వివక్ష తయారు చేసిన విషాదం టోనీ మారిసన్ ‘బిలవ్డ్’ BELOVED

0
1

[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]

1987లో టోనీ మారిసన్ రాసిన నవల బిలవ్డ్. ఈ నవలలోని ముఖ్య పాత్ర సేతేను రచయిత్రి మార్గరెట్ గార్నెర్ అనే ఒక యువతి జీవితం ఆధారంగా మలచుకున్నారు. మార్గరెట్ గార్నెర్ కెంటకీ నుండీ ఒహియో నగరానికి 1856లో పారిపోయిన బానిస స్త్రీ. కాని 1850 లోని ఫుజిటివ్ స్లేవ్ ఆక్ట్ ఆధారంగా ఆమెను నేరస్తురాలిగా పరిగణించి పోలీసులు అరెస్టు చేస్తారు. యు.ఎస్. మార్షల్స్ ఆమెను అరెస్టు చేయడానికి ఆమె ఇంట్లోకి దూసుకెళ్ళినప్పుడు అక్కడ ఆమె తన రెండు సంవత్సరాల కూతురుని గొంతు కోసి హత్య చేసి ఉంటుంది. తన మిగతా పిల్లలను కూడా చంపి వారికి బానిసత్వం నుంచి విముక్తి కలిగించాలని ఆమె అనుకుంటుంది. ఈలోపే పోలీసులు ఆమెను కస్టడీ లోకి తీసుకుంటారు. చనిపోయిన ఆమె రెండు సంవత్సరాల కూతురు మృతదేహాన్ని స్వాధీన పరుచుకుంటారు. బానిసత్వం నుండి తన పిల్లలను దూరం చేయాలని తన పాత నగరం నుండి పారిపోయినా ఎక్కడా రక్షణ దొరకక, పిల్లలు తన లాగే హీనంగా జీవించవలసి వస్తుందని, దాని కన్నా మరణం నయమని నమ్మి ఒక కన్నతల్లి బిడ్డలను చంపుకోవాలనుకోవడం వెనుక నల్లజాతీయుల హీనమైన జీవితాల గురించి చర్చ వస్తుంది. ఈ సంఘటన అమెరికా చరిత్రలో, మానవ చరిత్ర లోనే ఒక పెద్ద సంచలనం. దాని ఆధారంగానే టోనీ మారిసన్ రాసిన నవల బిలవ్డ్.

ఈ నవల లోని కథానాయిక సేతే తాను పని చేసే స్వీట్ హోమ్ అనే ప్లాంటేషన్ నుండి పారిపోతుంది. ఆమె పాత యజమాని మరణంతో అక్కడ జీవితం దుర్భరమవుతుంది. ఆ యజమాని మానవత్వంతో, ప్రేమతో తన బానిసలతో ప్రవర్తించేవాడు. అందరినీ ఆదరించి వారి బాగోగులు చూసుకునేవాడు. అతను మరణించిన తరువాత అతని భార్య తరుపు చుట్టం అయిన ఒక స్కూల్ మాస్టర్ ఆ ప్లాంటేషన్ పనులు చూడడానికి వస్తాడు. బానిసలతో అతి క్రూరంగా వ్యవహరిస్తాడు అతను. సేతే భర్త హాలె ఆ బాధలు తట్టుకోలేక పారిపోతాడు. ఆ క్రమంలో ఇద్దరు బానిసలు హత్యకు గురి అవుతారు. ఇది జరిగే కొన్నినెలల ముండు హాలే డబ్బు ఇచ్చి తన తల్లిని బానిస జీవితం నుండి తప్పించగలుగుతాడు. ఆమె ఓహియో వెళ్ళిపోతుంది. సేతే ఆక్కడి నరకం భరించలేక తన అత్తగారి వద్దకు పారిపోతుంది. అప్పుడు ఆమె నిండు గర్భిణి. దారిలోనే ఒక ఆడపిల్లను ప్రసవిస్తుంది. దారిలో ఆమెను కలిసిన ఒక తెల్ల జాతీయురాలు ఆమెను పోలీసుల నుండి రక్షించి, పురుడు పోసి ఆదుకుంటుంది. ఆ తెల్ల జాతి స్త్రీ పై కృతజ్ఞతతో పుట్టిన బిడ్డకు డెన్వర్ అని పెరుపెట్టుకుంటుంది సేతే. ఓహియో అతి కష్టం మీద చేరుకున్నా కాని ఆ కొత్త యజమాని ఆమెను వెతికి పట్టుకుంటాడు. పోలీసులు ఆమెను పట్టుకుపోవడానికి వస్తారు. బానిస స్త్రీ పిల్లలు కూడా బానిసలే, యజమాని వద్దకు చేరవలసినవారే. బిడ్డలను రక్షించాలన్నది సేతే తపన. కాని పోలీసుకు ఇల్లు చుట్టుముట్టాక, ఇక గత్యంతరం లేక ఆమె తన పిల్లలను చంపి వారికి బానిస జీవితం నుండి విముక్తి కలిగించాలనుకుంటుంది. ఒక కొడవలితో పెద్ద కూతురు గొంతు కోస్తుంది. డెన్వర్‌ను చంపబోయేంతలో తలుపులు పగులగొట్టి పోలీసులు ఆమెను పట్టుకుంటారు. ఆమెను స్థితికి ఆశ్చర్యపోతారు. కొన్ని పరిణామాల తరువాత ఆమె యజమాని వద్దకు వెళ్లవలసిన పరిస్థితి నుండి తప్పించుకుంటుంది. అయితే చేసిన హత్య ఆమెను జీవితకాలం వెంటాడుతూనే ఉంటుంది. ఆమె బిడ్డ సమాధి రాయిపై బిలవ్డ్ అన్న పేరు రాసి ఉంటుంది. ఆ బిడ్డకు అప్పటి దాకా పేరు పెట్టకపోవడం వలన సమాధి రాయి మీద బిలవ్డ్ అని రాయిస్తుంది సేతే.

ఇది జరిగిన పద్దెనిమిది సంవత్సరాల తరువాత, స్వీట్ హోం ప్లాంటేషన్ నుండి పాల్ డీ అనే మరో నల్ల జాతీయుడు తప్పించుకుంటాడు. అతను సేతే ఇంటికి వచ్చి ఆశ్రయం పొందుతాడు. ఆమెతో జీవితం మొదలెడతాడు. ఆ ఇంట్లో మామూలు కుటుంబ వాతావరణం తీసుకురావడానికి కష్టపడతాడు. ఇంటి యజమానిగా సేతేకి డెన్వర్‌కి రక్షణ ఇవ్వాలనుకుంటాడు. సేతే అత్తగారు ఎనిమిది సంవత్సరాల క్రితమే చనిపోతుంది. ఆమె ఇడ్దరు కోడుకులు ఇంటి నుండి పారిపోవడంతో ఇల్లంతా విషాద వాతావరణంతో నిండి ఉంటుంది. ఈ విషాదంతో నిండిన ఇంటిలో ఆనందాన్నినింపాలని పాల్ ప్రయత్నిస్తాడు. ఒక రోజు బిలవ్డ్ అనే పేరు గల ఒక అమ్మాయి ఆ ఇంటికి వస్తుంది. ఆమె రాకతో తన చేతిలో చనిపోయిన తన బిడ్డ మరణం సేతేకు ప్రతి నిముషం గుర్తుకువస్తుంటూ ఉంటుంది. అపరాధ భావంతో కృంగి పోతూ ఉంటుంది. సేతే చిన్న కూతురు డెన్వర్ కూడా బిలవ్డ్ రాకతో ఆనందంగా ఉండలేకపోతుంది. తన అక్క అత్మే ఇలా ఆ అమ్మాయి రూపంలో వచ్చిందని ఆమె నమ్ముతుంది. చనిపోయిన ఆ పాప బ్రతికి ఉంటే సరిగ్గా ఇంత వయసులో ఉండేది కాబట్టి ఇది ఖచ్చితంగా ఆ చనిపోయిన బిడ్డ ఆత్మే అని సేతే, డెన్వర్ ఇద్దరూ నమ్ముతారు. అందుకనే ఇప్పుడు ఆ అమ్మాయికి సమస్త సదుపాయాలు ఇచ్చి ప్రేమగా చూసుకునే ప్రయత్నం ఇద్దరూ చేస్తారు. బిలవ్డ్ పాల్ మధ్య శారీరిక సంబంధం ఏర్పడుతుంది. పాల్ అందువలన ఆ ఇంట్లో బిలవ్డ్ మధ్య ప్రశాంతంగా ఉండలేకపోతాడు. అంతే కాక సేతే కొన్ని సంవత్సరాల క్రీతం తన బిడ్డను పోలీసుల చేతిలో పడకుండా చంపేసిందని తెలిసి ఆ ఇంట్లో ఆమెతో కలిసి ఉండలేకపోతాడు. ఆ కుటుంబాన్ని వదిలేసి తన దారి చూసుకుంటాడు.

ఆ ఇద్దరి పిల్లలను ఒంటరిగా చూసుకోవడానికి సేతే చాలా కష్టపడుతుంది. అంతే కాక తాను కొన్ని సంవత్సారాల క్రితం చేసిన హత్య ఆమెను ప్రతి నిముషం వెంటాడుతూ ఉంటుంది. క్రమంగా ఆరోగ్యంతో పాటు మతి స్థిమితం కోల్పోతుంది. ఈ పరిస్థితిలో డెన్వర్ ఆ ఊరిలోని నల్ల జాతీయుల సహాయం కోరుతుంది. కొందరు స్త్రీలు ఇంటికి వచ్చి బిలవ్డ్ ఆత్మ నుండి ఆ ఇంటిని రక్షించే ప్రయత్నాలు చేస్తారు. డెన్వర్‌కి ఒక చిన్న ఉద్యోగం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ యుంటి యజమాని కూడా అక్కడికి చేరుకుంటాడు. అతనో తెల్ల జాతీయుడు. అతన్ని చూసి సేతేకు కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో తనను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులు గుర్తుకు వస్తారు. మరో సారి తన బిడ్డలు దూరం అవుతారనే భయంతో ఉన్మాద స్థితికి చేరుకుంటుంది. అతన్ని చంపడానికి వెళుతుంది. గ్రామస్తులు ఆమెను ఆపుతారు. బిలవ్డ్ మాయమవుతుంది. పాల్ తిరిగి రావడంతో ఆ ఇంట్లో మళ్ళీ మామూలు వాతావరణం వస్తుంది. పాల్ తాను సేతేని ప్రేమిస్తున్నానని ఆమెకు తోడుగా ఉంటానని ప్రమాణం చేసి సేతే ఒంటరితనాన్ని పోగొట్టే ప్రయత్నం చేస్తాడు.

ఆధిపత్యం, జాత్యహంకారం క్రింద నలిగిపోయిన వ్యక్తుల జీవితాలు ఎలా కృశీంచిపోతాయో, మరచిపోలేని అనుభవాలతో ఎలా శుష్కించి పోతాయో చెప్పే నవల ఇది. ఒక తల్లి తన బిడ్డను చంపే స్థితికి తీసుకువచ్చే సామాజిక కారణాలు, విషాద వాతావరణం తరువాత మారినా, ఆ జీవితాన్ని గడిపిన తల్లి ఎలా అ పాత అనుభవాల నుండి దూరం కాలేదో, ఎలా ఆ గతం తాలుకు భయానక స్థితి నుండి జీవితాంతం బయట పడలేక జీవచ్చవంలా బ్రతకాల్సి వస్తుందో చెప్పే కథ ఇది. కొన్ని కోట్ల మందికి భవిష్యత్తనేది లేని మరణించిన శవాలుగా ఈ భూమి మీద గడపవలసిన పరిస్థితులను కల్పించిన జాతి వివక్ష ఎంత మంది జీవితాలను బలి తీసుకుందో అర్థం అవుతుంది. చనిపోయిన వారి కన్నా ఆ జ్ఞాపకాలతో జీవించవలసిన వ్యక్తులు ఎక్కువ శిక్ష అనుభవించారు అన్న విషయాన్ని రచయిత్రి ఒక నిజ సంఘటన ఆధారంగా అల్లిన కథతో మనకు వివరించే ప్రయత్నం చేసారు. ఒక బిడ్డను చంపేసిన తల్లి ఆ తరువాత ఎలా జీవించి ఉండవచ్చు, నిరంతరం తాను చెసిన పని ఆమెను అపరాధ భావంతో నెట్టేస్తూ ఉంటే ఆమె ఎలా తన తరువాతి రోజులను గడిపి ఉంటుందో ఊహించే శక్తి ఉంటే ఈ నవలలోని సేతే వేదన అర్థం అవుతుంది. మనుషులలోని జీవితేచ్ఛను చంపేయడం, నిరంతరం రగిలిపోయే జ్ఞాపకాలతో వారు గడపవలసిన పరిస్థితులను వ్యవస్థ ఎర్పరచడం సామూహిక హత్యల కన్నా మహా ఘోరమైన స్థితి. ఆ స్థితిలో ఎందరో జీవించారు. వారు నిత్యం పడిన వేదన, నరకానికి జవాబుదారి ఎవరు అన్నది ప్రశ్న. మనిషిని ఇంత బాధకు గురు చేసే ఆ వ్యవస్థను సమూలంగా నాశనం చేయవలసిన భాధ్యత మనందరిదీ. వివక్ష మనిషిని బ్రతికున్న శవంగా మారుస్తుంది. మనిషి ఎదుగుదల సక్రమంగా ముమ్మాటికీ జరగనివ్వని మానసిక దుఖానికి అతన్ని గురి చేస్తుంది. అందుకే వివక్షను మొక్కలో త్రుంచి వేయాలి. ఎటువంటి వివక్ష అయినా మనిషి పతనానికి కారణం అవుతుంది. సమాజంలో అలా నిర్వీర్యంగా జీవించే మానవులు సగానికి పైగా ఉంటే అది ఆరోగ్యకర సమాజం ఎప్పటికీ కాదు. ఈ విషయాన్ని అర్థం చేసుకుని వివక్షారహిత సమాజం కోసం మానవాళి పాటుపడాలి అనే గొప్ప సందేశాన్ని అందించే విషాద రచన టోనీ మారిసన్ “బిలవ్డ్”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here