికి ఆమె గురక పెడుతూ నిద్రపోతుంది. ఇంకేముంది మర్నాడు తెల్లారే సూట్కేస్ సర్దుకుని వెళ్ళిపోతుంది. వొక జంట విడిపోతుందీ అంటే ఆ అమ్మాయిని కన్యగానే మిగల్చాలని వున్న ఆలోచన అన్యాయం కదా. పడుకోవడానికీ నిద్రపోవడానికీ మధ్య వున్న తేడానే అనైతికం అని వొక తెలుగు కవి ఉవాచ. మరి బాగా నచ్చిన విషయం ఏమిటంటే చివర్లో కోర్టు కేసు నడుస్తూ వున్నప్పుడు, బాలా తరపున వాదించేది లతిక. పరీ కూడా నచ్చచెబితే మారిపోతుందేమో అనిపించేలా కనిపిస్తుంది. లతిక, బాలా లు ఈ కేస్ కారణంగా దగ్గరవడం, అతను ఆమెను అర్థం చేసుకోవడం, రచయిత చెప్పాల్సిన విషయం లతిక నోటెంట అతనికి చెప్పించడం ఇవన్నీ చూస్తుంటే చివరికి వీళ్ళిద్దరినీ వొకటి చేసే కుట్ర పన్నుతున్నట్టు అనిపిస్తుంది. కాని అలాంటి సినెమా డ్రామాలేవీ చెయ్యకుండా ఆమె రంగుతో సంబంధంలేకుండా ఆమెను పెళ్ళిచూపులప్పుడు ఇష్టపడ్డ వ్యక్తి తోనే అతని పెళ్ళవుతుంది. అందమే కదా ప్రధానం, నాకు ఫేస్ బుక్ లో నూటికి తొంభై తొమ్మిది కామెంట్లు నా అందాన్ని పొగుడుతూ వచ్చేవే కదా, అలాంటప్పుడు నా భర్త అందంగా వుండాలని కోరుకోవడంలో నా తప్పేమైనా వుందా అంటూ పరీ అతని మీద మోసపూరితంగా వివాహం చేసుకున్నందున విడాకులిప్పించాల్సిందని కోర్టు కేసు పెట్టి విడాకులు పొందుతుంది.

Exit mobile version