బామ్మగారూ-పెంకు ముక్క

2
2

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన హాస్యకథల పోటీకి కె.వి. సుబ్రహ్మణ్యం పంపిన హాస్య కథ “బామ్మగారూ – పెంకుముక్క”. ఓ తెలివైన బామ్మ తన మనవడితో తమ ఇంటిని ఎలా బాగుచేయించిందో ఈ కథ చెబుతుంది. [/box]

[dropcap]”ఒ[/dropcap]రేయ్ కాముడూ, కామిగా, ఎక్కడ చచ్చావురా? ఎంత పిలుస్తున్నా రావేమిరా? ఇక్కడ నా నెత్తిన పెంకులూడి పడి చస్తున్నాయి… నా మాడు పగిలిపోయిందిరో దేవుడోయ్!!”
హాల్లోంచి వినవస్తున్న గావుకేకలకి ఆదరా బాదరాగా తువ్వాలు చుట్టుకుని స్నానాల గది లోంచి వచ్చాను..బామ్మ దగ్గరకి. నెత్తిన చెయ్యి పట్టుకుని మండువా దగ్గరగా గోడకానుకుని కాళ్ళు చాపుకుని రెశ్లింగ్ ఫెడరేషన్ పోటీలో దెబ్బతిన్న వస్తాదులా కూర్చునుంది. ఆవిడ అరుపులు తగ్గినా, మళ్ళీ నన్ను చూడగానే పెరిగిపోయాయి.
“చూడరా బాబూ, పైనించి నా నెత్తిన ఎంత పెంకు పడిందో..” అంటూ ఓ అరంగుళం కంటే తక్కువ ఉన్న ముక్క చూపించింది. చుట్టూ చూశాను, చుట్టుపక్కల, కింద, ఎక్కడా ఏ పెంకు ముక్కలు కనబడలేదు.
“ఒరే పిలిచిన గంటకి వస్తావా? చూడు నానెత్తి మీద ఎంత దెబ్బ తగిలిందో, చూసి చెప్పు, నా ముఖం నేను చూచేడ్చుకోలేను కదా?” అశక్తతను వెల్లడించడంతో నాకు జాలేసింది.
“రక్తం వస్తోందా?” ప్రశ్న సంధించింది. నిజానికి ఆవిడకి సమాధానాలు ఇవ్వక్కరలేదు. ప్రశ్నలు వేయడం ఆవిడకి (ఎమ్ ఈ కే లో) లా అలవాటే అయితే సమాధానాలు మటుకు ఆశించకపోవడం ఎదుటి వారికి రక్షణ.
“రక్తం రావడం లేదు. చిన్న ముక్కే, కొంచెం గీరుకున్నట్లుందంతే” అని ఆవిడని సమాధాన పరచి, వెంటనే ఫ్రిజ్ నించి అయిసు ముక్క ఒకటి తెచ్చి ఆవిడకి దెబ్బ తగిలిందన్న చోట పెట్టాను, దానిని అలాగే పట్టుకోమని చెప్పి, వంటింటిలోకి వెళ్ళి పసుపు, తేనె కలిపి తెచ్చి సన్నగా గీరుకున్న చోట రాశాను. బొప్పి కూడా కట్టలేదు.
“మండిపోతోందిరోయ్ ఏం మందు వేసి చచ్చావ్?” అరుపులు.
“ముందర కొంచెం మండుతుంది, తరువాత బానే ఉంటుంది, గట్టిగా అరవకే బామ్మా,’ఇల్లు కూలింది’ అనే ఉచిత సినిమా చూడడానికి చుట్టుపక్కల వారు ఎగబడి వస్తారూ….” అన్నాను. కాసేపు మూలిగి శాంతించింది. నేను ఓ బ్యాండ్ ఎయిడ్ తెచ్చి ఆవిడ గాయమయిందనుకున్న చోట అతికించాను.
పెరట్లో తోటకూర కోసుకురావడానికి వెళ్ళిన నా భార్య రమణి కంగారుగా వచ్చేసింది. ఏవో అరుపులూ హడావిడీ ఇంట్లోంచి వినబడి. నే చేసేదంతా చూస్తూ, నా పని అవగానే “ఏమయిందమ్మమ్మా?” కోకిల కూసినట్లు ప్రశ్నించింది…. నా ముఖంలోకి కూడా చూసింది. ఎవరు సమాధానం చెప్పినా పరవాలేదన్నట్లుగా.
కొందరు వ్యక్తులకి ప్రశ్నించడమే గానీ ప్రశ్నించబడడం ఇష్టం ఉండదు. అలాగే ప్రశ్నలు వేయడమే గానీ దాని సమాధానం కోసం చూడరు. ఆ కోవ లోదే మా బామ్మ కూడా. అందుకే నేను చొరవ తీసుకుని, జరిగిన దానిని రమణికి వివరించాను.
“ఇప్పుడెలా వుందమ్మమ్మా” మళ్లీ కోయిల కూసింది. చాలా సేపటినించీ తను గావు కేకలు పెడుతున్నా త్వరగా రాలేదని గుర్రుగా ఉందేమో, “తియ్యగా ఉందే…. నువ్వు కూడా ఓ పెంకుతో దెబ్బ కొట్టుకుని మందు వేయించుకుంటే… అచ్చం సున్నుండ తింటున్నట్లుంటుంది” చేతనయినంత వ్యంగ్యం వలికించింది బామ్మ కంఠస్వరం.
నా భార్య రమణి ఇగ్నో యునివర్సిటీలో డిగ్రీ చేసింది, కాపరానికి వచ్చిన కొత్తలోనే బామ్మ గారి మాటలని ’ఇగ్నోర్’ చేయడం అలవాటు చేసేసుకుంది. ఆవిడతో ఎప్పుడు ఏ రకంగా మెలగాలో అప్పుడు అలా మెలగగలదు.
నేను, అమ్మా నాన్నలకి ఏకైక సంతానం. కష్టపడి మెడిసినో, ఇంజినీరింగో చదవక, మా ఊరి నించి రోజూ వెళ్ళి రాగలిగిన కాలేజీలోనే ఆడుతూ పాడుతూ డిగ్రీ పూర్తిచేశాను. పెద్ద మార్కులా అంటే కాదనే చెప్పాలి. తరువాత నిరుద్యోగిగా అనేకానేక ఉద్యోగ పరీక్షలు రాస్తూండగా అనుకోకుండా ఎల్‌ఐ‌ కీ, మరో బ్యాంకుకీ సెలెక్ట్ అయాను. మొత్తo మీద బ్యాంకు ఉద్యోగానికే మొగ్గు చూపి అందులో చేరేశాను. అది కూడా మా ఇంటికి దగ్గర ఊర్లోనే ఉండటం వల్ల రోజూ స్కూటర్ మీద వెళ్ళి వస్తూండే వాడిని, అదే ఇప్పుడు మా బామ్మ గగ్గోలు పెట్టిన మా వంశపారంపర్య…స్వగృహం నించి.
మా తాతగారి తండ్రి గారు కట్టించిన ఇల్లవడం, ఇంకా గట్టితనం కోల్పోవకపోవడం, ఈ ఇంట్లోనే ఉంటూ, పైవారు మిగిల్చి ఉన్న కొద్ది పొలాన్నీ చూసుకుంటూ ఉండేవాడిని. మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగిగా ఊరూరూ బదిలీలని తిరగడం చేత, అమ్మా నాన్నా వేరే ఊళ్ళలో ఉండాల్సివచ్చేది. అప్పుడప్పుడూ ఇక్కడికి వచ్చి సెలవులలో నాతో, బామ్మతో గడపడం జరుగుతూండేది. అలాటి తీరిక సమయం లోనే, నా పెళ్ళి ప్రస్తావన వచ్చింది. కొద్ది పొలం ఇల్లూ, మంచి ఉద్యోగం, ఆడపడచుల్లేక పోవడం, వంటి అనేక సలక్షణాలున్న నాకు రమణితో పెద్దలు నిశ్చయించిన వివాహానికి తల వంచి, తలవంచిన రమణి మెడలో తల వంచుకుని మూడు ముళ్ళూ వేసి ఇదే మండువా లోగిలికి కాపురానికి తీసుకురావడం జరిగింది. రమణికి అత్తగారి పోరు లేకున్నా “మైనస్ ఇన్ టు మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్” అనే లెక్క ప్రకారం ’అత్తగారి అత్తగారి పోరు’కి ఎలా బాగా మెలగాలో ఇట్టే తెలిసి పోయింది. వారిద్దరూ ఇప్పుడు మాటల బాణాలు విసురుకున్నా విసనికర్ర వీచినట్లు భావిస్తుండే మంచి స్నేహితులు.

***

మా బాంకు మరో పది శాఖలు పెరగాలని, దానికి నెల రోజులే సమయం ఉంది కాబట్టి హెడాఫీసు వారు ఓ మ్యాప్ తెప్పించి దానిమీద పది గులకరాళ్లు కళ్లుమూసుకుని చల్లారుట. వాటిలో ఒకటి మా ఊరిమీద పడటంతో మా ఊర్లో కూడ ఒక రూరల్ శాఖ ఒకటి పెట్టారు. అక్కడికి బదిలీకి ఎవరూ రావడానికి ఇష్టపడరు సహజంగానే. కాబట్టి నేను మా ఊరికి బదిలీ అడగ్గానే ఇచ్చేశారు. సో… స్వంత ఇంట్లోంచి… స్వంత ఉద్యోగం అయింది నాది.
అమ్మా నాన్నా వారానికో, సెలవులకో, వచ్చినప్పుడుండేందుకు వీలుగా ఒక గది, నాకూ రమణికీ ఒక గదీ, వెరసి రెండు గదులని పెంకుల కింద, సీలింగ్ వేసుకుని ఓ మాదిరి సుకుమారంగా ఉండే బెడ్ రూంలుగా మార్చుకున్నాం. మా నాన్నగారి తాత గారు కట్టించిన ఈ మండువా లోగిలి ఇల్లు పూర్తిగా ఆధునికీకరించడానికి నాకు, మా నాన్నకి, మా ఆస్తికి గానీ… స్తోమత లేక అలాగే ఉంటున్నాం. ఇంతలో బామ్మగారూ పెంకుముక్క సంచిక(ఎపిసొడ్) నడిచింది. పైగా తాను ఆ ఇంటిలోకి కోడలిగా అడుగు పెట్టానని బామ్మ పంతం పట్టడం, అక్కడనించి బయటకి మరో చోటుకి సశరీరంగా వెళ్ళనని మొండికేయడం వల్ల కూడా మేం అక్కడే ఉండడం మరొక కారణంగా చెప్పుకోక తప్పదు సుమండీ.

* * *

ఈ సంచిక తరువాయి గా మేం చాలా మీటీంగులు పెట్టుకున్నాం. పూర్తిగా మార్చి డాబాగా వేద్దామంటే మా స్తోమతకి మించిన పని. ఎలాగయితేనేం, బామ్మ బలవంతం మీద, బామ్మ నగలు, నావద్ద నిలవ, నాన్నగారు సర్దేదీ, ఆయన తేగలిగిన అప్పు, నే తేవాల్సిన అప్పు ఎంతవుతుందో చూసుకుని… వాటినన్నిటినీ తీర్చడానికి, కాలపట్టిక ప్రణాళిక వేసుకుని ఇంటి కప్పుని తిరిగి నిర్మించడానికి, అంటే, పెణక (వెదురు బద్దలని ఇంటి దూలాల మీద పరచి తడకలాగ అల్లుతారు) దానిపై పెంకులు ఒక వరుసలో నేస్తారు. అలా చేయించడం, గోడలకి ప్లాస్టరింగ్ చేయడం, చేసి పూర్వపు ఇంటి ప్లాన్‌కి భంగం కలగని రీతిలో పూర్తవ్వాలని, తమ రెండు గదులకూ తోడు మరో గది, అతిథి గదిగా మార్పు చేయాలనీ, సర్వసభ్యసమావేశంలో తీర్మానాలు చేసుకున్నాం. ఆ కార్యక్రమమంతా నడిపేందుకు నాకు సర్వాధికారాలూ కట్టబెట్టడం మరో నిర్ణయం. వీటినే బామ్మమీటింగులంటూ చెప్పుకొచ్చేది. ఆవిడ తమ్ముడి కొడుకు సాఫ్ట్‌వేర్‌లో బెంగలూరులో పని చేస్తున్నాడు. ఎప్పుడైనా బామ్మ ఫోన్ చేస్తే మీటింగులని అంటూ ఉండేవాడు. వాటి అర్థం నేను బామ్మకి వివరించాక ఆ సాఫ్ట్‌వేర్ పదజాలాన్ని బామ్మ కూడా వాడుక లోకి తెచ్చుకుంది.
ముందస్తుగా పెంకుటింటికి పాత వెదురు రూఫింగ్ (పెణక) తీసివేసి, కొత్త వెదురు పెణక అల్లాలి. తరువాత దానిమీద పెంకులు వరుసలుగా నేయాలి. ఈ రోజుల్లో వెదురు ఖరీదు ఎక్కువ. పెంకులు ఎవరు తయారుచేస్తున్నారు చెప్పండి? రెండువేల కిలోమీటర్లు రాసే రీపిల్ ఒకటి నా కాలికి కట్టుకుని అతను చెప్పిన ఊళ్లన్నీ తిరిగి వాళ్లందరినీ వెదికి పట్టుకోవాలి. పెణక అల్లే వారినీ, పెంకులు వేసే వారిని వెదకాలి. పది రోజుల పాటు అయిదారు ఊళ్ళు తిరిగి ఒక ఆరా, ఒక మనిషినీ సంపాదించాను. అతనిని తీసుకొచ్చి ఇల్లు చూపించాను. అతని అంచనా ప్రకారం కేవలం వెదురు పెణకకే చాలాఖర్చయ్యేలా ఉంది. ఇతను కాకపోతే మరొకతను అని అనుకోడానికి కూడా లేదు. పెంకుల గురించి అతనినే అడగ్గా ఈ చుట్టుపక్కల ఎవరూ లేరని, పెంకు తయారయేచోటే పెంకులు, అవి నేసేవాళ్ళూ దొరకచ్చనీ చెప్పాడు. ఇక ఆ పెంకుల కోసం ఓ సెలవు రోజు ఆ ఊరెళ్ళి, వాకబు చేయగా, అతను గ్రామాంతరం వెళ్ళాడని తెలిసి, మళ్ళీ నెలరోజులాగి వెళ్ళాను. మొత్తానికి అతన్ని పట్టుకుని మాట్లాడినప్పుడు, ఆ రకం పెంకులు ఇక్కడ దొరకవని, మళ్ళీ మరో ఊరుపేరు తెలిపాడు. అతన్ని ’సంపాదించి’ పెంకులు ఎన్ని కావాలో? ఎంతవుతుందో ఇల్లు చూస్తే గానీ చెప్పలేనన్నాడు దారిఖర్చుల కింద ఒక అయిదొందలు ఇచ్చుకుని, అతనికి సమర్పించింది కన్సల్టేషన్ ఫీ గా భావించి వెనుతిరిగాను. అనుకున్నట్టుగానే వచ్చి చూసి ఎస్టిమేట్ చెప్పి వెళ్ళాడు. మొత్తానికి పనిచేయడానికి సమర్థత ఉన్న వారినే పట్టుకున్నానన్న నమ్మకం కలిగింది నాకు. కానీ వారు ఎన్ని రోజులు పనిచేస్తే అన్నిరోజులు టీ టిఫిన్ భోజనాలు అన్నీ వారికి అందించాలి… అదీ ఈ పల్లెటూరులో…. ఎంత కష్టం వచ్చింది నాకూ? బాధ పడిపోయాను. అయినా తప్పదు, వారు కోరిన కోర్కెలన్నింటికీ సమ్మతించి పని ప్రారంభించే రోజు తెలియజేస్తానని అడ్వాన్సులిచ్చాను.
ఒక మంచిరోజు చూసి పని ప్రారంభించాం. మేం ఎదురింటిలోని మూడు గదుల్లో అద్దెకి దిగి, సర్దుకుని ఈ మార్పులు చేయిస్తున్నాం. వెదురు అల్లేవారి పని ముందుగా ఉండడం వల్ల వారు వచ్చి ఉదయాన్నే ఒక్కొక్కరూ మా వసతి ఇంటినించే మేం చేసిచ్చిన టిఫిన్లు ఆరగించి పని ఆరంభించారు. మళ్ళీ పన్నెండు గంటలకల్లా టీ లు డిమాండ్ చేసి పెట్టించుకుని తాగారు. అపరాహ్నం వేళ మా ఇంటనే భోజనాలు లాగించారు, మళ్లీ మధ్యాన్నం టీ లు షరా మామూలే. అలా వారి పనికి అయిదు రోజులు పట్టింది. వారికి వారుస్తూ, వండి వడ్డించి రమణి చిక్కి సగమైంది.
తదనంతరం ఎలాగోల్లా పాత రకం కొత్త పెంకులు సంపాదించి, మేస్త్రీ అడిగినన్ని సుమారు ఒక రెండు వందల కిలోమీటర్ల దూరం నించి తెప్పించి ఉంచాం. రెండు రోజులు గదచినా మేస్త్రీ చిరునామా గల్లంతయింది. ఎట్టకేలకి వారం తరువాత వారు దర్శనమిచ్చారు. ఒక రకంగా రమణికి కొంచెం విశ్రాంతి లభించిందని ఆనందించాను.
మళ్ళీ కథ మామూలే, పెంకులు వేసే వారు రాగానే వారికీ అల్పాహార, ఏకాక్షరి (తేనీటి), భోజన, సరపరా మామూలుగానే కొనసాగింది. కానీ మొదట్లోనే మేస్త్రీ రోజూ ఒక కోడికీ, సాయంత్రం ఒక క్వార్టరుకీ చెల్లించాలని అడిగి, సాయంత్రం తమ భోజనాలు తామే చూసుకుంటామన్నాడు, మేం పూర్తి వెజిటేరియన్లని తెలిసి. కొంతలో కొంత సంతోషించా. మరో ఏడు కోళ్లు కొన్నాక పెంకుల నేతకూడా పూర్తయింది. నిజం చెప్పాలంటే ఇల్లు చూడడానికీ బాగుంది. గోడలకి రంగులు తప్ప.
గోడలకి రంగులు వెయ్యాలంటే వాటికి ప్లాస్టరింగ్ చెయ్యాలి. దానికి చాలా అయ్యేలా ఉండి. మరో మీటింగ్‌లో నిర్ణయించుకుని దానిని కూడా చేసేయాలని తీర్మానించేసుకున్నాం. ఒక ఇరనై రోజుల పనితో అది పూర్తయింది. అయితే వీరందరూ ఈ ఊరువారే కాబట్టి వారికి సేవ ఉదయం మధ్హ్యాహ్నం టీల తో సరిపోయేది. ఇక సున్నం వేయడం మిగిలింది. రంగుల వారిని పిలిచి మాట్లాడుతుంటే బామ్మ రంగులక్కరలేదు, సున్నం వేయించండంది. రంగులతనేమో సున్నం అంటే వైట్ సిమెంట్ అనుకున్నాడు. దానికైనా అంతే కూలీ అవుతుందని చెప్పాడు. లేని పళ్ల తో భయంకరంగా నవ్వుతూ..”పిచ్చి నాగన్నా, సున్నం అంటే నువ్వనుకునేది కాదురా, నత్తగుల్లలు తెచ్చి వాటిని వేడినీటిలో మరిగించితే తెల్లగా సున్నం తయారవుతుంది..దానిని గోడలకి వేస్తే, ఇల్లంతా మల్లెపూల తెల్లదనం, దోమలు కూడా ఇంటిలోకి చేరకుండా ఉండి ఆరోగ్యంగా కూడా ఉంటుంది..మీ కాలం పిల్లలకి ఆ సున్నం గురించి ఏమీ తెలియదు” వాడిని హడలగొట్టింది. ఆ విధానాన్ని కొత్తగా విన్న కుర్ర పెయింటర్ తెల్ల సబ్బు మరక ఏడ్ లాగా అవాక్కయాడు. చివరికి బామ్మని, కొత్త తరం “తెల్ల రంగు” మాత్రమే, ఇంటికి వేయించడానికి ఒప్పించేసరికి, నా తల ప్రాణం తోకకి వచ్చింది.
ఎట్టకేలకి పని పూర్తయి, “సో కాల్డ్ ఇంటీరియర్” కూడా పూర్తయింది. సర్వ సౌకర్యాలు అమర్చి బామ్మకి ఓసారి చూపించాం. అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తూ ఉండేది బామ్మ. ఉచిత సలహాలని పారేస్తూ, వారిని కన్ఫ్యూజ్ చేసేస్తూ. ఇంటి టోపోగ్రఫీ ఏమీ మారకుండా సుందరంగా మరో రెండు తరాల వరకూ గట్టిగా తయారవుతున్నందుకు ఆవిడ చాలా తృప్తి పడింది. పైగా తాను కాపరానికి వచ్చేటప్పటికి ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉన్నందుకు సంతోషించింది.
ఆ సంతోషంలో రమణిని గాట్టిగా ముద్దేట్టేసుకుంది. మరో నెల రోజులలోపు అన్ని పనులూ పూర్తయాయి. మండువా లోగిలి యవనత్వంతో మెరిసిపోతోంది.
హంగు ఆర్భాటాల్లేకుండా గృహప్రవేశం కూడా బంధుమిత్రుల ఆగమనాలు నిష్క్రమణలతో పూర్తయింది. ఇంటి లోపలకి చేరుకున్నాకా, వారం రోజులకల్లా పూర్తిగా సెటిలయ్యాం. మళ్లీ కుటుంబ సభ్యులందరం మీటింగ్ పెట్టుకున్నాం, పని బాగా చేయించినందుకు నన్ను బామ్మ బాగా మెచ్చుకుని పొగిడింది. పనివారికి చేసిన సేవలకి రమణిని కూడా మెచ్చుకుంది, అదీ రమణి పుట్టింటివారి ముందర. రమణి లావయింది.
మొత్తం ఖర్చు, లెక్క వేసి చెప్పాను అందరికీ. అప్పుడు తీసింది బామ్మ… తన కొంగున కట్టిన చిన్న పెంకుముక్కని. “దీనిని జాగ్రత్తగా పూజ గదిలో దేవుని దగ్గర ఉంచండిరా… దీని మూలంగానే మీరు ఇవన్నీ చేయగలిగారు. అంతకుముందు నేనెన్నిసార్లు చెప్పినా మీరు ఈ ఇంటిని బాగుచేయించే ప్రయత్నాలలో ఉండేవారు కారు. మీ దగ్గర స్తోమత వచ్చేవరకూ ఆగేవారు, నా నగలు తీసుకునేవారు కాదు. అందుకనే నాకు ఈ పెంకుముక్క వచ్చి తగిలిందని నాటకమాడి, ఇల్లు రిపేరు చేయించుకున్నా” అంది బామ్మ. ఎవ్వరికీ నోట మాట రాలేదు.
“అమ్మ బామ్మా”?
“ఎంతపని చేశావే అమ్మా”?
“అయ్యో అత్తగారూ….”…అన్నారు అందరూ.
రమణి ఏమీ అనలేదేమిటా అని చూస్తే ఆమె ఓక్ ఓక్ అంటూ హాల్లో కొత్తగా పెట్టిన వాష్ బేసిన్‌లో వాంతి ప్రయత్నాలు చేస్తోంది.
“అమ్మ మునిమనుమడా! నీ కోసమేరా ఈ మార్పులన్నీ చేయించాను, సరైన సమయానికి వస్తున్నావూ….” అని బామ్మ గారనడంతోనే ఇల్లంతా సంతోషంతో నిండిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here