బాలబాట – బాలల నాటక పోటీ విజేతలకు బహుమతి ప్రదాన సభ – నివేదిక

0
2

[‘బాలబాట’ మాసపత్రిక నిర్వహించిన బాలల నాటిక రచనల పోటీ – బహుమతి ప్రదాన సత్కార సభ – నివేదిక అందిస్తున్నాము.]

[dropcap]16[/dropcap] జూన్ 2024 న విశాఖపట్నం లోని ద్వారకానగర్, కేంద్ర పౌరగ్రంథాలయం, హాల్ నెం. 2 లో, సాయంత్రం 5.30 గంటల నుండి 8.30 గంటల వరకు సభాకార్యక్రమం కనులపండువగా జరిగింది. ‘బాలబాట’ మాసపత్రిక సంపాదకురాలు, బాలసాహిత్య ప్రకాశములో విశేష కృషి చేసిన శ్రీమతి కొల్లూరు స్వరాజ్యం వెంకట రమణమ్మ గారు సభకు అధ్యక్షత వహించారు. విజయ్ కన్‌స్ట్రక్షన్స్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డా. సూరపనేని విజయకుమార్ గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు. విశిష్ట అతిథిగా, ప్రముఖ నాటకకర్త, నవరస మూర్తి గారు వేదికనలంకరించారు. ఆత్మీయ అతిథులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయ తెలుగు ఆచార్యులు, ప్రొ. అయ్యగారి సీతారత్నం గారు, ప్రముఖ రచయిత, వక్త, సమన్వయకర్త శ్రీ కొలచిన రామ జగన్నాథ్ గారు సభకు విచ్చేశారు.

బాల సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేసి, బాలలను సైతం రచయితలుగా తయారు చేయాలని, శ్రీమతి స్వరాజ్య లక్ష్మిగారు, తమ అధ్యక్ష ప్రసంగంలో పేర్కొన్నారు. తాను ఉపాధ్యాయురాలిగా ఉన్నపుడు తెలుగు పాఠ్యపుస్తకంలోని పాఠాలను చిన్న చిన్న నాటికలుగా మలచి, పిల్లలతో నటింప చేసేదాన్నని ఆమె చెప్పారు. లుప్తమవుతున్న కుటుంబ సంబంధాల నేపథ్యంలో పిల్లలకు మన విలువలను నేర్పే విధంగా, నాటికల పోటీని నిర్వహించామని, ఆ పోటీకి 25 నాటికలు రావడం ముదావహమన్నారు.

బహుమతి గ్రహీతల సత్కారానికి ముందు, కొందరు చిన్నారులు తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించి, ప్రేక్షకుల కరతాళ ధ్వనులను అందుకోన్నారు. ఐదేళ్ల చిన్నారి, ‘ద్రౌపది’ ఏకపాత్రాభినయం, పదేండ్ల పిల్లవాని ‘కీచక’ ఏకపాత్రాభినయం ఆహూతులను ఆకట్టుకున్నాయి.

విశిష్ట బహుమతి గ్రహీతలలో సంచిక రచయితలు శ్రీ పాణ్యం దత్తశర్మ, డా. ఎమ్ సుగుణ రావు ఉన్నారు. వారికి ఘన సత్కారం జరిగింది.

పాణ్యం దత్తశర్మ గారు తమ స్పందనలో, 76 సం॥ వయసులో స్వరాజ్యలక్ష్మి గారు, బాల సాహిత్యానికి చేస్తున్న కృషిని కొనియాడారు. ‘పరధర్మో భయావహః’ అన్న తన నాటిక, పిల్లలలో విలువలు నేర్పడంలో తాతయ్య, నానమ్మ, అమ్మమ్మల పాత్రను నొక్కి చెప్పిందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల మాండలికాన్ని తన నాటికలో తాతయ్య పాత్రకు వాడానన్నారు. స్వరాజ్యలక్ష్మిగారి బాల సాహిత్య సేవను గూర్చి, అప్పటికప్పుడు ఒక పద్యాన్ని ఆశువుగా రాగయుక్తంగా ఆలపించి, సభికులను అలరించారు. ప్రముఖ కవి చిన సత్యనారాయణగారు తమ పద్యపఠనం చేశారు. డా. ఎమ్ సుగుణ రావుగారు ఒక చక్కని కవిత వినిపించారు.

పాణ్యం దత్తశర్మ గారి శిష్యుడు, దేవరాపల్లి సంక్షేమ గురుకుల కళాశాల ఆంగ్లోపన్యాసకులు సత్యనారాయణ (సత్యం), సభకు హాజరై, తన గురువు గారిని సన్మానించారు. ‘మధుర వచస్వి’ డా. జెట్టి యల్లమంద, విశ్రాంత కళాశాల ప్రిన్సిపాళ్ళు శ్రీ బండారు రామకృష్ణ, శ్రీ మల్లికార్జున రావు గారలు సభకు విచ్చేసి, పాణ్యం దత్తశర్మను అభినందించారు.

శ్రీమతి పి.ఎల్.ఎన్ మంగారత్నం, శ్రీమతి ఎస్. నాగశిరీష, శ్రీ చిన సూర్యనారాయణ గారలు ప్రథమ, తృతీయ బహుమతులను స్వీకరించారు. ఐదు విశిష్ట బహుమతులను సర్వశ్రీ ఓట్ర ప్రకాశరావు, గంపా శ్రీదేవి, డా. ఎమ్. సుగుణ రావు, పాణ్యం దత్తశర్మ, పి.వి శేషారత్నం గారలు అందుకున్నారు.

బహుమతి గ్రహీతలకు జరిపిన సత్కార కార్యక్రమంలో, చిన్నారులూ పాలుపంచుకునేలా చేయడం, ఎంతో ఔచిత్యశోభితంగా అనిపించింది. ఈ నాటికలను ఒక సంకలనంగా తీసుకురావడంతో బాటు, కొన్ని నాటికలను ప్రదర్శిస్తామని, నవరస మూర్తి గారు తెలిపారు.

‘నాటకాంతం హి సాహిత్యమ్’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here