Site icon Sanchika

బంధాలు – బాధ్యతలు

[dropcap]“ఒ[/dropcap]రేయ్ నన్ను పట్టుకోండి చూద్దాం” అంటూ పరుగెత్త సాగాడు శరత్. డిగ్రీ పాస్ అయినా పిల్లలతో సమానంగా ఆటలాడతాడు. “మనిద్దరం కలిసి అన్నను పట్టుకుందాం” అంటూ శరత్ వెంట పడ్డారు దినకర్, దివాకర్. వాళ్ళని తప్పించుకోవడానికి భావి దగ్గరకి పరుగెత్తాడు శరత్.

వరసకి బావ అయినా చిన్నప్పటినుండి కలసి తిరగడంతో శరత్‌ని అన్నా అని పిలవడం అలవాటుగా మారింది దినకర్‍కి, దివాకర్‌కి.

ఒకళ్ళ వెంట ఒకళ్ళు బావి చుట్టూ పరుగెత్తడం మొదలెట్టారు. అప్పుడే తెలతెలవారుతోంది, పక్షుల కిలకిలారావాలు, దానికి తోడు పిల్లల ఆటలతో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. ఎలాంటి అరమరికలూ లేకుండా సంతోషంగా నవ్వుకుంటూ ఆడుకుంటున్న పిల్లల్ని చూసి మైమరచిపోయిన పార్వతి, “అరేయ్ ఈ రోజు పండగర్రా, త్వరగా బ్రష్ చేసుకుని స్నానాలు చెయ్యండి. గుడికి వెళదాం అని పొద్దున్నేలే లేపితే, ఈ ఆటలేంటి – ఆగండి” అంటూ వాళ్ళ వెంట పడింది పార్వతి.

పంపులో మంచినీళ్లు పట్టుకుందామని వచ్చిన పావని వాళ్ళని చూసి, “ఏంటి వదినా నువ్వు గూడ చిన్న పిల్లలాగా వాళ్ళ వెంట పరుగెడుతున్నావా” అంది వాళ్ళతోబాటు తిరుగుతున్నవదినని పట్టుకుని.

“వీళ్ళు చూడు పావని త్వరగా తయారవండి, గుడికి వెళదామని బలవంతం మీద నిద్రలేపి బ్రష్ చేసుకోమని చెబితే, పొద్దున్నే ఆటలు మొదలెట్టారు” అంటూ “ఒరేయ్ శరత్! పెద్దవాడివి, నువ్వు కూడా పిల్లలతో ఆటలేంటిరా.. అదిగో మామిడి చెట్టు ఎందుకెక్కావ్ దిగు” అంది కోపం నటిస్తూ.

“వదినా, కాస్సేపు ఆడుకొని వాళ్ళే వస్తారు, నువ్వెళ్ళి అన్నయ్యా వాళ్లకి కాఫీ కలుపు, నేను మంచినీళ్లు పట్టుకుని వస్తాను” అంటూ పార్వతిని లోనికి పంపింది పావని.

అప్పుడే ఒళ్ళు విరుచుకుంటూ పెరటిలోకి వచ్చిన పరిమళ “అమ్మో కోతి” అంటూ అరిచింది.

ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు, “కోతేక్కడే!” అంటూ అయోమయంగా చూసింది పావని. “అదిగో అక్కడ” అంటూ చెట్టు మీదున్న శరత్‌ని చూపిస్తూ నవ్వింది పరిమళ. అది చూసి శరత్ ఒక్క వుదుటన చెట్టు దిగి “నన్ను కోతి అంటావా?” అంటూ పరిమళ వెంటపడ్డాడు.

పరిమళ పరుగెత్తుకుంటూ వెళ్లి వంట ఇంట్లో కాఫీ కలుపుతున్న తల్లి వెనకాల దాక్కుంది. పరిమళ వెనకాలే వచ్చిన శరత్ “చూడు అత్తా! నీ కూతురు నన్ను కోతి అంటోంది” అన్నాడు పార్వతితో. “మరి చెట్టు మీద కూచున్న జంతువుల్ని ఏమంటారు” పైట సరిచేసుకుంటూ అంది ఇంటర్ చదువుతున్న పరిమళ.

“మీరు కూడా ఏంటి చిన్న పిల్లల్లాగా ఈ ఆటలు. పదండి తొందరగా తెమలండి అందరం గుడికి వెళదాం” అంటూ పార్వతి పరిమళతో “ఏమే నువ్వు ఆడపిల్లవి, మగపిల్లలతో సమానంగా ఏంటి ఈ ఆటలు, త్వరగా ముఖం కడుక్కొని రెడీ అవు” అంటూ కాఫీ కలుపుకొని హాల్లోకి వస్తున్న పార్వతికి అప్పుడే లోనికి వస్తున్న దినకర్ డాష్ ఇచ్చాడు. కాఫీ గ్లాసులు కింద పడిపోయాయి. అవేమి పట్టించుకోని పార్వతి “నీ మీదేమైయినా కాఫీ పడిందా నాన్నా” అంటూ అడిగింది దినకర్‌తో.

“లేదు పెద్దమ్మ నా మీదేమి పడలేదు, నేనే పొరబాటున మీకు డాష్ ఇచ్చాను. సారీ పెద్దమ్మా” అన్నాడు దినకర్ .

“ఎవరొస్తున్నారో చూసుకోవక్కరలేదా” అంటూ రుసరుసలాడుతూ వచ్చిన మంగ, “పద స్నానం చేద్దుగాని” అంటూ కొడుకుని చెయ్యి పట్టుకొని గదిలోకి లాక్కెళ్ళింది. ‘మంగ ఎవర్ని అన్నదీ’ అనుకుంటూ మళ్ళీ కాఫీ కలపడానికి లోనికి వెళ్ళింది పార్వతి.

***

లోకనాధం పార్వతి దంపతులు ఆ ఇంటి పెద్దలు. వాళ్లకి ఇద్దరు కూతుర్లు, పరిమళ, హరిణి. చిన్నతనంలోనే తల్లి తండ్రులు పోవడంతో తమ్ముడు ముకుందాన్నీ తనే డిగ్రీ వరకు చదివించి తనకు తోడుగా ఉంటాడని మేనత్త కూతురు మంగతో పెళ్లి చేసి వాళ్ళని తన దగ్గరే ఉంచుకుని ఇద్దరూ కలిసి పొలం పనులు చేసుకోసాగారు. వాళ్లకి దినకర్, దయాకర్ ఇద్దరు కొడుకులు.

చెల్లెలు పావనిని కంటికి రెప్పలా పెంచి మేనత్త కొడుకు గిరీశాన్నిచ్చి పెళ్లి చేశారు లోకనాధం దంపతులు. గిరీశానికి ఎక్కువ చదువు లేకపోవడంతో, వీళ్ళ దగ్గరే వుండి అందరూ కలిసి పొలం పనులు చేసుకుంటున్నారు. చెల్లెలు పావని భర్తకి ఇక్కడ ఉండడం ఇష్టం లేక పోయినా తన పరిస్థితి బాగా లేకపోవడంతో సర్దుకుపోతున్నాడు. వాళ్ళ కొడుకు శరత్ డిగ్రీ పూర్తి చేసాడు, కూతురు కీర్తి ఇంటర్ చదువుతోంది .

మూడు కుటుంబాలతో ఆ ఇల్లు ఎప్పుడూ కళకళ లాడుతూ ఉంటుంది. ఏ పండగొచ్చినా, శుభకార్యం వచ్చినా ఎవరికీ ఏ లోటూ లేకుండా అందరికి బట్టలు కొని అందరూ సంతోషంగా ఉండేటట్లు నెట్టుకొస్తూ ప్రేమ, ఆప్యాయతలకు, బంధాలు అనుబంధాలకు విలువలనిస్తూ అందరిని సమానంగా చూస్తూ ‘ఉమ్మడి కుటుంబం’ అంటే ఇలావుండాలి అనేలా వాళ్ళ యోగక్షేమాలు చూస్తూ, అది తమ బాధ్యతగా భావించి కలసిమెలసి వుంటున్నారు లోకనాధం దంపతులు. తరతరాల నుంచీ ఆ కుటుంబంలో దగ్గర సంబంధాలు చేసుకుంటూ అందరూ కలిసిమెలిసి వుంటున్నారు, అలాగే పరిమళకి కూడా శరత్‌తో సంబంధం కలుపుకోవాలని వుంది లోకనాధం దంపతులకి. మరదలు, తోడికోడలితో కలివిడిగా ఉంటూ వాళ్ళని తోబుట్టువులాగా చూసుకుంటూ ఉంటుంది పార్వతి.

***

రోజులన్నీ ఒకేలాగా ఉండవు కదా. ఉన్నట్లుండి అకాల వర్షాలతో వరుసగా రెండు పంటలు దెబ్బ తినడంతో, కేవలం వ్యవసాయం మీద మాత్రమే ఆధారపడిన ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితులలో చిక్కుకుంది. పండగలకు పిల్లలకు తప్ప పెద్దలకు బట్టలు కుట్టించలేని పరిస్థితి. ఎప్పుడు పిండివంటలతో ఘుమ ఘుమ లాడే వంటగది మామూలు వంటలకే పరిమితమయ్యింది.

అవకాశం కోసం ఎదురుచూస్తున్న గిరీశం ఆలోచనలు పక్కదారి పట్టాయి. ఇదే అదనుగా తాను భార్యా పిల్లలతో బయటకువెళ్లాలని నిర్ణయానికి వచ్చాడు. అది విన్న పావని అర్థం కానట్టు చూసింది.

“ఏంటా చూపులు, నేననేది నిజమే. మనం బయటకు వెళదాం, మా బంధువు ఒకాయనకి బాగా పలుకుబడి వుంది, వాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీలో మన శరత్‌కి జాబ్ ఇప్పిస్తానన్నాడు. ఇక్కడుంటే మీ అన్న వాడిని కూడా పొలం పనులకే పంపుతాడు. నా క్లాసుమేట్ రవికి ఒక్కతే కూతురు, బాగా డబ్బు, రాజకీయ పలుకుబడి వున్నవాడు, నేనంటే ప్రాణం. మొన్న వాడు కలసి వాళ్ళ అమ్మాయిని శరత్‌కి చేసుకుంటావా అని అడిగాడు”.

“వాడికి వేరే సంబంధం చూడడం ఏమిటండి? మొదటినుంచి వాడు పరిమళని ఇష్టపడుతున్నాడు. అన్నయ్యవాళ్ళు కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలనే ఆలోచనలో వున్నారు”.

“ఆ సంగతి నాకూ తెలుసు. కానీ ఇక్కడ ఉంటే పెళ్లి అవుతుందేమో గాని వాడి బ్రతుకు బాగుపడదు. యూనివర్సిటీ పట్టా పుచుకున్న నా కొడుకు మేనరికం చేసుకొని ఈ పల్లెటూళ్ళో మగ్గిపోవడం నాకిష్టం లేదు. మనమూ అందరిలా పెద్ద సిటీలో సెటిల్ అయ్యి, వాడికి మంచి జాబ్ వచ్చాక మంచి బంగ్లా కొనుక్కొని, కారు కొనుక్కోని ఆ జీవితాన్ని అనుభవించాలి”.

“ఇన్నాళ్లు పెంచి పెద్ద చేసి మనతో అంత బంధుత్వం పెంచుకున్న అన్న వదిన ఏమనుకుంటారు, ఒక్కసారి ఆలోచించండి. పైగా పరిమళ మంచిపిల్ల, దానితో పెళ్ళయితే శరత్ కూడా సుఖపడతాడు”.

“చూడు పావనీ ఈ బంధాలు, బంధుత్వాలు మనసుకి సంతోషాన్నిస్తాయి కానీ సమాజంలో గౌరవం కానీ హోదా కానీ ఇవ్వలేవు. అవి కావాలంటే డబ్బు కావాలి, డబ్బు కావాలంటే పట్నం పోయి మనవాడు మంచి ఉద్యోగం సంపాదించి, ఉన్నత కుటుంబంలో వున్న అమ్మాయితో పెళ్లి జరిపించాలి, అప్పుడుకాని మనం బాగుపడం, మీరు దీనికి ఒప్పుకుంటే అందరం కలిసి వెళదాం, లేదంటే నేను ఒక్కడినే వెళ్ళిపోతాను, వెళ్ళానంటే మళ్ళీ తిరిగి రాను, ఇది నా నిర్ణయం” అంటూ బయటకు వెళ్లి పోయాడు గిరీశం.

భర్త అన్నంత పని చేసే మనిషే. ఇదివరకు ఒకసారి ఇంట్లోంచి వెళ్ళిపోతే అన్నగారు వెతికి తీసుకుని రావడం గుర్తుంది. ఈ వయసులో ఆయన లేకుండా పిల్లలతో అన్నగారి పంచన ఉండడానికి మనస్కరించలేదు పావనికి. అన్నయ్య పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. చేసేది లేక గిరీశం మాటకు తల ఒంచింది. శరత్‌కి కూడా అక్కడనుంచి వెళ్లడం ఇష్టం లేదు. పరిమళని చూడకుండా ఉండలేనని తల్లికి చెప్పాడు. బలవంతాన శరత్‌ని కూడా ఒప్పించింది పావని.

ఈవార్త విన్న లోకనాధం అచేతనంగా పడక్కుర్చీలో కూలపడి పోయాడు. గిరీశానికి ఎంతో సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు.

“నేను ఇలా చేస్తున్నానని వేరుగా అనుకోవద్దు బావా. ఇక్కడ వుండి నేను, నా భార్యా పిల్లలు మీకు భారం కాకూడదనుకుంటున్నా. ఈ ఇంటి పరిస్థితులు కూడా బాగాలేవు కదా.”

“మీరు నాకు భారం ఏమిటి గిరీశం? మీరు, అని మాట్లాడతావేంటి? అందరం ఒక్కటే” అన్నాడు లోకనాధం బాధగా.

పార్వతి కూడా గిరీశానికి, పావనికి ఎంతో చెప్పడానికి ప్రయత్నించింది.

“బయటకు వెళ్లి ఏంచేస్తావ్. సరైన చదువుకూడా లేదు, పొలం పని తప్ప ఏమి చేయగలవు నువ్వు” అన్నాడు లోకనాథం.

“నా ఫ్రెండ్ ఒకతను నేను బిజినెస్ చేసుకోవడానికి సహాయం చేస్తానన్నాడు.. నువ్వు ఏమీ అనుకోకపోతే..” అంటూ నీళ్లు నమిలాడు గిరీశం.

“ఏంటో చెప్పు” అన్నాడు రంగనాధం పడకకుర్చీలోనుంచి లేస్తూ.

“మా పెళ్లప్పుడు నా కిచ్చిన పొలం నాకివ్వండి. పనికి రాని పొలం మీద ఎన్నాళ్ళు ఆధారపడతాం, అది అమ్మి ఏదయినా వ్యాపారం చేసుకుంటాను” అన్నాడు గిరీశం.

“వ్యాపారం చేస్తావా, పొలాన్ని ముక్కలు చెయ్యాలా” బాధగా అన్నాడు లోకనాధం.

“తప్పదన్నయ్యా. ఎన్నాళ్లని ఈ వర్షాల మీద ఆధారపడి పంటని నమ్ముకుంటాం. ఆయన ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ, శరత్‌కి కూడా వుద్యోగం వస్తే, వాళ్ళిద్దరి పెళ్లిళ్లు చేస్తే బాధ్యత తీరిపోతుంది” అంది పావని.

“అదేంటమ్మా అలా అంటావు, శరత్ పెళ్లి చెయ్యడం మీ బాధ్యత ఏమిటి, వాడికి మన పరిమళని ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాము కదా” అన్నాడు రంగనాధం.

“వాడి పెళ్లి సరే అన్నయ్యా, ముందు ఆడపిల్ల బాధ్యత తీర్చుకోవాలి కదా” అంది మాట మారుస్తూ.

“మిమ్మలిని నేను బయటకు వెళ్ళమన్నట్లు మాట్లాడుతున్నావేంటి గిరీశం? మనమంతా ఒక్కటే. ఇప్పటి వరకు కలసి మెలసి వున్నాం, కలో గంజో కలిసి తాగాం. ఇన్నాళ్లు వున్న బంధాలని తెంచుకొని వెళ్లి పోతావా” బాధగా అన్నాడు లోకనాధం.

“అన్నయ్యా, ఆయన చెప్పేది నిజమే, చిన్నప్పటినుంచి నన్ను, పెళ్లయ్యాక ఆయనతో పాటు పిల్లల్ని నువ్వు వదిన కళ్ళలో పెట్టుకుని చూసుకున్నారు. దానికి మేము మీకు ఏమీ ఇవ్వలేక పోతున్నాం. అందుకే కొంచం నీకు బరువు దించుదామని ఈ నిర్ణయానికి వచ్చాం. బాధ్యత అంతా నీమీద వేసి నీకు బరువుగా ఉండడం నాకూ ఇష్టం లేదు. మా పిల్లల బాధ్యత కూడా నీమీద వదిలెయ్యడం న్యాయం కాదు. అందుకే బయటకువెళ్లి నీకు కొంచెం బరువు దగ్గిద్దాం అనేదే మా ఉద్దేశం తప్ప మరే ఆలోచన లేదన్నయ్యా, దయ చేసి మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు. వదినా నువ్వయినా చెప్పు అన్నయ్యతో” అంది తనకి ఇష్టం లేకున్నా భర్తని సమర్థించాలని.

“మీ ఇష్టం” అంటూ కుర్చీలో కూలపడి పోయాడు లోకనాధం. మంచి రోజు చూసుకుని గిరీశం, భార్యా పిల్లలతో వెళ్లి పోయాడు.

***

గిరీశం వెళ్లిన దగ్గరనుండి ముకుందానికి భార్య మంగ సాధింపు ఎక్కువయ్యింది. “వాళ్ళ దారి వాళ్ళు చూసుకున్నారు. మనం మాత్రం ఈ ఇంట్లో పడి ఉండాలా. మీకు మొదటి నుండీ చెబుతున్నాను మనం బయటకు వెళదామని, ఏం! మీరేమన్నా పావని భర్తలా చదువురాని వాళ్ళా, మీ చదువుకి ఓ ఉద్యోగం రాదా. పుట్టినప్పటినుంచి పట్నం అంటే ఏంటో తెలియక ఓ మారుమూల పడి వున్నాం, మన కాలంలో అంటే సరిపోయింది. మనమే కాదు మన పిల్లలకి కూడా ఈ పల్లెటూరి వాతావరణం అలవాటయి పోతుంది, హాయిగా వాళ్ళనయినా పట్నంలో మంచి స్కూల్లో చేర్పించి అందరిలాగా మనము పట్నం జీవితం గడుపుదాం”.

“మంగా! ఆ మాత్రం నాకు తెలియదా. చిన్నప్పటినుంచి నన్ను పెంచి పెద్ద చేసిన అన్నా, వదినలని వదలి ఎలా వెళ్ళగలం. ఇన్నాళ్లు హాయిగా సంతోషంగా వుండి, ఇప్పుడు పంటలు పండక కష్టాల్లో వున్న సమయంలో వాళ్ళని ఇలా వదలి ఎలా వెళతాం”.

“మీరెన్నయినా చెప్పండి, మనం ఇక్కడినుండి పట్నం వెళ్లి పోవాల్సిందే. వాళ్ళతో బంధాలు పెంచుకున్నాం అంటున్నారు, అది బంధం ఎలావుతుంది. పెంచి పెద్ద చెయ్యడం పెద్ద వాళ్ళగా అది వాళ్ళ బాధ్యత. అది సాకుగా చూపి జీవితాంతం వాళ్లకి చాకిరీ చేస్తూ బతకాలా”.

“మంగా! ఏమిమాట్లాడుతున్నావ్, వాళ్ళకి చాకిరీ చెయ్యడం మేమిటి. ఏ పనయినా అందరం కలసి చేసుకుంటున్నాం కదా?”

“ఆ ఇప్పటి వరకు బాగానే వుంది. మీకంటే మీ అన్న ఎనిమిదేళ్లు పెద్ద. ఇంకొన్నాళ్ళు పోతే ఆయన ఏ పనీ చెయ్యలేడు, ఇంటి బాధ్యత, పొలం బాధ్యత అంతా మీ మీదే పడుతుంది”.

“ఏంటి మంగా అలా మాట్లాడతావ్”.

“బావగారికి మీరు చెప్పలేక పోతే నేనే చెబుతాను” అంటూ విసురుగా బయటకు వస్తున్న మంగతో పాటూ ముకుందం కూడా అన్నగారి దగ్గరికి వచ్చాడు.

ముకుందం మాటలు విన్న లోకనాధం “చివరికి నువ్వు కూడా మమ్మల్ని వదిలి వెళ్లాలనుకుంటున్నావా ముకుందా! అంత అపరాధం నేనేమి చేసాను” అంటూ ఆవేదనగా తమ్ముడి చేతులు పట్టుకున్నాడు.

“అయ్యో అంతమాట అనవద్దు అన్నయ్యా! మా కోసం నువ్వు రెక్కలు ముక్కలు చేసుకుంటున్నావు, మా అందరి బాధ్యత నీ మీదే వేసుకున్నావు. వ్యవసాయం సరిగ్గా సాగక అప్పులతో నువ్వెంత బాధపడుతున్నావో అర్థం చేసుకోగలను. అందుకే మా భారమయినా కొంచం తగ్గిద్దామని ఈ నిర్ణయం తీసుకున్నా” అన్నాడు ముకుందం

“పర్వాలేదు ముకుందా, రోజులెప్పుడు ఒకేలా వుండవు కదా, మళ్ళీ మనకు మంచిరోజులు వస్తాయిరా. అందాకా ఉన్నది తింటూ సర్దుకుందాం” అభ్యర్థనగా అన్నాడు లోకనాథం.

“సర్దుకు పోవాల్సిన అవసరం మాకు లేదు బావగారూ” అని ఇంకా ఏదో మాట్లాడబోతున్న మంగని ఆపి, “నువ్వుండు, నే మాట్లాడుతున్నాను కదా” అన్నాడు ముకుందం.

“అన్నయ్యా! దాని మాటలు పట్టించుకోకు, నన్ను పెంచి పెద్దవాణ్ణి చేసావు. పిల్లలింకా చిన్న వాళ్ళే కదా, నువ్వు చదివించిన చదువుతో ఏదో చిన్న వుద్యోగం చేసుకుంటాను” అన్నాడు ముకుందం.

“ముకుందం, నిన్ను చిన్నప్పటినుంచి తమ్ముడిలా చూసాను. నిన్ను కాని నీ భార్యా పిల్లలని కాని మీ అన్నయ్య కూడా ఏనాడు ఓ పల్లెత్తు మాట అనలేదు. అలాంటిది మీరు ఇక్కడనుంచి ఎందుకు వెళ్లి పోవాలనుకుంటున్నారో తెలియదు” అంది పార్వతి.

“అంతమాట అనకు వదినా. మీరిద్దరూ నాకు దైవంతో సమానం. కన్న బిడ్డలకి వారు కోరుకున్న జీవితం అందించే బాధ్యత నాకుంది కదా.”

“సరే ముకుందా మీ ఇష్టం. మీరు ఎప్పుడు తిరిగివచ్చ్హినా నాకు సంతోషమే” అంటూ పడక కుర్చీలో కూలపడ్డాడు లోకనాధం బాధతో.

***

టీవీలో వార్తలు చూసి బయటకువచ్చి, ఆరుబయట పడక కుర్చీలో కూర్చున్న పార్వతిని చూసి, “ఏంటి పార్వతి? ఒక్కదానివే కూర్చుని ఏమి ఆలోచిస్తున్నావు” అన్నాడు లోకనాధం.

“ఒక్కదాన్నే కాక ఇంకెవరున్నారండి నాకు తోడు – మీరు తప్ప” అంది కుర్చీలోంచి లేవబోతూ.

“కూర్చో పార్వతి” అంటూ పక్కనున్న నులక మంచం కుర్చీ దగ్గరగా లాక్కుని కూర్చుంటూ – “ఏమైంది?” అన్నాడు.

“నిన్నటిదాకా కళకళలాడిన ఇల్లు ఎలా బోసిపోతోందో చూడండి” అంది లోకనాధం భుజం మీద తల ఆనించి వెక్కి వెక్కి ఏడుస్తూ.

“బాధపడకు పార్వతి” అని కంటి నీరు తుడిచి, “తప్పదు పార్వతీ, వీటన్నిటినీ ఎదుర్కోవలసిందే” అన్నాడు అనునయిస్తూ.

“ఒకప్పడు ప్రతిరోజు మన ఇల్లు పండుగలా ఉండేది, పండుగనాడయితే ఊరంతా మనింట్లో వున్నంట్లుండేది. ఒక విధంగా వూరు వారి దిష్టి తగిలిందేమో మన కుటుంబానికి. అంతగా కలసిమెలసి ఉన్న మనం ఎందుకు విడిపోవలసి వచ్చిందో అర్థం కాదు” అంది పార్వతి.

“కాల మహిమ పార్వతి, రోజులన్ని ఒకలాగుండవు కదా” అన్నాడు లోకనాథం.

“అదికాదండి. చిన్నప్పటినుండి పెద్ద చేసి పెళ్లి చేసి, వాళ్ళతో బంధాలని పెంచుకుని, అనురాగాలని పంచుకొని సంతోషంగా ఉంటే, వాళ్ళు ఇన్ని సంవత్సరాల తరువాత అలాంటి నిర్ణయం తీసుకొని వెళ్లడం చాలా బాధగా వున్నదండీ” అంది పార్వతి.

“పార్వతి అలా చూడూ” అంటూ ఆకాశం వైపు చూపించి, “చంద్రుడు ఎంత ప్రకాశవంతంగా వెలిగిపోతున్నాడో చూడు, చుట్టూ వున్ననక్షత్రాలు మిలమిల మెరిసిపోతున్నాయి చూసావా” అన్నాడు.

“అవునండి, అయితే?” ప్రశ్నార్థంగా చూసింది భర్త వైపు పార్వతి.

“ఆ కళకళలాడే చంద్రుడే మనిద్దరం అనుకో, చుట్టూ ఉన్న నక్షత్రాలు మన పిల్లలు, తోబుట్టువులు, బంధువులు అనుకో. కొంచంసేపయ్యాక ఏమవుతుంది? నక్షత్రాలు కనుమరుగై పోతాయి, చంద్రుడు ఒక్కడే మిగులుతాడు, మరి కొన్ని రోజులయ్యాక చూడు, వెలిగిపోతున్న చంద్రుణ్ణి కూడా చీకటి ఆవరిస్తుంది”.

“ప్రకృతికే తప్పని ఈ మార్పులు మనమూ అన్వయించుకోవాలి పార్వతి, చీకటి తరువాత వెలుగు, వెలుగు తర్వాత చీకటి ఎలాగో, జీవితంలో వచ్చే మార్పులూ అంతే, వాటికి మనం అలవాటు పడాలి కానీ మనకోసం అవి మారవు కదా, ఆ ప్రకృతికి తప్పని మార్పు మనకి రావడంలో ఆశ్చర్యం ఏముంది. జీవితం కూడా అంతే. బంధాలు బంధుత్వాలు ఏవి శాశ్వతం కాదు. మనం బంధాలని బాధ్యతలనుకుని మాత్రమే చూడాలి. లేకుంటే అవి బంధనాలుగా మిగిలిపోతాయి. ఆ బాధ్యత అయిపోయాక నిర్ణయం వాళ్ళకే వదిలెయ్యాలి, రేపు మన పిల్లలయినా అంతే. అన్నిటికి అలవాటుపడాలి, తప్పదు ఆ పైవాడు ఆడించే నాటకంలో మనం పాత్రధారులం మాత్రమే.

బాధపడకు పార్వతి, వీటన్నిటినీ కాలమే పరిష్కరిస్తుంది. చూడూ! బాధ్యతలకు మనుషులు దూరమయినా బంధాలే వాళ్ళని మళ్ళీ కలుపుతాయనే నమ్మకం నాకుంది. కొన్న్ని రోజులు గడిచాక ఆ నక్షత్రాలు మరలా చంద్రుని దగ్గరకి చేరకుండా ఉంటాయా. ఆ రోజు కోసం ఎదురుచూడడం తప్ప మనమేమీ చేయలేము, పద పొద్దు పోయింది పడుకుందాం” అంటూ పార్వతి భుజం మీద చేయివేసి లోనికి తీసుకువెళ్లారు లోకనాధం గారు.

Exit mobile version