[‘బస్తర్: ద నక్సల్ స్టోరీ’ అనే సినిమాని సమీక్షిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
[dropcap]గ[/dropcap]త కొన్నేళ్ళుగా హిందీ సినిమాల్లో స్పష్టమైన మార్పు వస్తోంది. సినీ పరిశ్రమలోనూ స్పష్టమైన విభజన రేఖలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నరేంద్రమోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ ఈ రేఖలు మరింత స్పష్టమై సినిమాలకు ఎంచుకునే అంశాలలోనూ గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి.
ఖాన్ త్రయం, వారి సమర్థకులు లౌకికవాద కళాకారులు ఒకవైపుగా, దేశభక్త కళాకారులు మరొకవైపుగా సినీరంగంలో విభజన రేఖలు కనిపించాయి. దేశభక్త నరేంద్రమోడీ సమర్థకులుగా కంగనా రనౌత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్ వంటివారు గుర్తింపు పొందారు. వీరు తీసే సినిమాలు, నటించే సినిమాలను బట్టి ఎవరెటువైపో అందరికీ తెలిసిపోతోంది.
సినీ రంగంలో కళాకారుల నడుమ ఈ విభజన ఒకవైపుండగా, మరోవైపు సినిమాల్లో కథాంశాల్లోనూ ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ పాలసీలను వివరిస్తూ సమర్థించే సినిమాలొకవైపు, సినిమాలో ఏ మాత్రం అవకాశం లభించినా ప్రభుత్వ పాలసీలను విమర్శించే సీన్లుండే సినిమాలింకోవైపు కనిపిస్తాయి. అయితే, గతంలో ఎన్నడూలేని విధంగా, ఇంతవరకూ ఆలోచనల్లోకి కూడా రాని అంశాల ఆధారంగా సినిమాలు రూపొందుతున్నాయి.
గతంలో సినిమాల్లో తీవ్రవాద సమర్థన కనబడేది. హీరో తీవ్రవాది అవటానికి కారణం చూపించేవారు. సమాజాన్నో, సామాజిక వ్యవస్థనో దోషిగా చూపేవారు. ముఖ్యంగా వామపక్ష భావ ప్రేరేపిత సినిమాలయితే, హీరో వామపక్ష సమర్థకుడవటానికి వ్యవస్థను దోషిగా చూపించి, ఆ వ్యవస్థను రక్షించే మిలటరీని, పోలీసులను విలన్లుగా చిత్రించటం ఆనవాయితీ అయిపోయింది. రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వ్యవస్థను కూలద్రోసి ఆ స్థానంలో తాము కలలుగంటున్న వ్యవస్థను నిలపాలంటే ఇది తప్పనిసరి. ఇందుకు భిన్నంగా ఇటీవలి కాలంలో తీవ్రవాదులను దేశద్రోహులుగా చూపిస్తూ, వారి చర్యల సమర్థన ప్రయత్నమే చెయ్యని ‘కశ్మీరీ ఫైల్స్’ లాంటి నిష్ఠూరమైన నిజాన్ని నిర్భయంగా, ఏమాత్రం అపాలజిటిక్‌గా కాకుండా చూపించే సినిమాను భారతీయ సినిమాల్లో ఊహించటమే కష్టం. అలాంటి సినిమా తయారవటం, రిలీజయి ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించటం అనూహ్యమైన విషయం. ఆ తరువాత ‘కేరళ స్టోరీ’ లాంటి చేదు నిజాలను నిక్కచ్చిగా ప్రదర్శించిన సినిమా, నిజంకన్నా ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చిన ‘వాక్సిన్ వార్’ లాంటి సినిమా, మిషన్ మంగళ్, షేర్ షా, యురి: ది సర్జికల్ స్ట్రైక్, రజాకార్, వంటి సినిమాలు, నడుస్తున్న చరిత్రను చూపించే ‘ఆర్టికల్ 370’ వంటి సినిమాలు మన సినిమాల్లో నెమ్మదిగా వస్తున్న మార్పును ప్రతిబింబిస్తాయి. ఎంతసేపూ, ఒకే భావజాలాన్ని సమర్థిస్తూ, ఒకే దృక్కోణాన్ని, అదీ వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీసే కోణమే అయ్యే పరిస్థితి నుంచి, అందుకు వ్యతిరేకమైన దృక్కోణాన్ని ప్రదర్శిస్తూ, సత్యాన్ని మరో కోణంలో అదీ, జాతీయ దృక్కోణంలో, వ్యవస్థపై విశ్వాసాన్ని పెంచి దేశ సమగ్రత, ఐక్యతను భద్రపరచే ఆలోచనతో సినిమాలు రావటం ఆరంభమయిందనటానికి సినిమాల్లో వచ్చిన ఈ మార్పు నిదర్శనం అయితే, అందుకు తిరుగులేని నిరూపణ, ఇటీవలే విడుదలయిన సినిమా ‘బస్తర్: ద నక్సల్ స్టోరీ’!
‘కేరళ స్టొరీ’ సినిమా నిర్మాత దర్శకులే బస్తర్ సినిమా నిర్మాత దర్శకులు. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా నిర్మాత దర్శకులే ‘వాక్సిన్ వార్స్’ సినిమా నిర్మాత దర్శకులు. ‘కశ్మీర్ ఫైల్స్’తో పోలిస్తే ‘వాక్సిన్ వార్స్’ సినిమా తేలిపోతుంది. అలాగే ‘కేరళ ఫైల్స్’ తో పోలిస్తే ‘బస్తర్: ద నక్సల్ స్టోరీ’ తేలిపోతుంది.
సినిమాగా చూస్తే, ‘బస్తర్: ద నక్సల్ స్టోరీ’ మామూలు స్థాయికన్నా తక్కువ స్థాయి సినిమా. సరయిన స్క్రిప్ట్ లేదు. పాత్రలను ప్రేక్షకులకు చేరువచేసే సన్నివేశ సృష్టీకరణ లేదు. పాత్రలన్నీ కార్డ్‌బోర్డ్ పాత్రలు. అయితే పూర్తిగా మంచి, లేకపోతే పూర్తిగా చెడ్డ. సినిమాకు ప్రేరణ, కేంద్ర బిందువయిన 76 గురు సీఅర్పీఎఫ్ జవాన్లను నక్సల్స్ ఘోరంగా హత్య చేసిన సంఘటన సినిమాలో ఒక సంఘటనగా మాత్రమే మిగిలుతుంది. అదీ ఎలాంటి ఉద్విగ్నతను, విషాదాన్ని కలిగించే సంఘటనగా కాక, మామూలు సంఘటనగా మిగులుతుంది. సినిమాలో ఏ సంఘటన కూడా మనసును కదలించి తీవ్రమైన భావనలు కలిగించే సంఘటనలుగా కాక, ఒక సీ గ్రేడ్ సినిమా స్థాయి నాటకీయతతో, కృత్రిమ సంఘటనల్లా అనిపిస్తాయి తప్ప ఎద కదిలించే సంఘటనల స్థాయికి ఏ దృశ్యం కూడా ఎదగలేదు.
ఇక నటన విషయానికి వస్తే, ఏ నటి, నటుడు కూడా నటన అన్నది తెలిసినవారిలా అనిపించలేదు. ప్రధాన పాత్రధారి అయితే మిడిగుడ్లు వేసుకుని ఉరిమి ఉరిమి చూడటమే నటన అనుకున్నట్టున్నది. ఆ పాత్రపై ఎలాంటి సానుభూతి కానీ, ఎలాంటి ఇష్టం కానీ కలగదు.
స్క్రిప్ట్ రచనలో కోర్ట్ సీన్లకు తగ్గట్టు, గతంలో జరిగిన, వర్తమానంలో జరుగుతున్న సీన్లను చూపిస్తూ ఏదో గొప్ప స్క్రీన్‌ప్లే రాశామనుకున్నట్టున్నారు.కానీ, సబ్జెక్ట్‌కు తగ్గ నేరేటివ్ స్టైల్‌ను ఎన్నుకోవాలని, ఎన్నుకున్న నేరేటివ్ స్టైలుకు న్యాయం చేయాలన్న ప్రయత్నం లేకపోవటం ప్రధానంగా సినిమాను అర్థం చేసుకోవటంలో ప్రతిబంధకం అవుతుంది. సినిమా సాంతం తెరపై జరుగుతున్న దానితో ప్రేక్షకుడి డిస్‍కనెక్ట్ కొనసాగుతుంది.
సినిమా నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీసినదని తెలుస్తూనే వున్నా, సినిమా కథకు నేపథ్యాన్ని తెలపటంవైపు దృష్టి పెట్టకపోవటంతో ప్రేక్షకుడు తెరపై జరిగే సంఘటనలకు స్పందించాల్సినంత తీవ్రతతో స్పందించడు. అవి కలవరపెట్టాల్సినంత తీవ్రంగా కలవరం కలిగించవు. అసలు బస్తర్ సమస్య ఏమిటి అక్కడ నక్సల్స్ ఎందుకని అంత శక్తిమంతులయ్యారు అన్న విషయాలతో సంబంధం లేకుండా, సల్వాజుడుం ఏమిటి? దాని ఆవశ్యకత ఏమిటి? అన్న విషయాలను వివరించకుండా, నక్సల్స్ క్రౌర్యాన్ని, సామాన్యులపట్ల వారి దాష్టీకాన్ని, దౌర్జన్యాన్ని చూపించటం కూడా సామాన్య ప్రేక్షకుడు సినిమాను మెచ్చటానికి అడ్డుపడుతుంది. సినిమా చూస్తూంటేనే ఇది ఏకపక్షం అని తెలిసిపోతుంది.
బస్తర్‍లో సమస్య ఈనాటిది కాదు.
బస్తర్ ప్రాంతాన్ని దండకారణ్యం అంటారు. రామాయణంలోనూ దండకారణ్యం ప్రస్తావన వస్తుంది. బస్తర్‍లో మారియా, ముడియా, దోర్లా, దురియా, హల్బా, భాత్రా వంటి జాతులవారు ఉంటారు. ముఘలులు, మరాఠాలూ ఈ ప్రాంతాలను పాలించారు. తరువాత ఈ ప్రాంతం ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలోకి వచ్చింది. 1871లో వారీ ప్రాంతంలో వున్న ఖనిజాలను వెలికితీయటంపై దృష్టిపెట్టారు. అడవిపై ఆధారపడి బ్రతికే తెగలను ఆ అడవికి దూరం చేశారు. ఇది స్థానికులలో ఆగ్రహం కలిగించింది. ఫలితంగా బస్తర్ విప్లవం, లేక, భూమికాల్ ఉద్యమం జరిగింది. బ్రిటీష్ వారు వదలి వెళ్ళిన తరువాత కూడా స్వతంత్ర భారతదేశంలో కూడా బ్రిటీషర్ల పద్ధతి కొనసాగింది.
దేశంలో కమ్యూనిజం ప్రవేశించి, అది సాయుధ పోరాటంగా రూపుదిద్దుకున్న తరువాత వారి దృష్టి ఈ వైపు మళ్ళింది. ట్రైబళ్ళ భూమిపై వారికి హక్కు ఇప్పించే లక్ష్యాన్ని సమర్థిస్తున్నట్టు కనబడటంతో వారికి స్థానిక ప్రజల మద్దతు లభించింది. అలా, ఈ ప్రాంతంపై నక్సల్స్ పట్టు సంపాదించారు. అయితే, నక్సల్స్ అసలు ఉద్దేశ్యం వేరు. వారు ప్రజాస్వామ్య వ్యస్థను నమ్మరు. ఈ వ్యవస్థను కూలద్రోసి తాము కలలు కనే కమ్యూనిస్టు వ్యవస్థను దేశంలో నెలకొల్పాలన్నది వారి ఉద్దేశం. వారి దృష్టి స్థానిక తెగలకు వారి వారి భూములను ఇవ్వటంపై లేదు. బస్తర్ కేంద్రంగా, దేశంలో ప్రజాస్వామ్యాన్ని రూపుమాపి కమ్యూనిస్టు పాలనను నెలకొల్పటంపైనే!
ఏదైనా వ్యవస్థను దెబ్బతీసేందుకు కమ్యూనిస్టులు గొప్ప పద్ధతిని అనుసరిస్తారు. ముందుగా స్థిరపడ్డ వ్యవస్థలో భాగస్వాములవుతారు. నెమ్మదిగా అక్కడి కీలకమైన స్థానాలను ఆక్రమిస్తారు. మరో వైపు వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగిస్తారు. వ్యవస్థలో కీలకమైన స్థానాలు ఆక్రమించిన వారు, దాన్ని బలహీనం చేసి, బయటనుంచి పోరాడుతున్న సాయుధపోరాటానికి వ్యవస్థలోనుంచి మద్దతునిస్తారు. అంటే, బయటనుంచి దెబ్బ తీస్తూ, పురుగులా లోపలనుంచి తొలుస్తూ బలహీనం చేస్తారు..పట్టు బిగిస్తారు. ఉదాహరణకు, హైదరాబాదు రాష్ట్రంలో నిజామ్‌కు వ్యతిరేకంగా పోరాటం సాగుతున్నప్పుడు, వారు కొన్ని జిల్లాలపై పట్టు సాధించారు. కాంగ్రెస్‌తో స్నేహం చేస్తూ, కాంగ్రెస్ పై పట్టు బిగించారు. నిజామ్‌తో చేతులు కలిపి కాంగ్రెస్‌ను దెబ్బ తీశారు. తమకు పట్టు ఉన్న ప్రాంతాలను భారతదేశం నుంచి వేరుచేసి ప్రత్యేక కమ్యూనిస్టు దేశం ఏర్పాటు చేయాలని కలగన్నారు. రష్యా వెళ్ళి స్టాలిన్ను తమకు పట్టున్న ప్రాంతాలను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసేందుకు సహాయం అభ్యర్ధించారు. అందుకే, నిజామ్ నుంచి హైదరాబాదును విముక్తం చేసి, హైదరాబాదును జాతీయ జీవన స్రవంతిలో విలీనం చేసిన తరువాత కూడా భారతీయ సైన్యం, తమ పట్టున్న ప్రాంతాలను భారత్ నుంచి వేరు చేసి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్న సాయుధ కమ్యూనిస్టు పోరాట దళాలతో యుధ్ధం చేయాల్సివచ్చింది. వారిని ఏరి వేయాల్సి వచ్చింది.
అయితే, వ్యవస్థలన్నిటిలో దూరి వాటిపై నియంత్రణ సాధించిన కమ్యూనిస్టులు ఈ అసలు చరిత్రను వక్రీకరించారు. తాము పేద ప్రజల పక్షాన పోరాడుతూంటే, సైన్యం భూస్వాముల పక్షాన పోరాడుతోందనీ, తమది భూస్వామ్య వ్యతిరేక ప్రజా పోరాటమనీ, భారత సైన్యం అమాయక పోరాట వీరులపై అత్యాచారాలు చేసిందన్న కథను సృష్టించి ప్రచారం చేశారు. ప్రజలను నమ్మించారు. ఇదే నిజం అని నమ్మే పరిస్థితులు కల్పించారు. ఈ పరిస్థితులు కల్పించటంలో వ్యవస్థలో వుంటూ తమను సమర్థించే వారు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించారు. బ్యూరోక్రటిక్ వ్యవస్థనే కాక, సాహిత్యం, కళలు, నాటకాలు, సినిమాలు ఒకటేమిటి ఎన్నెన్ని రకాలుగా ప్రజలను ప్రభావితం చేయవచ్చో అన్నన్ని రకాలుగా అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేస్తూ నిజాన్ని మరుగు పరచి విస్మృతిలోకి నెట్టి, అదృశ్యం చేశారు. ఈనాడు ఎవరయినా నిజం చెప్తే ఎవ్వరూ నమ్మని పరిస్థితిని కల్పించారు. తమను కాదన్నవాడిపై ఏవేవో ముద్రలువేసి డిస్‌క్రెడిట్ చేశారు. ఇదే పద్ధతి బస్తర్ లోనూ కొనసాగింది. దేశం నడిబొడ్డున వుండి అందరి దృష్టి పథంలో వున్న హైదరాబాదుకు సంబంధించిన చరిత్రనే సంపూర్ణంగా రూపాంతరం చెందించి రంగు మార్చిన వారికి, దేశం దృష్టి పథంలో లేని, అరణ్య ప్రాంతాల చరిత్ర రంగు మార్చటం పెద్ద కష్టం కాదు. ఇలా జన జీవన స్రవంతిలో వుంటూ, అడవుల్లోంచి పోరాడేవారికి మద్దతునిచ్చే వారిని ‘అర్బన్ నక్సల్స్’ అంటారు. వీరందరి నెట్‌వర్క్‌నూ ‘ఇకో సిస్టమ్’ అంటారు. ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏమిటంటే, అడవుల్లో ఆయుధాలు పట్టుకున్నవారు రాజ్యాంగ వ్యవస్థను నమ్మరు. నగరాల్లో అర్బన్ నక్సల్స్ రాజ్యాంగ వ్యవస్థను నిలపాలని పోరాడతారు. ఆ రాజ్యాంగ నిర్మాత పట్ల విధేయతను ప్రదర్శిస్తారు. అడవుల్లో వున్నవారికి ఆ రాజ్యాంగం ఆధారంగానే సహాయం చేస్తారు.
భారతదేశ జండా ఎగురవేసిన వారిని చంపటం నిజం. జాతీయగీతం పాడినవారిని హింసించటం నిజం. పాకిస్తాన్‌తో యుద్ధంలో 8738 సైనికులు చనిపోతే, నక్సల్స్ వ్యతిరేక పోరాటాల్లో 1500 పైగా మరణించటం నిజం. తీవ్రవాదులతో పోరాటం కోసం ఎంత ధనం ఖర్చవుతోందో, నక్సల్స్‌ను అణచివేయటానికీ దాదాపుగా అంతే ధనం ఖర్చవటం నిజం. ఐసిస్, బోకో హరామ్ వంటి తీవ్రవాద సంస్థల తరువాత మూడవ పెద్ద తీవ్రవాద సంస్థ నక్సల్ అన్నదీ నిజమే. దేశానికి, ప్రజాస్వామ్య వ్యవస్థకూ అతి పెద్ద ప్రమాదం నక్సల్స్ అన్నదీ నిజం. 2010లో నక్సల్స్ దంతేవాడలో 76 గురు జవాన్లను చంపటం నిజం. 76 గురు జవాన్ల క్రూరమైన హత్య తరువాత JNU లో సంబరాలు జరగటమూ నిజం. ఆ సమయంలో అక్కడ DIG గా వున్న ఎస్.ఆర్.పి. కల్లూరి ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించటమూ నిజమే!
నక్సల్స్ నడ్డి విరుస్తున్న ‘సల్వా జుడుం’ పై కేసువేసి, ఆ వ్యవస్థను బాన్ చేయించటమూ నిజమే! ఆ తరువాత నిరాయుధుడయిన ఆయనను క్రూరంగా చంపివేయటమూ నిజమే! సల్వాజుడుంను నిషేధించాలని పలు ఎన్జీవోలు, మేధావులూ నడుంకట్టి పనిచేయటమూ నిజమే! ఈ ఇకోసిస్టమ్‌ను ఈ సినిమా ప్రదర్శిస్తుంది. ఒక్కసారి మన చుట్టూ జరుగుతున్న సంఘటనలను, ఆందోళనలను పరిశీలిస్తే, సినిమాలో చూపించినట్టు, ప్రతి ఆందోళలోనూ ఆ మేధావులే, ఆ ఎన్జీవోలే బిలబిలమంటూ బెల్లం చుట్టూ ఈగల్లా చేరిపోవటం, ఆందోళనలూ, గోలలూ చేయటం, అవార్డు వాపసీలూ, ఆవేశపు వ్యాఖ్యానాలు, నినాదాలూ చేయటం, కవితల సంకలనాలూ వేసేసి, అరుపులూ కేకలతో వీధుల్లోకి రావటం గమనిస్తే, ఇది అర్థం కావాలంటే ఈ సినిమాలోని అర్బన్ నక్సల్స్ ఇకోసిస్టమ్‌ను చూడాల్సివుంటుంది. ఈ రకంగా నిజాలను నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా, నిజాయితీగా చూపించిన మొదటి సినిమా ఇది. కాబట్టి, సినిమా ఎంత తక్కువ స్థాయిదయినా నిజాలను గ్రహించేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చూడాలీ సినిమాను.
అయితే, నిజాలను ప్రతిభావంతంగా, చూపిస్తూ, వాటన్నిటినీ ఒక కథగా గుదిగ్రుచ్చి చక్కని స్క్రీన్‌ప్లేతో, చక్కని ప్రాత్రల వ్యక్తిత్వ రూపకల్పనతో సినిమాను నిర్మించి వుంటే, ‘బస్తర్: ద నక్సల్ స్టోరీ’ ఒక మరపురాని అద్భుతమైన సినిమాగా ఎదిగివుండేది. ఒక చక్కని అవకాశం వ్యర్థమైనా, కనీసం ఇంతవరకూ ఎవ్వరూ చెప్పెందుకే భయపడ్డ నిజాలను తెరపై ప్రదర్శించిన సినిమాగా ఈ సినిమా ప్రత్యేకంగా మిగిలిపోతుంది.
(ఈ సినిమా Zee5 లో అందుబాటులో వుంది)