బీటలు వారుతున్న బంధాలు

2
2

[dropcap]రా[/dropcap]మనాథం గారు వరండాలో కూర్చుని న్యూస్ పేపర్ చదువుకుంటున్నారు. మనవడు గోపి ఆయన దగ్గరికి వచ్చాడు. ఆ రోజు నీట్ (NEET) ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

“నాయనా గోపి నీకు ఎంత ర్యాంక్ వచ్చింది?” అన్నారు.

“నలభై ఐదు వేల ఆరు వందల పంతొమ్మిది” అన్నాడు గోపి.

“గట్టిగా చెప్పు, మళ్ళీ చెప్పు” తాతయ్య అన్నారు. గోపీ బిగ్గరగా అదే నెంబరు చెప్పాడు. ఆయన హతాశుడయ్యేరు. “కనీసం నాలుగు వందల ఏభై వస్తుంది అనుకున్నానురా – ఏమిటి ఇంత దారుణం – అసలేం జరిగింది?” అన్నారు, బాధతో.

గోపి తలదించుకున్నాడు. రామనాథం మౌనంలోకి వెళ్ళిపోయేరు. ఆలోచనల్లో పడ్డాడు – “ఆహా ఎటువంటి కుటుంబం, చదువంటే ప్రాణం, చదువే దైవం, ఊపిరి; అదే సంపద వ్యాపకం అని బతికేం కదా – అన్నీ ఫస్ట్ క్లాసులే. ఇంట్లో పిల్లలందరికీను. కొందరు విశ్వవిద్యాలయాల్లో, పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంక్స్ కూడా సంపాదించేరు. తను అనుకున్న విధంగా ఇంజనీరింగ్, మాస్టర్స్ చేసి ఉత్తమ శ్రేణి కంపెనీలో ఉద్యోగం పొందేరు. అంచలంచలుగా ఎదిగారు. రామనాథం గారు తన తల్లిదండ్రులకు ఐదుగురి సంతానంలో రెండవ వాడు. తనకన్నా పెద్దన్న గారు కాలేజీలో ప్రొఫెసర్ చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు కూడా బాగా చదివి విదేశాల్లో స్థిరపడ్డారు.

రామనాథం గారు రిటైర్ అయ్యాక పెద్ద కుమారుడు వేణుమాధవ్ కోరిక మీద బరోడాలో వాళ్ళ ఇంట్లో ఉన్నారు కొన్నేళ్లుగా. రెండో అబ్బాయి రఘు కెనడాలో వున్నాడు.

వేణు ఛార్టర్డ్ అకౌంటెంట్, ఒక ప్రభుత్వ రంగ బ్యాంకులో సీనియర్ మేనేజర్. అతనికీ ఇద్దరు కొడుకులు. గోపి పెద్దవాడు. ఇప్పుడు నీట్ పరీక్ష ఇచ్చేడు.

మధ్యతరగతి నుండి రామనాథమే ధనిక వర్గముకు ఎదిగేరు. ఇక వేణు సరేసరి. మనుమలు ‘చాలా రిచ్’ గా పెరిగేరు. ఆధునిక యుగం! సౌకర్యాలు పెరిగాయి కదా. కారుల్లో పుట్టేరు. ఏసీ గదుల్లో పెరిగేరు. ప్రస్తుతం గేటెడ్ కమ్యూనిటీలో బంగ్లా కొన్నాడు వేణు. మంచి లాన్, మొక్కలు, క్రీపర్లు,సేవకులు..

కోడలు మధుమతి. రామనాథం, భార్య భవాని బాగా ఆలోచించి తెలిసిన వాళ్లను సంప్రదించి మధ్యతరగతికి చెందిన కుటుంబంలోంచి మధుమతిని ఎంచేరు. చక్కగా బాధ్యతలు అన్నీ నిర్వహిస్తుందనీ, విలువలతో ఉంటుందనీ వాళ్ళ భావన.

రామనాథం గతాన్ని నెమరు వేసుకుంటున్నారు. తలదిమ్ము మొదలైంది. కళ్ళు తిరిగేయి. సడన్‌గా క్రింద పడబోతుంటే అటుగా వెళ్తున్న పనిమనిషి చూసి కేకలు పెట్టింది. భవాని పరుగున వచ్చింది. నలుగురి సాయంతో మంచం మీద పడుకోబెట్టారు.

ఫోన్ అందగానే వేణు వచ్చి హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళేడు. “BP ఎక్కువగా వుంది. సడన్‌గా తీవ్ర ఒత్తిడికి గురి అయ్యారా? షాక్‌లో ఉన్నారు. ఫరవాలేదు” అని డాక్టర్లు వైద్యం ప్రారంభించారు. ఒక వారం తర్వాత ఇంటికి పంపేరు.

రామనాథంకు పూర్వపు ఓపిక తగ్గింది. ఒకరి సాయంతోనే నడిచే స్థితి. కాలకృత్యాలు కూడా అలాగే. భవానికి మతి తోచడం లేదు. “ఏమండీ.. అలా మౌనంగా ఉండి పోతున్నారు. మనవాడి ర్యాంకు గురించి మీకెందుకు అంత బెంగ, బాధ? మన పిల్లల్ని మనం పెంచేము. బాధ్యతలు తీరేయి. వీళ్ళందరి గురించి ఆలోచించి, మనోధైర్యం పోగొట్టుకోవద్దు. ఆరోగ్యం దెబ్బతీయకూడదు” అని బ్రతిమాలింది.

మంచి మాటలు చెప్పేది. వార్తా పత్రికలూ చదివి వినిపించేది. కథలు, హాస్య కథలూ, జీవితచరిత్రలూ చదివి వినిపించేది. దైవప్రార్థనలన్నీ చేసేది. రోజంతా పక్కనే ఉండి ఏం కావాలో చూసుకునేది. రెండు నెలల తర్వాత రామనాథం గారు కాలం చేసారు. భవానికి బ్రతుకు అగమ్య గోచరం. పెద్ద శూన్యం. రెండోవాడు కెనడాలో వున్నాడు కదా. అక్కడ చలికి తట్టుకోలేక వెళ్లలేదు. అతనే వచ్చి నెల రోజులు చొప్పున ఉండి వెళ్ళేవాడు కుటుంబంతో. ఇప్పుడు ఒంటరి బ్రతుకు ఆమెను కుంగదీస్తోంది. స్వంత ఊరు ఖమ్మం. అక్కడ ఇల్లు వుంది. మేడ మీదా, క్రింద, ఓ వాటా అద్దెకు ఇచ్చారు. చాలా పెద్ద భాగం వాళ్లే ఉంచుకున్నారు. వేసవికి వెళ్లి కొన్ని నెలలుండి వచ్చేవారు.

ఆ రోజుల్లో భవాని S.S.L.C. పాసయింది (ప్రస్తుత 11వ తరగతి). తెలివైనది. ఓర్పుతో, సహనంతో పిల్లల్ని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని పెంచింది. బరోడా వచ్చిన తరువాత భవాని మనవల మీద మీద దృష్టి పెట్టింది. ప్రేమించింది. లాలించింది. పలకరిస్తూ, పాటలు పద్యాలు నేర్పింది. డాన్సులు చేసేది. ఆటలాడించేది. అప్పట్లో వేణు ఒక ఏడంతస్తుల అపార్ట్‌మెంట్‍లో ఉండేవాడు. సాయంకాలాలు లిఫ్టులో మనవలతో క్రిందికి దిగి షికారు తిప్పేది. షాపులు చూపించి ఎక్కడ ఏవి అమ్ముతారో చెప్పింది. రోడ్డుపై నడవడం నేర్పింది. కరెంటు స్తంభాలు చూపి, కరెంటు ఎలా ఉత్పత్తి అవుతుందో చెప్పింది, ఎండలు, వానలు, ఋతువులు – మొక్కలు, వృక్షాలు, రకాలు, వాని భాగాలు, లాభాలు – అన్నీ వివరించింది. అపార్ట్‌మెంట్‍ ఆవరణలోని కారులు చూపి, రంగులు గుర్తించేలాగా, నంబర్లు, అక్షరాలూ పోల్చేలాగా, అవి ఎందుకు ఉన్నాయో చెప్పింది.

వార్తాపత్రిక పేజీలు తిరగేసి, దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రుల ఫోటోలు చూపించింది. ఇలా పిల్లలిద్దరూ బాల్యాన్ని చక్కగా, ఆడుతూ, పాడుతూ, ఆస్వాదించేరు. అయితే గత రెండేళ్లలో కొన్ని మార్పులు. వేణు ఒక గేటెడ్ కమ్యూనిటీలో బంగ్లా కొన్నాడు. అందరూ ‘సూపర్ రిచ్’ వర్గం వారు. కొత్త ప్రపంచంలోకి అడుగులు.

పిల్లల స్నేహాల్లో పెను మార్పులు. నలుగురు (దుష్టచతుష్టయం) కొత్త స్నేహితులు దొరికేరు. ఇంకేమి? వేణు, మధులకు హడావిడి, అరుపులు. నడక, నడత మారిపోయేయి. మొబైళ్ళు, టీవీ దగ్గర ప్లే స్టేషన్‌లో ఆటలు. కంప్యూటర్ గేమ్స్, టిక్-టాక్, చిప్స్ ప్యాకెట్లు డ్రింకులు – ఇంట్లో సభ్యులపై ప్రేమ, మర్యాదలు తగ్గిపోయాయి.

మామ్మ అసలు లెక్క లేదు. “నాయనా గోపీ, చాలాసేపు ఆడుతున్నావు. ఈ రెండేళ్లు కీలకం రా. చదువు మీద ఏకాగ్రత పెంచుకోవాలి. కాలం వృథా చెయ్యకు” అని బ్రతిమాలేది. గోపీ చెవికి ఎక్కలేదు.మధు తన పిల్లలకు పూర్తి సపోర్టు. కొందరిని నడమంత్రపు సిరి ‘అతి’కి, ‘వెంపర్లాట’కు దారి చూపుతుంది. మధుమతి భాష, వేషం, దుస్తులు – అన్నిట్లో మార్పు. బయట భోజనాలు. విహారాలు. కొన్నాళ్ళుగా రామనాథం భవానీలకు ప్రేక్షక పాత్ర. వేణుకు ప్రమోషన్లు. తీరిక లేని పని. తరచు క్యాంపులు.

ఇంతలో మామగారి మరణం. మధులో మార్పులు మరిన్ని. భవాని పొడకిట్టడం లేదు. రుసరుసలు. ఆమెకు మూల వైపు ఒక గది కేటాయించింది. “మీరు ఇక్కడ వుండండి” అంది. తరువాత, అత్తయ్య గారు నుంచి అత్తయ్య, ‘మీరు’ నుంచి ‘నువ్వు’కు పలకరింపు పడిపోయింది.

ఓ పది రోజులుగా వేణు ఊళ్లో లేడు. భవాని కనిపిస్తే చాలు, మధుకు ఆవేశం. విసుగు కట్టలు తెగేవి. “అబ్బ, పొద్దుటే ఈ చెత్త ముఖాన్ని చూసేను. రోజు ఎలా గడుస్తుందో ఏంటో” అనేది. “ఆరింటికే కాఫీ తాగకపోతే చచ్చిపోతారా?” అని అరిచేది. భవానిలో సహనం చచ్చిపోతోంది.

ఓ రోజు నలుగురు మహిళలు ఇంటికి వచ్చేరు. వాళ్లతో మధు “ఈమె నా ఖర్మ భరించలేకపోతున్నాను” అని చులకనగా అంది. వాళ్ళు హేళనగా భవానిని చూసి నవ్వేరు.

“నేను వీళ్ళతో షాపింగ్‌కు వెళ్తున్నాను. బయట తింటాము. పిల్లలకి బాక్సులు సర్దేశానులే. నీకు కావాల్సింది వండుకో” అంది. వెళ్ళిపోయింది.

భవాని తన గదిలోకి వెళ్లి ఒక చిన్న జిప్ బ్యాగ్ తీసి, రెండు చీరలు, వానిలో ఒక గుడ్డ సంచీలో తన దగ్గరున్న కాస్త సొమ్ము పెట్టింది. చేతి పర్సులో రెండు వందలు, చిల్లర పెట్టుకుంది. “బహూ వస్తే అత్తమ్మ బయటికి వెళ్లేరని చెప్పు”, అని కాపలా మనిషితో చెప్పి ఇల్లు వదిలింది. కనబడ్డ మొదటి ఆటో ఎక్కి “రైల్వే స్టేషన్” అంది. ఖమ్మం వెళ్లడానికి అప్పుడు ఏ రైలూ లేదు. నవజీవన్ ఎక్స్‌ప్రెస్ మర్నాడు ఉదయం వస్తుంది. బరోడా నుండి బయట పడాలి. సూరత్‌కు టికెట్ కొనుక్కుని, ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న లోకల్ రైలు ఎక్కేసింది.

రైలు దిగి కొంత నడిచి, ఒక బెంచ్ మీద కూర్చుంది. గతాన్ని నెమరు వేసుకుంటూ, కన్నీటి చారికలతో ముఖం ఎర్ర బడింది. ఈ లోకంలో లేదు, ఆమె!

అదే బెంచీలో చివరిన ఒక పెద్దాయన కూర్చుని ఉన్నారు. గమనించింది.. ఆమె.

“అమ్మా! మీరు ఎవరు? ఇక్కడ ఒక్కరూ..”

“ఏం అనుకోకండి. నన్ను సోదరునిగా భావించండి. మీ సంచి చూసి మీరు తెలుగువారని అర్థం అయింది. నా పేరు నారాయణరావు. మాది రాజమండ్రి. ఇక్కడ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాను”.

భవాని సూక్ష్మంగా తన గురించి వివరాలు చెప్పింది. “మీరు ఖమ్మం రేపు ఉదయం రైల్లో కదా వెళ్లేది. నాతో మాయింటికి రండి” అని నమస్కరించి కోరేరు.

భవానీ నారాయణ రావు గారితో కలిసి వెళ్లింది. ఆయన భార్య రమ కొంత ఆశ్చర్యంగా చూసింది. వెంటనే తేరుకుని “రండమ్మా” అని సాదరంగా పిలిచింది. విషయాలు తెలుసుకుంది. రైలు టిక్కట్టు అర్జెంటు ప్రాతిపదికలో కొన్నారు. ఖమ్మం చేరేసరికి తెల్లవారదు. భవానీ క్రింద వాటాలోని రాంబాబు ఫోన్ నెంబర్ తెచ్చుకుంది. నారాయణ రావు గారి ఇంట్లోంచి అతనితో మాట్లాడి “నేను రేపు బయల్దేరి ఖమ్మం వస్తున్నాను. స్టేషన్‌కు వస్తావా చీకటి కదా” అంది. “తప్పకుండానమ్మా” అన్నాడతడు. రమ మర్నాడు ఉపాహారం పెట్టింది. భోజనం సర్ది ఇచ్చింది. కొన్ని పళ్లూ, సాదరా కూడాను. నారాయణ రావు గారు రైలు ఎక్కించేరు.

రాత్రి హాయిగా పడుకుని ఖమ్మం వస్తుంటే లేచింది. ఇల్లు చేర్చెడు రాంబాబు. ఇల్లు కొంచెం శుభ్రం చేసికొంది. “పిన్ని గారూ, ఇదిగో కాఫీ తీసుకోండి. మీకు ఇడ్లీలు తెస్తాను. ప్రొద్దుట మాయింట్లో భోజనం; ఈలోగా నాలుగూ సర్దుకోండి. సాయంత్రం నుండి రొటీన్ లోకి వెళ్ళవచ్చు” అంది రాంబాబు భార్య జానకి.

భవాని కొన్ని సరుకులు, సామాగ్రి, కూరగాయలు తెచ్చుకుంది. పరిచయస్థులందరితో “నేను ఇక్కడ ఉందామని వచ్చేను. మనమంతా కలుసుకుంటూ వుందాము” అంది.

ఉదయం లేచి మొక్కలకు నీళ్లు పోసి, పూలు కోసి, గుమ్మం తుడుస్తుంది. టిఫిన్ తినేది. పూజ తర్వాత, పది గంటలకు సమవయస్కులైన మహిళలు వస్తారు. వాళ్లకు మంచి పుస్తకాలు, కథలు వినిపిస్తుంది. వార్తా పత్రిక చదివి, విశేషాలు చెప్తుంది. వంట, భోజనం, విశ్రాంతి మామూలే. తన స్నేహితులతోనూ, కిరాణా, కూరగాయల వాళ్లతోనూ “మీ పిల్లల్ని సాయంత్రాలు నా దగ్గరకు పంపండి. కాస్సేపు కూర్చోబెట్టి చదువు చెప్తాను” అంది. వాళ్ళెంతో సంబరపడ్డారు.

కనీసం పది మంది వచ్చేవారు. వయస్సును బట్టి వాళ్లకు అక్షరాలు, గుణింతాలు, పద్యాలు చెప్పి వల్లె వేయించేది. తను నిలబడి చేతులు తిప్పి వాళ్లను కూడా అలా చెయ్యమనేది. ఓ నల్ల బోర్డు తెచ్చి విషయాలు వ్రాసేది, చదివించేది. వాళ్లను కూడా బోర్డు మీద రాయమనేది. అంకెలు, ఎక్కాలు, లెక్కలు నేర్పించేది. చదువును ఆట పాటలతో కలిపి విసుగనిపించకుండా సరదాగా ఉంచేది. 8, 9 తరగతుల పిల్లలకు “ఎందుకు, ఎలాగ” అనే అంశాలకు ప్రాధాన్యమిచ్చి పాఠాలు చెప్పేది. వ్యక్తిగత శుభ్రత, పుస్తకాల పై శ్రద్ధ చెప్పేది.

ఓ పది రోజుల తర్వాత వేణు వచ్చాడు. “అమ్మా! ఎంత పని చేసేవు” అని బాధతో ఏడిచేసేడు.

“చిన్నపిల్ల వాడిలా బాధపడకు.. సంతోషించరా. అమ్మ ఇప్పుడు ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం గల మహిళ. స్వేచ్ఛగా జీవిస్తోంది. నేను హాయిగా ఆరోగ్యంగా ఉన్నాను” అంది. కొన్ని రోజులు ఆమె దినచర్యను గమనించేడు. “అవును, ఆమె వరకు ఆమె కరెక్టే” అనుకున్నాడు. ఓ పదివేల రూపాయలు బల్ల మీద పెట్టాడు. “నాకు అవసరం లేదురా. బ్రతకడానికి మీ నాన్నగారు ఏర్పాట్లు చేసే వెళ్లేరు” అంది.

కొన్నాళ్లకు భవాని అక్క భర్త మరణించేరు. వనజమ్మకు 75 ఏళ్లు. ఒంటరి అయింది. “అక్కా, నువ్వు నాతో మనింటికి రా, ఒకరికొకరం తోడునీడగా వుందాం” అంది. ఆమె భవానిని కౌగిలించుకుని ఆనంద బాష్పాలు రాల్చింది. భవానికి ఆమె తోడు లభించింది.

భవాని హాయిగా ఠీవిగా బతుకుతోంది. ఇరుగు, పొరుగు, పేద, బిక్కి అంతా ఆమెకు బంధువులు, ఆప్తులు. నలుగురికి ఆమె ఆసరా, వాళ్లూ అలాగే ప్రేమిస్తారు – అవును కుటుంబం అనే పదానికి అర్థం మారుతోంది. పాత బంధాలకు బీటలు పడ్డాయి. కొత్తవి తెరుచుకొంటున్నాయి. ఆశ, పాశం, ఆప్యాయత, అనురాగం – ఇవే కదా మనల్ని బతికిస్తాయి. అవే బంధాలు.

మనిషి ఒక దారి మూసుకుపోతే మరో కొత్త దారి వెతుక్కుంటాడు. ముందుకు నడుస్తాడు. ఇదే జీవితం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here