బ్యాంకింగ్ రంగం – నియమావళి

0
2

బాసెల్ – అంతర్జాతీయ ఒప్పందం – ‘బాసెల్-III’

[dropcap]బ్యాం[/dropcap]కింగ్ రంగంలో నిరంతర పర్యవేక్షణ, క్రమబద్ధీకరణ, రిస్క్ మేనేజ్‍మెంట్ వంటి అంశాలకు సంబంధించిన మార్గదర్శకాలతో 2009లో ఒక ప్రచురణ వెలువరించబడింది. ప్రపంచ వ్యాప్తంగా (ఒప్పందంలో భాగస్వామ్య దేశాల) అన్ని బ్యాంకులకూ ఆ మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో ఆచరణలోనికి తీసుకురావటానికి మూడు సంవత్సరాల వరకూ వ్యవధి నిర్ణయించటం జరిగింది. పరపతి సంక్షోభం, ద్రవ్యనిల్వలు, లివరేజి రేషియో వంటి అంశాలకు సంబంధించిన ముందు జాగ్రత్త చర్యలన్నీ కమిటీ ప్రస్తావనలో ఉన్నాయి.

ప్రపంచీకరణ ఫలితంగా సేవలు, వాణిజ్యం, పెట్టుబడులు, ద్రవ్య వినిమయం/సరఫరా వంటివన్నీ స్వేచ్ఛగా జరిగిపోతున్నాయి. అటువంటి వాతావరణంలో ఇటువంటి అంతర్జాతీయ ఒప్పందాలు తప్పనిసరి అవుతాయి.

అమెరికాలో రోజుల తేడాలో సంక్షోభంలో 3 బ్యాంకులు – నిండా ముంచిన నైరూప్య కరెన్సీ:

ఒక దశలో ఈ క్రిప్టో కరెన్సీ వేల్యూ శరవేగంతో పెరుగుతూ వచ్చింది. అమెరికా లోని సిగ్నేచర్ బ్యాంక్ 2019 నుండి ఈ డిపాజిట్లను కూడా అనుమతించింది. 2022 నాటికి ‘సిగ్నేచర్’ లోని డిపాజిట్లలో ‘క్రిప్టో డిపాజిట్స్’ 30 శాతానికి చేరుకున్నాయి. అనంతర పరిణామాలలో సిగ్నేచర్ తన క్రిప్టో డిపాజిట్లను 8 బిలియన్ డాలర్లకు పరిమితం చేయాలని డిసెంబరు నెలలో ప్రకటించింది కూడా. అయితే అప్పటికే ఆలస్యం అయింది. ఖాతాదారులు తమ క్రిప్టో డిపాజిట్లను విత్‌డ్రా చేసుకోవడం మొదలుపెట్టారు. అది సిగ్నేచర్ దివాలాకు కారణం. ‘సిల్వర్ గేట్ బ్యాంక్’ దీ అదే కథ.

సిలికాన్ వేలీ బ్యాంక్:

దీనికి 40 సంవత్సరాల చరిత్ర ఉంది. అయినప్పటికీ ఈ బ్యాంక్ ఖాతాదారులలో 93% డిపాజిట్స్‌కి బీమా కవరేజ్ లేకపోవడం ఆశ్చర్యకరమే. ఈ బ్యాంకు పనితీరు మరీ ఆశ్చర్యకరం. బ్యాంకింగ్ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఈ బ్యాంకు స్వల్పకాలిక వ్యవధి డిపాజిట్లను దీర్ఘకాలిక ఋణాలకు మళ్ళించింది. మన దేశంలోని ‘నైకా’ అనుబంధ విభాగాలకు సైతం S.V.B. లో 64 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నాయి. అయితే ఈ విషయంలో మాత్రం యు.ఎస్. ప్రభుత్వం అనూహ్యంగా స్పందించింది. ఈ రెండు బ్యాంకుల డిపాజిట్‍దార్లకు వారి డిపాజిట్లకు ఫూర్తి రక్షణ ఉంటుందని ప్రకటించింది. ఫెడరల్ రిజర్వ్ సిఫార్సులను అందుకున్న అమెరికా ఆర్థిక శాఖ అధ్యక్షుడితో సంప్రదించి దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

ఏదైనా బ్యాంక్ దివాలా/నష్టం కు గురైతే వెంటనే ఒక బ్రిడ్జ్ బ్యాంక్‍ను ఏర్పాటు చేసి దివాలా తీసిన బ్యాంకు తాలూకు ఆస్తులన్నింటినీ ఆ బ్యాంకు బదిలీ చేసిన తరువాత పరిష్కార మార్గం చూడటం అమెరికాలో ఆనవాయితీ. ఆ చర్యల వల్ల బ్యాంకులో మరిన్ని అవకతవకలు, అక్రమాలు కొనసాగకుండా అడ్డుకట్ట పడుతుంది.

అక్కడి దివాలా పరిష్కార ప్రక్రియ ప్రకారం F.D.I.C (Federal Deposit Insurance Company) నుండి బీమా కవరేజ్ ఉన్న డిపాజిట్ల లోనూ 2.5 లక్షల డాలర్ల వరకే సొమ్ము డిపాజిట్‍దారులకు వెనక్కు వస్తుంది. ఆ పరిమితిని దాటి ఉన్న డిపాజిట్ సొమ్ము నష్టపోవాల్సిందే. అయితే దిద్దుబాటు చర్యలలో భాగంగా బీమా పరిమితి 2 లక్షల 50000 డాలర్లు, అంతకు మించి డిపాజిట్స్ ఉన్నవారు కూడా తమ తమ నగదును ఉపసంహరించుకొనేందుకు వెసులు కల్పిస్తూ ప్రకటన జారీ చేశారు. 2023 మార్చ్ 13 నుండే ఈ ఉపసంహరణకు వెసులు కల్పించారు. డిపాజిట్లు సురక్షితంగా ఉంటాయని సాక్షాత్తు యు.ఎస్. అధ్యక్షుడే హామీ ఇవ్వటం విశేషం.

ఉపసంహరణ ప్రక్రియలో నగదు లభ్యత సమస్య తలెత్తకుండా అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ – 2.5 బిలియన్ డాలర్లతో తాత్కాలిక నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

అయితే నిధుల ఉపసంహరణ అమెరికాలో ఇప్పటికే ఉన్న ద్రవ్యోల్బణం సమస్యను మరింత తీవ్రతరం చేసే అవకాశమూ లేకపోలేదు. మళ్ళీ ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి మరిన్ని చర్యలు చేపట్టవలసి ఉంటుంది. ఇవన్నీ గొలుసుకట్టు పరిణామాలు.

భారతదేశంలో:

ద్రవ్య వినిమయ వ్యవహారాలన్నిటినీ ఆర్.బి.ఐ. నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది. స్పెక్యులేషన్ మార్కెట్‍లో పెట్టుబడులు పెట్టడానికీ బ్యాంకులకు పరిమితులుంటాయి. అన్ని బ్యాంకులు S.L.R ప్రకారం నగదు నిల్వలను ఉంచుకొని తీరాలి. ఈ నిల్వలు బంగారం, ప్రభుత్వ బాండ్లు, సెక్యూరిటీస్ వంటి వాటి రూపంలో ఉంటాయి. బ్యాంకులు తమ డిపాజిట్లతో కొంత శాతం ఆర్.బి.ఐ. దగ్గర ఉంచి తీరాలి. అదే సి.ఆర్.ఆర్. లేదా క్యాష్ రిజర్వ్ రేషియో. ఈ సి.ఆర్.ఆర్. 1990 లలో 15% వరకు ఉండేది. 2002లో యు.పి.ఎ. ప్రభుత్వం దానిని 5 శాతానికి తగ్గించింది. ఎన్.డి.ఎ. ప్రభుత్వం మరి కొంచెం తగ్గించింది. కాగా 2022 సెప్టెంబర్ నాటికి C.R.R 3 శాతానికి చేరింది.

అన్ని వాణిజ్య బ్యాంకులు డిపాజిట్లకు – డిపాజిట్ల ఉపసంహరణ డిమాండ్‍కు నడుమ సమతౌల్యం దెబ్బ తినకుండా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ద్రవ్యపరమైన స్థిరత్వం, ఋణాలు, కరెన్సీ వంటి అంశాల పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యత సైతం బ్యాంకులదే. మన దేశపు బ్యాంకులలో టర్మ్ డిపాజిట్స్‌లో 60% ప్రజల పొదుపు డబ్బే. మిగిలినవి ప్రైవేటు సంస్థల, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు. మన బ్యాంకులకు విదేశీ లావాదేవీలు చాలా తక్కువ. దేశీయ సంస్థల ఋణాలు, ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి వాటిలోనే వీటి పెట్టుబడులు తిరుగుతూ ఉంటాయి. పైగా మూలధన నిష్పత్తి సైతం ఆర్.బి.ఐ. నిబంధించిన 11% కంటే అన్ని బ్యాంకులలోనూ అంతో ఇంతో ఎక్కువే ఉంది.

గత సంవత్సరంలోనే చైనాలో బ్యాంకింగ్ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంది. అయితే ముందు జాగ్రత్తతో ఆ సంక్షోభం ముదరకుండా చైనా ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టింది. అయితే అనేక ఇతర అంశాల వలె చైనాలో అది అంతర్గత వ్యవహారంగానే అణిగిపోయింది తప్ప పెద్దగా వివరాలేవీ బయటకు రాలేదు.

అమెరికాలో బ్యాంకుల సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయం కావటానికి కారణం అమెరికాలో ప్రవాసుల సంఖ్య చాలా ఎక్కువ. సహజంగానే వారి పెట్టుబడులూ అక్కడ ఉంటాయి. సంక్షోభం ప్రభావం ఎవరెవరిపై పడుతుందోనన్న ఆందోళన సహజంగానే తలెత్తుంది.

క్రెడిట్ స్విస్ వంటి బ్యాంకులూ ఖాతాదారులకు చుక్కలను చూపిస్తున్నాయి. చాలా దేశాలలో బ్యాంకింగ్ రంగం ఆటుపోటులను ఎదుర్కుంటోంది. కరోనా సంక్షోభం – దాని నుండి కోలుకునే లోగానే ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అంశాలు వివిధ దేశాలలో ఆర్థిక వ్యవస్థలు సంక్షోభంలో కూరుకుపోవటానికి కారణం.

సేవలు, వాణిజ్యం, ద్రవ్య వినియమం, విద్య, అన్నీ ఎల్లలు లేని ప్రపంచంలోకి స్వేచ్ఛగా అందుబాటులోని రావటం స్థూల దృష్టికి చాలా ప్రయోజనకరంగానే కన్పిస్తూ ఉండవచ్చు. కాని ఇటువంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు వాటి ప్రభావానికీ దేశాలూ, ఎల్లలూ ఉండవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here