Site icon Sanchika

సామాన్యంగా కన్పించే ఒక అసామాన్యమైన చిత్రం – ‘బలగం’

[dropcap]బ[/dropcap]లగం – తెలుగు సినిమా 2023 – అమెజాన్ ప్రైమ్ లో లభ్యం

ఏ స్థితిలో అయితే బాధ నిన్ను బాధించదో, ఆనందం- ఆనందపెట్టదో ఆ స్థితిని నిర్వాణం అంటారు. బౌద్ధంలో ఈ నిర్వాణ స్థితి గూర్చి పెద్ద పెద్ద గ్రంథాలే ఉన్నాయి.

అవధూత భగవాన్ వెంకయ్య స్వామి అంటారు “అయ్యా! కష్టమంటే ఏమిటో సుఖమంటే ఏమిటో నాకు తెలియదయ్యా!”. ఒక వ్యక్తి సజీవంగా ఉండగానే చేరదగ్గ అత్యున్నతమైన స్థితి అది. అందుకే ఆయన అవధూత అయ్యారు.

“జీవితంలో ఉన్న ఒకే ఒక నిజం – మృత్యువు. మృత్యువుని సదా స్మృతిలో నిలుపుకుంటే మనం ఎన్నడూ ఆనందోద్వేగాలకు, రాగద్వేషాలకు గురి కాము. మన కర్తవ్య నిర్వాహణలో తప్పిదాలు జరగవు” ఈ మాటలు ఏ ఆధ్యాత్మికవేత్తో అంటే ఆశ్చర్యం లేదు. ఈ మాటలు అంటున్నది వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణులు.

“7 హేబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్” గ్రంథ రచయిత స్టీఫెన్ ఆర్ ఖవీ తన గ్రంథంలో విక్టర్ ఫ్రాంకిల్ గూర్చి వ్రాస్తాడు. విక్టర్ ఫ్రాంకిల్ అనే ప్రొఫెసర్ మరియు సైకాలజిస్ట్ నాజీల చేతిలో అనుభవించిన అమానుషమైన శిక్షల వల్ల  జీవితం యొక్క విలువని, స్వేచ్చకున్న ప్రాముఖ్యతని, మనసుకున్న అద్భుతమైన శక్తులని కనుగొంటాడు. మనం అందరం కూడా జీవితం యొక్క నిజమైన విలువని తెలుసుకోవాలంటే, విక్టర్ ఫాంకిల్ లాగా మృత్యువు యొక్క అంచులవరకు వెళ్ళాల్సిన పని లేదు.

ఒక ప్రయోగం ద్వారా మనం మృత్యువుని స్పృహలో ఉంచుకోవటం ద్వారా జీవితం విలువని తెలుసుకోవచ్చు. ఆ ప్రయోగం ఏమిటంటే “నీవు చనిపోయినట్టు ఊహించుకో. నీ శవం చుట్టూ చేరి నలుగురూ  ఏమి మాట్లాడుకుంటున్నారో ఊహించుకో. ఆ నలుగురిలో నీ పరిచయస్థులు, ఆఫీస్ కొలీగ్స్, బిజినెస్ పార్టనర్స్, నీ కుటుంబ సభ్యులు, మీ ఊళ్ళో గుళ్ళో పరిచయం అయిన వ్యక్తులు ఉన్నట్టు ఊహించుకో.

ఆ సంతాప సభలో నీ శవం ముందు నిలబడి మైకు తీస్కుని ఆ నలుగురు వ్యక్తులు ఒకరి తరువాత ఒకరు నీ గురించి ఏమి మాట్లాడతారు అన్నది ఊహించుకో.

వారేం మాట్లాడాలి అని నువ్వు భావిస్తున్నావు అన్నది కూడా ఇప్పుడే ఊహించుకో. అదిగో అదే నీ జీవితంలో నీ గమ్యం. మిగతావన్నీ బూటకం” అంటాడు స్టీఫెన్ ఆర్ ఖవీ.

ఈ ఉదాహరణ చాలా కష్టంగా నొప్పి కలిగించేదిగా ఉంది కద. కానీ జీవితంలో అదే వాస్తవం.

ఇక మేనేజిమెంట్ నిపుణులు ఏమి చెపుతున్నారు అన్నది చూద్దాం. “జీవితంలో మార్పు అన్నది లేని ఒకే ఒక పర్మనెంట్ అంశం ఏమిటంటే మార్పు మాత్రమే”. అంటే నిత్యం మార్పుకు సిద్ధంగా ఉండమని అదే జీవితం అని చెపుతారు మేనేజిమెంట్ నిపుణులు.

ఈ రెండు అంశాల మేళవింపే ప్రతి విజేత యొక్క జీవిత చరిత్ర. ప్రతి మార్పుని ఎప్పటికప్పుడు స్వీకరిస్తూ, ఆయా మార్పులకి అనుగుణంగా జీవితాన్ని మలచుకుంటూ, తను ఆనందంగా ఉంటూ తన చుట్టూ ఉన్నవారిని ఆనందపెడుతూ తను ఏర్పరచుకున్న  జీవిత గమ్యాన్ని విజయవంతంగా చేరుకోవటమే విజేతల పద్ధతిగా ఉంటుంది.

ఎందుకు ఇదంతా చెబుతున్నాను అంటే, ఈ ‘బలగం’ చిత్రంలో ఈ అంశాలనే కాదు ఇంకా లోతైన అనేక అంశాలని నిర్మొహమాటంగా చర్చించారు.

‘బలగం’ నిస్సందేహంగా ఒక గొప్ప చిత్రం. ఇది సామాన్యంగా కన్పించే ఒక అసామాన్యమైన చిత్రం.

ఏదో మాండలికంలో పల్లెటూరివారి గూర్చి, ఒక పెద్దాయన చావు గూర్చి ఊరికే అలా తీసిన చిత్రం అని చెప్పుకుంటున్నప్పటికి ఇది అనేక ఆధ్యాత్మిక అంశాలని లోతుగా స్పృశించిన చిత్రం. ఇది ముమ్మాటికి ఒక గొప్ప ప్రయత్నం. పెద్ద గ్రంథం వ్రాయవచ్చు ఈ చిత్రం గూర్చి.

***

మాండలికంలో తీయబడ్డ సినిమాలే కాదు, కథలు నవలలు కూడా చదవను నేను. నాకు చిరాకు అలాంటి సినిమాలు, సాహిత్యం. ఇక సినిమాల జానర్ విషయానికి వస్తే నేను ఒక సగటు ప్రేక్షకుడిని. నేను ఇష్టపడే జానర్ థ్రిల్లర్స్, హారర్, ఇంటిలిజెంట్ కామెడీ, సర్వైవల్ థ్రిల్లర్స్, అడ్వెంచర్.

ఈ సినిమా గూర్చి సామాజిక మాధ్యమాలలో వెల్లువలా వస్తున్న రివ్యూలు, చర్చోపచర్చలు చూడంగానే ఇది మాండలికంలో తీయబడ్డ సినిమా అని, గ్రామీణ వాతావరణంలో తీయబడ్డ సినిమా అని తెలిసి ‘ఆ! ఏం చూద్దాం లెద్దూ’ అని నేను అనుకున్న మాట వాస్తవం.

మరి ఈ సినిమా ఎందుకు చూడాల్సివచ్చిందంటే,

సరే ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారు కద చూద్దాం ఎలాగూ ఓటీటీలో విడుదల అయింది అని చివరకు చూడటం జరిగింది. ఇది చూసిన తర్వాత నాకు అనిపించిన ఒకే ఒక అభిప్రాయం ‘ఇది చూడకుంటే నేను చాలా మిస్ అయి ఉండేవాడిని’ అని.

మీరు ఈ పాటికి చూసే ఉంటారు కాబట్టి కథ మీకు తెలిసే ఉంటుంది. అయినా కథ సూక్ష్మంగా చెప్పుకుందాం.

కథ ఏమిటంటే:

అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక వృద్ధుడు. ఆయన ఊరిలో అందరినీ కలుపుకుని పోతుంటాడు. సరదాగా మాట్లాడుతూ అందరితో కలివిడిగా తలలో నాలుకగా ఉంటాడు. ఊర్లో వాళ్ళు కొందరు సరదాగా ఆయనని విసుక్కుంటారే కానీ ఆయనంటె అందరికీ ప్రాణమే. ఆయన తనతో ఒక చేతి సంచిని ఉంచుకుని దానిని ప్రాణపదంగా కాపాడుకుంటుంటాడు. అందులో ఏమి ఉందో అందరికీ ఆసక్తే. ఆయన ఎవ్వరికీ తెలుపడు అందులో ఏముందో.

ఆయనకి ఇద్దరు కొడుకులు. ఒక కూతురు. అందరూ పెళ్లిళ్లైపోయి స్థిరపడి ఉంటారు జీవితాలలో. ఆయన కూతురు అల్లుడు వేరే ఊర్లో ఉంటారు. వారు ఆయనని చూడటానికి రాక చాలా సంవత్సరాలు అయి ఉంటుంది.

కథా ప్రారంభ సమయంలో ఆయన తన మనవడి పెండ్లి కుదిరింది అని చాలా ఆనందంగా ఉంటాడు. మనవడు అంటే పెద్ద కొడుకు కొడుకు. ఈ మనవడు ప్రియదర్శి.

ఈ ప్రియదర్శి రకరకాల వ్యాపారాలు చేయబోయి చేతులు కాల్చుకుని లక్షల రూపాయల అప్పులో కూరుకుపోయి ఉంటాడు. ఇదంతా మొదటి పది పదిహేను నిమిషాలలో మనకి తెలియజేస్తారు దర్శకుడు.

ఇక అసలు కథ ఇప్పుడు మొదలవుతుంది.

ఈ తాతగారు హఠాత్తుగా మరణించడం, ఆపై ఆయన చావు వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడ్డ వాగ్వివాదాలు, మనవడి పెళ్లి ఆగిపోవడం, ఇవి జరుగుతాయి. ఆయన చనిపోయాక యథావిధిగా జరిగే కర్మకాండలో భాగంగా పిండం పెట్టినపుడు కాకులు ఆ పిండాన్ని తాకవు. అందుకు కారణం ఏమిటి, ఈ కారణంగా ఏర్పడ్డ అయోమయం అందులోంచి ఎలా వాళ్ళకి పరిష్కారం లభించింది అన్నది అసలు కథ. ఆ ముసలాయన చేతి సంచిలో ఏముంది, ఆయన మనవడు తన స్వార్థంతో ఆడిన అంతర్నాటకం ఏమిటి, అది ఎలాంటి పరిణామాలకి దారి తీసింది? ఇవన్నీ తెరపై చూస్తేనే బాగుంటుంది మీరు ఇక.

ఇది తెలంగాణ చిత్రమా?

కొందరు ముఖపుస్తక మిత్రులు శెలవిచ్చినట్టు ఇది తెలంగాణ చిత్రమా అంటే కాదు అని చెప్పాలి. ఇది మనుషుల చిత్రం. మనసుల చిత్రం. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మనిషి పుటుక పుట్టిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం. రానురాను మృగ్యమవుతున్న ప్రేమానురాగాలు, ఉమ్మడి కుటుంబ బంధాలు, అమాయకత్వంతో కూడిన నిష్కల్మష మానవసంబంధాలు మమతానుబంధాలు ఇవన్నీ కావాలనుకుంటే ఈ సినిమా చూడాలి.

సినిమాలలో వచ్చే చిన్న చిన్న జోకులకి పడి పడి నవ్వుతాను. కాస్తా మనసుకు కలత కల్గించే దృశ్యం వస్తే కంటతడిపెడతాను. నేను ఇప్పటిదాకా ‘మాతృదేవోభవ’ సినిమా చూడలేదు. కారణం సుస్పష్టం. ఆ సినిమా చూస్తే నేను ఆ విషాదాన్ని తట్టుకోలేను. పాటలు వినే కంట తడిపెడతాను ఇప్పటికీ. ఇక ఈ సినిమా విషయానికొస్తే చిత్రంగా నాకు ఎక్కడా ఏడుపు రాలేదు. ఆలోచనలు వచ్చాయి. తీవ్రంగా అంతర్ముఖుడిని అయ్యాను. చాలా చాలా కలత పడ్డాను.

అతి చిన్న వయసులోనే అంటే తన ముఫై రెండో ఏట చనిపోయిన మా బావ గారు కీ.శే. శ్రీ విద్యానాథ వాచస్పతి మరణం గుర్తు వచ్చింది. మా అమ్మానాన్నల మరణం గుర్తు వచ్చింది. మా పెద్దక్కయ్య కీ.శే.శ్రీమతి భాస్కర రామలక్ష్మి మృతి గుర్తు వచ్చింది. మనసంతా బాధతో మూలిగింది. ఏడవటానికి కూడా శక్తి లేని స్థితి అది.

కానీ ఎంత వద్దనుకున్నా’బలరామ నరసయ్యో’ పాట పదే పదే గుర్తు వస్తోంది. ఆ పాట విన్న ప్రతీ సారి కళ్ళు నీటితో నిండిపోతున్నాయి. ఈ పాట వ్రాసిన కాశర్ల గొప్ప ఆధ్యాత్మికవేత్త అనిపించింది. ఈ పాటలో ఆయన నిర్వాణం, ముక్తి, మోక్షం వంటి పెద్ద పదాలు వాడకుండానే చాలా లోతైన భావనలని ఆవిష్కరించాడు.

‘నువ్వున్న ఇల్లు ఇడిసి
నువ్వున్న జాగా ఇడిసి
నువ్వు తిన్న కంచం ఇడిసి
ఆటేటు పోతున్నావే బాలి’
‘బాధంటూ లేని చోటు వెదుక్కుంటూ బోతివో’
‘తీరు తీరు వేషాలేసి ఎంత అలసి పోతివో’
‘తోడు రాని మంది కోసం తిప్పలెన్ని మోసినవో’
‘భూమ్మీద మీద లేని హాయి సచ్చి అనుభవించవయో’
‘తొమ్మిది తొర్రలు రో కొడుకో’
‘నాలుగు రోజులు ఈడ ఉంటాము
పైన ఉంది నీది దేశము కొడుకో’

 

ఇలా ఒక్కొక్క వాక్యము ఒక్కో ఆణిముత్యం. ఈ ఒక్క పాట గూర్చి ఒక గ్రంథం వ్రాయవచ్చు.

***

అసలు ఇలాంటి కథతో సినిమా తీయాలనుకోవడమే సాహసం. ఒక వ్యక్తి చావు తర్వాత జరిగే కర్మకాండ, పదమూడు రోజు వరకు జరిగే తంతు – అసలు ఇలాంటి నేపథ్యంతో కథ అల్లుకోవచ్చు అని అనిపించటమే సాహసం. అలా అనిపించినా దాన్ని ఇంత హృద్యంగా తీయటం ఇంకా పెద్ద సాహసం.

వాళ్ళు తీస్తే తీశారు, ప్రేక్షకుడు దీనికి బ్రహ్మ రథం పట్టటమే ఇంకా ఆశ్చర్యం.

కాంతారా సినిమా చూసి నేను నా అభిప్రాయాలని వ్రాసినప్పుడు చెప్పిన మాటలే ఇక్కడకూడా చెప్పుకోవాలి. దర్శకుడు తాను బలంగా అనుకున్నది అనుకున్నట్టు ఎలాంటి సంకోచం లేకుండా తీస్తే ఆ సినిమాని ఆదరించటానికి ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అనేక సార్లు ఈ అంశం ప్రూవ్ అయింది. కాంతారా సినిమా గూర్చి వ్రాసిన వ్యాసంలో అలాంటి సినిమాల పెట్టుబడి, బడ్జెట్ పరంగా అవి సాధించిన అసాధారణ విజయాలు కూడా ఆ వ్యాసంలో పేర్కొన్నాను.

‘ఇది ప్రేక్షకుడికి నచ్చుతుందా లేదా, ఇలా తీస్తే నచ్చుతుందా అలా తీస్తే నచ్చుతుందా’ అన్న ఆలోచనలు కట్టిపెట్టి తన మనసుకు నచ్చినట్టు ఒక దర్శకుడు తీయగలిగితే ఆ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది.

1970 దశకంలో అనేకానేక సినిమాలు ఆర్ట్ సినిమాల పేరిట ప్రేక్షకులని వేధించాయి. కన్నడ దర్శకులు, హిందీ, బెంగాలీ దర్శకులు ఈ రంగంలో ముందుండేవారు. మన తెలుగులో కూడా ‘మా భూమి’ తదితర చిత్రాలు వచ్చాయి ఆ పరంపరలో. కానీ ఇవి అవార్డులు దక్కించుకున్నాయే గానీ ప్రేక్షకులకి చేరువ కాలేకపోయాయి. కారణం తెలిసిందే. ఆ దర్శకులు ఎంత సేపున్నా అవార్డులు తెచ్చుకోవాలన్న తపనతో, కొన్ని పడికట్టు నియమాలు పాటిస్తూ భారతదేశం దరిద్రమైన దేశం అనే అర్థం వచ్చేలా దరిద్రం సినిమాలు తీసి తమవరకు తాము గొప్ప మేధావులుగా పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమాలలో విధిగా అగ్రవర్ణాల వారిపై ద్వేషం వెలిగక్కటం, బ్రాహ్మణులని విలన్లుగా చూపటం ప్రధానకర్తవ్యంగా ఉండేవి. ఏ నాడు ఆ సినిమాలు నిజజీవితాలని, నిజ జీవిత పార్శ్వాలని చూపటంలో విఫలం అయ్యేవి. అందువల్ల ప్రజలు వాటిని ఏ నాడు ఆదరించలేదు.

ఇటీవల విడుదల అయిన కాంతారా, ఈ ‘బలగం’ సినిమాలలో పూర్తి గ్రామీణ వాతావరణం, పల్లెటూళ్ళలో ఉన్న ఆచారాలు, సంప్రదాయాలు మాత్రమే ఉన్నప్పటికీ యూత్‌కి కూడా ఎందుకు ఇంత కనెక్ట్ అయ్యాయి అంటే ఒక్కటే సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.

మన సంప్రదాయాలు, మన సంస్కృతి సరిగ్గా చూపిస్తే ప్రజలు ఎంతగా ఆదరిస్తారో తెలుస్తోంది కద, ఈ సినిమాల విజయాలని చూస్తే.

Exit mobile version