Site icon Sanchika

లైంగిక సంబంధాల మీద ఓ దృష్టిసారింపు : బెస్ట్ గాళ్‌ఫ్రెండ్

[box type=’note’ fontsize=’16’]”దాయాల్సిన విషయం ఏమిటి, స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏమిటీ అన్నది అవసరం. ఆ స్పష్టంగా చెప్పాల్సింది కూడా verbose గా ఉండకూడదు” అంటూ ‘బెస్ట్ గాళ్‌ఫ్రెండ్’ అనే లఘు చిత్రాన్ని సమీక్షిస్తున్నారు పరేష్. ఎన్. దోషి. [/box]

[dropcap]ఈ[/dropcap] రోజు నేను చూసిన లఘు చిత్రం “బెస్ట్ గాళ్ ఫ్రెండ్: 2014 లో తీసినది. బహుశా అప్పుడు గొప్ప చర్చే జరిగి వుంటుంది, పెద్ద దుమారమే లేచి వుంటుంది. నేను ఇప్పుడే చూసాను కాబట్టి దీని మీద నాలుగు మాటలు వ్రాయాల్సిన అవసరం వుందనిపిచింది.

విక్రాంత్ మాస్సి నిద్రలేచి హాల్లోకొస్తాడు. ముందు తలుపు తెరిచి న్యూస్ పేపర్ అందుకుని సోఫాలు కూచుని చూస్తుంటాడు. చూసూనే లోపలున్న కృతికా కమ్రాను కేకేస్తాడు ఇవాళ ఆదివారం లేవమని. ఆమె నోట్లో బ్రష్ తో బయటికి వస్తుంది. ఈ వివరం ఎందుకు చెబుతున్నానంటే ఒక వాతావరణాన్ని క్లుప్తమైన సంభాషణలతో, షాట్లతో మనకు కథ ఎలా చెబుతున్నాడు అని చెప్పడానికి. ఆమె టీ, టిఫిన్ తయారు చేస్తుంటుంది. పేపర్ లో వొక వార్త చదివి ఆమెదగ్గరికెళ్తాడు చెప్పడానికి. ఒకానొక నటి ఎస్కార్ట్ సర్వీస్ చేస్తూ పట్టుబడిందని వార్త. ఇలా ఎలా చేస్తారూ అంటాడు. ఆమె శరీరం, ఆమె ఇష్టం, నువ్వెందుకు తీర్పరిగా మారతావు అంటుంది. తీర్పులు చెప్పడం కాదు గాని ఇది నాకు అర్థం కాక అడిగానంటాడు. ఈ లోగా ఆమె ఫోన్ మోగుతుంది లోపలెక్కడో. నేను చూస్తానంటాడు. లేదులే నేనే చూస్తానని వెళ్తుంది. ఏంటి నా నుంచి రహస్యమా అని నవ్వుతూ అడుగుతాడు. అవునంటుంది. విక్రాంత్ తల్లితో స్కైప్ లో మాట్లాడుతుంటాడు. కృతికా వూరెళ్తుంది కదా, నీ తిండి సంగతి ఏమిటి అని తన బెంగ వ్యక్త పరుస్తుంది. కృతికా మధ్యలో వచ్చి బెంగొద్దమ్మా,నేను చికెన్ వండే వెళ్తున్నాను అతనికోసం అంటుంది. ఆ తల్లి ముఖం వెలిగిపోతుంది. కొడుకుతో అంటుంది, ఈ పిల్లని వదులుకోకు, ఇప్పటిదాకా వున్న నీ గాళ్ ఫ్రెండ్స్ లో ఈమె బెస్టు అంటుంది. కాసేపు తర్వాత ఇద్దరూ టీ తాగుతూ సంభాషణ. ఆమె ముంబాయి నుంచి బెంగళూరుకెళ్ళే ఫ్లైట్ టైంకే వెళ్తుంది. నేను కేబ్ బుక్ చేస్తానంటుంది ఆమె. మీ నాన్న మిస్టర్ ఇండియా లాంటి వాడు, వుంటాడు కాని కనబడడు అంటాడతను. ఈ సారి ఆయన్ని తప్పక పరిచయం చేస్తాను అంటుంది. రెగ్యులర్ ఇంటర్వల్స్ లో ఆమె తండ్రి దగ్గరికి వెళ్తుంటుందనీ, అతను పెద్ద వ్యాపారవేత్త అనీ తెలుసు. అంతకు మించి వివరం తెలీదు. ఆమె తయారై వెళ్తుంది.

కాసేపటికి విక్రాంత్ స్నేహితుడు రాఘవ్ ఖక్కడ్ వస్తాడు. పక్క బిల్డింగులో ఆడిషన్ వుంటే వచ్చాడు. ఎలానూ ఇక్కడి దాకా వచ్చాను కదా చూసిపోదామని వచ్చానంటాడు. అతని ఇంట్లో ప్రస్తుతం ప్రైవసీ లేదు. వాళ్ళ కాస్టింగ్ డైరెక్టర్ మంచి అమ్మాయిలను తక్కువ రేటుకే ఏర్పాటు చేయగలడు, మాట్లాడమంటావా అంటాడు. నాకు ఆ యావ లేదు, నీకోసం నువ్వు మాట్లాడుకో అంటాడు విక్రాంత్. రెండు మూడు సార్లు అడిగే సరికి సరేనంటాడు. ఆ కాస్టింగ్ డైరెక్టర్ దగ్గరినుంచి కొన్ని ఫొటోలు వస్తాయి, ఎంచుకోడానికి. వాటిల్లో ఒకటి కృతికా ది. ఇద్దరూ స్టన్ అయిపోతారు. నెక్స్ట్ షాట్ లో కృతికా వస్తుంది. ప్రయాణం బాగా జరిగిందా అంటాడు. ఆ, ఈ సారి నాన్న తప్పక నీతో కలుస్తానన్నారు అంటుంది. మా అమ్మ ఏమందో తెలుసా, నువ్వు ఇప్పటిదాకా నాకున్న గాళ్ ఫ్రెండ్స్ లో బెస్ట్ అన్నది అంటాడు. అక్కడితో శుభం.

ఎక్కడా తీర్పులు లేవు. అతిగా సెంటిమెంటూ లేదు. ఆధునిక జీవితం లో మామూలు అయిపోయిన విషయాన్ని ఎలా తీసుకోవాలి అన్నది కూడా మన మీదే వదిలేశాడు దర్శకుడు. ఆమె ఆ పని ఎందుకు చేస్తుందీ చెప్పడు. అంటే ఒకవేళ ఏదో బలవత్తర కారణం వుంటే మనకు సింపతీ కలిగే వీలుంటుంది. డబ్బు గురించి కాదు అన్నది ఆమె తండ్రి పెద్ద బిజినెస్ మేన్ అని తెలవడం వల్ల తెలుస్తూనే వుంది. అదీ గాక అలాంటి విషయం మీద ఇతరులు తీర్పులు చెప్పడం అనవసరం అన్న భావం కలిగి వుంటుంది. అతనికీ దాదాపు అలాంటి భావనలే వుంటాయి. కానీ అవకాశం వచ్చినప్పుడు ముందు వద్దన్నా, తర్వాత తను కూడా ఒక ఎస్కార్ట్ అమ్మాయితో సెక్సు కు సిధ్ధ పడ్డాడు. చాలా మామూలుగా. జరుగుతున్నది ఏమిటి ఒకే పని చేసిన ఇద్దరిలో నైతికత విషయం కేవలం స్త్రీలకే వర్తిస్తుంది. అదే పని చేసిన పురుషుడికి అది చాలా మామూలు విషయం. ఇక ముగింపు గురించి నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే అన్నీ తెలిసీ అతను ఆమెతో చాలా మామూలుగా వుంటూనే నువ్వు నా బెస్ట్ గాళ్ ఫ్రెండని అమ్మ అంటోంది అంటాడు. అది కదా జెండర్ జుస్టిస్ అంటే. మనిషిని అర్థం చేసుకోవడమంటే. విక్రాంత్, కృతికా ఒక సహజీవనం చేస్తున్న జంట. వాళ్ళ మధ్య సంబంధం ఎలా వుందంటే ఆమెకు ఫోన్ వస్తే ఆమె మాత్రమే తీస్తుంది. అడగకుండా హక్కుగా తీసే అలవాటు విక్రాంత్ కి లేదు. అది మొదటే చెప్పడం, చివరి సీన్ కు కాస్త సపోర్టుగా వుంటుంది.

మరో విషయం గుర్తొస్తున్నది. కొన్నేళ్ళ క్రితం ఒక నటి హైదరాబాదులోని ఒక పెద్ద హోటెల్లో ఒక వ్యాపారవేత్తతో పట్టు బడింది. పేపర్లు ఆమె గురించి వ్రాశాయి. ఆ వ్యాపారవేత్త పేరు వ్రాయలేదు. సమాజం వెంటనే తీర్పులు చెప్పడానికి రడీ అయిపోయింది. ఆమె కష్టాలు ద్విగుణీకృతమయ్యాయి. సినిమాల్లో పనిలేక, ఇంటి అవసరాలకు డబ్బు అవసరమై ఆమె ఆ పని చేసింది. విచిత్రమేమిటంటే అతను తేలికగా తప్పించుకుంటాడు, ఈమె మాత్రం సమాజపు కోర్టు ముందు ముద్దాయిలా నిలబడాల్సి వచ్చింది. వెంటనే శ్యాం బెనెగళ్,అనురాగ్ కాశ్యప్ లాంటి వాళ్ళు ఆమెకు సపోర్ట్ ప్రకటించారు. కొందరు ఆమెకు తమ చిత్రం లో పని ఇస్తామన్నారు. ఈ చిత్రానికి ఇది ప్రేరణ అవునో కాదో, ఇది ముందు జరిగిందో, చిత్రమే ముందు వచ్చిందో కూడా తెలీదు. కాని మన చర్చల రూపం లో చూసిన సారం ఒక కళా రూపం లో ఇందులో చూస్తాము. నేను కథ ను కథ లా చెప్పినా, తెర మీద అది అచ్చు సినిమాలాగానే వుంది. అది సేంపిల్ గా మొదటి రెండు సీన్లు వర్ణిచి చెప్పాను.

విక్రాంత్ మెస్సీ మంచి నటుడు. చాలా నేచురల్ గా చేస్తాడు. కృతికా కూడా బాగా చేసింది. దర్శకుడు నవజోత్ గులాటీ కూడా చక్కగా డైరెక్ట్ చేసాడు. అతని నుంచి మంచి చిత్రాలు ఆశించవచ్చు. పోలికలు తేవడం మంచిదో కాదు గాని, ఈ మధ్య మెట్రో కథలు లో “ఘటన” చూసినపుడు నిరాశ కలిగింది. దాయాల్సిన విషయం ఏమిటి, స్పష్టంగా చెప్పాల్సిన విషయం ఏమిటీ అన్నది అవసరం. ఆ స్పష్టంగా చెప్పాల్సింది కూడా verbose గా ఉండకూడదు. కొన్ని సినిమాలు చూస్తే గేప్స్ కనబడతాయి, అవి పూడ్చాల్సిన అవసరం చాలా వుంది అనిపిస్తే అది వైఫల్యం. ఇక దేవదాసు నవలలో చాలా గేప్స్ వుంటాయి, అవి మనల్ను దాని గురించి మరింత లోతుగా ఆలోచించి పూరించుకునేట్లు చేస్తాయి, అది దాని బలం. ఈ పోలిక తేవడం రెండూ నేను ఈ మధ్యే చూడటం వల్ల.

యూట్యూబ్ లో ఈ చిత్రం వుంది, చూడండి. సంతృప్తికరంగా వుంది.

Exit mobile version