బంగారు నాన్న

1
2

[dropcap]‘బం[/dropcap]గారు నాన్న’ ఇది సామాన్యంగా తల్లి తండ్రులు తమ కొడుకును ముద్దు చేస్తూ వాడే పదం. కానీ ఒక అరవై ఏళ్ళు పైబడిన మహిళ తన ఎనభై ఏళ్ల పండు ముసలి తండ్రి తలను తన ఒడిలో పెట్టుకుని ఆయన జుట్టుని ప్రేమతో నిమురుతూ – ‘మా బంగారు నాన్న’ అంటూ మురిసి పోతున్నఅపురూప దృశ్యం చూసిన ఎవరికైనా కళ్ళు చెమర్చుతాయి.

ఈ అపురూపమైన దృశ్యం చాలా ఏళ్ల తర్వాత కలిసిన నా చిన్ననాటి స్నేహితురాలు శాంతి ఇంట్లో చూసాను. వాళ్లిద్దరిని అలా చూసిన ఎవరికైనా ఒక తల్లి కళ్లలో ఎంత వాత్సల్యం ఉంటుందో అది శాంతి కళ్లలో ఆ క్షణం లో కనిపించింది అంటే అతిశయోక్తి లేదని అంటాను.

ప్రస్తుతం శాంతి తండ్రి అవసరాలను చూసుకుంటూ ఎల్.ఐ.సి.లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటోంది. కొన్ని ఏళ్ల బట్టి వాళ్లిద్దరే ఆ ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు శాంతి తండ్రి అయిన వెంకటాచలంగారి స్వార్జితం. అన్ని వసతులతో బాటు పూల మొక్కలతో ఉన్న తోట చూడముచ్చటగా ఉంటుంది. వెంకటాచలం గారు ఎనభై ఏళ్ల తర్వాత సైతం ఆరోగ్యంగా ఉండి ఎవరిపైనా ఆధార పడకుండా తన పనులు తాను చేసుకుంటూ

జీవితం జాగ్రత్తగా గడుపుతున్నారు. డబ్బు విషయంలో గానీ నిత్యవసారాలకు గానీ ఒకరిపై ఆధారపడకుండానే ఉండటానికి కావల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఒకప్పుడు ఆ ఇల్లు ఆయన భార్యా పిల్లల్తో కళకళలాడుతూ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ ఇల్లు ఆ తండ్రి కూతుళ్లిద్దరితో బావురుమంటోంది.

***

వెంకటాచలం భార్య పేరు సుమంగళి, పేరుకి తగినట్టుగానే మంచికళతో ఉండేది. వారికి ఐదుగురు సంతానం. ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు. ఆడా మగా అనే తేడా లేకుండా అందరికీ సమానంగా చదువులు చెప్పించారు వెంకటాచలం. తల్లితండ్రుల నుంచి వారసత్వంగా పిల్లలకు మంచి సంస్కారం అబ్బింది. ఈ సంస్కారం తల్లి తండ్రుల సాంగత్యములో ఉన్నంత వరకే. పిల్లలు రెక్కలొచ్చి బైట ప్రపంచంలోకి వెళ్లిన తర్వాత ఎవరి దారి వారిదే ఆన్నట్టు తయారయ్యారు.

పెద్ద కొడుకు రోహిత్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. వెంకటాచలం గాని సుమంగళి గానీ అభ్యంతరం చెప్పలేదు. ఐతే జీవితంలో స్థిర పడిన తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పారు. అలాగే అన్నాడు రోహిత్. అమెరికా వెళ్లి అక్కడే స్థిర పడ్డాడు. ఇంట్లో మొదటి శుభకార్యం కావడంతో ఏలోటూ లేకుండా రోహిత్ వివాహం ఘనంగా చేశారు.

వెంకటాచలం దంపతులు కూడా అమెరికా వెళ్లి కొన్ని రోజులు కొడుకు, కోడలితో గడిపి వచ్చారు. కానీ ముసలితనంలో తనకు అండగా ఉండాల్సిన పెద్ద కొడుకు దూరమయ్యాడని ఆయన ఏనాడు బాధపడలేదు. పిల్లలు ఎవరి అభీష్ఠం మేరకు వారు తమ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. పిల్లలపై మన ఇష్టాలు మోపి వారిని కట్టి పడేయకూడదన్నది వెంకటచలం గారి భావన.

ఇక రెండోవాడు రాహుల్. అతను ఎం.కామ్ చేసి హైదరాబాద్‌లో ఉద్యోగంలో చేరాడు. మంచి సంబంధాలు రావడంతో అతనికి పెళ్లి చేశారు. తర్వాత ఇద్దరు ఆడపిల్లలు – శాంతి, నిర్మల. చిన్నవాడు రఘు. శాంతి మిగిలిన వారందరికి భిన్నమైన ఆలోచనలు కలిగినది. బాగా చదువుకుని ఉద్యోగం చేసి తండ్రి రిటైర్ అయిన తర్వాత తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలనేది ఆమె ఆలోచన. ఈ ఆలోచనను సామాన్యంగా మగపిల్లలనుంచి ఆశిస్తారు తల్లిదండ్రులు. పెద్దవారైనా ఇద్దరు కొడుకులకు అటువంటి ఆలోచన రాలేదు. వెంకటాచలం దంపతులకు ఆ అవసరం కూడా అనిపించలేదు.

ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి చేయగల ఆర్థిక స్తోమత ఉన్నవారే వెంకటాచలంగారు. రెండోవాడి పెళ్లి తర్వాత శాంతి కోసం సంబంధాలు చూడటం మొదలు పెట్టారు ఆయన. శాంతి తన మనసులో మాట చెప్పకుండా తాను ఇంకా చదువుకుంటానంటూ సంబంధాలు తిరగ్గొట్టింది. కొన్ని మంచి సంబంధాలు కూడా శాంతి ఏ కారణమూ చూపకుండా వద్దనటంతో వెంకటాచలం దంపతులు ఆందోళన చెందారు. తల్లి సుమంగళి ఒక రోజు శాంతిని కూర్చోపెట్టి గట్టిగా అడిగింది. ఇంకా పెద్ద చదువులు చదువుతానన్న సమాధానమే శాంతి నుంచి వచ్చింది.

ఇలా ఉండగా నిశ్చలంగా ఉన్న నీటిలో రాయి వేస్తే నీరు మొత్తం అల్లకల్లోలమైనట్టు వెంకటాచలం గారి ప్రశాంతమైన జీవితంలో అనుకోని ముప్పు వచ్చి పడింది. ఒక రోజు ఉదయం సుమంగళి మంచం మీదనుంచి లేవలేక పోయింది. ఎంత సుస్తి చేసినా ఏనాడూ మంచం పట్టని సుమంగళి ఎంత ప్రయత్నం చేసినా లేవలేకపోయింది. వెంకటాచలంగారు చాలా కంగారు పడిపోయారు. దగ్గర్లో ఉన్న లేడీ డాక్టర్ని రప్పించి చెకప్ చేయించారు. ఆమె న్యూమొనియా లక్షణాలు ఉన్నాయి, హాస్పిటల్‌లో చేర్పిచండీ అని చెప్పారు. ఏనాడూ ఒక జ్వరం కూడా తెలియని సుమంగళిని ఆస్పత్రిలో చేర్చాలి అనటంతో వెంకటాచలంగారికి ఏం పాలు పోలేదు.

ఇంట్లో శాంతీ, నిర్మలా చిన్నవాడైయిన రఘుని చూసుకుంటే వెంకటాచలం గారు ఆస్పత్రిలో సుమంగళిని అంటిపెట్టుకుని ఉండిపోయారు.

ముందు న్యుమోనియా అన్న డాక్టర్లు సుమంగళికి వేరే పరీక్షలు చేయడం మొదలు పెట్టారు. మొదట హైదరాబాదులో ఉన్న రెండో కొడుకూ, కోడలు తర్వాత అమెరికాలో ఉన్న కోడూకూ, కోడలూ వచ్చారు కబురు తెలిసి. కొడుకూ, కోడళ్లను చూసుకోడానికే అన్నట్టు నిలబడిన సుమంగళి ప్రాణం వాళని కళ్లారా చూసిన తర్వాత హారతి కర్పూరంలా ఆరిపోయింది.

ఊహించని దెబ్బకు వెంకటాచలం నిలువునా కూలిపోయారు. చిన్నవాడు రఘూతో సహా అందరినీ ఓదార్చే బాధ్యత పెద్ద కొడుకులా పెరిగిన శాంతిపై పడింది. సుమంగళి మరణవార్త విన్న బంధువులు వచ్చారు. తల్లి పోయిన పిల్లల్ను ఓదార్చారు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా తల్లిని రప్పించలేరు కదా. పెద్ద కర్మ అనంతరం అంతా వెళ్లిపోయారు. మొన్న మొన్నటి దాకా సుమంగళి కాళ్ల పట్టీలు, గాజుల సవ్వడితో కళకళ లాడిన ఇల్లు ఇప్పుడు దుఃఖ సముద్రంలోకి జారిపోయింది

పెద్ద కొడుకు అమెరికాకు, చిన్న కొడుకు హైదరాబాదుకు బయిలదేరుతూ తండ్రిని- ‘ఇక ముందు ఎలా’ అని అడిగారు. శాంతి తల్లికి వంటలో సాయం చేస్తూ ఉండేది కాబట్టి భోజనం సమస్య అంతగా లేదు. అవసరం అనిపిస్తే వంట మనిషిని పెట్టుకోవచ్చు. కొన్నాళు మార్పుగా ఉంటుంది… తమతో రమ్మని అడిగారు. అంతా కూర్చుని చర్చించుకున్న తర్వాత శాంతి, నిర్మల రెండో కొడుకు రాహుల్ దగ్గరికి వెళ్లారు, చిన్న కొడుకు రఘుని వెంటబెట్టుకుని. వెంకటాచలం పెద్ద కొడుకు రోహిత్‌తో కలిసి అమెరికా వెళ్లారు. వెంకటాచలం గతంలో ఒకసారి భార్యను వెంటబెట్టుకుని అమెరికా వెళ్లారు. ఈసారి ఆమె లేని లోటు స్పష్టంగా ఉండటంతో ఆయన మనస్సు తరుక్కు పోయింది. అక్కడికి వెళ్లిన కొన్నాళ్లకే మనస్సు ఇంటివైపుకు లాగుతోంది. కొడుకు కోడలు ఉద్యోగాలకి వెళ్లాక వెంకటాచలంకి ఏం చేయటానికి తోచేది కాదు. రఘు వీడియో గేమ్స్ తో టి.వి తో కాలక్షేపం చేస్తున్నాడు.

ఎక్కువ రోజులు అక్కడ ఉండలేక ఇండియాకి తిరిగి వచ్చేశారు. మరునాడే కూతుళ్లు శాంతి, నిర్మలా హైదరాబాద్ నుంచి వచ్చేశారు. ఏం మాట్లాడినా ఎదుటవారికి తల్లిని గుర్తుచేసి బాధ పడతారో అని ఎవరికి వారు మితంగా మాట్లాడి రోజువారీ పనులు చేసుకు పోతున్నారు.

పెళ్లి అంటే మొదటి నుంచీ విముఖత చూపుతున్న శాంతి, తాను, చెల్లి నిర్మలా ఇద్దరూ పెళ్లి చేసుకుని వెళ్లిపోతే ఇంట్లో ఆడదిక్కు ఉండదని భావించి, ఎవరు పెళ్లి ప్రస్తావన తెచ్చినా ఏదోలాగా అడ్డు పడుతోంది. వెంకటాచలం ఎన్నిసార్లు శాంతిని కూర్చోబెట్టి నచ్చ చెప్పినా శాంతి మాత్రం పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోలేదు .

“నువ్వు పెళ్లి చేసుకోకపోతే లోకం నన్ను అంటుందే… నా స్వార్థంతో నీకు పెళ్లి చేయలేదని అంతా అంటారు. నీ పెళ్లి అవకుండా నిర్మలకి మాత్రం ఎలా పెళ్లి చేస్తాను చెప్పు.” అన్నాడు తండ్రి.

“నిర్మలకి మంచి సంబంధం వస్తే నాతో వంతు పెట్టుకోకుండా చేసేయండి.” అని ఖచ్చితంగా చెప్పేసింది శాంతి .

“నేనూ నిర్మల పెళ్లి చేసుకుని వెళ్లిపోతే, మీ సంగతి ఏమిటీ చెప్పండి? రోహిత్ దగ్గర ఉంటారా, రాహుల్ దగ్గర ఉంటారా?” అంటూ తిరిగి ప్రశ్నిచింది .

“దానికి ఇంకా చాలా సమయం ఉందమ్మా. ముందు నువ్వు పెళ్లి చేసుకోటానికి ఒప్పుకుంటే తర్వాత మిగతావన్నీ….”

ఇటువంటి సంభాషణ ఎన్నిసార్లు జరిగినా శాంతి మాత్రం తన మనసు మార్చుకోలేదు. ఇక చేసేదిలేక నిర్మలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసేశారు వెంకటాచలం. కొత్తల్లో ఒకటి రెండుసార్లు పుట్టింటికి వచ్చివెళ్లింది నిర్మల. తర్వాత అత్తా, మామ,పెళ్లి కావల్సిన ఆడపడుచు లతో సతమతమవుతూ నిర్మల పుట్టింటికి రావటం రానురాను తగ్గి పోయింది.

ఇంజనీరింగ్లో జాయిన్ అవడానికి రఘు నాగ్పూర్ వెళ్లిపోయాడు. ఇంట్లో మిగిలింది శాంతి, వెంకటాచలం. ఆయన కూడా ఈ మధ్యనే రిటైర్ అయ్యారు. పెన్షన్ చేతికి అందటం మొదలయింది.

ఉద్యోగానికి వెళ్లినంత కాలం ఆయనకు బాగానే కాలక్షేపం ఉండేది. ఇప్పుడు ఖాళీగా ఉండటంతో ఇల్లాలు లేని లోటు బాగా తెలుస్తోంది .

శాంతి ఎల్.ఐ.సి పరీక్షలు రాసి ఉద్యోగంలో చేరింది. ఉదయమే టిఫిన్, భోజనం తయారు చేసి, తండ్రి కోసం అన్నీ రెడీగా డైనింగ్ టేబుల్ పై పెట్టి, తాను తొమ్మిదో గంటకల్లా ఆఫీస్‌కి బైల్దేరి వెళ్తుంది. సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వస్తుంది. అప్పటివరకూ కాసేపు గార్డెనింగ్ పని, కాసేపు పేపర్ చదువుకుంటూ, మ్యాగ్జైనులు తిరగేస్తూ, టి‌వి చూస్తూ గడిపేస్తారు. పిల్లల బాధ్యతలు తీరిపోయాక సుమంగళితో కలిసి మన దేశములో చూడవల్సిన ప్రదేశాలు చూసి వద్దామనుకున్నారు. ఆవిడ లేకపోవటంతో ఆయనలో ఆ కోరిక కూడా చనిపోయింది .

మధ్యలో ఒకసారి పెద్ద కొడుకు దగ్గరికి. మరో రెండు సార్లు చిన్న కొడుకు దగ్గరికి వెళ్లి వచ్చారు. ఇప్పుడు ఇద్దరి ఇళ్లలో మనవలు, మనవరాళతో బాగానే కాలక్షేపం అవుతోంది. కానీ పట్టుమని పదిహేను రోజులు మించి ఎక్కడా ఉండలేకపోతున్నారు. స్వతహాగా మంచి తెలివి, చురుకుదనం ఉండటంతో ఒక కాలేజ్‌లో పార్ట టైమ్ లెక్చరర్గా జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఆయనకు కాలం గడపటం పెద్ద కష్టంగా లేదు.

శాంతికి ఉద్యోగం, ఇంట్లో పనులతో తీరిక ఉండటం లేదు. సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చేసరికి వెంకటాచలం టీ‌ పెట్టి ఇస్తారు. ఇద్దరు గార్డన్‌లో కూర్చుని టీ‌ తాగటం పూర్తి ‌అయ్యాక శాంతి స్నానం చేసి వంట పనికి ఉపక్రమిస్తుంది. ఇలా జరిగి పోతున్నాయి రోజులు వారిద్దరికి.

ఎక్కువ కాలం కలిసి ఉండటం వల్ల తండ్రి కూతుళ్ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే శాంతికి ఆఫీస్ ఉన్నప్పుడు తప్ప మిగతా సమయంలో అరగంట కనిపించక పోయినా ‘శాంతీ… శాంతీ….’ అంటూ ఇల్లంతా వెతుకుతారు వెంకటాచలం. శాంతి వచ్చి “ఏమైంది నాన్నా ఏమైనా కావాలా?’’ అని అడిగితే

“చాలా సేపైంది కనిపించి. ఎక్కడ ఉన్నావా అని పిలిచాను’’ అంటారు.

శాంతికి చెప్పుకోతగ్గ స్నేహితురాళ్లు ఎవరూ లేరు. ఒకప్పుడు కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ పెళ్లిళు చేసుకుని స్థిర పడిపోయారు. అక్కడ నిర్మల మనసు అక్కని నాన్నని చూడాలని ఆరాట పడేది. కానీ అత్తా మామల వయస్సు పెరుగుతున్న కొద్ది నిర్మల పై ఆంక్షలు పెట్టడం ఎక్కువ అయి వదిలేవారు కాదు. ఒక వేళ ఏదోవిధంగా భర్తను ఒప్పించి పుట్టింటికి వచ్చినా రెండు మూడు రోజులకే అత్తకు బాగోలేదనో, మామగారు కళ్లు తిరిగి పడిపోయారనో కబురు వచ్చేది. వెంటనే నిర్మల తిరుగు ప్రయాణం అవ్వక తప్పేది కాదు.

ఏనాటి అనుబంధమో లేక ఈ జన్మ రుణమే తీర్చుకుంటున్నదో తన జీవితం తండ్రికి అంకితం చేసుకుని ఉండి పోయింది శాంతి. ఈ లోగా ఇంజినీరింగ్ పూర్తి చేసి తాను కూడా ఎం.ఎస్. చేస్తానంటూ పెద్దన్నయ్య రోహిత్ అడుగుజాడల్లో అమెరికా వెళ్లిపోయాడు రఘు కూడా. నాన్న ఒంటరితనాన్ని బాగా ఎరిగిన వాడు రఘు. వాడైనా పెళ్లి చేసుకుని తమ దగ్గరే ఉంటే ఇంటికి పోయిన కళ వస్తుందని ఆశ పడ్డారు వెంకటాచలం. కానీ అతను కూడా అమెరికా వెళ్లటానికి పట్టుబట్టేసరికి వెంకటాచలం ఏం చేయలేక ఊరుకున్నారు .

శాంతి రఘుని కూర్చోబెట్టి నచ్చచెప్పటానికి ప్రయత్నిచింది. కానీ రఘు తన నిర్ణయాన్ని మార్చుకోటానికి ఇష్ట పడలేదు. వెంకటాచలం నిర్లిప్తంగా ఊరుకున్నారు. పిల్లలు అమెరికా వెళ్ళి పోవడానికి కారణం తల్లి తండ్రుల బాధ్యతలనుంచి తప్పించుకోవటానికి కాదు కదా. అలాగని పిల్లల అభివృద్ధికి ఎప్పుడు అడ్డు పడలేదు వెంకటాచలం.

విదేశాలకు వెళ్లి బాగా డబ్బు, అనుభవం సంపాదించుకుని వయసు మళ్లిన తల్లి తండ్రులకు తోడుగా ఉండాలని వెనక్కి వచ్చిన వారు కూడా లేక పోలేదు. కానీ అలాంటి అదృష్టం అందరికీ ఉండొద్దూ?!

కొడుకుల మీద ఆశలు పెట్టుకోవటం వృథా అని వెంకటాచలం ఎప్పుడో గ్రహించారు. సుమంగళి బతికి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. తన అదృష్టాన్ని పరీక్షిస్తున్నట్టు శాంతికి పెళ్లి పట్ల విముఖత కలిగించాడా దేముడు? లేక ఎలాగూ శాంతి తనను చూసుకుంటునది కదా అని ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవాల్సిన కొడుకులు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారా. న్యాయంగా శాంతి కూడా పెళ్లి చేసుకు వెళిపోతే వీరు ఏంచేద్దురు? ఏమో మరి!

వెంకటాచలం కాలక్షేపం కోసం, ఆరోగ్యం కోసం యోగా చేసేవారు, సీనియర్ సిటిజన్ క్లబ్‌లో జాయిన్ అయ్యారు.

కాలం ఎవరి కోసం ఆగదు. మొన్నటి వరకు పెళ్లి చేసుకోమని అంటూండగానే శాంతికి రిటైర్మెంట్ వయసు వచ్చింది. అటు వెంకటాచలం ఎనభై దాటారు. ఇప్పటి వరకు ఇద్దరు డిసిప్లిన్డ్ జీవితం గడిపారు. వెంకటాచలంకి ఎలాంటి చెడు అలవాట్లు లేవు కనుక ఆయన శరీరం ఆయనతో సహకరిస్తోంది. ఈ మధ్యే ఆయన త్వరగా అలసి పోతున్నారు.

ఇన్నాళూ ఆఫీస్ పని, ఇంటి పని చూసుకుని రిటైర్ అయిన తరవాత శాంతి కొంత కాలం బాగానే ఉంది. తర్వాత ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తండ్రీ కూతురు కలిసి అమెరికా అంతా తిరిగి వచ్చారు. కొడుకూ, కోడలు తమ దగ్గర ఉండి పొమ్మని అడుగుతారని ఆశించారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. అన్నయ్య రోహిత్‌ను, వదినను కూర్చోబెట్టి అడిగింది,

“అన్నయ్యా, నాన్న పెద్దవారు అయిపోయారు, రాను రాను నాన్నకి స్వంత పనులు చేసుకునే ఓపిక తగ్గిపోతున్నది. అప్పుడు మీరు కూడా వెంట ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఎలాగూ లాగించాను. నాక్కూడా ఓపిక తగ్గిపోతున్నది. నువ్వూ రిటైర్ అయ్యావు. ఇండియా తిరిగి వచెయ్య కూడదూ?”

“ఎలా వీలవుతుంది శాంతి? పిల్లలకు ఇక్కడి వాతావరణం అలవాటై పోయింది. వాళ్ల చదువులు, పెళ్లిళ్లూ సగంలో వదిలి ఇండియాకు ఎలా వచ్చేయమంటావు చెప్పు. అయినా రాహుల్ ఉండేది హైదరాబాదు లోనే కదా.. అవసరానికి వెంటనే రాగలడు కదా? పోనీ నాన్నను ఇక్కడే ఉండి, గ్రీన్ కార్డ్‌కి అప్లై చేస్తానంటే ఒప్పుకోవడంలేదు.“ అన్నాడు రోహిత్ .

వాళ్లకు తన బాధ ఎలా చెప్పుకోవాలో అర్థం కాలేదు. అంతటితో సంభాషణ ఆపేసారు. పెద్దన్నయే ఇలా అంటే ఇంక మిగతా ఇద్దరిపై ఆశలు పెట్టుకోవడం వృథా అనిపించిది. తను కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి ఉంటే వీళ్లు ఏం చేద్దురో. తను సింగల్‌గా ఉండటాన్ని తన అన్నదమ్ములు తమకు అనుకూలంగా ఎంత బాగా వాడుకుంటూన్నారో కదా అనిపించింది. రాహుల్ ఉండేది హైదరాబాదులోనైనా తమ దగ్గరకు వచ్చి ఉన్నది తక్కువే. రాహుల్ భార్య తరుచూ ఏదొక అనారోగ్యంతో బాధ పడుతూ ఉంటూంది. అలాంటిది ఆమె తమ దగ్గరకు వచ్చి తోడుగా ఉంటుందని ఆశించటం అనవసరం.

అటు అత్తగారికి ఇష్టం ఉన్నా లేకపోయినా నిర్మల అప్పుడప్పుడు వచ్చి తమను చూసి వెళ్లటం తప్ప ఏం చేస్తుంది? నిర్మల పెళ్లి విషయంలో తను తొందర పడ్డాడా అని బాధ పడేవారు వెకటాచలం. పిల్లల్ని కని పెంచటం దాకానే కానీ వాళ్ల అదృష్టాలు మన చేతుల్లో లేవు కదా.

నిర్మల, శాంతి ఆలోచించి తమ ఇంట్లో ఒక పోర్షన్ కాలేజ్‌లో చదువుకుంటున్న అబ్బాయిలిద్దరికి అద్దెకు ఇచ్చారు. ఇద్దరూ బంధువుల పిల్లలే. ఎలాంటి అవసరమైనా పిలిస్తే పలుకుతారని అద్దె కూడా ఎక్కువ పెట్టలేదు. నమ్మి పెట్టుకునందుకు ఇద్దరు కుర్రాళూ వినయంగానే ఉన్నారు. శాంతి ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే ఇద్దర్లో ఒకరు వెంకటచలంకి తోడుగా కూర్చుండే వారు.ఇప్పుడు శాంతికి కొంత ధైర్యం వచ్చింది.

వయసు మీద పడుతున్న కొద్దీ వెంకటాచలానికి ఏ జబ్బులు లేకపోయినా బలహీనంగా ఉండి బాత్ రూమ్‌లో పడిపోయారు. ఆ సమయంలో అద్దెకున్న కుర్రాళ్లను పిలిస్తే వచ్చి సాయం చేసి లేవనెత్తారు. ఆస్పత్రికి తమతో పాటూ వచ్చి అన్ని టెస్టులు చేయించారు. ఏమీ లేదు, ఏజ్ ప్రాబ్లం తప్పితే అన్నారు డాక్టర్లు.

***

చాలా సంవత్సరాల తర్వాత నేను మా ఊరు వైజాగ్ వెళ్లాను. చిన్ననాటి స్నేహితురాలు ఇంకా మునపటి ఇంట్లో ఉంటోందని తెలిసి కలవటానికి వెళ్లాను. పదిసార్లు కాలింగ్ బెల్ కొట్టిన తర్వాత పెరటి తలుపు తీసుకుని బైటకి వచ్చిన శాంతి నన్ను గుర్తు పట్టి వీధి తలుపు తీసింది. వెంకటాచలం పడుకుని ఉన్న గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. శాంతి పరిచయం చేస్తే నన్ను గుర్తు పట్టారు. మనిషి దబ్బపండులా ఉన్నారు.

శాంతి తండ్రి గురించి చెబుతోంది. “ఐదు నిముషాలు నేను కనిపించక పోతే శాంతీ…. శాంతీ… అంటూ కేకలు వేస్తారు. ఆయన ఎదుట కూర్చుని కబుర్లు చెప్పమంటారు. ఏమీ తోచదు. టి‌వి చూడటం మానేసారు.’’ అని నాతో చెబుతూ తండ్రి తలను ఒడిలోకి తీసుకుని – ‘మా బంగారు నాన్న‘ అని ముద్దుగా, ప్రేమగా తల నిమిరింది.

అలా మేం మాట్లాడూకుంటూంటే ఆయన నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. శాంతీ నేను ముందు హాల్లోకి వచ్చాం. తన గురించి, తన కుటుంబం గురించి అంతా చెప్పింది శాంతి.

నేను అడిగాను- “నీకు అనుకూలమైన వారు… మీ ఇంట్లోనే ఉండగలిగిన వారిని ఎవరినైనా పెళ్లి చేసుకోలేకపోయావా? ఈ వయసులో నీకు తోడు ఉండేది. ప్రపంచంలో అందరూ చెడ్డవారు కాదు కదా?’’

“అవును అలాంటి సంబంధాలు కూడా వచ్చాయి, తెలిసిన వారి ద్వారానే. కానీ ఎవరూ వారి ఫ్యామిలీస్‌ని వదిలి వచ్చి మా దగ్గర ఉండిపోడానికి ఇష్ట పడలేదు.” అంది శాంతి .

ఇంకొద్ది సేపు కూర్చుని వికలమైన మనసుతో తిరిగి వస్తున్న నాకు ఒకటే ఆలోచన. ఈ మాత్రం దానికేనా కొడుకులు కావాలని కోరుకుంటారు. అయినా కొడుకులు అందరూ శాంతి అన్నదమ్ముల్లాగా ప్రవర్తిస్తారని అనుకోవటం కూడా తప్పే .

శాంతిని పెళ్లి మానేయమని ఎవరూ ప్రోత్సహించలేదు కదా. అది పూర్తిగా తన నిర్ణయమే. అయినా వయసు మీద పడి ఒక్కర్తి చేసుకోలేక అన్నా, వదినల దగ్గర సాయం ఆశించటం తప్పు కాదు కదా?

అప్పుడు తన ఒక్కర్తి నిర్ణయమే కాబట్టి ఇప్పుడు తమకి ఏ బాధ్యత లేనట్టు అన్నదమ్ములు ప్రవర్తించటం న్యాయమేనా?

***

రెండేళ్లకి మళ్లీ నేను వైజాగ్ వెళ్లినప్పుడు శాంతి ఎలా ఉందో అనుకుంటూ మరునాడే వాళ్ల ఇంటికి వెళ్లాను. ఇంట్లో కొత్తవాళ్లు కనిపిస్తే, వాళ్లు చెప్పారు. ఆ ఇల్లు అమ్మేసి, తండ్రి కూతురిద్దరూ సింహాచలం కొండపై స్వామివారి గుడికి దూరంగా ఒక వానప్రస్థాశ్రమంలో చేరిపోయారని.

చూసివద్దామని అక్కడికి వెళ్లాను. కొండపై ఆహ్లాదకరమైన ప్రకృతి మధ్య విశాలమైన ప్రదేశంలో చిన్న కాటేజెస్ కట్టి ఈ ఆశ్రమం నడుపుతున్నారు. అనుమతి తీసుకుని శాంతి కాటేజ్ కనుక్కుని వెళ్లాను.

శాంతి మొహంలో నాకు ఒక సంతృప్తి కనిపించింది. ఇల్లు అమ్మేసినప్పుడు వెంకటాచలం సంతానం అందరూ వచ్చారు. ఎవరికి ఎంత ఇవ్వాలో పంచేసి తనకంటూ కొంత భాగం అట్టేపెట్టుకుని ఇద్దరూ ఈ ఆశ్రమంలో చేరి సంవత్సరం అయిందిట. ఆస్తి పంపకం అప్పుడు ఎవరూ ఏం గొడవ పెట్టలేదు, కానీ ఆశ్రమంలో ఎందుకు, మా దగ్గర వచ్చి ఉండండి అని ఎవరు ముందుకు రాలేదుట.

ఏది ఏమైనా శాంతి ముఖంలో ఆత్మ విశ్వాసం చూసి తాను తీసుకున్న నిర్ణయం నాక్కూడా సమంజసంగా అనిపించింది. వారిని చూస్తే నిశ్చింతగా ఉన్నారనిపించింది .

వయసు మళ్లిన వారికి కావల్సిన సదుపయాలన్నీ ఉన్నాయి అక్కడ. మూడు పూటలు సమయానికి ఆరోగ్యకరమైన ఆహారం పెడుతున్నారు. మధ్యలో ఏ ఊరైనా తిరిగి రావాలంటే దానికి తగ్గ సదుపాయం కూడా ఉంది. అంతా తమ వయసు వారే కనుక కాలక్షేపానికి కొరత లేదు. ముఖ్యంగా శాంతి ఇక ఒంటరిగా లేదు ఎలాంటి అవసరం వచ్చినా.

ఈ సారి ఆ దేముడే శాంతికి సరైన దారి చూపించాడన్న సంతృప్తితో నేను తిరిగి వచ్చాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here