Site icon Sanchika

కాజాల్లాంటి బాజాలు-107: బీ పాజిటివ్..

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]అ[/dropcap]సలు ఇప్పుడు ఎవరినోట విన్నా “పాజిటివ్‌గా ఆలోచించండి. అప్పుడే మీరు సంతోషంగా ఉండగలుగుతారూ..” అనే మాటలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. “ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడూ నవ్వుతూ ఉండండీ..” అని కూడా చెపుతున్నారు. అంతవరకూ ఎందుకూ మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పిన “సంతోషం సగం బలం..” అనే సామెత ఉండనే ఉందిగా..

ఆ మాట వరకైతే సరే.. బానేవుంది. కానీ మామూలుగా ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ప్రతికూల పరిస్థితుల్లో కూడా పాజిటివ్‌గా ఆలోచించగలగాలి అని చెపుతున్నారు అదేంటో. ప్రస్తుతం నాకు అలాంటి సమస్యే వచ్చింది. అందుకని ప్రతికూల పరిస్థితుల్లో కూడా సంతోషంగా ఉండడం ఎలా అని పొద్దున్నే ఫోన్ చేసి మా వదినని అడిగేను.

“నువ్వు ఇడ్లీకోసం మినప్పప్పు నానబోసావనుకో.. మీ వీధిలో కరెంటు తీగలకి అడ్డంగా ఉన్నాయని విద్యుత్ శాఖ వాళ్ళు చెట్ల కొమ్మలని కొట్టెయ్యడానికి కరెంట్ కనెక్షన్ ఆపేసారనుకో.. ఆ పని పూర్తయేదాకా అంటే సాయంత్రం దాకా కరెంట్ రాదు. అప్పుడేం చేస్తావ్!” ఎదురు నన్నే అడిగింది వదిన.

“ఏం చేస్తానూ.. ఆ నానిన పప్పుని ఫ్రిజ్‌లో తోసేసి ఎప్పుడు కరెంట్ వస్తే అప్పుడే గ్రైండ్ చేస్తాను.”

వెంటనే చెప్పిన నా సమాధానానికి అంత తెలివైన వదినా కాసేపు ఏం మాట్లాడలేకపోయింది. కాస్త తేరుకున్నాక ఇంకో మాటడిగింది.

“మీ ఆయన నిన్ను కందిపచ్చడి చెయ్యమన్నాడనుకో.. మిక్సీలో వద్దూ, కమ్మగా ఉండదూ.. రోట్లో రుబ్బూ.. అన్నాడనుకో.. అప్పుడేం చేస్తావ్!”

“ఏం చేస్తానూ! రోట్లో వేయించిన కందిపప్పేసి దాని ముందు మా ఆయన్ని కూర్చోబెడతాను.” కోపంతో ఒళ్ళు మండిపోతుంటే జవాబిచ్చేను. అసలు అడిగినదానికి సమాధానం చెప్పకుండా ఎదురు నన్నే ప్రశ్నలు వేస్తున్న వదిన్ని చూస్తుంటే విసుగులాంటిది వచ్చింది. ఫోన్ పెట్టేయబోయేను.. ఎలా గ్రహించిందో మరి…

“ఆగాగు.. ఫోన్ పెట్టేయ్యకు. ఆర్నెల్లు సావాసం చేస్తే వారు వీరవుతారుట.. అలాగ ఇన్నాళ్ళనించి నాతో మాట్లాడి మాట్లాడి నా చురుకుతనం కాస్త నీకూ అంటుకున్నట్టుంది..” నవ్వుతూ అంది వదిన.

“ఇంతకీ నేనడిగినదానికి సూటిగా జవాబు చెపుతావా లేదా!”

“సరే.. ఇంక ఉదాహరణలు లేకుండా డైరెక్ట్‌గా పాయింట్‌కి వచ్చేస్తున్నాను. ఏదైనా జరగరానిది జరిగినప్పుడు ఇంతకన్న పెద్ద ప్రమాదం జరగలేదూ.. దీనితో సరిపోయిందీ.. అని సంతోషించడం..” అంది వదిన సింపుల్‌గా.

“ఏడిసినట్టుంది.. ప్రమాదం జరిగినప్పుడు సంతోషం ఎలా వస్తుందీ!”

“అందుకే ఉదాహరణలు చెప్పేది. ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ అయిందనుకో.. ‘హమ్మయ్య కళ్ళకేమీ కాలేదు.. కాలికే ఏదో ఫ్రాక్చర్.. అంతేకదా! రెణ్ణెల్లలో మళ్ళీ మామూలుగా నడిచెయ్యగలనూ..’ అనుకోవడమన్న మాట.”

“నా మొహంలా ఉంది..”

“సరే.. ఇంకోటి చెపుతాను.. సతీ సక్కుబాయిలాగా పాటలు పాడేసుకుంటూ కందిపచ్చడి రుబ్బేస్తూ.. ‘ఆహా..ఇలా రుబ్బడం వలన నా చేతులకి ఎంత మంచి వ్యాయాయం దొరుకుతోందీ! అయినా రోట్లో రుబ్బిన పచ్చడి రుచే వేరు.. మా ఆయన ఈ పచ్చడితో ఓ కుంభం అన్నం లాగిస్తాడు..’ అనుకుంటూ తన్మయత్వంతో పచ్చడి రుబ్బెయ్యడాన్నే ఎప్పుడైనా సంతోషంగా ఉండడం అంటారు..”

“నువ్వీ రుబ్బుళ్ళ ఉదాహరణలు తప్ప ఇంకేవీ చెప్పలేవా!”

అవతల్నించి వదిన శాంతంగా అడిగింది.

“ఇంతకీ ఇప్పుడు నీ సంతోషాని కొచ్చిన కష్టం ఏవిటీ!” అంది ఆరాగా.

“అదికాదు వదినా.. మా పక్క ఫ్లాట్‌లో సులోచన ఉంది కదా! వాళ్ళాయన్నీ, అబ్బాయినీ పోలీస్ స్టేషన్‌కి తీసికెళ్ళేరు.”

“అరెరె.. ఏవైంది!”

“వాళ్ళబ్బాయి కింకా పధ్నాలుగేళ్ళే కదా! నిన్న సాయంత్రం వాళ్ళ నాన్న స్కూటరేసుకుని బైటకి వెళ్ళేట్ట. వెళ్ళినవాడు తిన్నగా ఉండకుండా మెయిన్ రోడ్ మీద ఆక్సిడెంట్ చేసేట్ట. ఆ దెబ్బలు తిన్నాయన స్కూటర్ నంబర్ గుర్తు పెట్టుకుని పోలీసులకి చెప్పేట్ట. వాళ్ళు పొద్దున్నే వచ్చి ఆ అబ్బాయినీ, ఆయన్నీ కూడా స్టేషన్‌కి తీసికెళ్ళేరు. ఇప్పుడు నేను వెళ్ళి ఆవిడని పలకరించి రావాలి. ఎలాగో అర్థం కావటంలేదు. ఇందులోంచి పాజిటివ్‌గా ఎలా ఆలోచించాలో నాకు తెలీక నిన్నడుగుతున్నాను.”

“హోస్.. ఇంతేనా.. ఈమాత్రం దానికి ఇంత బిల్డప్ ఇవ్వాలా! ఆ సులోచన దగ్గరికి వెళ్ళి సింపుల్‌గా ‘ఖంగారుపడకు సులోచనా.. ఓ గంటలో మీవాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళ కిష్టమైన బ్రేక్‌ఫాస్ట్ చేసుంచూ’… అని చెప్పు.”

“పళ్ళు రాలగొడుతుంది నన్ను అలా చెపితే. అయినా అంత కష్టం వచ్చిన వాళ్ళ దగ్గరకెళ్ళి బ్రేక్‌ఫాస్ట్ చెయ్యమంటారా ఎవరైనా! ఇంత దారుణంగా ఆలోచిస్తున్నావేంటీ!”

“హమ్మయ్య.. నువ్వు కూడా గుడ్డిగా నేను చెప్పింది చేసెయ్యకుండా ఆలోచించే స్టేజి కొచ్చేవు కదా. సరే ఇప్పుడు చెప్తాను విను. ఆ సులోచన దగ్గరికి వెళ్ళి ‘ఖంగారుపడకు సులోచనా.. మా అంకుల్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పెద్ద పొజిషన్‌లో ఉన్నారూ. వీళ్ళ గురించి చెప్పి సాయం చెయ్యమంటానూ..’ అని చెప్పు”.

“పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో నాకెవరూ తెలీదే… నీకెవరైనా తెల్సా! నువ్వు సాయం అడిగితే చేస్తారా వాళ్ళు.. పాపం సులోచన..” ఆత్రంగా అడిగేను.

హడావిడిగా అన్న నా మాటలకి నవ్వేసింది వదిన..

“నాకూ ఎవరూ తెలీదు. కానీ ఆ సమయంలో అలా చెప్తే ఆ పరిస్థితుల్లో ఉన్నవాళ్లకి ప్రవాహంలో కొట్టుకుపోతున్నప్పుడు ఓ గడ్డిపోచ దొరికినంత రిలీఫ్ వస్తుంది. అది చాలు.. జరిగినదానికి వాళ్ళు బాధపడడం మాని ఏం చెయ్యాలో ఆలోచించుకుందుకు.”

హమ్మ వదినమ్మా.. అనుకున్నాను. కానీ మళ్ళీ సందేహం..

“అలా చెప్పేస్తే సరిపోదుగా.. వెంటనే సాయం అడుగుతుంది. ఎక్కడికని వెడతాం..”

“ఏం పరవాలేదు. అసలిప్పటికే ఆ సులోచన మొగుడూ, కొడుకూ ఇంటికి వచ్చేసుంటారు. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ఆక్సిడెంట్లు డబ్బులతో మాఫీ అయిపోతాయి. ఈ లోపల నువ్వు పక్కనుండి ధైర్యం చెపితే చాలు.”

“కాకపోతే..” అనుమానం వ్యక్తం చేసేను.

“అదిగో అదే నెగటివ్ థింకింగ్ అంటే.. వాళ్ళు వచ్చేసుంటారనే నమ్మకంతోనే సులోచనింటికి వెళ్ళు. ఒకవేళ నువ్వెళ్ళే టైమ్‌కి రాకపోతే నువ్వు పక్కన కూర్చుని ధైర్యం చెపుతుంటే వచ్చేస్తారు. బీ పాజిటివ్.” అంది వదిన.

వదిన మాటలు నమ్మబుధ్ధవలేదు. అనుమానిస్తూనే సులోచన దగ్గరికి వెళ్ళేను. అప్పటికే కాంప్లెక్స్‌లో ఉన్నవాళ్ళు కొంతమంది సులోచన చుట్టూ ఉన్నారు.

“ఇందుకే మైనారిటీ తీరకుండా పిల్లల చేతికి బండి తాళాలు ఇవ్వొద్దంటారు. ఎవరు వింటారూ!” అంటోంది నూట పదిహేడో అపార్ట్‌మెంట్‌లో ఉండే నిర్మల.

“నీకు తెల్సా నిర్మలా.. మొన్న మా బావగారింటి చుట్టాలబ్బాయి ఇలాగే ఆక్సిడెంట్ చేస్తే అ కుర్రాడితోపాటు వాళ్ల నాన్నని కూడా జైల్లో పెట్టేరు..” మొహమంతా వెలిగిపోతుంటే మూడువందల పదో అపార్ట్‌మెంట్‌లో ఉండే ఆశ గట్టిగా అక్కడున్న అందరూ వినేటట్టు చెపుతోంది.

వీళ్ళ మాటలు వింటున్న సులోచన పాపం బిక్కమొహం పెట్టేసింది. నేను నెమ్మదిగా వెళ్ళి సులోచన పక్కన కూర్చున్నాను. నన్ను చూస్తూనే భోరుమంది సులోచన. తన చెయ్యి నా చేతిలోకి తీసుకున్నాను ధైర్యం చెపుతున్నట్టు.

“మా ఆయన పిల్లాడికి పధ్ధెనిమిదేళ్ళూ వచ్చేదాకా బండి ఇవ్వద్దని చెప్తూనే ఉన్నారు. పిల్లాడు సరదా పడుతున్నాడని నేనే పంపించేను. ఇలా అవుతుందనుకోలేదు.” అంది.

నేను వదిన మాటలు గుర్తు చేసుకుంటూ పేద్ద పోలీస్ ఆఫీసర్ తెలుసని చెప్పడానికి గొంతు సవరించుకున్నాను.

ఇంతలో గుమ్మంలో ప్రత్ర్యక్ష్యమయ్యేరు తండ్రీ కొడుకులిద్దరూ.. ఒక్క ఉదుటన లేచి వాళ్ళకి ఎదురెళ్ళింది సులోచన.

ఆక్సిడెంట్ చిన్నదే కనక పోలీస్ ఇన్‌స్పెక్టర్ మంచివాడు కనక ఎదుటివాడికి తగిలిన దెబ్బలకి చికిత్సకి వీళ్ళు డబ్బులిచ్చేటట్టు మధ్యవర్తిత్వం చేసి కేసు రాయకుండా వీళ్ళని మందలించి పంపేసేట్ట.

సులోచన మాట పక్కన పెడితే ముందు నాకు గుండెలమీంచి పెద్దభారం దిగినట్టనిపించింది. ఇంటి కొచ్చి జరిగినదంతా వదినకి చెప్పేను.

“చూసేవా! అంతా దూదిపింజెలా ఎలా తేలిపోయిందో! అందుకే మిన్ను విరిగి మీద పడ్డా సరే ఎప్పుడూ పాజిటివ్ గానే ఆలోచించాలి. నువ్వేది ఆలోచిస్తే నీకు అదే జరుగుతుంది. యద్భావం తద్భవతి అన్న మాట గుర్తు తెచ్చుకో. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు కదా.. పైన తథాస్తు దేవతలు ఉంటారనీ.. అందుకనే మన నోటివెంట ఎప్పుడూ మంచిమాటలే రావాలనీ చెప్పేవారు కదా..” అవునుకదా! వదిన ఎంత మంచిమాట చెప్పిందీ.. ఎప్పుడూ నోటివెంట మంచిమాటలే రావాలి. అప్పుడు అంతా మంచే జరుగుతుంది.

సర్వే జనాస్సుఖినో భవంతు.

Exit mobile version