బతుకు విలువ

0
2

[dropcap]తా[/dropcap]రమ్మ ముఖం వెలిగిపోయింది. ‘నువ్వు రేపటినుండి పనిలోకి రానవసరం లేద’ని ఇంటి యజమాని వదన చెప్పడమే దానికి కారణం. కనిపించని విషపురుగు కాటువేయడానికి పాకుతూ వస్తోందని దాన్ని తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఎవరి ఇంట్లో వారు ఉండటమేనని స్వీయనిర్భందం ఆజ్ఞలు ప్రభుత్వం జారీచేసిన ఫలితం ఇలా తనను కాటేసిన బాధ ముఖంలో కనిపించింది.

గమ్మతేమిటంటే ఇటు వదన ముఖం కూడా చిన్నబోయింది. రేపట్నుండి ఇంటిపనంతా ఒక్కతే చేసుకోవాలి. అత్తగారికి ఉదయం ఐదుగంటలకల్లా ఇల్లంతా శుభ్రంగా ఊడ్చి వాకిట్లో ముగ్గువేసి పసుపు, కుంకుమతో కళకళలాడాలి. లేకుంటే చిరాకు పడుతారు.

తను లేచి పూజ ముగించుకొని సహస్రం పారాయణం చేసుకుంటారు. తరువాత వంటపనిలో సాయం చేస్తారు. రేపట్నుండి తారమ్మ రాదు కాబట్టి తానే అవన్నీ చేయాలి. రోజూ ఆరుగంటలకు లేచి హడావుడిగా బ్యాంక్‍కు తయారయే తనకు కష్టకాలం ఈ విషపురుగు వల్ల వచ్చిందని అనుకోసాగింది.

తారమ్మ దిగులు కనిపెట్టి విషయం కనుక్కుంది అత్తగారు. పాపం! పెద్దావిడ చాలా మంచిది. తారమ్మకు ఆమె కన్నతల్లితో సమానం. భర్త రోజువారి కూలీగా చేస్తాడు. వచ్చిన డబ్బుల్లో సగానికి పైగా తాగడానికే ఖర్చు చేస్తాడు. బిడ్డా, కొడుకు, తల్లీ ఎవరూ అతనిని ఒక్కపైసా కూడా అడగరు. అతడు ఇంటికి వచ్చి ఏ గొడవా చెయ్యకుంటే చాలునని దేవుడికి దండం పెట్టుకుంటుంటారు. ఇలా ఈ క్లిష్టకాలం ఎలా గడవాలి అనే ఆందోళనలో ఇద్దరూ మౌనమయ్యారు.

రెండు మూడు రోజులకి మద్యం దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఇతర అన్నిరకాల వ్యాపార, వాణిజ్య సముదాయాలను ప్రభుత్వం మూసివేసింది. ఈ బీద కుటుంబానికి గుండెల్లో పెద్దరాయే పడింది. వాళ్ళ భయమంతా తారమ్మ భర్త గురించే.

వాళ్ళ భయం బీభత్సాన్నే సృష్టించింది. రోజూ తాగే అలవాటున్న తారమ్మ భర్త సాయిలు ఆ సమయానికి మందు లేక పిచ్చిపిచ్చిగా ప్రవరించసాగాడు. మందు తెమ్మని తారమ్మను చితకబాదడం బయటకు గెంటేయడం మళ్ళీ కాసేపటికి తానే బ్రతిమిలాడి లోపలకు రమ్మనడం.

ఒక్కోరోజు ఒక్కోతీరుగా ఉండేసరికి తారమ్మకు పదిరోజుల్లోనే పై ప్రాణాలు పైనే పోయేన్నట్టు కాసాగింది. ఓ రాత్రి బాగా ఆలోచించింది.

తెల్లవారి 4.30 గంటలకల్లా శుభ్రంగా స్నానం చేసి చీకట్లోనే వదన ఇల్లు చేరుకుంది. అప్పటికే వదన వాకిలి ఊడుస్తూ ఉంది. గబగబా వెళ్ళి చీపురు అందుకోబోయింది. వదన ఆశ్చర్యపోయింది. ఇంత పకడ్బందీగా కర్ఫ్యూ ఉంటే ఇంత సాహసం చేసినందుకు గట్టిగా తిట్టబోయింది. ఇంతలోనే వదన అత్తగారు వేదమ్మ రావడం తారమ్మను లోపలికి తీసుకెళ్ళింది. విషయం ఏమిటో తెలుసుకుంది.

తారమ్మ తన భర్త మానసికంగా కుంగిపోతూ రోజురోజుకూ దిగజారిపోతున్నాడని ఈ విషమ పరిస్థితి ముగిసేవరకు తాను బతికి ఉంటాడని నమ్మకం సన్నగిల్లుతున్నదని బావురుమంది. ప్రభుత్వం, స్వచ్ఛంద సేవా సంస్థలు మాలాంటోళ్ళకి ఉప్పులు, పప్పులు, డబ్బులుకు బదులుగా ఆ మందేదో ఇచ్చినా బాగుండునని లేకుంటే మా బతుకులు తెల్లారిపోయేటట్లున్నాయని ఏడ్చింది తప్ప ధైర్యం జేసి తమ దగ్గరుంటే ఒక్కమందు బాటిలు ఇవ్వండమ్మా! అని నోరు తెరిచి అడగలేకపోయింది.

వేదమ్మ అంతా విని మౌనంగా లోపలికి వెళ్ళి కొడుకును నిద్రలేపి ఏదో మాట్లాడి సంచితో బయటకు వచ్చింది వెనకాలే కొడుకూ వచ్చాడు. ఆ సంచిని ఆమెకు ఇస్తూ “ఇందులో నీకు కావలసిన సరుకు ఉంది, ఇంకెప్పుడూ దొంగలా, దొంగదారెంబడి, కళ్ళుగప్పి రావద్దని గట్టిగా హెచ్చరించింది. నీ ఫోన్‍లో నేను వేస్తాను. ఏ అవసరమొచ్చినా నీ పిల్లలతో ఫోన్ చేయించు. ఇంక ఈ సంచితో నువు నడిచి వెళ్ళడం చాలా ప్రమాదకరం, బాబు దింపుతాడు వెళ్ళు” అని జాగ్రత్తలు చెప్పి పంపించింది.

వదనకు అత్తగారు కొత్తగా కనిపించారు. ఆ సంచిలోనిదేమిటి? ఈవిడ చేసిన పని సరైనదేనా? అని ప్రశ్నిస్తున్నట్టున్న ఆమెను చూసి వేదమ్మ “వదనా! ఒక కుటుంబం నిలబడాలంటే ఆరోగ్యం బాగవడానికి ఇచ్చే టానిక్ ఇస్తున్నాననుకొని ఆ బాటిల్ ఇచ్చాను. మనవాడెలాగు నెలలో ఒక్క ఆదివారమే తీసుకుంటాడు. పైగా వాడికి అది లేకున్నా పిచ్చిగా ప్రవర్తించేంత బానిసత్వం లేదు అందుకే అలా చేసాను” అంది.

“అయితే అత్తయ్యా! ఈ లాక్‍డౌన్ పరిస్థితులు చక్కబడేవరకు తమరే అందిస్తారా?” అన్న ఒక్కమాట గట్టిగానే అంది.

“పిచ్చిదానా! అలా ఎందుకు జరుగుతుంది? మట్టిలో ఆడుతున్న మట్టిపెడ్డ తింటున్న పిల్లవాడికి ఎలాగైతే బెల్లం ముక్క ఇచ్చి మాన్పిస్తామో! ఇదీ అంతే. కాకుంటే సాయిలుకు ఇష్టమయ్యే, మందు మాన్పించే బెల్లంముక్క ఏదో కనిపెట్టాలి” అంది.

మధ్యాహ్నం తారమ్మ ఫోన్ చేయించింది కొడుకుతో. “అమ్మా! మీ ఋణం తీర్చుకోలేను. మీ సాయం మరువలేను. బిడ్డ పెళ్ళి కుదిరి చేయవలసి ఉన్న ఈ సమయంలో మా ఆయనెక్కడ పిచ్చోడయి సచ్చిపోతాడేమోనని భయపడ్డానమ్మా కానీ! మీ వల్ల మళ్ళీ మామూలుగా మీరిచ్చిన దానితో దూప తీర్చుకున్నాడమ్మా!” అని ఏడ్చింది.

“లేదమ్మా! కానీ తారా! ఇది శాశ్వత మార్గం కాదు. నీవు ఏమీ అనుకోనంటే రాముడీ తలంబ్రాల తరవాత మీ ఆయన స్వామిమాల వేసుకుంటాడని చెప్పావు గుర్తుందా? ఆ పనేదో ఓ మంచిరోజు చూసి ఇప్పుడు చేయించు 41రోజుల దీక్ష పూర్తయ్యేవరకు విషపురుగు బెడద కూడా తగ్గవచ్చు” అని సూచించింది.

అలా తారమ్మ సాయిలుతో మాల వేయించి గుండె నిబ్బరంతో ఉంది. వేదమ్మకూ ఊరటగా అనిపించింది. పరిశుభ్రతలోనే పరమాత్ముడున్నాడని స్వచ్చతలోనే దేవుడున్నాడని తనలాగే గట్టిగా విశ్వసించే తారమ్మకు మేలు జరగడంతో దేవునికి దండం పెట్టుకుంది.

***

జరిగిన ఈ పరిణామానికి వదన అత్తగారిని ఇన్నాళ్ళూ సరిగ్గా అర్థం చేసుకోనందుకు సిగ్గుపడింది. చాలా ఖచ్చితమైన వ్యక్తిగా తాను అనుకున్నది చేసేంతవరకు ఊరుకోని మొండి వైఖరిదని తెలుసు. దాని ఋజువు ప్రభుత్వ ఉద్యోగినిగా ప్రధానోపాద్యాయురాలిగా పదవీ విరమణ చేసినా ఇప్పటికీ అదే క్రమశిక్షణ.

ఉదయం ఐదుగంటలకల్లా గడపలో పసుపు కుంకుమతో ముగ్గు కనబడాల్సిందే. బయటినుండి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోనిదే లోపలికి అడుగు పెట్టనీయదు. రోజూ రెండు పూటలా శుభ్రంగా స్నానం చెయ్యవలసిందే. యోగా, ధ్యానం తప్పనిసరి. కూరగాయల భోజనమే. పిజ్జాలు, బర్గర్‍లూ పూర్తిగా నిషిద్ధం. ఇంటి డాబాపైనా, వెనుక ఖాళీస్థలంలో సాగుచేసిన కూరగాయలే ఇంటి వంటకు ఆధారం. తీరిక దొరికినప్పుడు కుట్టిన బట్టసంచులే ఎక్కడికి వెళ్ళినా, ప్లాస్టిక్ డబ్బాలు, కవర్లు ఏవీ వాడరాదు. తమ పెళ్ళయినప్పటినుండీ చూస్తున్న పద్ధతుల్లో ఎలాంటి మార్పూ లేదు. పైగా తనకూ అలవాటయ్యాయి. తనూ బ్యాంకు అయినప్పటికీ ఆమెను కాదనాలంటే ఎందుకో గౌరవం అడ్డు వస్తుంది. కానీ నియంతలా ఆమె మనసులో ముద్ర వేసుకుంది.

అవసరానికి మించి ఖర్చు చేయదు. మాటల్లో కూడా అదే పొదుపు. బ్యాంక్ ఉద్యోగియైన తనకంటే తానే గొప్ప ఆర్థికవేత్త. పిల్లలిద్దరూ అమ్మ అనారోగ్యం వల్ల అత్తగారి చేతిలో పెరగడం వల్ల అచ్చం అలాగే తయారయ్యారు.

ఎవరైనా పెద్దవాళ్ళు కనబడితే వినమ్రంగా చేతులు జోడించి నమస్కరిస్తారు. నిండైన ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తారు. చక్కగా మాతృభాషలోనే చదవాలని పట్టుబట్టి చదివించి ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేలా తీర్చిదిద్దింది. కానీ, నేటి తరం పిల్లలతో పోలిస్తే ఎటువంటి సరదాలు లేకుండా చాదస్తంగా పెరుగుతున్నారేమోనని వదనకు వేదమ్మ మీద కాస్త కోపంగా ఉంటుంది. కానీ గడచిన ఈ నెలరోజులలో ఆమెకు మరింత దగ్గరగా చూస్తూ, మంచితనాన్ని తెలుసుకోసాగింది.

స్వీయ గృహనిర్బంధాన్ని వదన తనలో మార్పుకు శ్రీకారం చేసుకుంది. ఈ భావనతో అంతకుముందు తాను ఉద్యోగినని ఏ పని చేయడానికైనా బద్ధకంగా ఉండే సోమరితనం పారిపోయి ఇంటి ఇల్లాలుగా ఇంటిని చక్కబెట్టడంలో ఉత్సాహాన్ని పెంచుకొని శరీర బరువు ఉండాల్సిన స్థాయికి చేరుకోగలిగింది. నాజుగ్గా అయ్యావని శ్రీవారు మెచ్చుకుంటుంటే పెళ్ళయిన తొలిరోజులు గుర్తుకు రాసాగాయి.

మధ్యమధ్యలో విషపురుగుకు ఎదురొడ్డి పోరాడుతున్న అధికార, అనధికార సిబ్బందికి కృతజ్ఞతలలు తెలియజేస్తూ, ప్రజలతో దూరం దూరంగా మెలగడం శుభ్రంగా చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలతో అవగాహనను, చైతన్యంను కలిగిస్తూ మళ్ళీ కవితలుగా పాటలుగా వ్యాసాలుగా కలాన్ని కదిలించింది.

అత్తగారు మామయ్య తిధి కార్యాన్ని ఈసారి రోడ్డు పక్కన నిరాశ్రయులైన బీదాబిక్కి జనులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. వలస కూలీలకు నిత్యవసర వస్తువులను కూడా అందించింది.

వదన అత్తగారి నుండి చాలా స్ఫూర్తి నొందుతున్నది. తారమ్మ కూడా తనకంటే కూడా దీనస్థితిలో ఉన్న వలసకూలీలకు తన వంతు ప్రభుత్వం నుండి వచ్చిన పైసలను, నిత్యావసర సామాగ్రిని దానం చేసి దాతృత్వాన్ని ప్రకటించింది.

అలా ఇలా మరో 15 రోజులు గడిచాయి. వ్యాధి తగ్గుముఖం పడుతున్న వార్తలు కొంత తేలిక పరుస్తుండగా ప్రభుత్వం కొన్ని నిబంధనలను సడలించింది. పెండ్లిలు, చావులు ఇతర అత్యవసర కార్యక్రమాలకు జనసందోహం లేకుండా పరిమిత సంఖ్యతో అనుమతులిచ్చింది.

కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టుగా తారమ్మ బిడ్డ పెండ్లిని యాభైమందితో ఘనంగానే జరిపించింది. తారమ్మ అత్తకోరిక తీరినట్లయ్యింది. తారమ్మ భర్త సాయిలు దైవచింతనతోనే మద్యం మాట మరిచిపోయాడు. ఎప్పటికైనా సనాతన సంప్రదాయాలు, విశ్వాసాలే మానవప్రగతికి జీవం పోస్తాయని భారతీయ సమాజానికి తెలిసి వస్తున్నది. సమాజంలో మానవత్వం మొక్క వృక్షమై విషపు పురుగు కాటు వేయకుండా ఆకాశమై విస్తరించినందుకేనేమో క్రమేణా అదృశ్యమౌతున్నది. ఎన్నో దేశాలు, కుటుంబాలు మంచి గుణపాఠాన్ని నేర్చుకుంటున్నాయి. సంపాదించిన దాంట్లో ఎంతో కొంత శ్రామిక చీమల్లా కూడబెట్టుకుంటూనే ఉండాలని, మనిషిని మనిషిగా ప్రేమించాలని, నైతిక విలువలు కలిగి ఎదగాలని ఎరుకతో బుద్దిజీవులై బతకటం మీద కంటే బ్రతికించటం మీద ప్రేమ కలిగి నిస్వార్థతను అలవరచుకుంటున్నాయి. ప్లేగు, కలరా, మశూచి వంటి వ్యాధులు వచ్చినప్పుడు ఎదుర్కొన్న తీరును అధ్యయనం చేస్తూ ప్రణాళికలు రచించుకుంటున్నాయి. ఇప్పుడు ఎవ్వరితోనూ కుత్సితత్వం కనిపించడం లేదు. బతికుంటే బలుసాకైనా తినవచ్చునని, అందరూ బాగుండాలని మూసుకున్న తమ హృదయ తలుపులను తెరిచి అందులో కొలువైన భగవంతునికి జ్యోతల ద్వారా జ్యోతులు వెలిగిస్తూ ఆత్మస్థైర్యంతో నిలబడుతున్నాయి.

అజాగ్రత్త, నిర్లక్ష్య ధోరణితో విషపురుగు కాటుపడిన జనులు పశ్చాత్పాపంతో తమకు తామే బందీలవుతూ కోలుకుంటున్నారు. చూస్తుండగా మూడునెలల కాలం గడిచింది. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని అత్యవసర కార్యాలయాలను, వృత్తులను నిర్వహించుకోవచ్చునని మార్గదర్శకాలు ఇచ్చింది. అంతే కాకుండా మద్యం దుకాణాలను తెరిపించింది.

ఎంతోమంది తెల్లవారేసరికి దుకాణాల ముందు బారులు తీరారు. వారిని నిలువరించడం ఎవరి తరమూ కావడం లేదు. ఇన్నాళ్ళు పడిన శ్రమంతా ఒక్కసారిగా బూడిదలో పోసిన పన్నీరవుతున్నట్టూగా ఎన్నో కుటుంబాలు మళ్ళీ రోడ్డు పాలవడానికి దారులు తెరుచుకున్నాయని మహిళలంతా గగ్గోలు పెడుతూ ధర్నాలు చేపట్టారు.

తారమ్మ భర్త సాయిలు దీక్ష ముగిసి పనికి వెళ్తుండడం, మద్యం షాపులు తెరవడం గుండెల్లో రాయిపడ్డట్టయ్యింది. ఇన్నాళ్ళుగా ఆరోగ్యం బాగా కుదుటపడి, ఉల్లాసంగా, ఉత్సాహంగా స్థిమితపడ్డాడు. కొద్ది రోజులు తెరవకుండా ఉంటే తమ కష్టాలు తీరేవన్న ఆశ అడియాసే అవుతున్నట్టు తోచింది. అయినా డబ్బాలు గీసిన షాపు ముందు ఒక డబ్బాలో తానూ దస్తీ వేయించింది. ఎందుకంటే ఎక్కడ తన భర్త ఎండలో సొమ్మసిల్లుతాడోననే పిచ్చిభయం ఆమెది, ఇంత జరుగుతున్నా సాయిలు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం ఆమెలో ఒకింత కుతూహలాన్ని కలిగించింది. అదే విషయాన్నిఅడిగింది భర్తను. దానికి సాయిలు ఇన్నేళ్ళలో ఎన్నడూ లేని ఆనందాన్ని ఇల్లు కదలకుండా ఉన్న ఈ రోజుల్లో తెలుసుకున్నాను. నా కుటుంబం భవిష్యత్తు కోసం ఇంక ఒక్క ఆదివారం తప్ప ఏ రోజూ ముట్టుకోనని ఆ దేవుని మీద ప్రమాణం చేసుకున్నానని చెప్పడంతో తారమ్మ కళ్ళలోనే కాదు ఇంట వారందరిలోనూ కొత్తకాంతులు విరిశాయి.

వదనలోనూ, వదనలాంటి వాళ్ళలోనూ అంతకుముందున్నభేషజాలన్నీ చీకట్లో కలిసి కొత్త వెలుగు ప్రసరించింది.

ఈ రెండు కుటుంబాల వంటి ఎన్నో కుటుంబాలు మళ్ళీ కొత్తగా చిగురిస్తున్నాయి. వేదమ్మ లాంటి పెద్దలమాట చద్దన్నం మూట అని గుర్తెరుగుతున్నాయి. కాలుష్యమంతా కడిగివేయబడ్డట్టుగా ప్రకృతి కూడా కొత్తదనం సంతరించుకుంది.

మానవుడు భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉందని దానిని నాశనం చేస్తూ చెట్లను నరుకుతూ, కొండలను కరిగిస్తూ, నదులను ఎండగొడితే విచ్చలవిడితనానికి శాపంగా ఇటువంటి విషపురుగులు పుట్టుకొస్తాయని ’బతుకువిలువ’ తెలుసుకొంటూ, తెలియజేస్తుండగా తాను వచ్చినపని పూర్తయ్యిందన్నట్టుగా విశ్వవ్యాప్తమైన క్రిమి మళ్ళీ మరెక్కడా కనిపించలేదు. అధర్మం చెలరేగినప్పుడు ఏదో ఒక రూపంలో తాను మళ్ళీ అవతరిస్తానని చెప్పినదానికి సాక్ష్యంగా భగవంతుడు ఈ రూపంలో వచ్చాడని ఎవరికి వారు నమ్మడం మొదలుపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here