బామ్మగారూ – బుజ్జిదూడలు

0
2

[dropcap]ఇం[/dropcap]టి వెనుక వసారాలో మంచం మీద పడుకున్నారు బామ్మగారు. పైన ఫ్యాను తిరుగుతున్నది. ఆమె మంచం పక్కనే ఆవుదూడ పడుకుని వున్నది. అది మధ్య మధ్యలో తల అటూ ఇటూ తిప్పుతున్నది. పనిలో పని ఒకటీ రెండూ కూడా అక్కడే అక్కడే కానిచ్చేసింది. మధ్యాహ్నం నాలుగ్గంటలయింది. బామ్మగారు పగలు కాసేపు నిద్రపోయి లేచారు. అలవాటు ప్రకారం పక్కకు వత్తిగిలి చూశారు. తెల్లని ఆవు దూడ పడుకునే వుంది. దాని ఒంటి మీద తను పెట్టించిన గోరింటాకు పండిన ఎఱ్ఱని మచ్చలున్నాయి.

“దీనిక్కాసిని నీళ్ళు తాగించాలి. ఇప్పుడిప్పడే లేత పచ్చిక కొరకటం నేర్చుకుంటున్నది” అనుకుంటూ మంచం మీద పడుకునే తన కుడి చేత్తో ఆ దూడ వంటిని ప్రేమగా నిమురసాగారు. ఆ స్పర్శకు అది కూడా సంతోషంగా చెవులాడించసాగింది.

సాయంకాలం పూట పని చేయటానికని పనిమనిషి పార్వతి వచ్చేసింది. వస్తూనే చీర కుచ్చిళ్ళను బొడ్లో దోపుకుని పనిలోకి దిగుతుంది. రాగానే ముందు అంటుగిన్నెలన్నీ పంపు పళ్లెంలో వేసుకుని నీళ్ళు చల్లి నాన బెడుతుంది. ఆ తర్వాత పెరట్లోకి వెళ్ళి చెట్ల కింద రాలిన ఆకులనూ మొక్కల మద్య రాలిన పూలనూ చెత్తా చెదారాన్నీ వూడ్చి పోస్తూంది. వాటి నెత్తి గొడవతల వేసివస్తుంది. ఆ పనయ్యాక ఆవు దూడ దగ్గర శుభ్రం చేయటానికొస్తుంది.

అలా ఆవు దూడ దగ్గర కొస్తూనే “బామ్మగారూ ఈ ఆవు దూడ పక్కన లేకపోతే మీరు కనుకు దియ్యలేరా లేకపోతే మీరు పక్కన లేకపోతే దూడలకు తోచదా. ఇంతకు ముందల్లా గేదె దూడొకటి మీవెంటే తిరిగేదీ. ఆ దూడ మరీ చిత్రంగా చేసేది. మీ పక్కన పడుకున్నది పడుకోకుండా, అస్తమానం మీ చీరె పమిట కొంగు పట్టుకుని నమిలేది. మీరేమో దూడ నమిలిన చీరనంత వరకూ కత్తిరించి మిషను దగ్గర కుట్టించుకు రమ్మనీ నన్నే పంపంవారు. అది అలా కొన్నాళ్ళు పడుకునేది. ఇప్పుడీ ఆవుదూడను చేరదీసి పడుకోబెట్టుకుంటున్నారు. అదేసిన పేడా, పోసిన ఉచ్చనూ రోజూ కడగలేక నా చేతులు పడిపోతున్నాయి” అన్నది.

“అట్లా అనబాకే పార్వతీ. మనింట్లో పిల్లల్లాగే అవీనూ. మనం దగ్గరకు తీస్తే అవీ మనకెంతో మాలిమి అయిపోతాయి. మన పిల్లలు మాత్రం పసితనంలో మాట్లాడగలరా చెప్పు. వాళ్ల అవసరాలు తెలుసుకుని పాలూ, నీళ్లు పట్టిసాకినట్లే మన ఇంట పుట్టిన వాటినీ సాకాలి. మనం ప్రేమగా సాకితే అవీ ఎంతో ప్రేమగా వుంటాయి. మరెంతో విశ్వాసాన్ని ప్రకటిస్తాయి. నా పగటి నిద్ర అయిపోయింది. ఈ మంచం ఎత్తి పెట్టి మూందు గదిలో వేయి. ఈ ఆవు బుజ్జాయినీ తీసుకెళ్లి పశువుల చావిట్లో వున్న మీ ఆయన కప్పగించిరా. ఇదంతా శుభ్రం చేద్దువుగాని” అన్నారు బామ్మగారు.

పార్వతి దగ్గరకు రావటం చూసి ఆవు బుజ్జాయి లేచి నిలబడింది. పార్వతి బుజ్జాయి మెళ్లో పలుపు తాడు తగిలించి అవతలికి తీసుకెళ్ళటానికి ప్రయత్నించింది. పార్వతిని విదిలించుకుని పరుగెత్తుకుంటూ చెంగున గంతులు పెట్టకుంటూ తన తల్లి వైపుకు బుజ్జాయి వెళ్ళింది.

“మళ్ళీ ఇదొక వేషం. చేతికి దొరక్కూడదు. పరుగెత్తుకుంటూ పోతది” అని గొణుక్కుంటూ పేడను ఎత్తివేసింది. బకెట్‌లో డెటాల్ కలిపిన నీళ్లు చీపురు అక్కడంతా శుభ్రం చేయిసాగింది.

బామ్మగారు అంతకు ముందు మధ్యాహ్నాలు ఇంటిలోపలే పడుకునేవారు. తనెక్కడ పడుకుంటే అక్కడకి గేదెదూడో, ఆవుదూడో గడపలు దాటుకుంటూ లోపలికి వచ్చేసి ఇంక పక్కనే చేరి హాయిగా ఫ్యాను కింద పడుకునేవి. అదంతా చూసి తన పడకను వెనక వసారాలోకి మార్చుకున్నారు. ఇంట్లో వాళ్ళందరికీ ఇదంతా అలవాటే కనుక ఎవరూ ఏం మాట్లాడరు. ఆ దూడలకు గౌరి, రాముడు అంటూ పేర్లు పెట్టి మన “రాముడు ఇవాళ పాలు సరిగా తాగలేదు. రాముడి తల్లి ఇవ్వాళ వంటినిండా బురద పూసుకున్నది. శుభ్రగా కడగాలి. గౌరి మట్టి తినుట నేర్చింది. గౌరి తల్లికి పొదుగు పగిలింది. వత్తుగా వాజ్‌లైన్ రాయండి” అంటూ వాటి కబుర్లు నిత్యం ఇంట్లో వాళ్ళకు చెప్తూవుండేది.

“బామ్మా ఎప్పుడూ ఆవు దూడ సంగతీ, గేద దూడ సంగతీ చెప్తావు. నీకు చాలా కథలు వచ్చుగా. ఈ రోజు ఏదైనా కథ చెప్పు. వింటాను” అన్నాడు బామ్మగారి మనమడు.

“కథ కావాలా, సరే గుర్తు తెచ్చుకుని చెప్తాను” అన్నది బామ్మగారు.

“అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక రైతు వుండేవాడు. ఆ రైతుకు చాలా రోజుల వరకు పిల్లల్లేరు. తర్వాత కొంత కాలానికి ఒక కొడుకు పుట్టాడు. రైతుకూ అతని భార్యకు చాలా సంతోషం కలిగింది. చాలా ప్రేమగా పిల్లవాడిని చూసుకోసాగారు. వాళ్ళ ఇంట్లో గడ్డి వాము వుండేది. దాంట్లో దూరి ఒక  వెంట్రువ వుండేది. ఎలుకల్నీ, పందికొక్కుల్నీ పట్టుకుని తినేది. రైతు ఇంట్లో చాలా కోళ్ళుండేవి. కోళ్ళును తినటమంటే  వెంట్రువకు చాలా ఇష్టం. కాని ఎందుకనో గాని ఈ  వెంట్రువ రైతు ఇంట్లో వున్న కోళ్ళను మాత్రం చంపి తినేది కాదు.”

“ఎందుకుని బామ్మా?” అన్నాడు మనవడు.

“ఒకే రైతు ఇంట్లో వుంటున్నాయి గదా కోళ్లునూ, వెంట్రువనూ. ఒకే చోట కలిసి పెరుగుతున్నమన్న ఉద్దేశంతో కావచ్చు. కోళ్లను చంపేస్తే రైతుకు నష్టం వస్తుందనీ కావచ్చు” అన్నది బామ్మ.

“అవన్నీ వెంట్రువకు తెలుస్తాయా?”

“మన కథలో వెంట్రువకు తెలిసింది. మరి కథ విను” అంటూ బామ్మ మళ్ళీ చెప్పసాగింది.

“రైతుకో కొడుకు పుట్టాడని చెప్పానుగదా. ఆ పిల్లవాణ్ణి ఊయలలో పడుకో బెట్టి రైతు భార్య ఇంటి పక్కన ఎక్కడో పని చేసుకుంటున్నది. మధ్యాహ్నమయింది. రైతు పొలం నుండి అప్పుడే ఇంటికి వచ్చాడు. నోటి నిండా రక్తంతో ఇంట్లో నుండి వెంట్రువ రైతుకు దగ్గరగా వెళ్ళింది. తన కొడుకునే చంపి తిన్నదనుకున్నాడు. అందుకనే దాని నోటి నిండా రక్తముందని రైతు అనుమానించాడు. చాలా కోపం వచ్చింది. వెంటనే చేతిలో వున్న దుడ్డు కర్రతో  వెంట్రువను గట్టిగా కొట్టడు. దెబ్బ గట్టిగా తగిలింది.  వెంట్రువ విలవిలా తన్నుకుని చచ్చిపోయింది. రైతు లోపలి కెళ్ళి చూశాడు. ఊయలలో తన కొడుకు హాయిగా నిద్రపోతున్నాడు. ఊయెలకు దగ్గరగా పామొకటి రెండు ముక్కలై చచ్చిపడి వున్నది. రైతు కప్పుడు అర్థమైంది. పాము వచ్చి ఊయలలోకి పాకబోయి వుంటుంది. పిల్లవాడిని ఏమైనా చేస్తుందని  వెంట్రువ భయపడింది. పామును పట్టేసి చంపి వుంటుంది. అందుకే దాని నోటికి రక్తముయింది. తాను వెంట్రవే తన బిడ్డను కొరికి చంపేసి వుంటుందని పొరపాటుబడ్డాడు. తొందరపాటులో తనకు మేలు చేసిన  వెంట్రువను చంపేశాడు. ఎంతో పొరపాటు పని చేశానని రైతు చాలా దుఃఖించాడు. కాబట్టి మనం కూడా తొందరపడకూడదు. తొందరపడి ఎవర్నీ శిక్షించగూడదు, తెలిసిందా” అంటూ బామ్మ కథ ముగించింది.

“కథ బాగుంది బామ్మా. కాని జంతువుల మాటలన్నీ నీకు తెలిసినట్లే చెప్తావు. వాటి భాష నీ కర్థమవుతున్నదా” అంటూ మనమడు ఆటపట్టించాడు.

“అవి నోరు విప్పి చెప్పనఖ్ఖరలేదురా. అవి చూసే చూపుతోనే దాని భావాలు అర్థమైపోతాయి. నా చిన్నప్పటి నుంచీ వాటి మధ్యే మెలుగుతున్నాను. వాటి చూపులూ, వాటి అరుపులూ, అన్నీ నాకర్థమైపోతాయి. కావాంటే అమ్మను గానీ, మీ నాన్నను గానీ అడుగు. నీకు చెప్తారు. మీ తాతగారు చనిపోయినపుడు మన పెంపుడు కుక్క ఎలా ఏడ్చిందో, ఎంత బెంగెట్టుకుందో పిచ్చిముండ. పదిహేనేళ్ళు బతికింది. బతికినంతకాలం మన ఇంటిని ఎంతో విశ్వాసంగా కనిపెట్టుకుని వుంది. ఇంటి మీద కాకిని కూడా వాలనిచ్చేది కాదు. ఆ కుక్కంటే నాకు, మీ తాతగారికి కూడా బాగా ఇష్టం. దానికి తిండి పెట్టిగాని మేం తినేవాళ్లం కాదు. మీ నాన్న కాలేజీలో చదువుకునేటప్పుడు శెలవులకు ఇంటి కొచ్చినపుడు ఎంతో సంబరపడిపోయేది. మీ నాన్న బూట్ల చుట్టూ తిరుగుతూ ప్రేమగా గారాలు పోయేది. ఓసారి మన బంధువులంతా కలిసి ఉత్తర దేశ యాత్రకు పోయారు. వాళ్ళతోపాటు మీ తాతగారు కూడా వెళ్ళారు. కాశీ కూడా చూసొచ్చారు. కాశీ వెళ్ళివచ్చిన వాళ్ళు గంగతీర్థం తెచ్చుకుని పూజ చెయ్యాలన్నారు. సమారాధన చేసుకుని బంధువులకు భోజనాలు పెట్టాలన్నారు. కాలభైరవుని పూజ చెయ్యాలన్నారు.”

“కాలభైరవుని పూజేంటి బామ్మా” అనడిగాడు మనమడు.

“కాలభైరవుని పూజంటే కుక్కని పూజించటమే. కుక్కకు స్నానం చేయించి బొట్టు పెట్టాలి. ఇరవై ఒక్క గారెలు వండి వాటిని దండగా గుచ్చి వాటిని కుక్క మెళ్ళో వేయాలి. కొబ్బరి కాయకొట్టి హారతివ్వాలి. కాశీలో శివుడు కాలభైరవునితో తిరిగేవాడట. అందుకని కాశీ వెళ్ళొచ్చిన వాళ్ళు శివుని ఫోటోతో పాటు, ఈ కాలభైరవుని పూజ చేసేవాళ్ళు” అంటూ వివరంగా చెప్పింది బామ్మ.

“అదంతా మీరు చేశారా బామ్మా?” అనడిగాడు.

“ఎందుకు చెయ్యలేదు. కాని పాపం మన పెంపుడు కుక్క మీ తాతగారు ఊరెళ్ళెన దగ్గర నుండీ ఒకటే బెంగ పెట్టుకున్నది. తిండి తినలేదు. తాతగారు ఎక్కడెక్కడికి వెళ్లేవారో అక్కడికల్లా వెళ్లి చూసొచ్చింది. పొలం గూడా వచ్చి వెతుక్కున్నదని పాలేరు చెప్పాడు. మీ తాతగారు ఊరి నుంచి వచ్చేసరికి చిక్కి శల్యమై ఓపిక లేకుండా అయిపోయింది. ఆ రోజు కాలభైరవ పూజ కోసం స్నానం చేయించగానే నిస్సత్తువగా అయిపోయింది. ముందు వేడి వేడి పాలు తాగించి దాన్ని కాస్త తేరుకునేటట్టు చేశాం. ఆ తర్వాత పూజ పూర్తి చేశామనకో. ఆరోజు చూడాలి దాని సంబంరం. మీ తాతగారి కేసి అదే పనిగా చూస్తూ ఆయన చుట్టూ చుట్టూ తిరిగింది. ఆయన కేసి తన ఒంటిని రాస్తూ తన ప్రేమనంతా చూపించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తాతగారికి జబ్బు చేసింది. తాతగారు ఆస్పత్రిలో వున్నన్నాళ్లు అది తిండి తినకుండా ఏడ్చిందట. తాతగార్ని ఇంటికి తీసుకురాగానే ఆయన మంచాన్ని వదిలి పెట్టిపోలేదు. ఓ నాలుగు రోజులకు మీ తాతగారు చనిపోయారు” అని చెప్తూ బామ్మ కళ్లనీళ్లు పెట్టుకున్నది.

“కుక్కేం చేసింది బామ్మా?” అనడిగాడు.

“ఏం చేస్తుంది నాయనా. తిండి నీళ్లూ లేకుండా అల్లాడింది. ఓ.. అన్న నోటికి విరామం లేకుండా ఏడ్చింది. అప్పటికే దానికి 15 ఏళ్ళు వచ్చాయి. కంట్లో పొరలు వచ్చి చూపు సరిగా కనపడేది కాదు. ఏడ్చి ఏడ్చి తాతగారితో పాటు అదీ పోయింది” అన్నది బామ్మ నిట్టూరుస్తూ.

“ఆ కుక్క ఫోటో ఏమైనా వున్నదా బామ్మా?” అనడిగాడు.

“తాతగారు, నేను, మీ నాన్న, మన కుక్క కలిసి తీయించుకున్న ఫోటో ఒకటుంది. మన భోషాణంలో దాచి వుంచాను. ఆనక పార్వతి వచ్చినప్పుడు తీయించి చూపిస్తాను” అన్నది.

ఆ మాటలన్నీ వింటున్న అమ్మ మా దగ్గరకొచ్చింది.

“మనింట్లో మొదటి నుంచీ పెంపుడు జంతువుల్ని పెంచే అలవాటున్నది. ఇంట్లో పిల్లల్తో పాటు దొడ్లో ఆవులూ, గేదలూ, కుక్కా, పిల్లీ అన్నీ వుండేవి. మిమ్మల్ని పెంచినట్లే జాగ్రత్తగా వాటినీ చూసుకున్నాం. మీకు ఒంట్లో బాగా లేకపోతే ఎంత బాధపడేవాళ్ళమో వాటికి తేడా చేసినా అంతే బాధపడేవాళ్ళం. వాటిని ఆస్పత్రికి పంపించి వైద్యం చేయించేవాళ్లం. వాటికి సుస్తి తగ్గి మామూలుగా అయి సరిగా తిండితినే దాకా మాకు మనసులో గుబులుగా వుండేది. అవి కులాసాగా తిరుగుతుంటేనే మేము ప్రశాంతంగా వుండగలగే వాళ్ళం. వాటిని మేమెప్పుడూ జుంతువులనుకునే వాళ్లంకాదు. ఇంట్లో సభ్యులనే అనుకునే వాళ్లం. మన దొడ్లో ఆవు దూడ, కుక్కా, పిల్లీ, అన్నీ కలిసి పిల్లల్తో ఆడుకునేయి. అది చూస్తుంటే పిల్లలంతా ఆడుకున్నట్లే వుండేది. వాటిని ప్రేమగా పెంచటం వాటిన చూసి సంతోషపడటం, ఇదంతా మీ బామ్మ, తాతయ్యలను చూసే మేం అలవాటు చేసుకున్నాం” అని చెప్పింది అమ్మ.

“నిజం రా మనవడా. వాటిని సాకుతుంటే ఎంతో తృప్తిగా వుంటుంది. ఇందాక పార్వతన్నదే నా చీర కొంగులన్నీ దూడ నమిలేదని. నేను పాలు తీయటానికి గేదే దగ్గరకు వెళ్లేదానిని. ముందుగా దూడను కొంచెం తాగనిచ్చి ఆ తర్వాత పాలు పిండుకోవటానికి నేను గేదె దగ్గర కూర్చునేదానిని. పాలేరు చేతిలో దూడ నా పక్కనే వుండేది. కూర్చుని పాలు తీస్తున్నంతసేపూ దూడ నా చీర కొంగు నములుతూ వుండేది. నేను పాలు తీయటం పూర్తి చేసి లేవగానే దూడ నా చీర కొంగ వదిలి పాలు తాగడానికి కెళ్లేది. నా చీర కొంగు దూడ నోట్లో చిక్కుకుపోయి నేను చాలాసార్లు ముందుకు తూలేదాన్ని. ఆ దూడ తల్లికయితే ఎంత గుర్తో. నేనెప్పుడైనా కొత్త చీర కట్టుకోవటం ఆలస్యం, ఎక్కడికో వెళ్తున్నానని దానికర్థమైపోయేది. ఒకటే అరవటం మొదలు పెట్టేది. దాని అరుపులు విని మిగతా గేదెలూ ఆవులూ అరవటం మొదలుపెట్టేవి. చిన్నపిల్లల్లాగే అవీ అంత మారాం చేసేవి. ఆ గోల పడలేక ఒక్కోసారి కట్టుకున్న కొత్త చీర విప్పేసి నా ప్రయాణం మానుకున్న సందర్భాలు వుండేవి. ఒక్కోసారి పాత చీరతోనే ఏ పక్కింటికో వెళ్లి చీర మార్చుకుని వెళ్లేదానిని. అలా వెళ్లిన రోజు నేను తిరిగి ఇంటికి వచ్చిన దాకా అరుస్తూ వుండేవట. చుట్టు పక్కల వాళ్లందంరికీ అర్థమైపోయేదట. ఇవాళ పిన్నిగారు ఎక్కడికో వెళ్లినట్లున్నారు. చిన్నపిల్లలు తల్లి కోసం ఏడ్చినట్లు ఈ పశువులూ ఆమె కోసం అరుస్తున్నాయని. మీ తాతగారు పోయినపుడు పెంపుడు కుక్క అలా చనిపోయిందా. మిగతా గేదేలూ, ఆవులూ అదే పనిగా పదిహేను రోజుల పాటైనా అరుస్తూ మేత మేయక నీళ్లు తాగక అల్లాడిపోయినవి. చివరికి నేనే వాటి దగ్గర కెళ్లి గంగడోలు సవరిస్తూ కుడితి బకెట్లు వాటి ముందు పెట్టించాను. వాటి ప్రేమ విశ్వాసం అలా వుండేవి. మీరంతా కూడా అస్తమానం ఫోన్లూ, కంప్యూటర్ల ముందు కాకుండా కాస్త ఏ పెంపుడు జంతువునన్నా పెంచుకోండి. కాలక్షేపానికి కాలక్షేపం వుంటుంది. ‘నాకేం తోచటం లేదు, మరేం చెయ్యాల’న్న చికాకు లేకుండా పోతుంది” అన్నారు బామ్మగారు.

“ఇట్లా చెప్పేగా అత్తా వాళ్లింట్లో రెండు కుక్క పిల్లల్ని పెంచుకునేటట్లు చేశావు” అన్నాడు మనుమడు. “అవున్రా. మీ మేనత్త తన కొడుకూ, కూతురూ అస్తమానం ఫోన్ ముందేసుకుని కూర్చుంటున్నారు. ఇంకే ధ్యాస లేకుండా పోతుందని గొడవ పెట్టింది. అప్పుడు నేనే వాళ్లకు సలహా ఇచ్చా. కుక్క పిల్ల నొక దాన్ని తీసుకొచ్చి పెంచుకోండి. పిల్లలు దానితో ఆడుతూ ఫోన్ ధ్యాస తగ్గించుకుంటారు. ఇటు ఇంట్లో కాపలాగా కూడా పనికొస్తుంది. కుక్క పిల్లతో ఆడుకోవటమే కాదు దాని స్నానం తిండీ శుభ్రం చేయింటం ఇలాంటి పనులన్నీ పిల్లలు శ్రద్ధగా చేస్తారు. వాళ్లకూ బాధ్యత పెరుగుతుంది. మంచి తోడు దొరుకుతుందని మీ మేనత్తతో నేనే చెప్పాను. అత్త పిల్లలిద్దరూ మేం కుక్క పిల్లను పెంచుకుంటాం. కాని మా ఇద్దరికీ చెరొక కుక్క పిల్ల కావాలంటే మీ మామయ్య ఇద్దరకీ చెరొక దాన్ని కొనిపెట్టారంట. పోటీ పడి పిల్లలిద్దరూ ఆ రెండింటినీ శ్రద్ధగా పెంచుతున్నారు. స్కూల్ నుండి రాగానే వాటి పనే సరిపోయేది. కాసేపు హోమ్ వర్క్ చేసుకోవటం, చదవాల్సినవి చదువుకోవటం. మిగతా టైమంతా కుక్క పిల్లల్తో గడపటం చేశారు. అవి కూడా పిల్ల లెప్పుడు స్కూల్ నుంచి వస్తారా అని కనిపెట్టుకుని వుండేవట. తరువాత మీ మేనత్త నాకు చెప్పింది. నాకు మంచి సలహా ఇచ్చావమ్మా. కుక్క పిల్లల్ని పెంచుకుని, వాటితో ఆడుకుంటూ నీ మనమడూ, మనమరాలూ ఎంత బుద్ధిమంతులైపోయారు. ఎంతో ఓర్పుగా వుంటున్నారు. తమ తోటి వారితో కూడా ఎంతో ప్రేమగా వుండటం నేర్చుకున్నారు. స్కూల్లు పిల్లలందరితోనూ ఇంటి చుట్టు పక్కల పిల్లల్తోనూ చాలా స్నేహంగా వుడటం అలవాటు చేసుకున్నారు. ఇంట్లో కూడా మేమేం చెప్పినా సరేనమ్మా. సరే డాడీ అంటున్నారు. ఇది వరకు ఫోన్ చూస్తూ మా మాటలు వినిపించుకునే వాళ్లు కాదు. ఇప్పుడు మా ప్రాణాలకు ఎంతో హాయిగా వున్నది. ఇదంతా నువ్విచ్చిన సలహా వలనేనమ్మా అంటూ ఎంతో సంతోపడింది. అప్పడే ఇంకో మాట కూడా చెప్పింది. ఈనాటి శాస్త్రవేత్తలు ముఖ్యంగా పిల్లల విషయంలోనూ, పెద్దల విషయంలోనూ ఒత్తిడి తగ్గించుకునే మంచి వ్యాపకం పెంపుడు జంతువుల్ని పెంచుకోవటమే అన్నారుట. వాళ్లు ఎన్నో పరిశోధనలు చేసి చెప్పిన విషయాన్ని నువ్వు నీ అనుభవం ద్వారా చెప్పావమ్మా అంటూ పొంగిపోయింది. ఒరేయ్ అబ్బాయ్ నువ్వు గుర్తు పెట్టుకో. ఇప్పుడు మనింట్లో అంటే పెంపుడు జంతువులంటూ వున్నాయి. నువ్వు పెరిగి పెద్ద వాడివైన తర్వాత ఎక్కడో వుంటావు. అప్పుడు కూడా నీకు వీలైన పెంపుడు జుంతువునో, పక్షులనో పెంచుకో. దాన్నొక తోడు అనుకో. మనసుకు చాలా హాయిగా వుంటుంది” అంటూ సలహా ఇచ్చారు బామ్మగారు.

“నువ్వు చెప్పన విషయాలన్నీ నాకు బాగా గుర్తుంటాయి బామ్మా. తప్పకుండా ఏదో ఒక దాన్ని పెంచుతాను. నువ్వే చూస్తావుగా” అన్నాడు మనుమడు మాట ఇస్తున్నట్లుగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here