[శ్రీమతి యలమర్తి అనూరాధ రచించిన ‘బాల్యం భవిష్యత్తు బంగారు బాటగా!’ అనే కవిత అందిస్తున్నాము.]
[dropcap]ఆ[/dropcap]టలు పాటలు ఉరుకులు పరుగులు
అచ్చం నా కలంలా అత్యంత మధురంగా
పలకరింపులు ఆప్యాయతల మూటలు
నా అక్షరాల వెల్లువలా
మైదానాలలో అలుపెరగని క్రీడలు
~
రాజభవనాలు, వేపచెట్టు
దొంగాటకు స్థలాలు
నా వెతుకులాట కథాంశాలలా
నేస్తాలను మించిన సాంగత్యం పుస్తకాలతో
నా జ్ఞాన సంపద ఆ చెలిమి మహిమే
మైళ్ళకు మైళ్ళ నడక తోడుగా
నా దోస్తు ప్రకృతితో మమైక్యమౌతూ
చిన్నా పెద్దా అందరూ హితులే.. సన్నిహితులే.. స్నేహితులే
ఈనాటికీ వదలని అలవాటులా నన్నంటి పెట్టుకునే
నోరు లేని గోడలు జంతువులూ మొక్కలు సైతం
మాటల వెల్లువలో ఒకటే ఊసులు
కల్మషం ఎరుగని పూలతో సదా మైత్రి
స్వచ్ఛత చిరునవ్వు నా సొంతం చేసిన చందం
రాత్రి పాలగ్లాసుతో నాన్న
దోమతెర సరి చేస్తూ అమ్మ
భవిష్యత్తు జాగ్రత్తలకు పునాదులుగా
మమకారం రంగరించి అందుకున్న బాల్యం
నా లక్ష్యానికి మార్గదర్శిగా
చక్కటి అనుబంధాలతో ముడి వేసిన ప్రేమలు
నా గమ్యానికి ఆసటగా బాసటగా అనుక్షణం
ఆ బాల్యం ఇప్పటి బంగారు భవితవ్యంగా!