[box type=’note’ fontsize=’16’] “బెంగాల్లో 1975 – 90 మధ్యకాలం ఒక శూన్యమావరించింది. ఆర్ట్ సినిమాలకి కాలం చెల్లడంతో ప్రత్యామ్నాయం ఎవరూ పట్టుకోలేకపోయారు” అంటూ బెంగాలీ సినిమాలను విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
[dropcap]ప్ర[/dropcap]పంచంలోనే హాలీవుడ్‌ని అనుసరించి నామకరణం చేసుకున్న మొట్టమొదటి సినిమా పరిశ్రమ టాలీవుడ్ అని చరిత్రలో నమోదైంది. దక్షిణ కోల్‌కతా లోని ఒక ప్రాంతం టోలీగంజ్. ఇక్కడే 1920లలో సినిమా పరిశ్రమ ఆవిర్భవించింది. దీంతో ఈ ప్రాంతం పేరు మీదుగా టాలీవుడ్ అని నామకరణం జరుపుకున్నారు. టాలీవుడ్ ఆర్ట్ సినిమాలకి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిందని తెలిసిందే. మహాదర్శకుడు సత్యజిత్ రే దీనికి కారకుడు. అయితే ఇది జరగడానికి ఓ 24 ఏళ్ల కాలం పట్టింది. కానీ సినిమాల పరంగా ఎంత పేరు సంపాదించుకున్నా, బెంగాలీ కమర్షియల్ సినిమాలకి కేంద్రంగా టాలీవుడ్ మార్పు చెందినా, హిందీ, తెలుగు, తమిళ పరిశ్రమల స్థాయికి మాత్రం చేరుకోలేకపోతోంది.
సత్యజిత్ రే బాటలో బెంగాల్లో మృణాల్ సేన్, రిత్విక్ ఘటక్‌లు అవతరించారు. వీళ్ళూ బెంగాలీ సినిమాని పటిష్టవంతఃగా ప్రపంచం ముందు నిలబెట్టారు. అయితే ఇదంతా 1955 నుంచే ప్రారంభమయింది. బెంగాలీ సినిమా పుట్టుక మాత్రం 1919లోనే జరిగింది. అప్పటికి దేశంలో మొదటి చలన చిత్రం ‘రాజా హరిశ్చంద్ర’ పుట్టి ఆరేళ్ళు. రుస్తోంజీ ధోతీవాలా అనే పార్సీ, ‘బిల్వమంగళ్’ అనే మొదటి బెంగాలీ మూకీని గుజరాత్‌లో నిర్మించారు. ఒక వైపు బెంగాల్‌లో బయస్కోపులో నిశ్చలన చిత్రాలు చూపెడుతూ అలరిస్తున్నారు (1970 లలో వరకూ కూడా మన వైపు బయస్కోపులో చిన్న పిల్లలకి బొమ్మలు చూపెడుతూ తిరిగే వారు. ‘ఖైదీ బాబాయ్’లో ‘బయస్కోప్ పిల్లొచ్చింది, భలే తమాషా చూపిస్తుంది’ అని వాణిశ్రీ పాట కూడా వుంది). మరోవైపు ప్రొజెక్టర్లో మొదటి మూకీ ‘బిల్వమంగళ్’ విడుదలైంది. కానీ మొదటి టాకీ రావడానికి ఇంకో దశాబ్దం పట్టింది.
అయితే మూకీల కాలంలోనే హీరాలాల్ సేన్ ‘రాయల్ బయస్కోప్ కంపెనీ’ స్థాపించి, స్టేజి ప్రోగ్రాములు ఫోటోలు తీసి బయస్కోపుల్లో చూపించేవారు. టాకీలు వచ్చే వరకూ ఈ వ్యాపారం బాగానే సాగింది. రెండు మూడు పైసల టికెట్టుతో. 1931లో అమర్ చౌదరి ఒక షార్ట్ ఫిలిం తీశారు. దానికి అప్పుడప్పుడే కనుగొన్న శబ్ద కళని జోడించి టాకీని చేశారు. ఆ టాకీ పేరు ‘జమై షష్టి’. ఇక్కడనుంచీ 24 ఏళ్ల పాటూ టాకీల తొలి యుగం కొనసాగింది. 1955 లో సత్యజిత్ రే రాకతో అంతర్జాతీయ ఖ్యాతి నార్జించసాగింది. 1975 వరకూ అదొక స్వర్ణ యుగం. ఈ స్వర్ణయుగంలో ఉత్తమ్ కుమార్, సుచిత్రాసేన్, షర్మిలా ఠాగూర్, ఉత్పల్ దత్‌ల వంటి నటీనటులు పాపులరయ్యారు. 1975 తర్వాత నుంచి 1990 వరకూ పదిహేనేళ్ళ కాలం హీన దశకి చేరింది బెంగాలీ సినిమా. వాస్తవిక సినిమాలంటే బెంగాలీ ప్రేక్షకులకి అప్పుడే మొహంమొత్తింది. బెంగాలీలోనే కాదు, ఇతర ప్రాంతీయ భాషాల్లో- జాతీయ భాష హిందీతో సహా- ఆర్ట్ సినిమాల ఉద్యమం తెల్లజెండా చూపించడం 1980లలోనే ప్రారంభమైంది. శ్యాం బెనెగళ్, గోవింద్ నిహలానీ లవంటి సర్వోత్తములే చేతులెత్తేశారు. 2000లో శ్యాం బెనెగళ్ ఆర్ట్ సినిమాలకి బాలీవుడ్ తారలతో కమర్షియల్ హంగులు జోడించాలనే కొత్త ఫార్ములా కనిపెట్టి, తిరిగి రంగంలో కొచ్చారు. ఎందరో కొత్త తరం దర్శకులకి ఈ కొత్త బాట చూపించారు. దీంతో క్రాసోవర్ సినిమాలనే కొత్త పేరు పుట్టించి మల్టీప్లెక్సుల కెక్కించారు. ఇది వేరే విషయం.
బెంగాల్లో 1975 – 90 మధ్యకాలం ఒక శూన్యమావరించింది. ఆర్ట్ సినిమాలకి కాలం చెల్లడంతో ప్రత్యామ్నాయం ఎవరూ పట్టుకోలేకపోయారు. 1990లలో కొత్త విజన్‌తో కొత్త తరం దర్శకుల రావడంతో క్రమంగా పరిస్థితి మెరుగుపడింది. కాలానికి తగ్గ ఆధునిక విషయ పరిజ్ఞానంతో, ఆర్టు సినిమాల నుంచి దూరంగా కమర్షియల్ ప్రయత్నాలు చేయసాగారు. అయినా ఎటూ ఎదగని, అతి చిన్న మార్కెట్ గానే వున్న టాలీవుడ్‌లో కొత్త దర్శకులు ఇమడలేక బాలీవుడ్ బాట పట్టసాగారు. అనురాగ్ బసు, ప్రదీప్ సర్కార్, దిబాకర్ బెనర్జీ, సుజోయ్ ఘోష్, ఆయాన్ ముఖర్జీ, రీతో పర్ణో ఘోష్ మొదలైన వారు – బిమల్ రాయ్, శక్తి సామంతా, హృషికేష్ ముఖర్జీ లాంటి పాతతరం బెంగాలీ దర్శకులు బాలీవుడ్‌లో వెలిగిన పరంపరనే వీరూ కొనసాగిస్తున్నారు.
ఈ రూటు తెలుసుకోవడానికి ఒకటి దోహదపడింది. ఐఎంఆర్ బీ ఇంటర్నేషనల్ అనే మార్కెట్ రీసెర్చి సంస్థ వెలువరించిన అధ్యయన ఫలితాలు. బెంగాల్లో సినిమాల పరిస్థితిపై ఈ సంస్థ రీసెర్చి చేసి అందించిన రిపోర్టు ప్రకారం, 54 శాతం కోల్‌కతా వాసులు సంవత్సర కాలంగా బెంగాలీ సినిమాలు చూసేందుకు థియేటర్‌లకి వెళ్ళలేదు. మల్టీప్లెక్సు లానే ఆధునిక థియేటర్లు వెలసినప్పటికీ వాటి మొహం కూడా చూడలేదు. తిరిగి ప్రేక్షకులు బెంగాలీ సినిమాలకి రావాలంటే వాళ్లకి నచ్చే బలమైన కథా వస్తువుతో సినిమాలు తీయాల్సిన అవసర ముందని, అన్ని డిజిటల్ ఆధునిక సాంకేతిక విలువల్ని కల్పించాలని, సింగిల్ స్క్రీన్ థియేటర్లని మల్టీ ప్లెక్సులుగా మార్చాలనీ, ప్రమోషన్‌తో బాటు డిస్ట్రి బ్యూషన్ని పూర్తిగా నవీకరించాలనీ పేర్కొంది.
సమీప భవిష్యత్తులో 30 శాతం మంది బెంగాలీ ప్రేక్షకులు బెంగాలీ సినిమాల్ని థియేటర్‌లకి వెళ్లి చూసే పరిస్థితి ఉండదనీ, సంవత్సర కాలంగా 10 శాతం మంది ప్రేక్షకులు సింగిల్ స్క్రీన్ థియేటర్‌లకి వెళ్ళడం లేదనీ ఈ రిపోర్టు పేర్కొంది.