బాటసారి-3

0
1

[box type=’note’ fontsize=’16’] బాలబాలికల కోసం ‘బాటసారి’ అనే పెద్ద జానపద కథని మూడు భాగాలుగా అందిస్తున్నారు దాసరి శివకుమారి. ఇది మూడవ, చివరి భాగం. [/box]

[dropcap]ఈ[/dropcap] రాజ్యాన్ని కూలదోసే కుట్ర జరుగుతుందని కమలనాథుని కర్థమయింది. ఆ తర్వాత ఏదో ఆలోచనలో పడ్డాడు. బాగా వేకువజామునే కమలనాథుడు లేచి నిలబడ్డాడు. అతని గుర్రం అప్పటికే లేచి సిద్దంగా వున్నది. తనతోపాటు కొంచెం దూరంలో పడుకున్న నలుగురూ నిద్రలో అటూ ఇటూ కదులుతున్నారు. ఈ రోజు నిద్రలేచి కమలనాథుడు ఇంకా ముందుకు వెళదామనుకున్నాడు. కాని తన ఉద్దేశం మార్చుకుని తమ రాజ్యపు రాజధాని పట్టణం వైపుకు సాగిపోయాడు.

అది ప్రతీపాల రాజ్యం. దానికి రాజు ప్రతీపాలుడు. ఇది చాలా ధనవంతమైన రాజ్యం. సిరిసంపదలతో తూలతూగుతున్నది. రాజు శక్తిమంతుడు. కాని యుద్దాల జోలికి పోకుండా ఎక్కువగా శాంతిగా వుందామనుకుంటాడు. తన ప్రజలంతా ఎప్పుడూ సుఖసంతోషాలతో వుండాలని కోరుకుంటాడు. ఇరుగుపొరుగు రాజులు అప్పుడప్పుడూ ప్రతీపాల రాజ్యంపైకి దండెత్తాలని చూస్తారు, కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారు. వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా, తన రాజ్యంలోకి శత్రువులను కాలుపెట్టనివ్వకుండా ప్రతీపాలుడు ఇప్పటివరకూ రాజ్యాన్ని, ప్రజల్నీ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు.

ఇప్పుడు ప్రతీపాలుని కొడుకు పెద్దవాడయ్యాడు. యుద్ధవిద్యలు, రాజ్యపరిపాలనా విషయాలన్నింటినీ నేర్చుకుని వచ్చారు. అతనికి రాజ్యం అప్పచెప్పి ప్రతీపాలుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడు. యువరాజు పట్టాభిషేకానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రజలుకూడా ఆ ఉత్సవం కోసం బాగా ఎదురుచూస్తున్నారు.

ఆ రోజు ప్రతీపాలుడు కొలువుతీరాడు. మంత్రులు, సేనాధిపతి అందరూ వున్నారు.

“మహామంత్రీ! ఉత్సవానికి అన్నీ ఏర్పాట్లు పూర్తయినట్లేనా?” అనడిగాడు ప్రతీపాల ప్రభువు.

“అంతా సిద్ధంగానే వున్నది ప్రభూ! ఇంకా పదిరోజుల సమయమున్నది. అప్పటికి బంధుమిత్రులు ఇరుగుపొరుగు రాజ్యధికారులు అందరూ చేరుకుంటారు ప్రభూ” అని బదులిచ్చాడు మంత్రి.

“సేనాధిపతీ! ఏ సమయంలోనైనా శాంతిభద్రతలకు ఆటంకం రాకుండా చూడాలి. మీరు అన్నివేళలా చాలా జాగరూకతగా వుండాలి. సైన్యాన్ని అప్రమత్తంగా వుంచాలి” అని సేనాధిపతికి సూచించాడు రాజు.

“తప్పకుండా ప్రభూ! నేనూ, మన సైన్యం ఎల్లప్పుడూ అప్రమత్తంగానే వుంటాం. మన రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడతాం. మీరు నిశ్చింతగా వుండండి” అని చెప్పాడు సేనాధిపతి.

ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుని ఆనాటికి కొలువు చాలించారు.

ఆ సాయంకాలం కొంతమంది ముఖ్యులతో రాజు ప్రతీపాలుడు రహస్య మందిరంలో ఆలోచనలు చేస్తున్నాడు. మంత్రి, సేనాధిపతి, యువరాజు, గూఢచారి విభాగపు అధికారి మాత్రమే ఉన్నారు. గూఢచారి అధికారి మాటలు మొదలుపెట్టాడు. “మీ అనుమానం నిజమే యువరాజా! మన వేగులవాళ్ళు వార్తలు తెచ్చారు. మన పొరుగురాజు చీటికీ మాటికీ మనమీద కాలు దువ్వుతాడు. మన సంపదను కొల్లగొట్టాలనే దురాశతోనే ఎప్పుడూ ఉంటాడు. ఆ దురాశతోనే ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. అతనికీసారి గట్టిగా బుద్ధి చెప్పాలి. జీవితంలో మళ్ళీ మనవంక చూడటానికి కూడా ప్రయత్నం చెయ్యకుండా చూడాలి. అతను మనం ఉత్సవపు వేడుకల్లో వుండగా దాడిచేద్దామన్న పేరాశలో వున్నాడు” అన్నాడు.

“అతను దాడి చేసే దాకా మనం ఆగొద్దు. మన దెబ్బ రుచి చూపిద్దాం. మనమే అతని మీద దాడిచేద్దాం. సైన్యాన్ని సిద్ధం చేసుకుందాం. సేనాధిపతిగారూ మీరు ఆ ఏర్పాట్లలో ఉండండి” అన్నాడు యువరాజు.

“తొందరపడొద్దు యువరాజా! అనవసరంగా ముందుగా మనమే యుద్ధం జోలికి పోవద్దు. అతను దాడిచేస్తే ఎదుర్కొందం” అన్నాడు ప్రతీపాలుడు.

మంత్రి తలూపాడు. కాని యువరాజు దానికి ఒప్పుకోలేదు. “అతనితో పదిరోజుల తరువాతనైనా యుద్ధం చేయక తప్పదు. అతను పదిరోజుల తర్వాత సిద్ధపడతాడు. మనమే ఈలోగా దాడిచేసి అతణ్ణి మట్టి కరిపిద్దాం. మళ్ళీ జీవితంలో మనవంక చూడటానికి కూడా సాహసం చెయ్యడు. అతడీ పరిస్థితి చూసి మిగతారాజులు కూడా భయపడతారు. మనం శాంతినే కోరుకుంటామని అనవసర యుద్ధాలకు పోమని వాళ్ళకు బాగా అలుసుగా వున్నది. ఒక్కొక్కప్పుడు యుద్ధం చెయ్యక తప్పదు మహారాజా. మన రాజ్యాన్ని సుస్థిరం చేసుకోవటం మా కర్తవ్యం” అన్నాడు యువరాజు పట్టుదలగా.

ప్రతీపాలుడు మంత్రివంక, సేనాధిపతివంక చూశాడు. వాళ్ళుకూడా సాలోచనగా తలూపుతూ “యువరాజుల ఆలోచన సరైనదే ప్రభూ! మనం శాంతికాముకులమేకాని అసమర్థులుగా వుండకూడదు. అవసరమైనప్పుడు మన శక్తిసామర్ధ్యాలను నిరూపించుకోవాలి” అన్నారు.

“సేనాధిపతీ! ముందుగా మన దళపతిని రహస్యంగా బంధించండి. అతని ద్వారా సైన్యం విషయాలు ఏమీ బయటకు పోనీయకూడదు. సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేయండి. మీరు ఆ ఏర్పాట్లలో వుండండి. పొరుగురాజు సైన్యం ఇంకా సిద్ధంగా లేదు. మనం వెంటనే దాడిచేద్దాం. అతడికి ఊపిరి ఆడకుండా చెయ్యాలి” అన్నాడు పట్టుదలగా.

ప్రతీపాల రాజ్యంలోని సామాన్యప్రజలంతా యువరాజు పట్టాభిషేక వేడుకల్లో పాల్గొనటానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. రాజభవనాన్ని, సభామంటపాన్ని బాగా అలంకరించే పనిలో వున్నారు. పైకంతా పట్టాభిషేకపు ఏర్పాట్లే కనపడుతున్నాయి. రాజసైన్యం మాత్రం యుద్ధానికి సిద్ధమైపోయింది. సేనాధిపతీ, యువరాజు సైన్యంతో పాటు బయలుదేరి వచ్చారు. ఊహించని దాడికి పొరుగురాజు బిత్తరపోయాడు. రెండురోజుల్లోనే ఆ పొరుగురాజ్యాన్ని ఓడించాడు యువరాజు. వాళ్ళు సంధి చేసుకున్నారు. పనిలోపనిగా ఈ పక్కనున్న రాజ్యంమీద కూడా దండెత్తాడు. యువరాజు పరాక్రమం ముందు వాళ్ళు ఓడిపోయారు. తండ్రిని మించిన కొడుకని యువరాజును అందరూ మెచ్చుకున్నారు. నాలుగురోజుల్లోనే రెండురాజ్యాలను గెలిచి తిరిగివచ్చిన యువరాజుకు పట్టణ ప్రజలందరూ జేజేలు పలికారు. పట్టాభిషేకపు ఏర్పాట్లు మరింత ఉత్సాహంగా జరుపుతున్నారు. అనుకున్న సమయానికి యువరాజుకు పట్టభిషేకమయింది. వచ్చినవారందరికీ బాగా మర్యాదలు చేసి పంపారు. ఎంతో అనుభవమున్నవాడిలా యువరాజు పరిపాలన మొదలుపెట్టాడు.

ఆ రోజు ఆ మారుమూల వున్న ధర్మసత్రం దగ్గరకు ఇద్దరు రాజభటులు వచ్చారు.

“ఇదిగో పెద్దాయనా! రాజుగారు నిన్ను రాజసభకు పిలుచుకురమ్మని చెప్పారు. గుర్రం కూడా సిద్ధంగా వుంచాం బయలుదేరు” అన్నారు రాజభటులు.

తాతా, అవ్వా భయపడిపోయారు. “మేమెక్కడ? రాజసభ ఎక్కడ? అయినా మేమేం తప్పుచేయలేదే?” అన్నారు తడబడుతూ.

“విషయమేమిటో అక్కడకు వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. అనవసరంగా భయపడకండి. త్వరగా పోదాం పద” అంటూ తాతను బయల్దేరతీశారు.

“బాబ్బాబు మా ముసలాయనకు రాజధానికి రావటం కొత్త. ఒక్కడూ మరలా తిరిగిరాలేడు. మీరే కాస్త దింపి వెళ్ళండి నాయినా” అన్నది అవ్వ.

“అలాగే అవ్వా. రాజుగారి ఆజ్ఞ కూడా అదే. నువ్వేం భయపడమాకు” అంటూ అవ్వకు ధైర్యం చెప్పి రాజభటులు తాతను తీసుకుని రాజధానికి వెళ్ళారు.

చినలక్ష్మణయ్య కోసం కూడా రాజభటులు వాళ్ళ ఊరు వెతుక్కుంటూ వెళ్ళి గాలించారు. కాని అతను, రాజాధానిలోనే వున్నాడని తెలిసింది. పట్టణమంటా గాలించారు. చివరకు ఆచూకీ దొరికింది. రాజుగారి కొలువులో చేరాలని బాగా ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. అతణ్ణీ రాజసభకు రమ్మని చెప్పారు. రైతులు పండించిన గింజలకు ఎక్కువ తరుగుకట్టి మోసం చేయాలనుకున్న వ్యాపారినీ వెదికి తీసుకొచ్చారు. ఆ వ్యాపారి ఒకటే భయపడిపోతున్నాడు. ‘ఆనాడెవరో ఒకతను నామీద ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు. అతడే ఫిర్యాదు చేసి ఉంటాడు. అందుకే రాజభటులు నాకోసం వచ్చి ఒకేసారి రాజసభకు తీసుకొచ్చారు. ఓరి భగవంతుడా! ఇప్పుడేది దారి? బతికుంటే బలుసాకైనా తిని బతకొచ్చు. ఏమి ఖర్మ వచ్చిపడ్డదిరా నాయినా’ అనుకుంటూ రకరకాలుగా భయపడుతూ వణికిపోసాగాడు. అలాగే మంచితీర్పులు చెప్పే గ్రామాధికారినీ రాజభటులు పిలుచుకొచ్చారు.

“నన్ను రాజధానికి రమ్మనటమేమిటి? అందులోనూ రాజాజ్ఞ అని చెప్తున్నారు. నా తీర్పు వలన ఎవరికైనా అన్యాయం జరగలేదు కదా? అలాంటివారెవరైనా రాజసభలోనే ఫిర్యాదు చేశారా? అని గ్రామాధికారి ఆలోచించసాగాడు.

రాజుగారి సైన్యంలో పనిచేసే దళపతినీ, అతని ద్వారా సమాచారం తెలుసుకుని శత్రురాజు సమచారం చేరవేసే నేరస్థులనూ పట్టి బంధించి జైలులో వుంచారు.

ఆ రోజు రాజుగారు సభ దీరారు. తాతా, చినలక్ష్మయ్యా, వ్యాపారీ, గ్రామాధికారీ అందరూ సభకు వచ్చారు. దోషుల్ని శిక్షించి రాజ్యానికీ ప్రజలకూ మేలుచేసే వారికి బహుమతులిస్తున్నారని రాజభటుల ద్వారా వాళ్లు విన్నారు. తమను ఎందుకు పిలచినట్లో వారికర్థం కాక అయోమయంగా చూడసాగారు. వారంతా తలెత్తి రాజుగారి వంక చూశారు. తలమీద కిరీటం, వంటినిండా ఆభరణాలతో మెరిసిపోతున్నాడు. ఆయన్ని చూస్తుంటే రాజుగార్ని ఇంతకుముందు ఎక్కడో చూసినట్లు అనిపించింది. కాసేపటి తర్వాతపోల్చుకున్నారు. తమ దగ్గరకొచ్చిన కమలనాధుడే ఇప్పుడు రాజుగారు అని తేల్చుకున్నారు.

వారివంక రాజుగారు చిరునవ్వుతో చూశారు.

“తాతా! నన్ను గుర్తుపట్టావా? మీ దగ్గరకొచ్చి జొన్నరొట్టి, బచ్చలికూర తిన్నాను. మీరు నిరుపేదవారైనా మీకున్న దాంట్లో ఇతరులకు పెట్టి ఆకలి తీరుస్తున్నారు. ధనానికి మీరు పేదవారేగాని దానానికి మీరు చాలా గొప్పవారు. మీలాంటి దయగలవాళ్ళు ఎక్కడో తప్పితే వుండరు. మీకున్న రెల్లుపాక తీసివేసి మంచిగట్టి ధర్మసత్రం కట్టిస్తాను. పనివాళ్ళను కూడా ఏర్పాటుచేస్తాను. మీక్కవలసిన గింజలూ, ధాన్యం అంతా రాజు తరుపునుండే అందుతుంది. వాటితో మరింతమంది ఆకలి తీర్చండి. ఆ చుట్టుపక్కల వారికి మీచేతనైనంత సాయం చేయండి” అంటూ తన ప్రయాణంలో తాత ఇంటికి వెళ్ళిన సంగతీ, తనకూ, గుర్రానికీ ఆహారం, వసతీ ఇచ్చిన సంగతులు సభలోని వారికందరికీ రాజు తెలియజేశాడు.

“అలాగే ప్రభూ!” అంటూ సంతోషంగా చేతులెత్తి తాత నమస్కరించాడు.

తాను ఎంత ప్రయత్నించినా తనకు రాజదర్శనం కాలేదు. ఎవరూ రాజుగారి కొలువులో ఉద్యోగమూ ఇప్పించలేదు. ఇలా రాజుగారి రక్షకభటులతోనే తాను రాజసభలోకి రప్పించబడటం కలా? నిజమా? అన్న సంకోచంలో పడిపోయాడు చినలక్ష్మణయ్య.

“ఏం చినలక్ష్మణయ్యా!” అన్న రాజుగారి పిలుపువిని ఉలిక్కిపడ్డాడు అతను.

“ప్రభూ!” అన్నాడు ఆలోచనల నుండి తేరుకుని.

“మా కొలువులో చేరాలనే అనుకుంటున్నావా?” అనడిగాడు రాజు.

” అది నా కల ప్రభూ! ఎన్నాళ్ళనుంచో దానికోసమే తపనపడుతున్నా”న్నాడు.

“నీ ఉద్దేశం నా కర్థమయినది. నీకు నా ఆంతరంగిక కాపలాదారుగా కొలువుఇస్తాను. జాగ్రత్తగా చేసుకో. నీ మాటల్లో కనపడే తపన నీ చేతల్లో కూడా ఉండాలి. నాకు నమ్మకం కలిగించు” అన్నాడు రాజు.

వంగి నమస్కరిస్తూ “మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను ప్రభూ” అంటూ వెనక్కి వచ్చాడు చినలక్ష్మయ్య. ఆనాడు తాత ఇంటినుండి వస్తూ మనం మళ్ళీ కలుసుకుందాం అంటే తాను సుతరామూ నమ్మలేదు. తనను గుర్రమెక్కించుకుని మరీ దింపాడు. తమ రాజుది ఎంత దయగల హృదయం అనుకున్నాడు.

ఆనాడు రైతులతోపాటు తన అంగడికొచ్చిన మనిషే ఈనాడు రాజుగా దర్శనమిస్తున్నాడు. ఇప్పుడెలా అనుకుంటుంటే వ్యాపారికి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. నోరంతా పొడిబారుతున్నది. ఇప్పుడు రాజుగారికి ఏం సమాధానం చెప్పాలో, ఎట్లా శిక్షనుంచి తప్పించుకోవాలో అని మధనపడసాగాడు.

“తాతనూ, చినలక్ష్మయ్యనూ మళ్ళా కలుసుకుంటానని మాట ఇచ్చాను. ఆనాడు బహూశా వాళ్ళు నామాట నిజమవుతుందని అనుకుని వుండరు. కాని నేను మాటమీద నిలబడే రాజును. వాళ్ళిద్దరికీ తగు న్యాయం చేశాను. వాళ్ళింకా మంచిపనులు చేయటానికి ప్రోత్సహమిస్తాను. వాళ్ళు కోరుకున్నట్లే కొండకు దిగువనున్న ఊళ్ళలో రైతులకు పన్నులు వేయను. వాళ్ళు ఎంతో కష్టించి కాసిన్ని గింజల్ని పండించుకుంటున్నారు. ఇకమీదట పన్నులంటూ ఎవరూ అక్కడికి వెళ్ళి వసూలు చేయటానికి ప్రయత్నించగూడదు. ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన శిక్ష వుంటుంది” అన్నాడు రాజు.

“తమరు ప్రభువులయి ఉండీ కూడా తాతా అని అభిమానంగా పిలిచారు. ఇంకా నాలాంటి రైతులకు పన్నులు లేకుండా చేత్తున్నారు. పదికాలాలపాటు చల్లగా వుండండి ప్రభూ. నాకు ఓపికున్నంతవరకూ జనాలకు గెంజికాసి పోత్తనే వుంటాను అది మాత్రం మానను సామి” అన్నాడు తాత.

ఆ తర్వాత రాజు వ్యాపారివంకకు తిరిగిచూస్తూ “ఈ తాతలాంటి వాళ్ళు చెమట కారుస్తున్నారు. బండల్ని పిండి చేస్తున్నారు. సాలుపొడుగునా కష్టపడుతూనే ఉన్నారు. తనతోటి వాళ్ళ ఆకలి తీరుస్తున్నారు. కాని నువ్వు అలాంటి నిరుపేదల కష్టాన్ని దోచుకుంటున్నావు. తరుగు పేరుతో సగానికి సగం ధాన్యం కాజేస్తున్నావు. వాళ్ళ ఉసురుపోసుకుంటున్నావు. మహామంత్రీ! ఇతనికేం శిక్ష వేస్తారో వేయండి” అన్నాడు.

మంత్రి లేచి నిలబడి “ప్రభూ! ఇతన్ని తిరిగి వ్యాపారం చేయనీయకూడదు. అంగడిని మూయించాలి” అన్నాదు మంత్రి.

“ఇతనికి గుండు చేయించి సున్నపుబొట్లు పెట్టించండి. రాజధాని చుట్టూ తిప్పి అందరికీ తెలిసేటట్లు చెయ్యండి. వ్యాపారులందరికీ ఇదొక హెచ్చరికగా వుండాలి. అంగడిని పూర్తిగా మూయిస్తే ఇతని భార్యా పిల్లలు ఆదాయం తక్కువయి ఇబ్బందిపడొచ్చు. అందుకని మొదటితప్పుగా భావించి వదిలేద్దాం. ఇతను ఇక ముందెప్పుడూ ఏ రైతును మోసం చేయకూడదు” అంటూ వ్యాపారి వంకకు తిరిగి “మా వేగులవాళ్ళు నిన్ను గమనిస్తూనే వుంటారు. ఇటు తర్వాత ఏ చిన్న పొరపాటు వచ్చినా ఖైదు చేయిస్తాను. జాగ్రత్తగా మసలుకో” అన్నాడు రాజు.

“ప్రభువులు నన్ను క్షమించాలి” అంటూ చేతులు జోడించాడు వ్యాపారి.

“ఇక నా జీవితంలో ఎప్పుడూ ఏ పొరపాటు చెయ్యను. నిజాయితీగా వుంటాను. ఏ రైతు నుంచీ ఫిర్యాదు రానివ్వను. మీ కాళ్ళకు మొక్కుతాను ప్రభూ. నన్నూ, నా పిల్లల్ని అన్యాయం చెయ్యొద్దు. నా జన్మంతా మీకు రుణపడి ఉంటాను” అంటూ మరీ మరీ దణ్ణాలు పెడుతూ వెనక్కు వెళ్ళాడు.

ఆ తర్వాత రాజు గ్రామాధికారి వంకకు తిరిగాడు. “గ్రామాధికారి గారూ! మీరు ఆ పెద్ద గ్రామానికి అధికారిగా వుంటూ చక్కని తీర్పులివ్వటం నేను గమనించాను. నేనొక రోజు మీతో మాట్లాడాను కూడా. గ్రామంలో జరిగే మోసాలను అడ్డుకుంటూ మీరు న్యాయం చెప్పడం నాకు బాగా నచ్చింది. మీకు కొడుకు వున్నాడని చెప్పారు కదా? అతను శాస్త్రాన్ని చదివాడని కూడా చెప్పారు. ఇకనుంచీ మీ గ్రామానికి అతనే అధికారిగా వుంటాడు. న్యాయపరిపాలనతో పాటు ప్రజలకు అన్నిరకాల సమస్యలకు పరిష్కారాన్ని సూచిస్తాడు. మీరిక్కడ రాజధానిలో వుండండి. ఇక్కడ న్యాయాధికారిగా వుండండి. మీకు సమ్మతమేగా” అనడిగాడు.

“తమరి ఆజ్ఞ ప్రభూ! సంతోషంగా మీరు చెప్పిన పనులు చేస్తాను. నన్నూ, నా కుటుంబాన్ని ఇంతగా ఆదరిస్తున్నందులకు మీకు సర్వదా కృతజ్ఞుడిని” అన్నాడు వినయంగా ఆ అధికారి.

చివరిగా దళపతినీ, గూడుపుఠాణి చేసిన ఆ నలుగుర్నీ రాజసభలోకి తీసుకొచ్చారు.

“మన కొలువులో వుంటూ రాజద్రోహానికి పాల్పడిన దళపతినీ, ఆ నలుగుర్నీ కూడా కఠినంగా శిక్షించండి. వీళ్ళంతా మన రాజ్యానికే తీరని ద్రోహం చెయ్యబోయారు” అన్నాడు రాజు కోపంగా.

“వీళ్ళ నాలుకలు కోయించి జీవితాంతం కారాగారంలో ఉంచాలి ప్రభూ. అదే వీళ్ళకు సరియైన శిక్ష” అన్నాడు మంత్రి.

“అలాగే కానివ్వండి” అన్నాడు రాజు.

ఆ తర్వాత ఊరూరా దండోరా వేయించారు. “అందరూ న్యాయంగా, ధర్మంగా ఉండండి. వ్యాపారులతో సహా ఎవరూ మోసాలూ, కల్తీలు చేయకూడదు. అలా చేస్తే కఠినశిక్ష వుంటుంది. ఎవరైనా రాజద్రోహానికి పాల్పడితే కఠిన కారాగారవాస శిక్ష దేశబహిష్కరణ వుంటుంది. రాజభక్తులకూ, ధర్మంగా, న్యాయంగా, దయగా వుండేవారికి రాజుగారు తగిన బహుమానాలు ఇస్తారు. పదవులు ఇస్తారు” అని ఒకటికి రెండుసార్లు చాటింపులు వేశారు. దాంతో రాజ్యంలోని ప్రజలందరూ భయభక్తులతో వుండసాగారు.

చినలక్ష్మణయ్య లాంటి మరికొందరి సహకారంతో, పాత సైనికాధికారుల సహాయంతో కమలనాధ ప్రభువు తన రాజ్యాన్ని ఇంకా పెంపొందించుకున్నాడు. చక్కని పరిపాలన చేస్తూ మంచిరాజుగా పేరుపొందాడు. ప్రతీపాల రాజ్యాన్ని గొప్ప రాజ్యంగా తయారుచేశాడు.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here