Site icon Sanchika

బతుకు సిత్రాలు

[box type=’note’ fontsize=’16’] పాలకులు మారినా… ప్రభుత్వాలు మారినా ‘వలస’ భూతం నుంచి ప్రజలనెవరూ కాపాడలేకపోతున్నారన్నది సత్యం. అలా వలసలు వెళ్ళేవారి కష్టాల్లోంచి పుట్టిందే ఈ ‘బతుకు సిత్రాలు’ కథ. ఎమ్. హనుమంతరావు ఈ కథను సీమయాసలో (కర్నూలు జిల్లా)లో వ్రాశారు. [/box]

[dropcap]రే[/dropcap]పు ‘సోమవారం నాడు ‘బడి’ తెరుస్తారనే మాట ఊరంత ఇనపడుతుంటే శలవుల్లో బా…గ ఆటపాటల్కి మరిగిన నాకా మాట మింగుడు పడక ‘ఎండాకాలం శలవులిడిసి పెట్టి ఇంగా నిన్న మొన్న అన్నట్లే వుండాది… అప్పుడే బళ్ళు తెరుత్తుండారు కదా!’ అని దిగులు పన్నాను.

ఇన్ని దినాలు గుట్లెమ్మట సెట్లమ్మట యాళాపాళా ల్యాకుండ తిరిగినోళ్ళమంతా… ఆదరాబాదరా తయారై సగం సినిగిపోయిన బుక్కుల నంచి భుజానికి తగిలిచ్చుకోని బళ్ళోకి అడుగు పెట్నాము. నిరుడు సదుకున్నోల్ల సరీగే కొత్తగ సేరే పిల్లోల్లుగూడ వొచ్చిందానికి ‘బడి’ అట్లే కంకి తొడిగిన జొన్నసేను మాదిర్గ పాల మెరుగులు మెరుత్తా కళకళ్ళాడిపోతుండాది.

ఐనా ఈ కళ యన్నాళ్లుంటాత్తీ…! మహా ఐతే ఒగ నెల. లేదంటే రెన్నెల్లు! అన్సవారికి అన్ని తరగతుల పిల్లోళ్ళని కలిపి కుసబెట్న్యా పదిపదైదు మందుంటే గొప్పే! వానలు పల్లేదనో, ఒగళాకి మా టైం బాగుండి మొదిట్లో వానలు కుర్సినా; మొంట్లో ఇత్తనాలు పోసుకున్నంక వానదేవుడు మొండి సెయ్యి సూష్తే, మొలకలు రాక మోసపోతిమనో యాదో ఒక్కార్ణంతో ఇండ్లకాడ ముసలి ముతకని ఇడ్సి పెట్టి, ఊరి జనాలు గంట్లు నెత్తి పెట్టుకోని యాదో ఒగూరికి సుగ్గికి (1) బొయ్యేది యేటా సూస్నే కతే గద!

బతకల్యాక ఇట్ల…ఊరిడ్సి పొయ్యేది ఒగ… మా’రాజుల మండగిరి’లోనే కాదు పత్తికొండ, దేవనకొండ, తుగ్గలి, అస్పరి మండలాల్లో మీరు యా పల్లెనన్న తీసుకోండి… నూటికి డెబ్బై-ఎనభై జనం ఇండ్లకి బీగాలేసి సుగ్గికి పోయిండకపోతే నా పేరు రామాంజినే కాదు! అంతగా కావాల్లంటే మీరే విశారించి సూడండి మరి!

***

బడి తెర్సినంక బాగ ఒగ నెల… నెలన్నర గడిసింటాది. ఇంగతే… ! రెడ్దొచ్చ మొదలెత్కో…’ అనే ‘శాస్త్రం’ లెక్క యాటా మాదిర్నే ‘వాన వాన’ అంటా కలవరీయడం మొదల్పెట్నారు ఊరి జనం. ఎవుర్ని సూసినా అరసేతిని పనకి (2) ఆనిచ్చుకోని ఆకాశంలో వుండే మోడాలపక్క ఆశగా ఎగసూసేటోళ్ళు.., లేదంటే, ‘మన బతుకులే పనికిరాని బతుకులు తీ..!’ అని తలకాయకి సేతులు పెట్టుకోని సింత సేసేటోళ్ళ సూడు!

‘అప్పటి కాలాల్లక్క న్యాయమైన కాలాలై వానలు సరీగ్గురిసే పనైతే ఈ టెయానికంత సేన్లమింద పైర్లు సుమార్గ జానడెత్తు పెరిగి, ఒగటో రొండో దెంతె పట్టకాలు గూడ అయిపొయ్యి, మా సేన్లో కలుపంటే మా సేన్లో కలుపని నెత్తికి నీళ్ళు పోసుకునేగూడ పుర్సేతి(3)కి ల్యాకుండ, తనకలాడుకుంటుండేటోళ్ళం! కానీ, ఆ కాలాలు మారిపొయ్యి ఈ అన్యాయపు కాలాలొచ్చి సచ్చిందానికో ఏమో మరి. పెద్దపుజాల.. సిన పుజాల కార్తెలు పొయ్యి, (ఆశ్లేస) అసిలేనొస్తున్నా ‘సినుకు సుక్క’ అనేది నేల రాలకుండుండాది. ఈ యేడుతో సరీగ మూడేండ్లయింది సూడు సరైన వానలు కుర్సక. యప్పుడు… నీళ్ళలో వుండి గడ్డకి పడిన ‘శా(చే)పపిల్ల గదా యండకి నోరు తెర్చుకోని నీలిగినట్ల!(4) భూమమ్మ తల్లి ఎండిపొయ్యి ఊరకట్లే… యక్కడ పడితే అక్కడ ప(నె)ర్రెలు – పర్రెల్దీసి సినుకు సుక్క కోసరం నోరు తెర్సుకోని ఆకాశానికి ఎగసూత్తా వుండాది. ఆ ఆకాశంలో తిరుగుతుండే మోడాలు అనుకూలంగా లేని అన్నదమ్ములక్క పట్టీపట్టనట్లుండి ముందరికి పారిపోతుండాయి.

ఇయ్యాళ వొంగుతాయిల్యా… రేపు వొంగుతాయిల్యా… మర్నాడు వొంగుతాయిల్యా అని మోడాకల్ల ఎగజూసీ… ఎగజూసీ మా మెడలు పట్టకపాయగాని ఆ మోడాలకి మాత్రం మాము సేసే అపలాసన పట్ల్యా! దానికి తోడు… ‘గోరుసుట్టుమింద రోకలిపోటు’లక్క ఈ మిండ్లకి పుట్టిన ఎండొకటి; ఒంటికిలో నెత్తర సుక్కలు పడేతట్ల ఇరగ్గాస్తా మనుషుల్నట్లే  కిందికి మిందికి సేత్తుండాది. అమాసయినంక ఆవు కొమ్ములక్క ఎల్లుకోని దినదినానికి రోంత పెరిగి పెద్దయ్యే ‘సందమామ’లక్క సలికాలం సగమంతరాల్నుంచే మొదలైంది సూడు ఈ యెండ! వానకాలం నడీమద్దెల్లేకొచ్చినా… ఇడ్సుకోకుండ బ్యాగారోళ్ళ ‘ఈరనుమంతమ్మ’కి పట్టిన ‘దెయ్యం’లక్క మొండికి పడి కుసునేద!

ఒగర్లో ఒగర్లేని ఆలుమగల కాపురం కల్లిబిల్లయినట్ల ‘ఈ దేవుళ్ళు (ప్రకృతి) సేసే శాతలకి పెన్నం మీద రొట్టె మాడిపోయినట్ల మన బతుకులు మాడి మసిబారిపోతుండాయం’టా.. మసీదులో కుసోనున్న పెద్దమనుషులు ఇట్లా… తమ బాధలన్నీ సెప్పుకోని అంగలాత్తుంటారు.

ఇంగ మా ఇంట్లో సంగతైతే… ‘ఇంట్లో సూతామంటే సారెడు తినే గింజల్లేవు! వామిదొడ్లో పసలమ్యాతంత పిడికిడు ల్యాకుండై పోయి సుట్రూగుండే కదరకంప ఎక్కిరితుండాది! మనమంటే ఎవురివో ఒగరి కాళ్లు పట్టుకోని తిండి గింజలు తెచ్చుకోని సంగటో సారకో కాసుకోని కాలం గడపొచ్చుల్యా! నోరెరుగని పసరాల సంగతెట్ల మరి?! దినాము జల్లులు… జల్లలు మ్యాత తిని అరిగిచ్చే యెద్దులు; రెన్నెల్నుంచి మ్యాత సరీగ ల్యాక డొక్కలు లోపలికి సేదకపొయ్యి కటికే(కసాయి) వోనికిగూడ తరం కావనేతట్ల ఎముకలు కర్సుకోనుండాయి. పాపం! అప్పటికి మా నాయన ఆ యెద్దుల బాధ సూల్యాక, కాలువగడ్లకల్ల(5) పొయ్యి ఒగ బండి జొన్నసొప్ప తెచ్చి పడేద్దాం తాలని.. యప్పుడు సేతినిండ దుడ్లాడే కమ్మొల సంద్రన్న కాడికి, టీచరు రామన్నొద్దికి.. మన తేలుకుట్టినోడుగదా సెట్టు పెట్టిచ్చుకునేకి తిరిగినట్ల తిరిగ! వాళ్ళు ఈపొద్దు సూతాం… రేపు సూతాం తాలని, ‘వాన సినుకనేదే నేల రాలకపోతే ఈయప్ప యాట్నుంచి తెచ్చి అప్పు దిద్దుతాడో’ అని.. కడాకి సేతులెత్తేసిరి!

ఇంగంతే! మా నాయనికి పెంగిరేగి(6), ‘తూ.. ఈ రైతు బతుకు బతికేకన్నా యా కాన రాజ్యానికో పొయ్యి గాసముండి బతికేది మేల’ని… ప్రాణానికి ప్రాణంగ సాకిన సీమెద్దులు.. ‘గోరంట్ల’ నుంచి సంగనిదుడ్లుపోసి తెచ్చుకున్న యెద్దులబండి, కడాకి ఇత్తనాల గింజల్నిగూడ రాత్రికి రాత్రే తెగమ్మేస! ఆ వొచ్చిన దుడ్లతో సగం అప్పుకట్టి, మిగిలిన దుడ్లకి ఆయాళే పత్రాల్ని రాపిచ్చి, మరునాడు.. ‘రాజంపేట’ కల్ల బెల్టారి పనికి పోదామని మూటముల్లె కట్నారు. తీరా.. గంటు నెత్తి పెట్టుకోని బెయిలెల్లే ముందర- ‘కాదు.. కర్మకాలి మనం ఊరిడ్సిపోతే పోతిమిల్యా! మధ్యలోన పిలవోని సదువు అద్దుమానం(7) అయిపోతాది కదా!’ అని గడ్డానికి సేతులు పెట్టుకోని సింత సేసుకుంట న(న్ను)న్ని ఈడే మా సిన్నాయనొళ్ళింట్లో ఇడిసి పెట్టిపోతే వాడే సదువుకుంటాడు కదా! అని ఆలోసన సేస్నాడు నాయన!

అమ్మ – ‘మనకుండేది ఒక్కగానొక్క మొలక! నాను వాన్నిడిసి వుండలేన’ని ఒప్పుకోల్యా!

‘కాదు.. ఈ యేడుతంత ఇగ్గిచ్చినామంటే మనూరి బళ్ళో సదువు పూర్తైపోతాది. ఇసాకి(8) పత్తికొండ బళ్ళో సేర్పిచ్చి, అట్లే.. ఆస్టల్లోన పడేసినామంటే ఇంగ మనం యాడపడున్నా వాని సదువుకి అడ్డమనేదుండదు. పండగలకి పబ్బాలకి వస్తా-పోతా పిల్లోని మంచి- సెడ్డ సూసుకోవచ్చ’ని అమ్మని సమ్దాయించి సూస్నాడు నాయన. ఐనా మాయమ్మ ఒప్పుకోక… ‘పిల్లోడొగతాన మనమొగతాన వుండేతట్లుంటే.. ల్యాకుంటేమన్ల్యా ఆ కమ్మని సదువు! లోకంలోన అందరు సదువుకున్నోళ్ళే వుండారేమి!? కూలినాలి సేస్కోని బతికినా సింతల్యా! పిల్లోడు మాత్రం మన కండ్లముందరుండల్ల’నింది అమ్మ. ఆ మాటకి నాయన్కి కోప్మొచ్చి.. ‘ఏయ్ సింపిరి నెత్తిదానా! సదువు గురించి నీకేం తెల్సెల్లేదు వూరక పడిండ్రదా! మామాపొద్దు ఏమి సదివినామ్ల్యా! అని బడికి ఎగనామం పెట్టిందానికే ఇగా ఇట్ల.. సత్తూ బతుకుతుండాము. వానికదే గతిని పట్టిద్దామా?!’ అని అమ్మ మిందికి లేసుకున్నాడు!

‘నువ్విట్లే నన్నీడ్సి తన్నినా సింతల్యా! నాను మాత్రం ఒప్పుకోనంటే ఒప్పుకోను. మీ తమ్మునికి ముక్కుమింద కోపం! పిలవోన్ని సిటికిమాటికి కొట్టుకుంటుంటాడు. వీడు ముందరంగనే ఒంటెముకోడు! పిల్లోన్ని ఆయప్ప సేతిలో పెట్టి పోయినామంటే, వాడు దినాము తన్నులు తినుకుంట పెయ్యి కట్టక (9) పాలుమారిపోతాడని(10) ఏడుత్తా మొండిపట్టుదల పట్టుక్కుసునుంది అమ్మ!

‘తత్తర్.. బాంచెత్..! నెత్తిమీద నీళ్ళకుండ పెట్టుకోని పుసుక్కున కన్నీళ్ళు ఇడ్సేద్దప్ప… ఈ ఆడోళ్ళకి ఏమీ తెల్సేల్లేదు. మనమేం పిల్లోన్ని అరణ్ణడివిలో ఇడ్సి పెట్టి పోతుండామా ఆతిరంగ అంగలాసేదానికి! ఔల్యా! మా తమ్మునికి రోంత కోపము యక్కువే! యప్పుడు తన్నుకుంటాడంటే, వాడైనా ఏంటికి తంతాడు? ఈయప్ప ఏమైనా తప్పుజేత్తే తంతాడు. సిన్నాయన కదా! తంతే తన్ననిల్యా! ఈయప్ప కిరీటమేమన్న కింద పడిపోతాదా!?వాడే బుద్ధి తెచ్చుకోని ఇంగోసారి తప్పులు సెయ్యకుండ మసుల్కుంటాడు. ఏం? మామంద్రు తన్నులు తినకుండే పెద్దయినామా! మా నాయన సచ్చి ఆ… గుడిసేన్లో పండుకునేడ సరిపాయ!ల్యాకుంటేనా.. సెలకాల తీస్కోని సందుల్పొడూత పారాటిడ్సేటోడు తెల్సునా..! సచ్చేదానికి మూన్నాళ్ళ ముందర గూడయాదో కయ్యాల్లో వుండి ‘ఎద్దు’ని తొలుగు తెంపుకునేతట్ల కట్టేసింటే ‘పిల్లల తండ్రైనాగూడ ఇంగా నీకి ఎద్దుని కట్టేసేకి రాదా నీకని సేతిలో కట్టె తీస్కోని ఒక్క దెబ్బచ్చినాడు కదా మిందికి! పడెరా దెబ్బ తలకాయకి అనుకోని దిమ్మరకపొయ్యి, అట్లే కండ్లుమూసుకొని నిలబడ్తి! యట్లట్లో మనిషి మ్యారకొచ్చి నిలబడిపాయ! ల్యాకుంటే, ఆ ఏటుగీన నెత్తికి తగిలింటే ఆయప్ప కంటే ముందర నానే సచ్చి గుడి సేన్లో పండుకునేటోన్ని! అగా మా నాయన సాలే నీ మరిదికి పడిండేది! నిజం సెప్పల్లంటే వాడు మా నాయన నోట్లోనుంచి దుషిపన్నాడు(11)! దానికే వానికి అంత కోప్ము! ఈ సిమింతటదాన్ని పట్టుకోని యాలాడితే మన పిల్లోని బతుకే కదా నాశనమయ్యేద’ని నాయన ఎంత ఇడమర్సి సెప్పినా అమ్మ పట్టిన పట్టు ఇడ్సల్యా!

నాయనకి యాసిరికొచ్చి ఏం సెయ్యల్లో అర్థంకాక కడాకి నన్ని వొద్దికి పిల్సుకోని- ‘నాయనా! మా ఇద్దరి సంగతి ఇడ్సి పెట్టు. నీకి మా యెంబడి మూట్లు ఎత్తుకోని రావడం ఇష్టమా? ల్యాక బాబాయొళ్ళింట్లో వుండి సక్కగ సదువుకునేది ఇష్టమా?’ అని అడిగినాడు. బడి ఇడ్సినంక నన్నిసూడకుంటే రోంత సేపుగూడ తాళ్ళేడు కదా! మీ ఎనకనే వత్తాననే మాటే కచ్చితంగ సెప్తానని అమ్మ మొకంలోన రోంత సంతోషం కనపడింది. కానీ, నాను- ‘సిన్నాయనొళ్ళొద్దనే వుండి సదువుకుంటా’నని సెప్పేతలకే మొకం మాడ్సుకోని అలిగి ఆ పక్కకి తిరిగి కుసునుంది! తన మాటే నెగ్గిందనే సంబ్రంలో.. ‘అద్దీ నా కొడుకు మాటంటే!’ అని జవురి పైకెత్తుకోని నన్ని ముద్దులాడుకుంట.. అట్లే నగతా అమ్మపక్క సూసి మీసాలు దూగినాడు నాయన! అమ్మ మనుసుని బాధ పెట్టకూడదని నాయన మీద నుంచి దిగి, అమ్మొద్దికి పొయ్యి కొంగులో కుసునుకోని ‘ఒమా! నువ్వేం బాధపడొద్దు. నాను ఈడే ఉండి బాగ సదువుకుంటాను. నిన్న ప్రవేట్ బళ్ళో (ట్యూషన్‌లో) పద్యాలు మేలగ సెప్పినానని ‘లాలు సాహెబ్’ సారు మెచ్చుకోని అందరితో తప్పట్లు కొట్టిచ్చి, ‘లే! నువ్వు మంచి తెలివైనోడివి రా..! ఇట్లే సదివినావంటే పెద్దయినంక ఇంజనీరైతావు. ఇంజనీరువి అయినావనుకో రేయి… పగలనక రెక్కలు ముక్కలు సేసుకొని కష్టపడే మీ అమ్మనాయన్ని ఇంట్లోనే కుసనబెట్టి సాకొచ్చు. అప్పుడు మీ అమ్మనాయన ఎంతో సంతోషపడతార’ని సెప్పినాడు. ఎన్ని తిప్పలొచ్చినా సదువు ఇడిసి పెట్టనని సేతిలేకి సెయ్యి గూడ ఏసినా! దానికే, నాను ఈడే వుండి సదువుకుంటానని మంకుపడితే, ‘సూసేకి జానెడు లేడు… ఈ నా కొడుక్కి ఇంత ధైర్నం ఎక్కన్నుంచి వొచ్చిందప్పా!’అని నోటికి సెయ్యి అడ్డ పెట్టుకోని; ఆచ్ఛరకపోతా.. ‘సరే! నీకి మీ నాయన్కి ఇష్టమున్నట్లే కాన్ల్యా నాయనా!’ అని మనసు సంపుకోని తీసకపొయ్యి, సిన్నాయన్కి సిన్నమ్మకి నన్నప్పజెప్పి, వాళ్ళు వొద్దొద్దని సెప్తున్నా రెన్నెళ్ళ బత్తెము, ఇన్నూరు రూపాయలు దుడ్డు, అట్లే నెల… నెల స్టోరు బియ్యము తెచ్చుకోండని రేషనుకార్డు… వాళ్ళ సేతిలో పెట్టి…,

‘అమ్మనాయన వొద్దలేరని ఊరక యదారు(12) సెయ్యెద్దు నాయనా! సిన్నమ్మతో యాలాకి బువ్వ పెట్టిచ్చుకోని తింటా.., సెప్పిన మాటినుకుంట మడ్సానంగుండి బుద్దిగ సదువుకో! ఇడిసి పెట్టి పోయినాము కదాని అల్లరోళ్ళ జతపట్టి ఇష్ట ప్రకారం తిరుక్కుంటుండొద్ద’ని ఒగరుమెచ్చొగరు ముద్దులాడుతా సెప్పి, నన్నిడ్సి పోలాకపోతా- ‘పిల్లా తల్లిని ఎడబాపే గడ్డుకాలమొచ్చి సచ్చ కదరా! ఈ వానదేవునికి ఏమి అగ్గిపడే రోగమొచ్చేద్నో సూడు మరి! మనుషుల్ని ఇట్ల రోపీకుండ(13) సరైన టెయానికి వానలు కుర్సింటే మాకీ యతలు తప్పేవ’ని ఏడుస్తా.. మూట-ముళ్ళే తీస్కోని ఆటో ఎక్కి ‘గుత్తి’ రైలు టేషన్కి పోయినారు. వాళ్ళు ఎక్కిన ఆటో కనుమరుగైతానే సంగటం పొంగుకోనొచ్చి గెట్టిగ ఏడ్సల్లనిపిస్తుండాది. అట్ల ఏడ్సినానంటే, ఎనకనే యేరే ఆటో ఎక్కిచ్చి అమ్మొళ్ళలో కలిపొస్తాడు మా సిన్నాయనని…  ఏడుపుని దిగమింగేకి తండ్లాడుతుండాను. అయినా నా తరం కాకుండుండాది. ఇంగిట్లయితే కాత్తీ..! అని సెంబట్టుకోని పొయ్యి, కొండమ్యార్నుండే నల్లన్నోళ్ళ దిబ్బలో కుసున్కోనీ- ఓ… ఓ అనీ దిబ్బ ఎత్తకపొయ్యేతట్ల ఏడ్సి… ఏడ్సి కన్నీళ్ళన్నీ ఇంకిపోయినంక ఇంటికొచ్చినాను.

తొలి నాలుగైదు దినాలు గడిగడికి అమ్మనాయన మతికొస్తున్నా ఆ బాధనట్లే ఓర్సుకున్నాను. సదువంటే ఎంతో ఇష్టముండబట్టే వీడు వీళ్ళ అమ్మనాయనెంట పోలేదని సారొళ్ళంతా శానా ప్రేమంగ సూసుకుంటుండారు. వాళ్ళ దయవల్ల సదువుకేమీ ఢోకా ల్యాకుండ వుండాది. అదేమాట అమ్మనాయన ఫోన్ సేసినప్పుడు సెప్తావుంటాను. వాళ్ళు. ‘మంచిదిల్యారా సిన్నోడా.. బాగ సదువుకో! అట్లే, సిన్నమ్మ సిన్నాయన మాటకి ఎదురు సెప్పకుండ మడ్సాసంగ మసులుకో’ మంటావుంటారు.

మొన్న రాత్రి ఫోన్ సేసినప్పుడు సంకురాత్రి పండక్కి వస్తుండామని, వచ్చేతప్పుడు కొత్త బట్టలు తీసుకోని వస్తామన్నారు. దేవుని దయతో పనులు గానీ బాగ జరిగినాయంటే అట్లే.., సైకిలు గూడ తీసిత్తామన్నారు. నాను సంబరంతో సంకలెగరేసి, అన్సకారికి తమాయించుకొని, సదువు ధ్యాసలో పన్నాను.

***

ఇయ్యాళ ఆదివారం శలవనే సంబరంలో పడి పొద్దున్నుంచి ఆటపాటల్లోనే మునిగి తేలుతుండాను. మాసారి పొద్దు బారెడుండాదనంగ ‘హోమ్‌వర్క్’ల సంగతి మతికొచ్చి, నెత్తి… నెత్తి కొట్టుకుంట ఇల్లు సేరితి.

బయట కట్టమింద ఈతసాప పర్సి బుక్కులు ముందరేసుకోని ‘ఇబ్రహీం’ సారు సెప్పిన లెక్కల్లో మునిగినాను. గడి (య) సేపు గడిసేతలకే, సేన్లకి పోయినోళ్ళు వుత్త సద్దిగంట్లు నెత్తి పెట్టుకోని, నగతా… గెలుస్తా… మా ఇంటిముందరెళ్ళి ఇండ్లకి పోతావుండారు. వాళ్ళని సూసి ‘మన బతుకులు గతి తప్పినాయి నాయనో!’ అని ఏడుత్తా… మూట-ముళ్లి ఎత్తుకోని సుగ్గికి(వలస) పోయిన మాయమ్మ నాయన కండ్లల్లోన కదలాడినారు. కన్నీటిధారలు కడతలమీదనుంచి జారిపోతా… వుండాయి…

దావన పొయ్యే మా సంద్రమ్మ అత్త – ‘రామాంజీ..!’ అని క్యాకేసి పిల్సడంతో ఉలిక్కిపడి అటుపక్కకి సూస్తి. అత్త – ‘ఏమి మొకం అట్ల సన్నపొయ్యేద’ని అడుగుతా వొచ్చింది. కండ్లలో నీళ్లు సూసి, గాబరా పడి, దగ్గరికి తీస్కోని కన్నీళ్లు తుడుస్తా..’అమ్మనాయన మతికొచ్చినారా నాయనా..?’ అడిగింది జాలిగా.

అత్తని సూసినంక నా ఏడుపు ఇంగా ఎక్కువాయ! ఎంత ఓదార్సినా ఏడుపు ఆగకుండవుండాది. నాను బాధపడేది సూసి తట్టుకోల్యాక ‘అత్త’గూడ కన్నీళ్ళు పెట్టుకొని- ‘ఆ రాతి దేవునికి మన కష్టాలు కంటపడవేమో సూడ్రా..! ఒక్కోసారి పనిగట్టుకోని బీదావోళ్ళ బతుకుల్ని సెట్లు గుట్లుపాలు సేసి, అటెంక మనం పడే యతలు సూసి సంబరపడతాడేమో అనిపిస్తాది! ల్యాకపోతే, బంగారం పండే ఎనమిదెకరాల ఎర్నాల భూమి పెట్టుకోని, ఏంటికిట్లా పరిస్థితి దాపురించేదంటే, ఏం! మీ నాయనేమి జూదం ఆడ్నాడా… సాని కొంపల సుట్టు తిరిగినాడా? భూమమ్మ తల్లిని నమ్మినాడంతే! దానికే మనకీ గతి పట్టి, బతుకులు సిట్లి సిల్లాపల్లమై పోయినాయి! పుట్టుకతోనే కన్నో-కాలో వంకరైతే, యాదో భగవంతుడు సన్నసూపు సూసినాల్ల్యా! అని యట్లో రాజీపడి బతుకునీడుత్తాముల్యా! కాల్లు.. సేతులు అన్ని బాగుండి గూడ బతుకునిట్లా.. ఈడ్సే పనైతే ఏమని మొత్తుకొనల్ల! ఇట్లా.. దరిద్రం పట్టిన బతుకుల గతి ఇంతే! బతకనీకుండదు.. బట్టకట్టేకుండదు. మధ్యలోనపడి, కుత్తిక తెగిన కోడిలక్క ‘గిజగిజ’మని కొట్టుకులాడి.. కొట్టుకులాడి కడాకి పాణం ఇడల్సిందే! మన (కర్నూలు) జిల్లా జనం బతుకులంత ఇగా ఇట్లే ఉండాయి సూడు..! ఏమేమి పాపాలు సేసి పుట్నామో ఏమో తెల్లు గానీ, వుండూర్లో పడుండి.. కమ్మగ తినుకుంట (పని) సేసుకుంటుండి, మంచి- సెడ్డ సూసేదానికి ల్యాకుండ, బతుకం..త కడుపు సేతపట్టుకోని ఆ ఊరు ఈ ఊరు తిరిగేదానికే సరిపోతుండాది’. అత్త తన మనసులో బాధనంత ఇట్లా.. యెల్లగక్కి, రోంత నిమ్మళపన్నంక (14)…

‘మా బతుకులు యట్లుంటే ఏమిల్యా రామాంజి..! నిన్ను ఐనా బాగ సదివిచ్చుకుంటే నీ బతుకున్న బాగుపడతాది కదా అని మీ అమ్మనాయన ఆశ! అంతేగాని, నిన్ను ఇడ్సిపెట్టిపోవల్లని వాళ్ళకేమి కోరిక్కాదు. ‘నా కడుపులో ఒక్క కాయ కాసేతట్ల వరమీ దేవుడా!’ అని మీయమ్మ ఎన్ని దేవుళ్ళకి మొక్కిందో ఎన్ని నోములు నోసిందో నాకు తెల్సు! ఇయ్యాళ పరిసితులు బాగల్యాక నిన్ను ఇడ్సి పెట్టి పోవల్సొత్తే, ప్రాణమంతా నీ వద్దనే పెట్టి, వుత్త మొండాల్లో మూటలెత్తుకోని పొయ్యి, ఆడుండారు నాయనా వాళ్ళు..! నువ్వు అది అర్థం సేసుకోకుండ సిన్నదానికి పెద్దదానికి ఏడ్సుకుంట వున్నావనుకో.. సదువు తిప్పడింటికి పోతాది.. తిప్పడిమూట నీ నెత్తిమిందికొత్తాది. అంతే సూడు. ఇప్పుడు మా బతుకుల్లో జరిగిండేది అదే! నీ బతుకు అట్ల కాకూడదనుకుంటే ఇట్లా వన్నిటికి తట్టుకోని నిలబడగలగల్లంటా..’ నాలు మంచిమాటలు నూరి పోసింది అత్త.

అత్త సెప్పిన మాటల్లో నా జీవితం కనపడింది. ఇంగ ఎనక-ముందు ఆలోసించుకోకుండ మెల్లంగ బుక్కుల సంచి తీస్కోని ప్రవేటుబడికి బయలెల్లినాను అత్త మొకంలో నగువుని సూస్తా…

(సమాప్తం)

  1. వలన
  2. నుదురు
  3. తీరిక లేకుండా
  4. చచ్చినట్లు
  5. నీటి పారుదల ఉండి పంటలు పండే వైపు
  6. కోపం వచ్చి
  7. అధ్వానమగు, నిష్ప్రయోజనమగు
  8. రేపటి సంవత్సరానికి
  9. ఒళ్ళు చేయక
  10. బలహీనపడి పోవడం
  11. ఊడిపడ్డాడు
  12. దిగులు
  13. విసిగించకుండ
  14. శాంతపడి

Exit mobile version