ఆసక్తికరమైన “బత్తీ గుల్ మీటర్ చాలూ”

0
1

[box type=’note’ fontsize=’16’] “ఇది కచ్చితంగా వ్యాపార చిత్ర మూసలోదే. ఆ హీరోని ప్రవేశ పెట్టడం కాని, డ్రామా కాని. కాని వొక సీరియస్ చిత్రం ఇచ్చే తృప్తిని ఇస్తుంది” అంటూ “బత్తీ గుల్ మీటర్ చాలూ” సినిమాని విశ్లేషిస్తున్నారు పరేష్ ఎన్ దోషి. [/box]

[dropcap]ఎ[/dropcap]డిటర్ గా సినిమాల్లోకొచ్చిన శ్రీ నారాయణ్ సింఘ్ తర్వాత దర్శకుడై ఈ మధ్యనే “టాయ్లెట్: ఎక్ ప్రేమ్ కథా” తో ప్రజల నోట్లో నానాడు. ఇతని మొదటి చిత్రమైతే “యే జో మొహబ్బత్ హై”. ఇప్పుడొచ్చిన “బత్తీ గుల్ మీటర్ చాలు” నిడివి మూడు గంటలు. కాని ఎడిటర్‌ వున్న అనుభవమూ, కథ, మానవ సంవేదనలు, మనస్తత్త్వాలూ వీటిని తెరపై చూపించే విధమూ మనకు యెక్కడా విసుగు అనిపించదు.

హిందీలో ఈ మధ్య సినెమాలు ఫార్ములా చిత్రాలలో వుండే timeless spaceless nowhereland నుంచి స్పెసిఫిక్ గా వొక పల్లెలోనో, ప్రాంతంలోనో అక్కడి ప్రజల నిజమైన సమస్యను తీసుకుని, అక్కడి కట్టు-బొట్టు-మాటా వొంట బట్టించుకుని, అక్కడి వీధుల్లో చిత్రీకరించి మనల్ను కూర్చున్నపళంగా అక్కడికి తీసుకెళ్తున్నారు. వొకటి కథా రచయితలకు ఇవి మంచి రోజులు. మంచి కథలు వెలుగులోకొస్తాయి. సంభాషణా రచయితలకు కూడా. మనకు వొకటో రెండో రకాల హిందీ (హాలివుడ్ హిందీ కాకుండా) తెలిసి వుంటే ఇప్పటి సినెమాల పుణ్యమా అని చాలా ప్రాంతాల యాసలు తెలుస్తున్నాయి. శుభ పరిణామం.

ఇది కచ్చితంగా వ్యాపార చిత్ర మూసలోదే. ఆ హీరోని ప్రవేశ పెట్టడం కాని, డ్రామా కాని. కాని వొక సీరియస్ చిత్రం ఇచ్చే తృప్తిని ఇస్తుంది. అదనంగా ఇది అన్ని రకాల ప్రేక్షకులనీ దగ్గరకు లాక్కుంటుంది. ప్రస్తుతానికి ఇలాంటివి యెక్కువ అవసరం.

SK (షాహిద్ కపూర్), నౌటి (శ్రధ్ధా కపూర్), త్రివేది (దివ్యేందు శర్మ) చిన్నప్పటినుంచీ స్నేహితులు. ఎస్కే లాయరు. యెక్కువగా బ్లాక్‌మెయిల్ పధ్ధతిలో కేసులని కోర్టు బయటే సెటిల్ చేసే “చమత్కారి”. నౌటి వొక డ్రెస్ డిజైనర్. త్రివేది కొత్తగా వొక ప్రింటింగ్ ప్రెస్స్ పెట్టిన లఘు ఉద్యోగపతి. సినెమా అసలు కథ మొదలు కాకముందు వీళ్ళ స్నేహం, నవ్వులు, డేటింగ్ లాంటివి సాగుతాయి. అసలు కథ కు సమానంగా ఇది కూడా ఆకర్షిస్తుంది. పాటలకూ మాటలకూ మధ్య సరిహద్దు చెరిపేసింది ఈ చిత్రం. ముఖ్యంగా మొదటి అరగంట. ఇదంతా వాళ్ళ స్వభావాలు తెరకెక్కించడానికి ఉపయోగపడే మెట్లు. తిన్నగా అసలు కథలో కెళ్ళిపోతే కొంత వెలితిగా వుండొచ్చు. ఉత్తరాఖండ్లోని టిహరి గఢ్వాల్ ప్రాంతాల్లో కరంటు కోతలూ, భారీ కరెంటు బిల్లులు (బత్తీ గుల్ మీటర్ చాలూ అంటేనే కరెంటు లేకపోయినా తిరుగుతున్న మీటర్లు అని) దానివల్ల జనం పడుతున్న కష్టాలు, వాటి కోసం ప్రజల ఫైటు ఇది మూల కథ. ఉత్సాహంగా ప్రింటింగ్ ప్రెస్స్ అయితే పెట్టాడుగాని, యెప్పుడూ కరంటు కోతలు, జెనెరేటర్లు వాడక తప్పని పరిస్థితి వీటికి తోడు లక్షల కరంటు బిల్లులు. ఆ విద్యుత్ సంస్థకు ఫ్రియాదులు చేసినా ఉపయోగముండదు. ఒకసారైతే 54 లక్షల బిల్లు వస్తుంది. అది కట్టాలంటే ఇల్లు అమ్మకానికి పెట్టాలి. ఎస్కే లా ధైర్యసాహసాలు లేని భయస్తుడైన త్రివేది వో సామాన్యుడు. తను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులతో బిల్లు కట్టి ఇంటిని తల్లిదండ్రులకు మిగల్చాలని ఆత్మహత్య చేసుకుంటాడు. ఇక అక్కడినుంచి ఎస్కే రంగంలో దిగుతాడు. తన పూర్వపు పధ్ధతులకు స్వస్తి చెప్పి విద్యుత్ సంస్థ మీద దావా వేస్తాడు. మొదటి సారి కోర్టులో ప్రవేశిస్తాడు. ఆ తర్వాతి కథ అంతా దీని వెనుక ప్రజల నిస్సహాయత,వెతలు, ప్రభుత్వపు పట్టనితనము, ప్రైవేటు విద్యుత్ సంస్థల మోసాలు అన్నీ చర్చకు వస్తాయి.

ముందుగా ప్రస్తావించాల్సింది చాయాచిత్రణం (అమ్షుమన్ మహాలయ్), నేపథ్య సంగీతం (అనామిక్ చౌహాన్, విజయ్ వర్మ, అరబింద్ లైటన్). ఆ తర్వాత కథా-సంభాషణలు (విపుల్ రావల్, సిద్దార్థ సింఘ్, గరిమా వహల్). Solid work. ఇక నటనకొస్తే అందరూ బాగా నటించారు ముఖ్యంగా కపూర్లు, శర్మ. షాహిద్ వొక వాణిజ్య చిత్రాల హీరోలలాగా తోపు మాత్రమే కాదు వొక మాములు మనిషి కుండే అన్ని సంవేదనలూ ప్రకటించే నటుడు. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత ఎస్కే-త్రివేదీలు కలిసినప్పుడు సన్నివేశం. అను మలిక్ మరో ఇద్దరు పాటలకు సంగీతమిచ్చారు. పాటలన్నీ బాగున్నాయి. చూడాల్సిన చిత్రమనే అంటాను. అన్నట్టు ఇప్పుడు హిందీ చిత్రాలలో నటించే వాళ్ళకు ఆ కథా ప్రాంతపు భాషా వ్యవహారాలు నిశితంగా పరిశీలించి పలకగల సత్తా వుంటేనే, ఇదివరకటిలా చెల్లదు. చిత్రం మొదట్లోనే ప్రాసలతో ఆడుకుంటూ స్పాంటేనియస్గా ముగ్గురు మిత్రులు మాట్లాడే సన్నివేశం చాలా పొడుగైన సింగిల్ షాట్. అందరూ అద్భుతంగా తమ లైన్లు చెప్పారు, ప్రేక్షకుల నోట్లో పంచదార పోస్తూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here