Site icon Sanchika

బలమైన అడుగులమే…

[dropcap]పు[/dropcap]ట్టాము ఏదో లోపంతో…
పెరిగాము ఎంతో శాపంతో…
అయినా మేము మనసులమే!
మెదడు ఉన్న మనుషులమే!

పలకపట్టిన బుద్ధి జీవులమే
పనిని నేర్చిన సిద్ధి శక్తులమే
వడి వడిగా ఉరుకు యుక్తులమే
ఒరవడిగా కదిలే పరుగులమే

లోకంలో వింత రాతలమైనా…
శోకంతో చింతలన్ని వెతలైనా..
ఆలోచన అంకురించిన ఆశలమే!
ఆవేదనను ఎదిరించిన బాటలమే!

ఊపిరి పోసిన దేవుడూ
విస్తుపోయేలా…
ఉహించని ఊహకూ
ప్రాణంపోసేలా…

గుండె వాకిట గోడు డప్పు
బతుకు వాడవాడలో మ్రోగిస్తూ
నిరాశని భయపెట్టి
విధిని తరిమికొట్టి

మౌన విహారంలో
మనసు వికాసాన్ని తలుపు తట్టి
జ్ఞానవికాశంతో
సంఘ గుర్తింపుతో అడుగు పెట్టి

చితికి చేరిన ఆఖరి ఆశను
ఆత్మస్థైరంతో బతికించి
వెక్కిరించిన స్థితినే ఉన్నతంగా
శిఖరాన్ని చేరిన బలమైన అడుగులమే

మనసు పంచితే ప్రేమకు అర్హులమే
కలను కంటూ కదిలే కారణజన్ములమే.
విధికి ఎదురేగే ఎదురు ప్రశ్నలమే.
ఎదన విశ్వాసంతో ఊరేగే వీరులమే.
(దివ్యాంగుల గురించి వ్రాసిన కవిత)

Exit mobile version