బతుకు చక్రం…!!

196
2

[dropcap]ఆ[/dropcap] రోజు ఎప్పటిలాగే రఘు తన ఆఫీసుకు పది నిమిషాలు ముందుగా వచ్చి కూర్చున్నాడు. చుట్టూ చూశాడు, ఇంకా అప్పటికి స్టాఫ్ ఎవరూ రాలేదు. అప్పుడప్పుడే స్టాప్ ఒక్కొక్కళ్ళూ రావడం మొదలుపెట్టారు. ఒక ఉద్యోగి మాత్రం అందరి టేబుల్స్ పైన మంచినీళ్ల బాటిల్ లు తెచ్చి పెడుతున్నాడు. ఒక 10 నిమిషాలు గడిచేసరికి అందరూ ఉద్యోగస్థులు వరుసగా అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం పెట్టి తమ బల్ల దగ్గరికి వెళ్లి కుర్చీ లాక్కుని సర్దుకో సాగారు. కొందరు న్యూస్ పేపర్లు ముందు వేసుకొని పతాక శీర్షికలు చూడటం మొదలుపెట్టారు. ఒక చిరు ఉద్యోగి అందరికీ వేడి వేడి టీలు తీసుకొచ్చి పెడుతున్నాడు

రఘు తన బీరువా తెరిచి ఆ రోజు చేయవలసిన పనులకు సంబంధించిన ఫైల్లు టేబుల్ మీద పెట్టి కూర్చున్నాడు.

ఆరోజు అర్జెంటుగా చూడవలసిన ఫైళ్లలో తలమునకలు అయిపోయిన రఘు, ఎదురుగా ఎవరో వ్యక్తి నిలబడినట్లు గమనించి తల ఎత్తి పైకి చూసాడు

ఎదురుగా బక్కచిక్కి బాగా పెరిగిన గడ్డంతో, మాసిన దుస్తులతో, అమాయకంగా,ఆందోళనగా ఒక వ్యక్తి దీనంగా నిలబడి ఉన్నాడు.

రఘు అతన్ని ప్రశ్నార్థకంగా చూసి అడిగాడు

“చెప్పండి ఏం కావాలి మీకు?”

“సార్, మాది ఒక డెత్ పాలసీ ఉంది సార్. మా అల్లుడు నెల క్రింద వాహన ప్రమాదంలో చనిపోయాడు. దాని గురించి వచ్చాను”అని రఘు వైపు దీనంగా చూశాడు.

“ఓహో, అలాగా సరే కూర్చోండి” అంటూ ఎదురుగా ఉన్న కుర్చీ చూపించాడు రఘు.

అతను చేతిలోవున్న డాక్యుమెంట్స్ అన్ని రఘు చేతిలో పెట్టాడు. ఆ ప్రమాద మరణం తాలూకు వివరాలు అన్నీ చదివాడు రఘు.

“స్నేహితుడి పెళ్లి పత్రికలు తీసుకొని పక్కనున్న ఊర్లో పంచి వస్తుండగా జాతీయ రహదారి మీద వెనకవైపుగా వస్తున్న లారీ వీరి మోటార్ సైకిల్‌ని కొట్టేసి వెళ్ళిపోయింది” అని చెప్పాడు ఆ వ్యక్తి. పంచనామా ఎఫ్ఐఆర్ పోస్టుమార్టం రిపోర్ట్స్ అన్నీ చదివి కొన్ని ఇన్సూరెన్స్ పేపర్లు అతని చేతిలో పెట్టి “ఇవన్నీ ఫిలప్ చేసి అందులో అడిగిన డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీలు పెట్టి నాకు ఇవ్వండి” అన్నాడు రఘు.

“ఎన్ని రోజుల లోగా డబ్బులు వస్తాయి సార్? అసలు వస్తాయా??” అని ఒక రకమైన భయంతో ఆతృతతో అడిగాడు, ఆ వ్యక్తి.

“మీరు ఎంత త్వరగా ఆ డాక్యుమెంట్స్ అన్నీ ఇస్తే అంత త్వరగా నేను మీకు ఇప్పించగలను, మీకు తప్పకుండా వస్తాయి. అందులో ఏమి ఇబ్బందులు లేవు” అని రఘు వినయంగా చెప్పాడు.

అతను లేచి రెండు చేతులతో నమస్కారం పెట్టి “నాకు సహాయం చేయండి సార్, నాకు ఒక్కతే కూతురు. దానికి ఇద్దరు చిన్నపిల్లలు, మీ సహాయం జీవితమంతా మర్చిపోలేను” అని అతని కళ్ళల్లో నీళ్ళు ముంజేతితో తుడుచుకుంటూ చెప్పాడు. అతడిని చూస్తుంటే చాలా బాధగా అనిపించింది రఘుకు. తైల సంస్కారం లేని జుట్టు. కొన్ని నెలలుగా గడ్డం చేసుకోలేదు. రంగు వెలిసిన పాత దుస్తులు వేసుకున్న అతడిని చూస్తే జాలివేసింది రఘుకి.

 “నేను మీకు పూర్తిగా సహాయం చేస్తాను, మీరు ఆ డాక్యుమెంట్ త్వరగా తీసుకురండి, వీలైనంత త్వరగా నేను మీకు చెక్కు ఇప్పిస్తాను. మీరు అధైర్య పడకండి” అని సర్ది చెప్పాడు. అయినా కదలకుండా అలాగే నిలబడ్డ అతన్ని ఈ సారి కాస్త తేరిపార చూశాడు. అతన్ని చూస్తుంటే ఎక్కడో ఎప్పుడో అతగాడిని చూసినట్టుగా అనిపించింది రఘుకి.

వెంటనే రఘు ఆలోచనలు గతంలోకి మళ్ళాయి.

***

బిఎస్సీ డిగ్రీ పరీక్ష ఫలితాలు ఆ రోజు పేపర్లో వచ్చాయి. రఘు అనుకున్నట్లుగానే ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడు. పక్కవారి ఇంట్లో వచ్చే న్యూస్ పేపర్‌లో తన రిజల్ట్స్ చూసుకొని ఇంటికి వెళ్లి తల్లి – చెల్లెలు తమ్ముళ్లతో ఈ విషయం చెప్పాడు.

డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు చదవటానికి వివిధ రకాల యూనివర్సిటీలకి అప్లై చేశారు. రఘు మాత్రం ‘ఇంక చాలు చదువు, ఉద్యోగం తెచ్చుకోవడం ప్రస్తుతం జీవన్మరణ సమస్య’ అని నిశ్చయించుకున్నాడు. కుటుంబ పరిస్థితులు నాన్నగారి ఆర్థిక స్థితిగతులను బట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్‌  చేయడం కల్ల అని రఘుకు తెలుసు. అందుకని చదువు మీద ఎంత మమకారం ఉన్నప్పటికీ ఉన్నత చదువుల మీద ఎటువంటి ఆశలు పెట్టుకోలేదు.

బ్యాంకు, ఇన్సూరెన్స్, రైల్వే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు సన్నద్ధం కావడం ఇక తదుపరి కార్యక్రమం అనుకొన్నాడు రఘు. తోటి విద్యార్థులు అందరూ స్నేహితులు కూడా తమ తమ ఇళ్లకు వెళ్లి పోవడం వలన ఎవ్వరూ లేరు ఒక వెంకు తప్ప. వెంకును కలిసి వద్దాం అనుకుంటూ ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళాడు. తను వెళ్ళేటప్పటికి అక్కడ వాతావరణమంతా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ అమ్మ నాన్నగారు సాదరంగా లోపలికి రమ్మని పిలిచి కూర్చోబెట్టి చాలా సంతోషంగా నిర్మలంగా నవ్వుతూ స్వీట్లు చాక్లెట్లు ఇచ్చి తినమని, “ఏరా! ఏం చేద్దాం అనుకుంటున్నావ్ నెక్స్ట్?” అని ప్రశ్న వేశారు రఘుని.

“ఇంకేం చేస్తా అండి, ఉద్యోగం వెతుక్కుంటాను” అన్నాడు రఘు.

“అదేంటి ఎమ్మెస్సీ చేయవా? ” అని అడిగారు.

“లేదండి నేను ఉద్యోగం చూసుకుంటాను” అన్నాడు రఘు మనసులో బాధను దాచుకుంటూ.

“మరి నీ సంగతేంటి రా “అని వాళ్ళ అబ్బాయి వెంకటేశ్వరరావును ప్రశ్నించారు.

“నేను ఉద్యోగం చేయను నాన్న! ఎమ్మెస్సీ కూడా చేయను! ఏదో వ్యాపారం చేసుకుంటాను!!” అన్నాడు.

“సరేరా. నీ ఇష్టం” అంటూ ప్రశాంతతతో కూడిన నవ్వు నవ్వారు వెంకటేశ్వర్రావు నాన్నగారు.

రఘు వెంకు ఇంటికి బయలుదేరిన కొద్దిసేపటి తర్వాత వాళ్ళ నాన్న గారు ఇంటికి వచ్చారు. “ఏవండీ రఘు రిజల్ట్స్ వచ్చాయి! వాడు బీఎస్సీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యాడు!!” అని వాళ్ళ అమ్మగారు నవ్వుతూ చెప్పారు.

“అలాగా.. చాలా సంతోషం! ఇన్ని రోజులకి నా కష్టాలు తీరిపోయాయి. ఇక ఇప్పటి నుంచి ఇంటి బాధ్యత వాడిదే, నాదేమీ లేదు. నేను ఇన్ని సంవత్సరాలు మీ అందర్నీ పోషించాను, చదివించాను ఇక నా వల్ల కావట్లేదు. మీ జీవితాలు మీవి. నాకు సంబంధం లేదు” అంటూ తన సూట్‌కేస్ తీసుకొని అన్ని బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టారు.

వాళ్ల అమ్మగారు ఖిన్నురాలై, ఎంత ప్రాధేయ పడుతున్నా వినకుండా వెళ్లిపోయారు.

***

రఘు మధ్యాహ్నం ఇంటికి వెళ్లేసరికి ఇంట్లో పరిస్థితి భయంకరంగా ఉంది, అమ్మ ఏడుస్తూ వుంది. చెల్లెలు తమ్ముళ్లు ఏమీ అర్థం కాక బిక్కమొహం వేసుకొని కూర్చొని ఉన్నారు. రఘు బయట చెప్పులు విప్పి ఇంట్లోకి అడుగుపెట్టగానే వాళ్ళ అమ్మ జరిగింది చెప్పి భోరున ఏడవడం మొదలు పెట్టింది. పెద్ద భూకంపం వచ్చి కాళ్ళ కింద భూమి కదలాడినట్టుగా అనిపించింది రఘుకు. డిగ్రీ పాస్ అయినందుకు, ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినందుకు సంతోషించాలో ఇంట్లో పరిస్థితి చూసి ఏడవాలో అతనికి అర్థం కాలేదు. రఘు తన మొహంలో ఏ మాత్రం బాధ, కంగారు కనిపించనీయకుండా నిలకడగా నిలబడి అందర్నీ “చూసి ఏమీ భయపడకండి, అంతా నేను చూసుకుంటాను” అని ధైర్యం చెప్పాడు. ఒకవైపు నాన్నగారి మీద కోపం, జాలి కలిగాయి. కాసేపు కూర్చుని కిం కర్తవ్యం? అని ఆలోచించసాగాడు. అయితే ముందుగా అతనికి తోచింది ఏంటంటే తను అర్జంటుగా ఏదైనా ఉద్యోగం చూసుకోవాలి. సరే ఇప్పుడు ఇంక చేసేదేమీ లేదు పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలి. అంతే, అదే తక్షణ కర్తవ్యం అనుకున్నాడు.

తల్లి పక్కన కూర్చొని, ఓదార్చి, కళ్ళు తుడిచి, అనునయించి, నెలంతా సరిపోయేందుకు ఎంత కావాలి, ఇంటి కిరాయి ఎన్ని నెలలు బకాయిలు ఉన్నాయి, అన్నీ ఒక పుస్తకంలో రాసుకున్నాడు.

ఆ రోజు రఘుకు రాత్రంతా చాలాసేపు నిద్రపట్టలేదు.

ఇంటి డాబా మీద చాప, దిండు వేసుకుని, పడుకుని ఆకాశం వంక చుక్కలు చూస్తూ తన కర్తవ్యాన్ని ఆలోచిస్తూ పడుకున్నాడు. చెల్లెలు 18 సంవత్సరాల వయసు, తమ్ముళ్లు 11 సంవత్సరాల వయసు వాళ్ళు. ఇంట్లో గమనిస్తే తిండి గింజలు కూడా నిండుకున్నాయి. మనసంతా వెలితిగా ఉంది. డిగ్రీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయిన సంతోషం అదే రోజు ఎటో మాయమైపోయింది. చాలా నీరసంగా, నిస్సత్తువగా అనిపించింది. జీవితంలో ఉద్యోగం సంపాదించి నిలదొక్కుకునే వరకు ఓపిక పట్టకుండా, నాన్నగారు అలా ఇంట్లోంచి బాధ్యతలన్నీ వదిలించుకొని వెళ్లిపోవడం అన్నది రఘుకు చాలా బాధాకరం అనిపించింది.

“రైల్వే స్టేషన్ ముందు వేపు పేరు ప్రఖ్యాతలు గడించిన దుర్గ భవన్ అనే శాఖాహార హోటల్ ఉంది. దాని యజమాని అయిన శ్రీ గొండ స్వామి గారు, మీ నాన్నగారికి మన కుటుంబానికి చాలా పరిచయస్థులు. వారిని కలిసి ఏదైనా ఉద్యోగం ఇస్తారేమో లేదా చూపిస్తారేమో కనుక్కోరా” అని సలహా ఇచ్చింది, రఘు తల్లి.

తల్లి సలహా మేరకు…. ఆ హోటల్ కు వెళ్లి యజమాని గారిని కలవడానికి అటువైపుగా అడుగులు వేశాడు రఘు.

“నమస్కారం సార్!” అంటూ ఆయనకు నమస్కరించి కౌంటర్ పక్కలో చేతులు కట్టుకుని నిలబడ్డాడు. కాసేపటి తర్వాత శ్రీ గొండ స్వామి పక్కకి చూసి” క్యా హై బాబు ఏమిటి విషయం” అని అడిగారు రఘు వంక పరిశీలనగా చూస్తూ.

“సార్ మీరు నన్ను గుర్తుపట్టే వుంటారు! నేను బీఎస్సీ ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయినాను, ఇంకా ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. ఇంట్లో పరిస్థితి అసలు బాగా లేదు. అందుకని ఏదైనా పని ఇప్పించమని అడగడానికి వచ్చాను.” కాస్తా వినయంగా విషయాలు వివరించాడు రఘు.

ఆయన రఘు నాన్నగారికి చిరకాల మిత్రుడు అయినందున, కూర్చోబెట్టి “బాబు నీ చదువుకు సంబంధించి,ఇక్కడ దానికిసరిపోయే ఉద్యోగం ఏమీ లేదు.నువ్వు ఇక్కడ పని చేయలేవు” అని హితవు పలికారు.

“పర్వాలేదు సార్. నేను ఏదైనా చేస్తాను” అని అతనికి కాస్త టూకీగా వాల్ల నాన్నగారి యొక్క మానసిక స్థితి మరియు కుటుంబ పరిస్థితులు చెప్పాడు. దానికి అతను చాలా సేపు ఆలోచించి తర్వాత” నాగరాజు గారు!!” అని నాగరాజును, ఆ తర్వాత ఇంకొక సూపర్‌వైజర్‌ని పిలిచి “మన పక్కనున్న బార్ కౌంటర్, రేపటి నుంచి ఈ బాబు చూసుకుంటాడు, తీసుకెళ్లి అన్ని పనులు నేర్పించండి” అని చెప్పి రఘు వైపు చూసి “సరే నాగరాజుతో వెళ్ళండి. అతను అన్నీ చెబుతాడు” అని పంపించారు.

ఆ బార్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కౌంటర్ డ్యూటీ. ఉదయాన్నే తలుపు తాళం తీసి కౌంటర్లో ఉన్న డబ్బులు లెక్క పెట్టుకొని, లెక్క చూసుకుని, స్టాక్ లెక్కలు తీసుకొని వంట కార్యక్రమాలు కూడా మొదలు పెట్టించాలి. నెల జీతం 200గా నిర్ధారించారు. ఉదయం వెళ్లినది మొదలు సాయంత్రం వరకు అక్కడ ఏవైనా తినొచ్చు. కాఫీలు టిఫిన్లు భోజనం అన్ని ఫ్రీ. “ఇది బావుంది! ఇంట్లో నా ఖర్చు మిగిలిపోతుంది, ఇంట్లో మిగతా వారు కడుపునిండా తింటారు “అని ఆలోచించాడు రఘు.

ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చిపోయే జనాలను చూస్తూ డబ్బుల విషయంలో చాలా జాగ్రత్త వహిస్తూ, బాధ్యతగా పని చేయటం మొదలు పెట్టాడు అతను. రెండవ రోజు డబ్బులు లెక్క చూసి సాయంకాలం డ్యూటీ దిగే సమయానికి అప్పజెప్పేప్పుడు దాదాపుగా 200 రూపాయలు ఎక్కువగా జమ అయ్యింది.

మరుసటి రోజు రఘుకి యజమాని నుండి కబురు అందింది, తనని కలవమని.

ఉదయాన్నే రఘు వెళ్లి యజమాని ఆఫీస్ రూమ్‌కి వెళ్లి నిలబడి నమస్కారం చేసి “సార్ మీరు నన్ను కలవమని చెప్పారట “అన్నాడు.

“అవును బాబు! నిన్న ఏంటి డబ్బులు ఎక్కువగా జమ అయ్యాయట? ఎలా వచ్చింది? అలా రాకూడదు కదా!” అన్నాడు.

“ఆ విషయం, ఎందుకో నాకు తెలియదండి. నా అకౌంట్ లోకి వచ్చిన డబ్బులు అన్నీ నేను లెక్క చూసుకుని ఇచ్చేసాను” అన్నాడు రఘు.

“అది నిజమే. కానీ అలా రాకూడదు. ఎంత బిల్స్ రాశారు, చేశారో అన్ని మాత్రమే నీ అకౌంట్ లోకి రావాలి. అంతకంటే ఎక్కువ ఎలా వచ్చింది నీకు? మాకు అర్థం కావట్లేదు!!” అని చాలా గంభీరంగా మొహంపెట్టి అడిగారు.

“ఎక్కువ వచ్చిందండి. వచ్చింది ఇచ్చేశాను” అని అసలు విషయం ఏంటో అర్థం కాక ఎక్కువ వస్తే ఇచ్చేసాను కదా? దాంట్లో తప్పేంటి? అనుకుంటూ నిలబడ్డారు రఘు.

“సరే బాబు! జాగ్రత్తగా చూసుకో కౌంటర్!” అంటూ మొహంలో ఎటువంటి భావాలు కనిపించనీయకుండా పంపించేశారు స్వామి గారు.

ఎవరైనా పని వాళ్ళు తప్పు చేస్తే అక్కడ ఉన్న 17 నెంబరు గల గదిలోకి తీసుకు వెళ్లి చితకబాది బయటకు విసిరేసే వారు. అది అక్కడి ఆనవాయితీ

అప్పుడే రఘుకు అత్యంత ఆశ్చర్యం కలిగే నిజం బయటకు వచ్చింది.

ఈ హోటల్స్ అన్నింటికీ యజమాని దగ్గర అత్యంత విశ్వాసపాత్రుడైన నాగరాజు గారు వచ్చి మెల్లిగా కౌంటర్ దగ్గర నిలబడి గుసగుసగా మాట్లాడుతూ “ఏమండీ, రఘు బాబు! మీరు కాస్త ఇక్కడ పని వాళ్ళని, మమ్మల్ని చూసి చూడనట్టుగా వదిలేయాలి. పాపం! ఈ పని వాళ్ళందరూ చాలా చాలా తక్కువ జీతాలతో పని చేస్తుంటారు. మీరు వచ్చిన దగ్గర్నుంచి చాలా బాధతో ఉన్నారు” అని నసిగాడు.

రఘుకు విషయం యేమిటో అర్థం కాక “ఎందుకండీ? నేనేం చేశాను? ఏమైంది అసలు?” అంటూ కంగారుగా అడిగాడు.

“అబ్బే ఏమీ లేదండీ, కాస్త వచ్చిన కలెక్షన్స్ బిల్లుల విషయంలో అడ్జస్ట్‌మెంట్‌లు ఉంటాయి, వాటిని అందరూ కలిసి పంచుకుంటారు. మీరు సహాయం, సహకారం అందిస్తే అందులో మీకు కూడా వాటా ఉంటుంది” అని చెప్పాడు. రఘుకు కరెంట్ షాక్ కొట్టినట్లు అయింది, బిత్తరపోయి “నేను అలాంటివి చేయలేనండి” అని భయపడుతూ చెప్పాడు.

“మీరేం భయపడకండి, మీరు కాస్త సహకరిస్తే చాలు. మేము మిగతా అన్ని చూసుకుంటాం. ఇందులో కొత్త ఏం లేదు ఎప్పుడూ జరిగేదే! మీకు మీ వాటాగా మీ జీతం కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ వస్తుంది!!” అన్నాడు.

ఈసారి రఘుకు భయం కంటే ఆశ్చర్యం ఎక్కువ కలిగింది, ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నది, చెబుతున్నది ఎవరో కాదు యజమాని పూర్తిగా నమ్మిన, అన్నీ, డబ్బు లెక్కలు చూసుకుంటున్న వ్యక్తి. సంఘంలో కూడా యజమాని తర్వాత అతనికి ఎక్కువ విలువనిచ్చేనాగరాజు గారు.

“మీరు ఏమన్నా చేసుకోండి నాగరాజు గారు. కానీ నాకు అందులో ఎటువంటి సంబంధం ఉండదు. నన్ను అందులోకి అనవసరంగా లాగకండి. నేను అటువంటి వాటిలోకి తల దూర్చను. అటువంటి పనులు నాకు అవసరంలేదు. నేను చేయలేను” అని ఖరాఖండిగా చెప్పేశాడు.

ప్రపంచంలో నమ్మిన వాళ్ళని ఎలా మోసం చేస్తారో అర్థం కాలేదు. ‘యజమాని ముందు చేతులు కట్టుకుని నమస్కారాలు కొట్టి ఆయన దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్న వీరందరూ కలిసి ఎంత మోసం చేస్తున్నారో ఆయనను!’ అనుకుని ఒక క్షణం వాళ్ళని చూస్తే అసహ్యం వేసింది రఘుకు.

వాళ్ళతో సహకరిస్తే రఘుకు నెలకు 200 జీతం కాకుండా మొత్తంగా వెయ్యి రూపాయల వరకూ వచ్చే అవకాశం ఉందన్నమాట. ‘నేను నా ఇంటి పరిస్థితి, కష్టాలు చెప్పగానే యజమాని కాసేపు ఆలోచించి నాకు ఉద్యోగం ఇచ్చి కష్టాలలో సహాయానికి చేయూతనిచ్చిన వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేసే సమస్య లేదు’ అని మనసులో అనుకున్నాడు రఘు.

ఈ మధ్యలో రఘుకు మరొక కొత్త వింత సమస్య ఎదురయింది. అది ఏమిటంటే కొందరు రఘు నాన్నగారి స్నేహితులు లేదా పరిచయం ఉన్న వాళ్ళు అటువైపుగా రోడ్డు మీద వెళుతూ రఘు ను చూసి బార్ కౌంటర్ దగ్గరగా వచ్చి ” ఇక్కడ పని చేస్తున్నావా బాబూ! బాగా చదువుకున్న వాడివి కదా? వేరే ఉద్యోగం దొరకడం లేదా? సరే లే తొందరగా ఈ ఉద్యోగం మానేసి, ఏదైనా వేరే మంచి పని చూసుకో” అని హితవు పలికి వెళ్లేవారు.

“సరే ఇది కూడా నిజమే ఇంకోటి చూసుకుందాం” అని వెతుకుతున్నంతలో నిజామాబాద్ గంజి అసోసియేషన్‌లో టైపిస్ట్‌గా ఇంకొక ఉద్యోగం తెలిసిన వారి ద్వారా కబురు అందింది రఘుకి.

రఘు సంపాదించే 200 రూపాయలు చాలా విలువైనవి. ఆ సమయంలో అవి లేకుంటే కుటుంబం అంతా పస్తులు ఉండాల్సిన పరిస్థితి. బార్లో ఉద్యోగం అయిపోయిన తర్వాత సాయంకాలం ఫర్టిలైజర్ కంపెనీ ఆఫీసర్ ఇంటికి వెళ్లి ఇద్దరు చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తే అక్కడ యాభై రూపాయలు నెలకు ఇచ్చేవారు.

మూడు పూటలా కడుపునిండా భోజనం పెట్టే అన్నపూర్ణ లాంటి ఉద్యోగం వదిలేసి తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చినందుకు ఎంతో బాధపడుతూ తను వేరే ఉద్యోగానికి వెళుతున్నానని యజమాని శ్రీ గొండ స్వామి గారికి తెలిపాడు రఘు.

ఒక నెల తర్వాత ఆఖరి రోజున అన్ని లెక్కలు యజమాని గారి తమ్ముడికి అప్పజెప్పాడు.

ఆ ఉద్యోగం, ఆఖరి రోజున రఘుకు జరిగిన ఒక్క చిన్న సంఘటన మానసికంగా ఎంతో వ్యథను, దుఃఖాన్ని కలిగించి ఎన్నో రోజులు నిర్వేదాన్ని కలిగించింది అతనికి. ప్రతిసారి రఘు కు ఇస్తున్న స్టాక్ (బార్‌లో) ఆఖరి రోజున ఉదయాన్నే ఎందుకో ఎప్పుడూ ఇచ్చే స్టాకు కంటే కాస్త తక్కువగా ఇచ్చారు. అది గమనించి రఘు ప్రశ్నార్థకంగా సూపర్‌వైజర్ వైపు చూశాడు.

దానికి ఆయన సమాధానంగా “ఇవి ఎక్కువగా అమ్ముడు పోవడం లేదు కదా? ఈ రోజుకు అవి చాలు లే!” అని సర్ది చెప్పాడు. రఘు ఆ లెక్కలు అన్నీ రాసుకొని స్టాక్ ఎంట్రీ చేసుకొని పనిలో మునిగిపోయాడు. రోజంతా పనిచేసి తర్వాత సాయంకాలం డబ్బులు, మిగిలిన స్టాక్స్ అన్నీ సూపర్‌వైజర్‌కి అప్ప చెప్పాడు. అప్పుడు యజమాని గారి తమ్ముడు చిన్న మెలిక పెట్టాడు “అదేమిటి స్టాకు తక్కువగా చూపిస్తున్నావు?” అని.

“సూపర్‍వైజర్ ఉదయాన్నే నాకు ఈరోజు తక్కువ స్టాక్స్ ఇచ్చారు కదండీ ?”అని గుర్తు చేశా డు.

“లేదు లేదు ఎప్పటిలాగే ఇచ్చాను.తక్కువ ఎందుకు ఇస్తాను!!” అని ఆయన కరాఖండిగా సమాధానం చెప్పాడు. రఘు కు ఏమి చెయ్యాలో పాలు పోలేదు. చాలా వినయంగా మళ్ళీ చెప్పాడు. “మీరే కదా అన్నారు ఇవి ఎక్కువగా అమ్ముడు పోవట్లేదు, అందుకే తక్కువ తీసుకో! సరిపోతుంది!!” అని మళ్లీ గుర్తు చేశాడు రఘు.

“అలాంటిదేం లేదు. నేను నీకు ప్రతి రోజులాగే పూర్తిగా ఇచ్చినట్లు నాకు గుర్తుంది. అవన్నీ కుదరవు. నువ్వు మొత్తం డబ్బులు కట్టాల్సిందే, లేదంటే మీ జీతంలో నుంచి అవి మేము పట్టుకుంటాం” అని సూపర్‌వైజర్ ఖరాకండిగా నిర్ధారించాడు.

ఆఖరి రోజున రఘు తెచ్చే జీతంలోంచి ఎవరెవరికి ఎంత కట్టాలి అని కూడా ఇంట్లో లెక్కలు వేసి పెట్టుకున్నారు. జరుగుతున్నదంతా అక్కడ చూస్తున్న పని వాళ్లు రఘు వేపు దీనంగా చూడటం మొదలుపెట్టారు. అన్యాయం జరుగుతున్నట్లుగా అక్కడ ఉన్న అందరి పనివాళ్లకు తెలుసు. ఒకసారి ‘ఏమన్నా చేయగలరా?’ అన్నట్లుగా మళ్ళీ నాగరాజు కేసీ చూశాడు రఘు.

ఆ చూపులు తప్పించుకుంటూ అతను తల కిందకి వేసి నిలబడ్డాడు. రఘు అక్కడ్నుంచి సరాసరి వెళ్లి పెద్ద యజమాని గారికి అన్ని వివరించాడు. దానికి సమాధానంగా ఆయన “చూడు బాబు !అక్కడ మరి, నువ్వు తీసుకుంది ఎంతో, ఇచ్చింది ఎంతో, వాళ్ళకి నీకు మాత్రమే తెలుసు కదా? నువ్వు వాళ్లతోనే మాట్లాడుకొని ఈ విషయాన్ని సెటిల్ చేసుకో” అని సలహా ఇచ్చి పంపించేశాడు. ఆయనే కాదు ఆయన స్థానంలో ఎవరున్నా అంతే చేసేవారు.

ఇక రఘు పూర్తిగా నిస్సహాయుడైయిపోయాడు. అతడిలో రక్తం సలసలా మరుగుతూ ఉంది. కానీ ఉపయోగంలేదు! అన్యాయాన్ని ఎదిరించే శక్తి లేక ఉక్రోషం తన్నుకొస్తోంది. ‘బలహీనుల పైన బలవంతులు ఎలా రాజ్యం చేస్తారో’ అర్థం అయింది. ‘నిజాయితీకి, ధర్మానికి స్థానం ఎంత బలహీనమైనదో’ తెలిసి వచ్చింది అతనికి. అన్నీ లెక్కలు చూసి, ఇవ్వని స్టాక్ విలువ డబ్బులు పట్టుకొని, జీతంలో కొన్ని పదుల నోట్లు మాత్రమే చేతిలో పెట్టారు. మొత్తం జీతం చేతిలో ఉంటే రఘు కుటుంబమంతా దాదాపు పదిహేను రోజులు పస్తులు లేకుండా కడుపునిండా తినగలిగేది. రఘుకు తెలిసినంత వరకు పోగొట్టుకున్న జీతం విలువ అది. తనకు ఆ డబ్బులు అవసరం అంత వరకు మాత్రమే.

రఘు కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. అన్యాయాన్ని సహిస్తూ మనసంతా కృంగిపోయింది. రఘు తెచ్చే జీతం డబ్బులతో కుటుంబమంతా మూడు పూటల భోజనం చేయగలిగేవారు. ‘అసలు మాకు ఈ ఆకలి బాధలు ఎప్పుడు తప్పిస్తాడు భగవంతుడు’ అని మనసులో అనుకున్నాడు రఘు. ‘ఈ తక్కువ డబ్బుతో మళ్లీ నెలంతా ఎలా గడపాలి?’ అని ఆలోచిస్తూ ఇంటి దారి పట్టాడు రఘు. నిజాయితీ పట్ల భగవంతుడు పరీక్షలు పెడుతూ ఉంటాడు అన్నమాట నిజమే కదా అనుకొని నవ్వుకున్నాడు రఘు.

జరిగిన అవమానానికి తీరని వేదనను ఎన్నో రోజులు అనుభవించాడు. జరిగిన అన్యాయాన్ని ఎదిరించే శక్తి లేనందుకు లోలోపలే ఆక్రోశించాడు.

పూర్వకాలంలో భూస్వాముల, జమీందారుల అన్యాయాన్ని సహించలేక, ఎదిరించలేక బాధితులు ఎంత దుర్భర జీవితాన్ని అనుభవించారో, ఎందుకు విప్లవాన్ని ఎంచుకున్నారో అర్థమైంది అతనికి.

***

“సార్ కాఫీ ముందు పెట్టాను, చల్లారిపోతుంది. తాగండి!!” అన్న సహోద్యోగి ప్రశాంత్ పిలుపుతో ఈ లోకం లోకి వచ్చి పడ్డాడు రఘు

“సార్ నాపై దయ చూపించండి” అన్న ఆ ఎదుటి వ్యక్తిని చూసి “బాబు చెప్పాను కదా ఏమి ప్రాబ్లం లేదు. నేను చేసి పెడతాను డోంట్ వర్రీ” అని ధైర్యం చెప్పి పంపించాడు.

ఒక వారం తర్వాత ఆ వ్యక్తి వచ్చి కావలసిన అన్ని డాక్యుమెంట్లు ఇచ్చిన తర్వాత ఒకటే రోజులో, ఆ ఫైల్‌ని డివిజనల్ మేనేజర్ గారి దగ్గరికి తీసుకెళ్లి, ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని రిక్వెస్ట్ చేసి అదే రోజు చెక్కు అతని చేతిలో పెట్టాడు రఘు. రెండు లక్షల రూపాయల చెక్కు చేతిలో పట్టుకుని రెండు చేతులు పైకి ఎత్తి దండం పెట్టి, కళ్ళలో నీళ్ళు తిరుగుతుండగా ఆయన రఘును చూస్తూ వెళ్లిపోయాడు. భుజం మీద వెనకాతల చిరిగిన షర్టు వేసుకొని వెళుతున్న ఆ వ్యక్తిని చూసి రఘు ‘పాపం! భగవంతుడు శత్రువులకు కూడా ఇలాంటి కష్టం కలిగించ కూడదు’ అనుకున్నాడు మనసులో.

ఇంతకీ అతను ఎవరో కాదు, రఘు పనిచేసిన బార్‌లో ఆరోజు తనకు అన్యాయం చేసిన వ్యక్తే!

మనిషి ఎప్పటికీ గొప్పవాడు కాదు, పరిస్థితే బలమైనది!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here