బ్యూటిఫుల్ బాయ్

1
2

2018 లో వచ్చిన హాలీవుడ్ చిత్రం “బ్యూటిఫుల్ బాయ్”. రకరకాల ఉద్వేగాలకు గురి చేస్తుంది. నిజమైన ఘటనల ఆధారంగా తీసిన తండ్రీ కొడుకుల కథ, నేపథ్యం డ్రగ్స్ వలలో చిక్కిన యువతరం. డేవొడ్ షెఫ్, నిక్ షెఫ్ తండ్రీ కొడుకులు. తండ్రి వ్రాసిన “బ్యూటిఫుల్ బాయ్ : ఎ ఫాదర్స్ జర్నీ థ్రూ సన్స్ అడిక్షన్” మరియు కొడుకు వ్రాసిన “ట్వీక్ : గ్రొయింగ్ అప్ ఆన్ మెథ్” అన్న రెండు పుస్తకాల ఆధారంగా తీసారు.
డేవిడ్ న్యూ యార్క్ టైంస్ లో రచయిత. తన ఎడిటర్ ముందు కూర్చుని ఓ సహాయం కోరుతాడు, అది పూర్తిగా వ్యక్తిగతం అంటాడు. తన కొడుకు నిక్ కనబడట్లేదనీ, ఏవేవో డ్రగ్స్ కు బానిసయ్యాడనీ, అతన్ని వెతికి పట్టుకోవడంలో సాయం కావాలనీ అంటాడు. ఇది చిత్రం మొదలు. తర్వాత నిక్ దొరుకుతాడు, ఇంటికి తీసుకొస్తారు. తండ్రికి కొడుకు మీద చాలా ప్రేమ, ఆపేక్ష, అతని మీద బెంగ. అతను మొదటి భార్య కొడుకు. రెండవ భార్య ద్వారా ఇప్పుడు ఒక కొడుకు, ఒక కూతురూ. ఆ పిల్లలిద్దరూ నిక్ అంటే ఇష్టం.నిక్ కూడా వాళ్ళతో కలిసిపోయే రకం. నిక్ మాయమైపోయిన ప్రతిసారీ డేవిడ్, అతని మొదటి భార్యా ఫోన్ మీదే ఒకరినొకరు తప్పు పడుతూ వుంటారు. ఇప్పుడు నిక్ కి 18 ఏళ్ళు. అంటే స్వతంత్రుడు. తండ్రి జోక్యాన్ని సహించడు. తండ్రి కూడా ఈ విషయం లో నిస్సహాయుడు. కాలేజీలో వుండలేక పారిపోతాడు. మళ్ళీ వెతికి పట్టుకుంటారు. ఏవో మామూలు డ్రగ్స్ అనుకుంటే అతను క్రిస్టల్ మెథ్ అనే ప్రమాదకరమైన డ్రగ్ కి బానిసైపోయాడు. ఒక రీహేబిలిటేషన్ సెంటర్ లో జేరుస్తారు. బాగానే కోలుకుంటున్నాడు అనుకునే సమయానికి మరలా పారిపోతాడు అక్కడినుంచి. ఒకసారి తండ్రికి ఫోన్ చేసి మరలా కాలేజీ జేరాలనీ, జీవితాన్ని సరిదిద్దుకోవాలనీ వుందంటాడు. తండ్రి జేర్పిస్తాడు. ఆ ముచ్చటా కొన్నాళ్ళే. అక్కడి నుంచీ పారిపోతాడు.
ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. డేవిడ్ రెండవ భార్య కూడా ఓర్పుగా నిక్ మేలు కోసం చేయగలిగినదంతా చేస్తుంది. కానీ ఒక స్టేజ్ తర్వాత ఇక అతను మారడు అని అర్థం చేసుకుని, భర్తతో అంటుంది నువ్వు అతన్ని మార్చలేవూ అని. చిన్న పిల్లవాడు కూడా నాన్నని అడుగుతాడు, నాన్నా నిక్ మళ్ళీ డ్రగ్స్ తీసుకుంటున్నాడా అని. తెలీదు బాబూ అంటాడు. అంటే అక్కడి సామాజిక వాతావరణాన్ని ఊహించుకోండి. ఓ చిన్న పిల్లవాడికి ఇవన్నీ తెలుస్తున్నాయీ అంటే ఎలా వుందో. ఇక ఈ భయంకరమైన అలవాటు మనుషులను ఎంతకు దిగజారుస్తుందో చూడండి. తన కొడుకు ఆచూకీ కోసం వెతుకుతూ ఒక అమ్మాయిని రెస్త్రాఁ బయట కలుస్తాడు. టిండి తినలేదు, డబ్బేమైనా కావాలా అని అడుగుతాడు తండ్రి. బ్లో జాబ్ (అంగ చూషణ) చేయ్యాలా అని అడుగుతుంది. ఏం వద్దులే, పద నీకు తిండి కొనిపెడతాను అంటాడు. ఇది వాస్తవ చిత్రం. ఇక మరో సందర్భంలో కొడుకు కూడా కొన్ని వందల డాలర్లు కావాలంటాడే గాని, ఫోన్ లో మరేమీ మాట్లాడడు. అప్పటికి కాస్త గట్టిపడిన తండ్రి నా దగ్గర లేవని చెప్పేస్తాడు. ఇంట్లో తండ్రి, కరేన్, పిల్లలూ లేనప్పుడు నిక్ తన గాళ్ ఫ్రెండ్ తో వచ్చి తలుపు విరగకొట్టి ప్రవేశించి దొంగతనం చేస్తాడు. అప్పడే ఇంటికి వస్తున్న తండ్రిని చూసి వెనక ద్వారం నుంచి పారిపోతారు. కరేన్ కారు తీసి వాళ్ళ వెంటపడుతుంది కానీ అందుకోలేకపోతుంది. నిక్ గాళ్ ఫ్రెండ్ కి మత్తు ఎక్కువై పోయి ఆసుపత్రిలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. నిక్ తండ్రికి ఫోన్ చేసి తనకు కుటుంబ సహాయం కావాలి, ఇంటికి రావచ్చా అని అడుగుతాడు. గుండెలమీద రాయి వుంచుకుని వద్దంటాడు తండ్రి. నిక్ కూడా ఓవర్డోస్ చేసుకుని ఆసుపత్రిలో తేలుతాడు.
చివరి షాట్ లో డేవిడ్, అతని మొదటి భార్య విక్కీ నిక్ ను చూడడానికి ఆసుపత్రికి వెళ్తారు. కుటుంబ సహాయంతో నిక్ ఎనిమిది ఏళ్ళూ డ్రగ్స్ కు దూరంగా ఉండగలుగుతాడు. అంతటితో సినిమా ముగుస్తుంది.
అమెరికా లో డ్రగ్స్ చేసే బీభత్సమంతా కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు దర్శకుడు. అందులో భాగంగా ఆ మత్తు పదార్థాల సేవనం, ఇంజెక్షన్లు పొడుచుకుంటున్నప్పుడు తూట్లు పడ్డ చేయి చూపడం అంతా కడుపులో దేవినట్టు అనిపిస్తుంది. ఆయా డ్రగ్స్ పేర్లు కూడా యథేచ్చగా వాడబడతాయి. ఒక క్షణం నాలో సంశయం. ఈ పేర్లూ, ఈ నిజ సేవన దృశ్యాలూ అవసరమా అని. అర్జున్ రెడ్డి చిత్రంలో ఇవే చూపిస్తే అభ్యంతరం చెప్పిన మనిషిని. అయితే రెండు విషయాలున్నాయి ఇక్కడ. అమెరికన్ ప్రజలకి ఇవి తెలిసిన విషయాలే, షాక్ వేల్యూ లేదు. రెండు అర్జున్ రెడ్డి లో వీటిని చూపిస్తూ కూడా కాస్త లీనియెంట్ గా చూపారు. అదేదో ఫేజ్ అయినట్లు, తను బయటికి రాగలనన్నట్టు ఒక డాక్టర్గా హీరో చెప్పడం. ఇక్కడ వాస్తవం విరుధ్ధంగా వుంది. ఒక సారి అలవాటయ్యాక ఉండలేని తనం, రీహేబిలిటేషన్ సెంటర్ నుంచి కూడా పారిపోయే పరిస్థితులు, డ్రగ్స్ కొనడానికి డబ్బుకై అమ్మాయిలు బ్లో జాబ్ సేవలందించడం, అబ్బాయిలు దొంగతనాలు చెయ్యడం ఇవన్నీ మనల్ని అవి చూసి వెగటు కలిగిస్తాయే తప్ప ఒకరకమైన మేలిముసుగు నుంచి అందమైన ద్రవ్యాలను అరమోడ్పు కళ్ళతో హీరోని చూసినట్లు చూడం. ఒక చెంప ఈ డ్రగ్స్, మరో చెంత ఆ పతనం. రెంటి మధ్యా వున్న లింక్ మనల్ని బుధ్ధి దగ్గర పెట్టుకునేలానే చేస్తుంది.


స్టీవ్ కేరెల్ తండ్రిగా, తిమోథీ షలమే కొడుకుగా అద్భుతంగా నటించారు. కొడుకు రోల్ కష్టం కాబట్టి అతని పేరే ముందు చెప్పుకోవాలి.బెల్జీన్ దర్శకుడు ఫెలిక్స్ వేన్ గ్రొనిగెఁ దర్శకత్వం చాలా బాగుంది. ఈ పేర్లు నాకు కొత్తే. వెతికి వీరి ఇతర చిత్రాలు చూడాలి.
ఈ చిత్రం చూడమని నేను స్ట్రాంగ్ గా రెకమెండ్ చేస్తాను. నేను అమేజాన్ లో లేదా నెట్ఫ్లిక్స్ లో చూసాను. గుర్తు లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here