మూడు ప్రయోజనాలను సాధించిన నవల ‘బతుకు సేద్యం’

0
64

[శ్రీమతి వి. శాంతిప్రబోధ గారి ‘బతుకు సేద్యం’ అనే నవలని సమీక్షిస్తున్నారు డా. వెలువోలు నాగరాజ్యలక్ష్మి.]

శాంతి ప్రబోధ గారు రచించిన ‘బతుకు సేద్యం’ నవల స్వయంకృషికి నిలువుటద్ధం. నేలతో, స్త్రీలతో, ప్రకృతి పర్యావరణంతో ముడిపడిన ఇతివృత్తం కల నవల. ప్రస్తుత కాలంలో ప్రతి వ్యక్తీ వేదన పొందవలసిన, ఆలోచించదగిన అతి క్లిష్టమైన సామాజిక సమస్యను సమర్థంగా చిత్రించిన నవల. ఆ సమస్యను అధిగమించగల విధానాలను ప్రత్యక్షంగా సోదాహరణంగా నిరూపించిన నవల. కాల్పనికత నవలాలక్షణం అయినప్పటికీ దానికి భిన్నంగా వర్తమాన చరిత్రను కళ్ళముందు నిలిపి, ఆలోచనాత్మకంగా రచయిత్రి ఈ నవలను రూపొందించారు.

నవలలో ఇతివృత్తం గ్రామీణాభివృద్ధి, దేశప్రగతికి పల్లెలు పట్టుకొమ్మలని స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి అందరూ వల్లె వేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు కొన్ని కార్యక్రమాలు చేపట్టుతున్నాయి. కాని అవి చేరవలసిన వారికి ఎంతవరకు చేరుతున్నాయో చెప్పలేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. పల్లెలలో, వ్యవసాయాధారిత కుటుంబాలలో, ప్రధానంగా అట్టడగు వర్గాలకు చెందిన స్త్రీలు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల స్త్రీలు ఆకలికి, అణచివేతకు, వివక్షకు గురి అవుతూనే ఉన్నారు.

ఆకలి తాళలేక మట్టి తింటూ జీవచ్ఛవాలుగా కాలం గడుపుతూ, రేపు అనేది ఎలా ఉంటుందో తెలియని వారు తమ జీవితాల్లోని చీకటి సముద్రాలకు ఎదురీది, బ్రతుకులలోని ఖాళీలను పూరించుకొని తలఎత్తుకొని నిలబడిన మహిళల జీవన పోరాటం ఈ ‘బతుకు సేద్యం’ స్వేదంతో సేద్యం చేస్తూ తమ జీవితాల్లోనే కాదు తమ చుట్టూ ఉన్న జీవితాల్లోనూ ప్రాణవాయువులు ఊదిన భూమి పుత్రికలు వీరు.

నిర్వేద్యంతో కాలం వెళ్ళదీస్తున్న ఆ మహిళల్లో డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ ధైర్యాన్ని కూడగట్టింది. ఆలోచనలు రేకెత్తించింది. బ్రతుకు తెరువును చూపించింది. ఆ సంఘ సభ్యుల తోడ్పాటు వలన వారి ప్రోత్సాహమూ, ప్రబోధాల వలన దారిద్ర్యంతో, అవిద్యతో అణగారిపోతున్న స్త్రీలు జీవించటం అంటే ఏమిటో నేర్చుకున్నారు. వ్యవసాయ రంగంలో రావలసిన మార్పులను గురించి అర్థం చేసుకున్నారు. ప్రకృతి పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం అంటే ఏమిటో తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించుకొని రైతులుగా ఎదగటం ఎలాగో నిరూపించారు. ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతితో కలసి అడుగులు వేస్తున్న ఆ ప్రకృతి బిడ్డలు తాము పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి, కాయ, పండు ఏదైనా సహజంగా ఉండాలని దీక్షతో పంటలు పండించిన సమాజ శ్రేయోభిలాషిణులు. పచ్చటి జీవితాల్లో చిచ్చు పెట్టే కృత్రిమ రసాయనాల ఎరువులు, పురుగు మందులు దరిచేరనీయక నకిలీ విత్తనాల బెడద లేకుండా దళారీల మోసాలకు గురికాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన వ్యవసాయాన్ని చేసి చూపించిన మహిళలు ఈ నవలలో మనకు ఉత్తేజాన్ని కలిగిస్తారు.

స్వశక్తికి నమూనాగా నిలిచిన మట్టిలో మాణిక్యాలు తమ కన్నీటి జీవితాన్ని కాట్లో కలిపేసి ఆకలికేకల జీవితాల ఆకృతిని మార్చుకున్న ఆ మహిళలు ప్రకృతిసేద్యంతో సాంకేతిక విజ్ఞానాన్ని మేళవించి, గగన పుటంచులను తాకి విశ్వవేదికపై అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 2019లో నోబెల్ బహుమతితో సమానమైన ఈక్వెటర్ పురస్కారాన్ని అందుకోవటం తెలుగు మహిళాలోకానికే గర్వకారణం.

పల్లెపట్టులలో అణగారిన స్త్రీలు నాయకులయ్యారు. పల్లె స్వరూపస్వభావాలను మార్చి వేశారు. పెత్తందారి విధానాలతో తలపడ్డారు. తమ పిల్లల భవిష్యత్ సౌధాలను స్వయంగా నిర్మించుకున్నారు. మొగులమ్మ లక్ష్మమ్మ మొదటితరం నాయకులుగా ఎదిగి తమ అనంతరతరానికి తమ ఆలోచనలను ఆస్తిగా పంచి ఇచ్చారు.

ప్రధానంగా ఈ నవల కలిగించిన ప్రయోజనాలు మూడు. 1. అణగారిన వర్గాలకు చెందిన స్త్రీ తెగువతో, డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ వంటి సంస్థ సహకారంతో సాధికారిత దిశగా ఎదిగా సాటివారికి ఆదర్శపు బాటలు చూపటం. 2. రసాయనాలు, కృత్రిమ ఎరువులు లేని ప్రకృతి వ్యవసాయం. ఆరోగ్యాన్ని పెంపొందించే చిరుధాన్యాల ఉత్పత్తులపై అవగాహన కలిగించటం. 3. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను చాటి చెప్పటం. ఈ మూడు ప్రయోజనాలను సమర్థంగా, నూటికి నూరుపాళ్ళు సాధించిన నవల బతుకు సేద్యం.

అంతేకాదు నేటి ప్రభుత్వాలకు చక్కని సూచన దీని వలన చేయబడింది. అణగారిన వర్గాల వారి అభివృద్ధికి కేవలం తాత్కాలికమైన ఆర్థిక సహకారం అందించటం కాకుండా వారు స్వశక్తితో ఆర్థిక స్వావలంబన సాధించగలిగే ప్రణాళికను రూపొందించి వాటిని పటిష్టంగా అమలు చేయటం అత్యంతావశ్యకం. ఆరోజు ఆకలి తీర్చే చిరు ఆర్థిక సహకారం భవిష్యత్తుకు భరోసా ఇవ్వదు.

ఒక పల్లె స్త్రీ జీవితంలోని అణచివేతలకూ, ప్రకృతి పర్యావరణానికి నడుమ ఉన్న అనుబంధాన్ని, అనుసంధానతను గుర్తించి, దానికి నవలారూపాన్ని ఇచ్చిన శాంతి ప్రబోధ గారు బహుథా అభినందనీయురాలు. ఒక సామాజిక పరిణామానికి అక్షరరూపం అందించి, నేటి సమాజానికి అనివార్య ఆవశ్యకమైన పర్యావరణం, ఆహారం, వ్యవసాయం అనే విషయాలను చర్చకు తీసుకువచ్చిన ఈ పరిశోధనాత్మక నవల నవలా రచనలో భిన్నమైనది, విశిష్టమైనది.

చదువరులకు ఉద్వేగం పెంచి నరాలు ఉప్పొంగే ముగింపు గీతం ఈ నవల లక్ష్యాలను ఎలుగెత్తి చాటుతుంది. న్యూయార్క్ నగరంలోని అంతర్జాతీయ వేదికపై ఆ స్త్రీలు గొంతు కలిపే స్థాయికి ఎదిగారు.

“మనం ఈ తల్లి బిడ్డలం

వేలవేల ఏళ్ళుగా ప్రకృతి/తననుతాను రక్షించుకుంటూ

ప్రకృతి అంత స్వచ్ఛంగా, స్పష్టంగా, స్నేహంగా

కలసి అడుగులో అడుగేసి నడుద్దాం

—–

మన గాలి, నీరు, భూమి, ఆహారం, ఆరోగ్యం

మనచేతుల్లో”

అదే మన సంపద, అంతులేని సంపద, తరిగిపోని సంపద విశ్వవేదికపై మట్టిచేతుల గొంతుల్లోంచి పాట జాలువారుతుంది. లయబద్ధంగా ఎవరి సంప్రదాయ వస్త్రధారణలో వాళ్ళు అడుగులు వేస్తున్నారు. ఆ అడుగుల్లో మొగులమ్మ, లక్ష్మమ్మ, సునీతల అడుగులు కలసి గుర్తించాయి.

***

బతుకు సేద్యం (నవల)
రచన: వి. శాంతి ప్రబోధ
ప్రచురణ: ఛాయా రిసోర్స్ సెంటర్,
పేజీలు: 360
వెల: ₹330
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
ఆన్‍లైన్‌లో:
https://www.amazon.in/BATUKU-SEDYAM-V-SANTHI-PRABODHA/dp/B0BR5VK8G5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here