Site icon Sanchika

బెజ్జ మహాదేవి వాత్సల్య భక్తి

[ఫిబ్రవరి 18 మహాశివరాత్రి సందర్భంగా శ్రీ గోనుగుంట మురళీకృష్ణ అందిస్తున్న బెజ్జమహాదేవి కథ.]

[dropcap]ప[/dropcap]న్నెండవ శతాబ్దంలో కర్నాటక రాష్ట్రంలో అవతరించినవాడు బసవేశ్వరుడు. ఈయన వీరశైవ భక్తిని ప్రభోదించాడు. శివుడి ఆజ్ఞ వలన భూలోకంలో అవతరించిన నందీశ్వరుడి అవతారంగా వీరశైవులు ఈయనని భావిస్తారు. వీరశైవ మతంలో యజ్ఞయాగాది క్రతువులకు ప్రాధానం లేదు. శివుడొక్కడే దేవుడు అని విశ్వసించిన వారందరూ వీరశైవులే! వీరి భక్తిలో ఒక రకమైన మూఢత్వం, ఉద్రేకం ఉంటాయి.

ప్రథమ ఆంద్ర వీరశైవ కవిగా ప్రసిద్ది గాంచిన పాల్కురికి సోమనాధుడు తనకు సమకాలికుడైన బసవేశ్వరుడి మహిమలను, వీరశైవ భక్తుల కథలను ద్విపద ఛందస్సులో ‘బసవ పురాణం’ పేరుతో భక్తిరస కావ్యంగా రచించాడు. ఇందులో ఎందరో శివభక్తుల కథలు ఉంటాయి. వారందరూ ప్రాచీనకాలం వారు కాకుండా ఆనాటి కాలంలోని వారు. అల్లమదేవుడూ, అక్కమహాదేవి, గొడగూచి, కాళహస్తి కన్నప్ప, సిరియాలుడు, ఏకాంత రామయ్య వంటి భక్తుల కథలు ఉంటాయి (సమకాలిక ఇతివృత్తాలను మత ప్రచారానికి ఉపయోగించటం వల్ల, ఇంకా కొన్ని ఇతర కారణాల వల్ల తర్వాత కాలంలో వీరశైవం ఆచరణీయం కాలేదనుకోండి. అది వేరే సంగతి.) అలాంటి వారిలో బెజ్జ మహాదేవి ఒకరు. ఈ కథలన్నిటిలో లాగ ఈమె పండితురాలు కాదు, ఆమెకి ఉన్నదల్లా అచంచలమైన శివభక్తి. భక్తి తప్ప ఇంకొకటి తెలియదు అమెకి. బెజ్జమహాదేవి కథను ఇప్పుడు తెలుసుకుందాం.

***

బెజ్జ మహాదేవి ప్రతిరోజూ శివుడిని పూజిస్తూ ఉండేది. భక్తిగీతాలు పాడుతూ ఉండేది. ఒకరోజు పూజా మందిరంలో శివుడి ప్రతిమను చూస్తున్న ఆమెకి ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది. లోకంలోని వారందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. కానీ శివుడికి తల్లి లేదేం! శివుడు పులిచర్మం కట్టుకుంటాడు. పాములను మెడలో వేసుకుంటాడు. స్మశానంలో తిరుగుతూ ఉంటాడు. ఒంటికి బూడిద రాసుకుంటాడు. తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా? విషం తాగనిచ్చేదా? ఇలా భిక్షాటన చేయనిచ్చేదా?

ఎవరికైనా తల్లి లేకపోవటం కన్నా మించిన కష్టం ఏముంటుంది? తల్లి ఉంటే బిడ్డలని దగ్గరుండి ఆలనా పాలనా చూసుకుంటుంది. పెళ్లి పేరంటాలు చేస్తుంది. తల్లి ఉంటేనే కాదా అందరికీ ఆ భాగ్యం దక్కేది? పాపం శివుడికి తల్లి లేకపోవటం వల్లనే ఒంటిగా తిరుగుతూ ఉంటాడు. ఎవరో ఎందుకు? నేనే తల్లిని అవుతాను. కన్నప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది అంటారు. శివుడికి పెంచిన తల్లి అనిపించుకుంటాను అనుకుంది బెజ్జ మహాదేవి.

అనుకున్నదే తడవుగా శిశువు అంత పరిమాణం గల శివుడి ప్రతిమను తయారుచేయించింది. దానినే శిశువుగా భావించి లాలించి ముద్దాడింది. కాళ్ళ మీద పడుకోబెట్టుకుని తలంటు స్నానం చేయించింది. నలుగుతో శరీరం అంతా రుద్దింది. దోసిళ్ళతో నీళ్ళు తీసుకుని పొట్టమీద చరుస్తూ పోసింది. కళ్ళలోకి నీళ్ళు పోకుండా నుదురు మీద అరచెయ్యి అడ్డంపెట్టి స్నానం చేయించింది.

స్నానం అయిన తర్వాత చెంబుతో నీళ్ళు తీసుకుని శివుడి చుట్టూతా తిప్పి దిష్టి తీసింది. మెత్తటి గుడ్డతో ఒళ్ళు తుడిచింది. తుడిచిన తర్వాత ధూపం వేసి, ఉయ్యాలలో పడుకోబెట్టింది. ఊపుతూ జోల పాటలు పాడింది. మూడు కళ్లకూ కాటుక పెట్టేది. పొట్టమీద పడుకోబెట్టుకుని జో కొట్టేది. ఆ ప్రతిమని శిశువుగా భావిస్తూ దొంగాటలు ఆడేది. ఒక వేలుని ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పుతుంది.

ఇలా రోజూ అనేకములైన బాల్యోపచారాలు చేస్తూ వాత్సల్య భక్తితో పరమేశ్వరుడిని సేవించుకుంటూ ఉంది. అయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకోసాగింది. ఆమె తల్లిప్రేమను చూసి ముగ్దుడైన హరుడు కూడా ఆమె కోరినట్లే అయిదేళ్ళ బాలుడిలా ప్రవర్తించేవాడు. ఆమె కొంగు పట్టుకుని తిరుగుతూ ఆమె ఉపచారాలు అన్నీ ఆనందంగా స్వీకరించేవాడు. ఒకరోజు ఆమె భక్తిని పరీక్షించాలనుకున్నాడు.

ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించబోతే తినేవాడు కాదు. పాలు పట్టబోతే నోరు తెరిచేవాడు కాదు. పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు. “అయ్యో! ఏమయిందయ్యా నీకు? ఇలా అయిపోతున్నావేమిటి? ఎవరు ఏది పెడితే అది తింటావు. ఒక భక్తుడు మాంస నివేదన చేస్తాడు. ఇంకో భక్తుడు నెత్తి మీది కెక్కి తొక్కుతాడు. నువ్వింత అమాయకుడివి కాబట్టే అందరూ నిన్ను ఇలా చేస్తున్నారు” అంటూ నిష్టూరాలు ఆడింది. “ఎంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకు?” అని దిష్టి తీసివేసింది.

ఎన్ని చేసినా శివుడికి తగ్గలేదు. “అయ్యో! నీ శరీరం చల్లగా ఉంది. ఈ రోగం నాకొచ్చినా బాగుండేది కదా! మాట్లాడవేమయ్యా! దైవమా! నా బిడ్డను రక్షించు” అంటూ పరిపరి విధాల వాపోయింది. ఎన్ని ఉపచారాలు చేసినా శివుడిలో మార్పు లేదు.

“జరగరానిది ఏమైనా జరిగితే నేనెలా బ్రతకనయ్యా? ఒంటరిగా బ్రతికే ధైర్యం నాకు లేదు. ఆ పాడు రోజు నా పాలిట పడకముందే ఈ గుక్కెడు ప్రాణం గుటుక్కుమనిపించుకుంటాను” అంటూ తల శివలింగాని కేసి కొట్టుకోసాగింది. నుదురు చిట్లింది. రక్తం ధారగా కారసాగింది. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. కళ్ళు మిరుమిట్లు గోలిపేటట్లు మెరుపులు మెరిశాయి. పెళపెళ మంటూ శబ్దాలు వచ్చాయి. శివలింగం స్థానంలో పులిచర్మం ధరించి మెడలో నాగాభరణంతో, జటాజూటంలో నెలవంకతో శివుడు ప్రత్యక్షమైనాడు.

బెజ్జ మహాదేవి తల శివుడి తొడను ఆనుకుని ఉంది. ఆమె నుదుటి మీద రక్తం అదృశ్యమైంది. ఆమె తలమీద చేయి వేసి “అమ్మా! లే!” అన్నాడు ఆప్యాయంగా. బెజ్జ మహాదేవి తలెత్తి చూసింది. ఎదురుగ ప్రసన్న వదనంతో పరమేశ్వరుడు, ఆ వెనుకనే పార్వతి, నంది, భ్రుంగి వంటి ప్రమథ గణాలు అందరూ కనిపించారు.

“నీ ప్రయత్నాన్ని మానుకో! నీ భక్తికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో!” అన్నాడు.

“నాకు వరమెందుకయ్యా! ఇప్పుడు రోగంతో బాధ పడుతున్నది నువ్వు. నువ్వు ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడవై ఉంటే అంతకన్నా నాకు కావలసింది ఏముంది నాయనా!” అన్నది అమాయకత్వంగా.

ఆమె వాత్సల్య భక్తికి శివుడు ఎంతో ఆనందించాడు. “నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుందమ్మా!.. నువ్వు నాకు తల్లివి గనక ముల్లోకాలకు ముత్తల్లివి. ముత్తవ్వ అనే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు. అంత్యములో కైలాసానికి చేరుకొందువు గాక!” అని ఆశీర్వదించి అందరితో పాటు అంతర్ధానమైపోయాడు పరమేశ్వరుడు.

***

“యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తధైవ భజామ్యహం మను వర్త్మాను వర్తంతే..” అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. అంటే, ఎవరెవరు ఏయే విధముల నన్ను తెలియగోరుతున్నారో వారిని ఆయా విధముల నేను అనుగ్రహించుచున్నాను అని అర్థం. శివకేశవులకు భేదం లేదు గనుక పరమేశ్వరుడు కూడా భక్తులు కోరిన విధంగానే అనుగ్రహిస్తున్నాడని బెజ్జ మహాదేవి కథ ద్వారా మనకు తెలుస్తుంది.

(మూలం: పాల్కురికి సోమనాధుడు రచించిన ‘బసవపురాణం’. కథనం: రచయిత స్వంతం.)

Exit mobile version