Site icon Sanchika

బెంగుళూరు ఆలయాలు

[dropcap]బెం[/dropcap]గుళూరును ఎన్నిసార్లు చూసినా ఏదో కొత్తదనం కనపడుతూనే ఉంటుంది. ఎన్ని చూసినా చూడనివి ఎన్నో కనిపిస్తూనే ఉంటాయి. నేను పెద్ద మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్, ప్రసిద్ధ హస్పిటల్స్, షాపింగ్ మాల్స్ బాగా చూశాను. ఇస్కాన్ టెంపుల్ తప్ప గుడులు పెద్దగా చూడలేదు. ఇస్కాన్ టెంపుల్ కూడా చాలా ఏళ్ల క్రితం చూశాను. ఏమీ గుర్తులేదు. అయితే ఇప్పుడు మా బాబు బెంగుళూరులోనే ఉండి చదువుకుంటున్నాడు. కాబట్టి నెలకు, రెండు నెలలకు ఒకసారి రావాల్సి వస్తుంది. మొత్తం బెంగుళూరును జల్లెడ పట్టేయాలి అనుకున్నాను. అది కూడా సులభమేమీ కాదని అర్థమైంది. అంతకు ముందు టూర్‌లో వచ్చినపుడు ఆ నాలుగు రోజుల్లో ఎన్ని చూడగలుగుతాములే అని ముఖ్యమైనవి మాత్రమే చూశాము. ఇలా ఏదో వంక అనుకున్నాము కానీ రోజూ ఇక్కడే కాపురముంటున్నా వీకెండ్స్‌లో మాత్రమే బయటకు వెళ్ళగలుగుతున్నాము. అంటే ఎప్పుడు వ్యవహారాలు అప్పుడే. ఇప్పుడు బెంగుళూరులో సంవత్సరన్నర నుంచి ఉన్నప్పటికీ రెండు మూడు నెలల నుంచి మాత్రమే బయటకు వెళుతున్నాం. మా బాబు ఒక ఆదివారం సాయంత్రం కాస్త ముందుగా హాస్పిటల్ నుంచి వచ్చాడు. ఈ రోజు ఇస్కాన్ టెంపుల్‍కి వెళ్ళాం రాజాజీ నగర్ లోని ఇస్కాన్ టెంపుల్‍కి చేరే సరికి 7.30  అయింది. 8.30 కు మూసేస్తారని చెపితే హడావిడిగా వెళ్ళాం చాలా మెట్లు ఎక్కి వెళ్ళ వలసి వచ్చింది. ఇక్కడి ధ్వజ స్తంభం బంగారం పూతతో చేయబడినది. 56 అడుగుల ఎత్తున్నఈ ధ్వజ స్తంభం దగ్గర నిలబడి ఫోటో తీసుకున్నాం. ఎన్నో మెట్లు ఎంతో నడక తర్వాత ముఖ్యమైన ఆలయంలోకి చేరాం. చాలా చోట్ల ఫోటోలు తీసుకున్నాం. ఎవరూ అభ్యంతర పెట్టలేదు. ప్రధాన మందిరం గోల్డెన్ టెంపుల్‌లా బంగారంతో చేసినట్లుగా ధగద్ధాయమానంగా ప్రకాశిస్తోంది. ఎదురుగా రాధాకృష్ణులు, శ్రీనివాస గోవిందుడు, బల రామకృష్ణుల విగ్రహాలు వర్ణ మనోహరంగా, ఆకర్షణీయమైన రూపాలతో కంటికింపుగా ఉన్నాయి. మేము దర్శనం చేసుకుంటూ ఉండగానే పల్లకి సేవ మొదలౌతుంది అని చెప్పారు. అన్ని భాషల్లోనూ భగవద్గీత పుస్తకాలు దొరుకుతున్నాయి. వాటిని చూస్తుండగా అక్కడ ఒక భక్తుడు పరిచయం చేసుకోని మాట్లాడాడు. అతనొక న్యూరాలజిస్ట్ అట. ఉద్యోగం వదిలేసి స్వామి సేవలో మునిగిపోయాడట. చాలా ఆశ్చర్యం అనిపించింది. మాకు పల్లకీ సేవను దగ్గరుండి చూపించాడు. పూజారులు నృత్యం చేస్తూ పల్లకీ సేవలో పాల్గొన్నారు. ఎక్కడిక్కడ సైన్ బోర్డులు ఉండడంతో తికమక పడకుండా బయటి కొచ్చాం. స్వచ్ఛమైన తీపి పదార్థాలు. హోటళ్ళు హరే రామ హరే కృష్ణ వాళ్ళే నడిపిస్తున్నారు. రాధాకృష్ణుల అద్భుతమైన చిత్రాలు, పటాలు, పెయింటింగులు ఎన్నో రకాలుగా దొరుకుతున్నాయి. రెండు కీ చైన్లు, రెండు రాధాకృష్ణుల బొమ్మలు కొనుక్కుని బయటకు రాబోతుండగా వేడి వేడి పొంగల్‌ను ప్రసాదంగా పెట్టారు. మెట్లెక్కి బాగా నడిచామేమో పొంగల్‌ను చూడగానే ఆవురావురుమంటూ తినేశాం.

మరో రోజు మళ్ళీ గుళ్ళు చూసే పనిలో పడ్డాం. ముందుగా రాజ రాజేశ్వర దేవాలయం చూడాలని అనుకున్నాం. చాలా పెద్ద గుడి. వాకిట్లోనే పెద్ద ఏనుగు ప్రతిమ ఉన్నది. లోపలకు వెళితే పెద్ద లైనే ఉన్నది. ఇరవై నిమిషాల తర్వాత దర్శనం లభిచింది. అమ్మవారి ఎదురుగా సింహం ప్రతిష్ఠించి ఉన్నది. చుట్టూ అమ్మవారి అవతారాలు ఉన్నాయి. రాజరాజేశ్వరీ అమ్మవారు చిరునవ్వుతో మందన్మిత వదనమై అభయమిస్తోంది. గర్భగుడి కన్నా ముందుగా ఉన్న గోడపై ఒక వైపు లక్ష్మి దేవి, మరొక వైపు సరస్వతి దేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు. గోపురాలపై రంగులు వేసిన శిల్పాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ దేవాలయం మైసూరు రోడ్డులో రాజరాజేశ్వరీ నగర్‌లో ఉన్నది. ఇది బెంగుళూరు నగరంలోని పురాతన ప్రసిద్ధ ఆలయం. ఆలయ ఆవరణలో మూడు నాలుగు గుళ్ళు, గోపురాలు కనిపిస్తున్నాయి. ఆవరణ మాత్రం చాలా విశాలంగా, పెద్దదిగా ఉన్నది. ఈ గుడి ఎంతో బాగున్నది.

ఇక్కడ నుంచి దొడ్డ గణపతి, దొడ్డ బసవన్న దేవాలయాలు చూడటానికి వెళ్ళాం. రెండు దేవాలయాలు పక్కపక్కనే ఉన్నాయి. ముందుగా చెప్పులు స్టాండ్‌లో పెట్టి గుడిలోకి అడుగు పెడుతూనే ఫోటో దిగాం. నాలుగు మెట్లు ఎక్కగానే రూమ్ మొత్తం నిండిపోయి ఉన్న గణేశుడి శిల్పం కనిపించింది. ఇక్కడ ఫోటోలు తీసుకోవచ్చు. నేను హారతి తీసుకొని బొట్టు పెట్టుకున్నాను. ఈ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ అయ్యాక తీర్థం, ప్రసాదం పెడుతున్నారు. తీర్థం మామూలుగానే ఉన్నది కానీ ప్రసాదమే అర్థం కాలేదు. చిన్న ఆకు కప్పులో పెట్టినపుడు మెత్తని క్రీములాంటి స్వీటు అనుకున్నాం. తిన్నాక గానీ తెలియలేదు అది ‘వెన్న’ అని. నేనింత వరకు వెన్నను ప్రసాదంగా పెట్టిన గుడిని చూడలేదు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. శ్రీ కృష్ణుడు పుట్టిన మధురనూ చూశాను. ఉడిపిలోని శ్రీ కృష్ణ మందిరాన్ని దర్శించాను. ఒరిస్సా లోని సాఖి గోపాల్ ఆలయాన్ని చూశాను. ఎక్కడా వెన్నను ప్రసాదంగా పెట్టలేదు. ఇక్కడ గణేషుని ఆలయంలో వెన్న ప్రసాదాన్ని ఆనందంగా తిన్నాము.

బుల్ టెంపుల్ అని పేరున్న దొడ్డ బసవన్న గుడి ఇక్కడే అన్నారు కదా వెతుకుతున్నాను. పెద్ద నంది విగ్రహం ఆరు బయట స్థలంలో ఉన్నట్లుగా చెప్పారు. అక్కడ కనిపించక అడిగాను. “ఆ మెట్లెక్కి పైకి వెళితే బసవన్న కనిపిస్తాడు” అని అక్కడి వాళ్ళు చెప్పగా అటు వైపు నడిచాను. ఎత్తుగా కొండలాగా ఉన్నది. మెట్లెక్కి పైకి వెళ్ళాను. పెద్ద ధ్వజ స్తంభం కనిపిస్తున్నది. ఇది కూడా చాలా విశాలమైన ఆవరణే. పెద్ద మర్రి చెట్టు ఊడలతో ఉన్నది. ఇంకా చుట్టూ ఉద్యానవనం ఉన్నది. ధ్వజ స్తంబం దాటి లోపలి అడుగుపెడితే ఒక గుడి కనిపించింది. అక్కడ దొడ్డ బసవన్న ఆలయం అనే బోర్డు కనిపించింది. పెద్ద నందిని గుడిలో పెట్టి బంధించినట్లుగా అనిపించింది.

తీర్థం తీసుకొని చుట్టూ ప్రదక్షిణ చేశాము. భారతదేశంలో ఉన్న అతిపెద్ద నంది విగ్రహాలలో నేను రెండు మూడు చూశాను. ఇప్పుడు ఈ నందీశ్వరుడిని చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా అనిపిచింది.

అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంటి దారి పట్టాము. దారిలో ‘గోవర్ధన క్షేత్రం’ అనే పెద్ద కొండలాంటి ప్రాంతం కనిపించింది. దాదాపు ఐదంతస్థుల భవనమంత ఎత్తుగా కొండల్ని పేర్చినట్లుగా నిర్మించారు. చాలా అద్భుతమనిపించింది. లోపలికి వెళ్ళాను. అంతా పద్మవ్యూహంలా ఉన్నది. రాళ్ళ మధ్య నుంచి నడుస్తున్నట్లుగా పద్మవ్యూహం ఆశ్చర్య చరితుల్ని చేసింది. లోపల చిన్ని కృష్ణుడు కొలువై ఉన్నాడు. రాళ్ళ లాంటి గోడల నిండా కృష్ణ లీలల చిత్రాలు చెక్కబడి ఉన్నాయి. అపూర్వమైన ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించిన ఈ గోవర్ధన క్షేత్రాల విచిత్రనుభూతిని మిగిల్చింది. మరో శివాలయాన్ని సందర్శించాను. అన్ని చోట్లా లింగంగా దర్శనమిచ్చే శివుడు ఇక్కడ పార్వతిదేవితో మానుష రూపంలో కొలువై ఉన్నాడు. ఇక్కడ ఫోటోలకు అభ్యంతరం లేకపోవడంతో తనివితీరా ఫోటోలు తీసుకున్నాం. మరోసారి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం!

Exit mobile version