బేరం

1
1

[dropcap]అ[/dropcap]రవై ఏళ్ల రామ్మూర్తి చాలా అసహనంగా ట్రెడ్‌మిల్ మీద నడుస్తున్నాడు. వ్యాయామం అతను ఎంతో ఇష్టంగా రోజూ చేసేదే అయినా గత రెండు వారాలుగా జరుగుతున్న సంఘటనలు అతని మనసుని చిరాకు పెడుతున్నాయి. రామ్మూర్తి మంచి హోదాలో బ్యాంకు ఉద్యోగం విరమణ చేశాడు. తన స్వార్జితం, పిత్రార్జితం, భార్య పుట్టింటి నుంచి వచ్చిన ఆస్తి కలుపుకుంటే మంచి స్థితిమంతుడే. ఇద్దరు కొడుకులను కన్న తండ్రిని అన్న గర్వం అతని నరనరాల్లోనూ ఉంటుంది. ఇంట్లో అందరినీ తన అదుపు ఆజ్ఞలలో ఉంచాడు. అతని మాటే వేదవాక్కు. సరుకులు, కూరగాయల నుంచి ఎటువంటి విషయాలైనా రామ్మూర్తి అనుకున్నదే చేస్తాడు. భార్య సునంద తన ఎదుట నోరు విప్పి మాట్లాడటానికే జంకుతుంది. పెద్ద కొడుకు ఆదిత్య, చిన్న కొడుకు వంశీ ఇద్దరికీ ‘బొమ్మరిల్లు ప్రకాష్ రాజ్’ రోజు గుర్తుకొస్తాడు. కొడుకులు ఇద్దరూ మంచి ఉద్యోగాలలో స్థిరపడితే కట్నాలు భారీగా గుంజవచ్చని, వాళ్లని తొక్కి నార తీసి మరీ చదివించాడు. అనుకున్నట్టే ఇద్దరికీ మంచి ఉద్యోగాలు వచ్చాయి. ఈరోజుకీ ఆదిత్య రాగానే తండ్రి చేతిలో పెడతాడు. మరి ఇప్పుడు అదంతా ఏమయ్యింది?

వీళ్ళల్లో ఈ మార్పేమిటి? అయినా మొదటి నుంచీ చిన్నవాడు వంశీ తండ్రి మాటకు అంతో ఇంతో ఎదురు చెప్పేవాడు. రామ్మూర్తి చూపులతో అదుపు చేసేవాడు. అతనికి చాలా ఇష్టమైనవి రెండు – ఒకటి డబ్బు, రెండు – తన మాట నెగ్గడం. తన లౌక్యంతో అవతలి వాళ్ళ నోరు మూయించగలడు. అతనితో ఏ విషయంగా అయినా వాదన వస్తే, వాళ్ళు చెప్పదలుచుకున్నది మరిచిపోయి, చివరకు రామ్మూర్తి చెప్పినదానికి సరే అనేస్తారు. అది అతని వాక్పటిమ. మరి అదంతా ఇప్పుడు ఏమయ్యింది? ట్రెడ్‌మిల్ వేగాన్ని మించి పరిగెడుతున్నాయి ఆలోచనలు. ఒంటికి బాగా చెమట పట్టడంతో ట్రెడ్‌మిల్ ఆపి క్రిందకు దిగాడు.

స్నానం చేసి సునంద పెట్టిన వేడి వేడి ఇడ్లీలు ఘుమఘుమలాడే, కారప్పొడి వేసుకొని తింటున్నా, అతని మనసు ఆస్వాదించలేకపోతుంది. అతని కొడుకుల గురించి ఎన్నెన్ని ఆలోచనలు చేశాడో. పెద్దవాడు ఆదిత్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, ఒక మంచి సంబంధం వెతికి, వాళ్ల మూతి ముక్కు పిండి భారీగా కట్నకానుకలు వసూలు చేశాడు. అసలు వాళ్లు కట్నం మాట్లాడడానికి వచ్చినప్పుడు, ‘కోట్ల ఆస్తి, మంచి ఉద్యోగం, అందం, వినయం, సంస్కారం ఉన్న మా అబ్బాయికి మార్కెట్లో విలువ ఎంతుందో తెలుసా’ అని అడిగాడు. ఆడపెళ్ళివారు ఈ మాటలకు బిత్తరపోయారు. పెద్ద కోడలు రాధిక పుట్టింటి వాళ్ళు ఉన్నవాళ్లే. సంబంధం గురించి వాకబు చేసినప్పుడు ఈ విషయాలు తెలిసి తన కట్నకానుకల చిట్టా అమాంతం పెంచేసి వాళ్ల నుంచీ బాగానే రాబట్టాడు రామ్మూర్తి.

అలాగే చిన్నవాడు వంశీ విషయంలో కూడా చేద్దామంటే కుదిరి చావటం లేదు. టిఫిన్ ముగించి లేస్తుంటే, “ఆ గుంటూరు వాళ్లది మంచి సంబంధం కదండీ. మీరు ఇంకోసారి ఆలోచిస్తే మంచిదేమో” అన్నది సునంద చిన్నగా. రామ్మూర్తితో ఏ మాట అంటే ఏ గొడవ వస్తుందో అని ఆమెకు భయం. అంత కట్టుదిట్టాలలో పెట్టాడు భార్యను. ఈ మాట వింటూనే చురచురా చూశాడు సునంద వంక. ఆమె అదురుతున్న గుండెలతో వంటింట్లోకి వెళ్ళిపోయింది.

మూడు రోజుల క్రితం ఆదివారం నాడు వంశీకి పెళ్లి సంబంధం కోసం అమ్మాయి పూర్ణిమ తల్లిదండ్రులు, మేనమామ, బాబాయి వచ్చారు. తాము రెండు వారాల క్రితమే గుంటూరు వెళ్లి పూర్ణిమను చూసి వచ్చారు. అదిగో అసలు అప్పటి నుంచే రామ్మూర్తి మాట సాగటం లేదు. ఏదో విధంగా ఆడపిల్ల వాళ్ళని మాయ చేసి, ఆ పెళ్లిచూపుల కార్యక్రమం తాను ఉన్న హైదరాబాదులోని కానిచ్చేస్తే, ఖర్చులు కలిసి వస్తాయి కదా అనుకుంటే, పిల్ల తండ్రి విశ్వనాథం అసాధ్యుడే. ‘మీరు పిల్లను మా ఇంట్లో చూడడమే పద్ధతి’ అని పట్టుపట్టాడు. అసలు రామ్మూర్తి ఈ సంబంధం వద్దన్నాడు. కానీ తలరాత ఏం చేస్తాం. వంశీ వింటేనా. ఆ పూర్ణిమ ఫోటో చూడగానే వీడికి ఏదో మైకం కమ్మింది. గుంటూరు వెళ్లి పిల్లను చూడాలని భీష్మించాడు. అయినా వంశీ సంపాదనలో పడ్డాక తండ్రి మాట వినేవాడు కాదు. పరువు పోకూడదని రామ్మూర్తి వంశీ విషయంలో జోక్యం చేసుకునేవాడు కాదు.

పూర్ణిమ బయోడేటా కూడా రామ్మూర్తికి నచ్చలేదు. ఆమె ఎకనామిక్స్ లెక్చరర్‌గా చేస్తోంది. ఒక ఇంగ్లీషు పేపర్‌లో ఆర్టికల్స్ రాస్తుంది. భరతనాట్యం వచ్చు. ప్రదర్శనలు ఇస్తుంది. ఇంత వరకు బానే ఉంది, కానీ రామ్మూర్తికి ఒళ్ళు మండే విషయం ఏమిటంటే ఆ నాట్య ప్రదర్శనల ద్వారా పూర్ణిమ డబ్బు సంపాదించదు. చేనేత కార్మికులు, అనాథలు, ఇతర ఛారిటీ ట్రస్టుల కోసం ఉచిత ప్రదర్శనలు ఇస్తుంది. రామ్మూర్తి దృష్టిలో సేవా కార్యక్రమాలు అంటే పనికిమాలిన పనులు. ఈ ప్రదర్శనలు అంటూ ఊళ్లు పట్టుకు తిరిగితే, ఉన్న ఉద్యోగం కాస్తా ఊడిపోతుందేమో అని అతని భయం. ప్రయాణాలకు అదనపు ఖర్చు. అతను ఎన్నడూ ఎక్కడా ఒక్క రూపాయి చందా ఇచ్చి ఎరుగడు. ఏదో రకంగా లౌక్యంగా తప్పించుకునేవాడు.

వంశీ పోరు పడలేక సరేలెమ్మని గుంటూరు వెళ్లి పిల్లని చూసి వచ్చారు. ఎంత పొగడకూడదు అనుకున్నా విశ్వనాథం గారి ఇల్లు చాలా బావుంది. పాత మండువా ఇల్లులాగా కట్టించిన మూడు అంతస్తుల పెద్ద ఇల్లు. విశ్వనాథం గారిది ఉమ్మడి కుటుంబం. ఆయన తల్లిదండ్రులు, తమ్ముడు, తమ్ముడి భార్యా పిల్లలు అందరూ కలిసే వుంటారు. ఆయన భార్య లక్ష్మిని, కొడుకు ప్రణవ్‌ని పరిచయం చేశాడు. వాళ్ల మర్యాదలకు రామ్మూర్తి ముగ్ధుడైపోయాడు. అయితేనేమి, ఆ మాయలో పడి కొడుకుని తక్కువ బేరం పెట్టదలుచుకోలేదు.

అందుకే అతని బంధువూ, ఆడ పెళ్లివారికి పరిచయస్తుడూ అయిన రాధాకృష్ణను మధ్యవర్తిగా వుంచాడు. పూర్ణిమ మంచి అందగత్తె, తెలివిగల పిల్ల, చలాకీతనం, వినయం, సంగీత నాట్యాలలో నైపుణ్యం, దయ, జాలి… ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి గుణాలు వున్నాయి. వంశీ పూర్ణిమ ఏకాంతంగా మాట్లాడుకున్నాకా ఒకరంటే ఒకరికి సదభిప్రాయం ఏర్పడింది. ఇక ఇంటికి వచ్చినప్పటి నుంచి పుత్రరత్నం పెళ్ళంటూ చేసుకుంటే పూర్ణిమనే చేసుకుంటానని గోల. వంశీకి తోడు సునంద కూడా పూర్ణిమ కోడలు అయితే బావుండునని సన్నగా గొణుగుతోంది, అంతకన్నా మాట్లాడే ధైర్యం లేక.

సరే తన లౌక్యంతో మంచి బేరం కుదర్చవచ్చులెమ్మని రాధాకృష్ణ ద్వారా మిగిలిన విషయాలు మాట్లాడుకోవటానికి ఇంటికి రమ్మని విశ్వనాథం గారికి కబురు పెట్టాడు. పనిలో పనిగా తాను అనుకున్న కట్నకానుకల విషయం చూచాయగా రాధాకృష్ణ చెవిన వేశాడు. ఆ విషయం గుర్తు రాగానే రామ్మూర్తి ముఖం కందగడ్డలా అయిపోయింది.

కాదు మరీ, విశ్వనాథం గారు ‘తాను ఒక్క పైసా కట్నం కూడా ఇవ్వనని, అసలు ఆ ప్రస్తావనే తీసుకురావద్దని చెప్పారు. తన కుటుంబ గౌరవం, గుణగణాలు నచ్చితే పెళ్లి ప్రస్తావన, లేదంటే లేద’న్నాడు. రామ్మూర్తి దృష్టిలో ఇది అహంకారం. ఆడపిల్ల తండ్రి అణిగిమణిగి ఉండాలంటాడు. కట్నం అసలే ఇవ్వనంటే కుదురుతుంది? చిన్నప్పటి నుంచి కొడుకు పాలడబ్బాల నుంచి పీజీ వరకూ, బట్టల నుంచి బండి వరకు, వామ్మో లక్షల్లో అయ్యింది ఖర్చు. పైగా పెళ్లి ఖర్చు ఒకటి. ఇప్పుడు ఈయన కట్నమే ఇవ్వనంటే తన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? తనేమన్నా కాని కోరిక కోరాడా, లోకంలో ఎక్కడా జరగనిదా. కట్నం తీసుకోకుండా పెళ్లి చేయటానికి తన కొడుక్కి ఏమన్నా కన్నొంకరా, కాలొంకరా. ఇలా సాగాయి రామ్మూర్తి ఆలోచనలు.

వంశీకి ఎంత చెప్పినా వినలేదు. గతిలేక విశ్వనాథం గారికి ఇంటికి రమ్మని కబురు పెట్టాడు. మొన్న ఆదివారం వచ్చి వెళ్లారు విశ్వనాథం గారు, ఆయన తమ్ముడు, బావమరిది. రామ్మూర్తి తన లౌక్యం అంతా ఉపయోగించి ‘వరకట్నం మన సాంప్రదాయం అని, అది ఆడ పెళ్లి వారికి కూడా గౌరవమని, ఆ డబ్బుని పిల్లా పిల్లాడి పేర్లనే ఉంచుతాం’ అని చెబుతుంటే, మౌనంగా విన్నారు ఆడపెళ్ళివారు. ‘పరవాలేదు కాస్త మెత్తబడుతున్నారు’ లెమ్మని, వెండి పానకం బిందెలు, ఆడపడుచు లాంఛనాలు, అక్క పాన్పు మీద కారు, కాపురానికి పంపేటప్పుడు ఇంటెడు సామాను ఇంకా ఏవో చిన్నాచితక కానుకల చిట్టా విప్పాడు. కట్నం కింద ప్రత్యేకంగా ఏమీ ఇవ్వకుండా, పూర్ణిమ ఇన్నాళ్లు సంపాదించినది మాత్రం చాలన్నాడు.

అప్పుడు జరిగిందా సంఘటన. నెమ్మదిగా విశ్వనాథం గారు లేచి ‘మేము వెళ్లి వస్తా’మన్నారు. రామ్మూర్తి కాస్త ఆశ్చర్యపడుతూ ‘ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామ’ని అడిగాడు. ‘ఆ అవసరం లేదు. మీరు మరో సంబంధం చూసుకోండి. మీరు కట్న కానుకల ప్రసక్తి తీసుకు రానని చెప్పి మాట తప్పారు. మా అమ్మాయికి నేను మంచి భర్తను ఇస్తాను కానీ కొనిపెట్టను’ అని వెళ్ళిపోయారు విశ్వనాథంగారు వాళ్లు.

రామ్మూర్తి జీవితంలో అతని లౌక్యంతో సాధించలేకపోయిన మొదటి పని ఇది. అతని అహంకారం దెబ్బతిన్నది. అతన్ని ఈ రోజు వరకు ఇన్ని మాటలు అన్నవాడు లేడు. అందునా ఆడపిల్ల నిచ్చే వియ్యంకుడు అంటే అతని కాలికింద చొప్పు లాగా ఉండాలనుకునే మనస్తత్వం. రామ్మూర్తి పెద్ద వియ్యంకుడు అతని ముందు సరిగ్గా కూర్చో లేడు కూడా. మరి విశ్వనాథం గారికి ఇంత అహంకారం ఉంటే ఎలా? ఈ ఉచిత బేరం తమకి కుదిరేది కాదులే అని, ఈ సంబంధం మాట మరిచి పొమ్మన్నాడు వంశీని.

వంశీ రామ్మూర్తి మీద ఇంత ఎత్తున ఎగిరాడు. పూర్ణిమతో పెళ్ళి జరిపించకపోతే తానే విశ్వనాథం గారి కాళ్ల మీద పడి, బ్రతిమాలి ఆ పిల్లను పెళ్లి చేసుకుంటానన్నాడు.  హతాశుడయ్యాడు రామ్మూర్తి. ఇదే జరిగితే ఇక చిన్న కోడలిని సాధించేదెలాగా? ఇప్పటికీ కోడలు రాధిక జీతం డబ్బులు రాగానే చెప్పిన దాంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ వేయాల్సిందే. నామమాత్రంగా కొద్దిపాటి డబ్బులు ఆమె ఖర్చులకి ఆమె ఎకౌంటులో ఉంటాయి. ఆమె బ్యాంకు పాసుబుక్ కూడా రామ్మూర్తి స్వాధీనమే. మరి ఇప్పుడు ఈ చిన్న వెధవ వేరు కాపురం పెడితే పూర్ణిమని ఆడించడం కుదరదుగా. కట్నం పోతే పోయింది. కనీసం నెలనెలా ఆ పిల్లకి వచ్చే జీతమన్నా దక్కుతుంది. పైగా రామ్మూర్తి పంటికింద ఆహారంగా ఇంకో జీవి.

కట్నం లేదన్నమాట తలచుకోగానే రామ్మూర్తి ముఖం వెలవెలబోయింది. ఇక తప్పనప్పుడు చేసేదేముంది. కానీ కట్నం లేకుండా చిన్న కోడలిని ఇంటికి తెచ్చుకున్నాననే పేరైనా మిగులుతుంది కదా. ఇన్నాళ్లు తనను పిసినారి అన్నవాళ్ళ నోళ్లు మూయించినట్టు అవుతుంది. ఇంతలో రాధాకృష్ణ వచ్చాడు ‘ఏమనుకుంటున్నారు గుంటూరు సంబంధం గురించి’ అంటూ.

‘ఆ… అనేదేముంది. నాలాంటి వాళ్లు దయ తలచకపోతే పూర్ణిమ లాంటి పేదింటి పిల్లలకు పెళ్లిళ్లు ఎలా అవుతాయి’ అన్నాడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ. అతని గుంజటం, ఓటమి రెండూ గమనిస్తూ వంశీ సునంద ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here