[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘బన్నారుగట్ట జూ పార్కు’ అనే రచనని అందిస్తున్నాము.]
[dropcap]బ[/dropcap]న్నారుగట్ట నేషనల్ పార్క్‌ను నేను దాదపుగా పాతికేళ్ళ క్రితం చూశాను. ఇది కర్ణాటక రాష్ట్రం లోని బెంగుళూరులో ఉన్నది. అప్పట్లో మేము నెలకోసారి రిలాక్సేషన్ కోసం బెంగుళూరు వచ్చేవాళ్ళం. పేషెంట్ల అనారోగ్య వాతావరణాల మధ్యనుండి చల్లని చెట్ల గాలుల కోసం బెంగుళూరు వచ్చేవాళ్ళం. అప్పుడు మా పిల్లలు మూడు, నాలుగేళ్ళ వయసుల వాళ్ళు. కాబట్టి వాళ్ళు సరదా పడాలంటే జూపార్కులే కదా. మా ఫ్రెండు వాళ్ళ ప్యామిలీతో కలసి బన్నారుగట్ట నేషనల్ పార్కుకు వెళ్ళాం.
అందరం ఒకే కారులో సర్దురుని కూర్చున్నాం. పెద్ద వాళ్ళం కారు లోపల కూర్చుని పిల్లల్ని డిక్కీలో బెట్టాం. డిక్కీ డోర్ ఎత్తేసి పిల్లల్ని కూర్చోబెడితే వాళ్ళ సందడే సందడి. ఇందులో మా ఫ్రెండ్ వాళ్ళమ్మాయికి పన్నెండు, పదమూడేళ్ళు ఉంటాయి. తను ఈ పిల్లల్ని జాగ్రత్రగా గమనించింది మిగతా ముగ్గురు పిల్లలు అరుపులతో కారు దద్దరిల్లిపోయింది. వెనక వచ్చే కార్లను చూస్తూనే కంపెనీ పేర్లను చెప్పటం ఒక ఆటగా ఆడుకున్నారు. మొక్కజొన్న కంకులు, ఐసుక్రీములు కొనుక్కుని తింటూ పిల్లలు నలుగురూ బాగా ఎంజాయ్ చేశారు. ఆ రోజు ఆటలాడిన ఈ నలుగురి పిల్లల్లో ఇద్దరు ప్రముఖ డాక్టర్లయ్యారు. మిగతా ఇద్దరూ టెక్నాలజీ రంగoలో ఎదిగారు.
అదుగో అప్పటి తర్వాత మరల ఇప్పడు చూస్తున్నాం. అప్పటికీ ఇప్పటికీ జూపార్క్ ఎంతో మారింది. అప్పట్లో మేము సఫారీ చూడలేదు. 2000 సంవత్సరం తర్వాతనే సఫారి తయారయ్యిందట. ఏ రాష్ట్రం వెళ్ళినా జూపార్కులు చూడటం నాకిష్టం. దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న అలీపూర్ జూపార్కును కోల్‌కతాలో చూశాను. అప్పుడు ఒక విషయం కూడా పుస్తకంలో రాశాను. అలీపూర్ జా చూసేందుకు లైన్లు చాలా పొడవుగా ఉన్నాయి. పక్కనే ఉన్న వంద ఏళ్ళ లైబ్రరీ మనుష్యులు లేక వెలవెల బోతున్నది. జoతువుల మీద ఉన్న ఆసక్తి పుస్తకాల మీద లేదని రాశాను.
దేశంలో రెండవ స్థానాన్ని ఆక్రమించిన నందన్ కానన్ జూలాజికల్ పార్కును భువనేశ్వర్‌లో చూశాను. ఈ పార్కు చూసినపుడు ఒక అనుభవం గుర్తుంది. నాలుగైదు రోజుల నుండి వరసగా దేవాలయాలు తిరుగుతూ ఉండటంతో అ పార్కు లోపలికి వెళ్ళిన కాసేపటికే అలసిపోయాను. ఇక ఒక్క అడుగు కూడా వెయ్యలేననిపించింది. అక్కడ ఒక ఉత చెట్టు కింద కూర్చుండిపోయాను. మా కుటుబం అoతా జూ చూడటానికి వెళ్ళారు. నేను మాత్రం అలసిపోయి ఉండటంతో చెట్టు కింద పడుకుని నిద్రపోయాను. గంట తర్వాత మా వాళ్ళు వచ్చి నిద్ర లేపేదాకా లేవలేదు. అదీ నందన్ కానన్ జ్ఞాపకం.
మైసూరు లోని జయ చాదురాజేంద్ర జూలాజికల్ ఏర్కును చూశాము గానీ చాలా త్వరగా చూసేసాము. ఎందుకంటే రవివర్మ ఆర్ట్ గ్యాలరీని చూసినపుడు నేను చాలా సమయం తీసుకున్నాను. అక్కడి వివరాలు రాసుకుందామని దాదాపు రెండు గంటల సమయం తీసుకున్నాను. అందుకే ‘జా’ లోపల తక్కువ టైముతో సరిపెట్టుకున్నాము. పూనే లోని రాజీవ్ గాంధీ జూలాజికల్ పార్కును చూడటం బాగా ఆనందాన్ని కలిగించింది. ఇక్కడ మా ఫ్రెండు వాళ్ళ కుటుంబంతో చూడటానికి వెళ్ళాను. వాళ్ళకు చిన్నపిల్లలున్నారు. అందుకే ‘జూ’ కు వెళ్ళాము. పిల్లలతో నడువలేమని కారు ఎక్కేశాం. ‘జూ’ మొత్తం తిప్పి చూపించారు. ప్రస్తుతం అంతరించిపోయిన ‘డోడో’ పక్షి వివరాలు ఇక్కడ పొందు పరచబడ్డాయి. ఇది ఫోటో తీసుకుని సంతోషపడ్డాను. నేను అప్పటికే అంతరించి పోయిన లేదా అంతరించి పోతున్న జంతువుల వివరాలతో ఛార్టులు తయారు చేయడం మొదలు పెట్టాను. అందుకే ‘రెడ్ డాటాలిస్ట్’ లో ఉన్న ‘డోడో పక్షి’ వివరాలు ఆనంద పరిచాయి. తలుపులు ఉండని కారులో కూర్చున్నాక మా ఫ్రెండు వాళ్ళ పాప మధ్యలో కూర్చోకుండా తలుపు వైపు కూర్చింది. తను పడుతుందేమోనని నేను తనను గట్టిగా పట్టుకున్నాను. తనకేమో అలా పట్టుకోవడం ఇష్టంలేదట. నా చేతులు తీసేస్తున్నది. నేనేమో మరల చేతులు వేస్తున్నాను. కాసేపటికి మా ఫ్రెoడు చెప్పింది. “తను జాగ్రత్తగానే కూర్చుంటుంది. మీరు భయపడవలసింది లేదు”. నాకేమో ఇంత చిన్నపిల్ల ఎలా జాగ్రత్తగా కూర్చుంటుంది. అన్నీ స్పీడు బ్రేకర్లే కదా! పడిపోతుందేమో అని భయం. మొత్తానికి ఇప్పటి పిల్లలు ఎంత తెలివిగా ఉంటున్నారో అనిపించింది.
ఇంకా నేను కమలా నెహ్రూ ప్రాణి సంగ్రహాలయ, గిండీ నేషనల్ పార్కు, వంటి అనేక దేశీయ జూ పార్కులతో పాటు అంతర్జాతీయంగా పేరు పొందిన క్రూగర్ జూపార్కునూ చూశాను. ఇంతకీ ఇప్పుడు బన్నారుగట్ట నేషనల్ పార్క్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా!
నిన్న బన్నారుగట్ట నేషనల్ పార్కుకు వెళ్లాం. మొదటగా సఫారికి తీసుకెళ్ళారు. నాలుగు వందల రూపాయలు కడితే బస్సులో తీసుకెళ్ళారు. సఫారీలో సింహం, పులి, ఏనుగు, ఎలుగులుంటి వంటి జంతువుల్ని చూశాము. ఇక్కడ తెల్ల పులులు ఉన్నాయి. రెండు తెల్ల పులులు కనిపించాయి. పెద్ద బండరాళ్ళ గుట్టలు, చెట్లు, పొదలు సహజ వాతావరణాన్ని సృష్టించారు. బొనుల్లో లేకుండా స్వేచ్చాయుత వాతావరణంలో సింహాల్ని, పులుల్ని ఉంచుతున్నారు. బోనుల్లాంటి బస్సుల్లో మనుష్యులే వాటిని చూడటానికి వెళుతున్నారు. క్రూర మృగాలు బయటికి రాకుండా పెద్ద పెద్ద కందకాలు నిర్మించారు. కేవలం బస్సులు పోవటానికి మాత్రం ఎన్‌క్లోజర్లు ఏర్పాటుచేశారు.
పూర్తిగా వెదురు చెట్లతో నిండిపోయింది సఫారీ. ఎండాకాలం కావటంతో జంతువులు దాదాపుగా నీటి మడుగుల వద్దే కనిపించాయి. ఒక సింహo మోసాల మనుష్యుల్ని నేను చూడను అంటూ తల అటు తిప్పి కూర్చుంది. దాహానికి వగరుస్తూ నాలుక బయట పెట్టి కుక్కలా శ్వాస తీసుకుంటున్నదో ఎలుగుబంటి.
నీళ్ళ చప్టా దగ్గర శరీరమంతా ముంచి తల మాత్రం బయట పెట్టి పడుకున్నదో పెద్ద పులి. చెరుకు, అరటి చెట్లను తింటూ రోడ్డు పక్కనే నిలబడిన ఏనుగు. దానిని చూసిన పిల్లలు ‘ఆనె, ఆనె’ అని అరిచారు. కన్నడంలో ఏనుగును ‘ఆనె’ అంటారు.
సఫారీ బస్ డ్రైవరు జంతువులు కనపడగానే కొద్దిసేపు ఆపి మరీ సహకరించాడు. అందరూ ఫొటోలు తీసుకుంటూ ఆనందపడ్డారు. కొంతమంది ఈలలు వేస్తూ మిత శబ్దాలు చేస్తూ వాటి ఏకాగ్రతను భంగం చేస్తున్నారు. ఏ జూపార్కుకు వెళ్ళినా ఇదే కనిపిస్తుంది. ప్రతి చోటా ‘డోంట్ ఇరిటేట్ యానిమల్స్’ అని బోర్డులు పెట్టినా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తుoటారు. ఇలా చేసిన వాళ్ళ మీద కోపం వస్తుంది. నేను జంతువులను హింసించవద్దని చెపుతూ పిల్లల కోసం ఒక కథ కూడా రాశాను.
సఫారీ చూడటం పూర్తయ్యాక మేము జూపార్కు చూడటానికి వెళ్ళాము. విపరీతమైన ఎండలో నడవలేక బ్యాటరీ కారు ఎక్కాము. బ్యాటరీ కారు కోసం టిక్కెట్ కొనడానికి చాoతాడంత క్యూ ఉన్నది. టికెట్ తీసుకున్నాక చేతి మీద స్టాంపు వేశారు. బర్డ్స్, రెప్టైల్స్ అవి ఒక విభాగం ఉన్నది.
మొత్తం జూ పార్కులో లేళ్ళు జింకలు ఎక్కువ కనిపించాయి. ఆస్ట్రిచ్‌లు, ఈము పక్షులు కూడా ఉన్నాయి. అప్పుడే దక్షిణాఫ్రికా లోని ఆస్త్రిచ్ పార్కు లోని ఆస్ట్రిచ్‌లు గుర్తొచ్చాయి. అక్కడి ఆస్ట్రిచ్‌లు మనిషి కన్నా చాలా ఎత్తుగా ఉన్నాయి. పక్షుల్లో పారాకీట్లు, నెమళ్ళు, మకావ్‌లు, పిచ్చుకలు ఎన్నో రకాలున్నాయి. ఇక్కడా మనుష్యులు చిన్న చిన్న రాళ్ళు, పుల్లలు విసురుతూ కనిపించారు. వీళ్ళు మారరు అని నాకు విసుగు వచ్చింది.
బన్నారుగట్ట జూపార్కును 1970లో మొదలుపెట్టారట. 1974కు నేషనల్ పార్కుగా మారిందట. ఒక బోనులో చాలా తాబేళ్ళు ఉన్నాయి. “పాపం ఇంకా జాయింట్ ఫ్యామిలీ లోనే బతుకుతున్నాయి” అని ఎవరో హిందీలో కామెంట్ చేయగానే అందరూ నవ్వారు. హైనా, ముళ్ళపంది కూడా కనిపించాయి. జూపార్కులో కార్నివోరాస్ విభాగం, హెర్బివోరస్ విభాగం అంటూ విభజించారు. ఇవీ బన్నారుగట్ట జూపార్కు విశేషాలు!