[box type=’note’ fontsize=’16’] స్ప్రెడింగ్ లైట్ జ్యోతిగా, పుస్తకం జ్యోతిగా, తెలుగు సాహితీ అభిమానులకు సుపరిచితమయిన పి.జ్యోతి, సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా రచిస్తున్న పుస్తక పరిచయాలు/సమీక్షలు… [/box]
[dropcap]‘ది[/dropcap] వైట్ టైగర్’ అనే పుస్తకంతో అరవింద్ అడిగ చాలా మందికి పరిచయం అయ్యరు. ఆ నవల సినిమాగా వచ్చిన తరువాత అతనికి మంచి గుర్తింపు కూడా లభించింది. వైట్ టైగర్ అతని మొదటి పుస్తకం అని అందరూ చెప్తారు కాని దాని కన్నా ముందే అతను రాసిన పుస్తకం ‘Between The Assassinations’. అయితే ఇది వైట్ టైగర్ తరువాత ప్రచురించబడింది కాబట్టి ఇది అతని రెండవ పుస్తకం అయింది. ఈ పుస్తకంలో వైట్ టైగర్ కథకు విషయన్ని అందించిన కొన్నిమూల కథలు మనకు కనిపిస్తాయి. ఈ నవలకు ఆ పేరు పెట్టడానికి కారణం, ఇందులోని కథావస్తువు ఇందిరాగాంధీ హత్య (1987), రాజీవ్ గాంధీ హత్య(1991) మధ్య గడిచిన కాలం. అంటే ఆ సమయాన్ని తన కథలకు బేస్‌గా తీసుకుని అప్పటి కాలాన్ని మనముందు ఉంచే ప్రయత్నం చేసారు రచయిత. అప్పట్లోమన దేశంలో ఉన్నకుల, మత, జాతి వర్గ విభేదాల మధ్య చిక్కుకున్న సామాన్య మానవుని జీవితాన్ని ఈ నవలలో తన పాత్రల ద్వారా రచయిత చూపిస్తారు. ఇప్పుడేదో అన్నీ మారిపోయాయని కాదు కాని కొని సంవత్సరాల సమయాన్ని బేస్‌గా తీసుకుని తన కథల పరిమితిని ఫోకస్డ్‌గా చెప్పే ప్రయత్నం ఈ నవలలో కనిపిస్తుంది. దాని వలన కథా పరిస్థితులను పాఠకులు అర్థం చేసుకోవడం సులువవుతుంది.
ఈ నవలలో రచయిత శైలి మిగతా ఆధునిక రచయితలకు భిన్నంగా కనిపిస్తుంది. దీన్ని నవలగానే పరిగణించినా కొన్ని కథల సమాహారం ఇది. ఈ నవలలో వచ్చే అన్ని పాత్రలు కిట్టూర్ అనే ఒక దక్షిణ పడమర ప్రాంతం లోని ఊరులో నివసిస్తాయి. కిట్టూర్ ఇప్పటి మాంగళూర్‌ని పోలుస్తూ రచయిత నిర్మించుకున్న ఒక కాల్పనిక ఊరు. మన ఆక్. కే. నారాయణ్ మాల్గుడి లాగ అనమాట. ఆ ఊరు ఒక్కటే ఆ పాత్రలన్నిటిని కల్పుతుంది. కాని వారి అనుభవాలు వారి సొంతం. పాత్రలు ఒకరితో ఒకరు కలవవు. అందువలన అందరి జీవితాలు కిట్టూర్‌లో గడిచినా ఒకరి జీవితంతో మరొకరికి సంబంధం ఉండదు. ఈ కథలన్నీ ఒక వారం రోజులలో జరిగే సంఘటనల ఆధారంగా తయారు చేసుకున్నారు కాబట్టి రచయిత ప్రతి అధ్యాయాన్ని రోజుల లెక్కగా చూపిస్తారు.
మొదటి కథ మొదటి రోజు అనే అధ్యాయంతో మొదలవుతుంది. జియాఉద్దీన్ అనే బాలుడి కథ ఇది. తండ్రి అతన్ని పోషించలేక, పని వెతుక్కొమ్మని ఈ ఊరికి పంపిస్తాడు. ఎక్కవ శాతం హిందువులున్న ఈ ఊరిలో ఒక హోటల్‌లో సర్వర్‌గా కుదురుతాడు జియాఉద్దీన్. అతని అమాయకత్వానిన్ని, కష్టపడే నైజాన్ని చూసి అందరూ అతని ప్రేమిస్తారు. సెలవు పెట్టి తన ఊరు వెళ్ళి వచ్చిన తరువాత జియాఉద్దీన్‌లో మార్పు వస్తుంది. తనో పఠాన్ అని, మిగతా మతాల వారు తన కన్నా తక్కువని చెప్పుకుంటూ అహంకారాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అప్పటి దాకా స్నేహంగా ఉన్న వారితోనే గొడవలు పడడం వల్ల అతను అందరికీ దూరమవుతాడు, పైగా దొంగతనం, అబద్దాలు అతని నైజం అయిపోతాయి. ఎన్నో పనులు మారి చివరకు రైల్వే స్టేషన్‌లో కూలిగా కుదురుతాడు. ఒక సారి ఆ ఊరికి ఒక అపరిచిత వ్యక్తి వస్తాడు. తననో పఠానుగా పరిచయం చేసుకుని జియాఉద్దీన్ లోని కోపం, అసహనం గమనించి అతనితో తన ఉగ్రవాద కార్యక్రమాల కోసం పని చేయించుకుంటాడు. ముందు మతం కోసం అతనితో స్నేహం చేసినా, అతని స్వార్థం జియాఉద్దీన్‌కి నచ్చదు. చివరకు అతన్ని వదిలి మళ్ళీ కూలిగా తన పాత చోటుకు వెళ్ళిపోతాడు. అందరితో గొడవలు పడుతూ జీవించడం ఇష్టపడతాడు కాని ఆ అపరిచితుడితో కలవలేకపోతాడు. అతనిలోని మానవతావాదం అతనికే తెలీయకుండా అతనిలో నిద్రలేస్తుంది. సమాజంలోని అనుభవాలు, ఇతరులు తన పట్ల ప్రదర్శించిన సహనం అతనిలో తెచ్చే ఆ మార్పును రచయిత చిత్రించిన విధానం బావుంటుంది.
రెండవ రోజు అనే అధ్యాయంలో అబ్బాసి అనే ఒక వ్యాపారస్తుడిని రచయిత పరిచయం చేస్తాడు. షర్ట్లు తయారు చేసే ఫాక్టరీ అతనిది. అయితే అతను తయారు చేసే షర్ట్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నా, అవి కుట్టే స్త్రీలు ఆ పని వలన చాలా తొందరగా చూపు పోగొట్టుకుంటారని అతనికి అర్థం అయి ఆ ఫాక్టరీ మూసి వేస్తాడు. కాని చివరకు బ్రతకడానికి మళ్ళి అ ఫాక్టరీ తెరవక తప్పదు. ఆ క్రమంలో ఎందరికో లంచాలివ్వడం తప్పదతనికి. తన దగ్గర పని చేసే స్త్రీలు తనలాగే ఆ పని తప్ప మరొకటి చేయలేరని, తను ఫాక్టరీ మూసి వేసినా, వారు ఆ పని మానరని అతనికి అర్థం అవుతుంది. ఆ ఫాక్టరీ తిరిగి తెరవడానికి ఎంత మందికో లంచాలిస్తూ అతను చాలా బాధపడతాడు. చివరకు నక్క జిత్తులు నేర్చుకుని ఆ లంచగొండి తనాన్ని ఎదుర్కునే వ్యక్తిగా మారతాడు. వ్యవస్థ తయారు చేసిన ఒక మనిషి అతను. అమాయకత్వాన్ని వీడి జిత్తులమారితనాన్ని నేర్చుకుని జీవించడం తప్పని ఒక సాధారణ వ్యాపారి కథ ఇది.
ఇదే అద్యాయంలో జెరాక్స్ అనే మరో వ్యక్తిని రచయిత పరిచయం చేస్తారు. ఇతని వృత్తి, మంచి ఖరీదైన పుస్తకాలను కాపీలు చేసి అమ్మడం. అలా అమ్ముతూ ఎన్నో సార్లు పోలీసులకు పట్టుబడినా అతను తన వృత్తిని మానడు. ఒక సారి సల్మాన్ రష్డీ సటానిక్ వర్సెస్ అనే పుస్తకాన్ని అమ్ముతూ పట్టుపడతాడు. అది బాన్ చేసిన పుస్తకం అని, అది అమ్మితే అది దేశద్రోహమవుతుందని కూడా అతనికి తెలీదు. అకలిని జయించాలంటే అతనికి వచ్చిన ఒకే వృత్తి అది. అతను పోలీస్ స్టేషన్ నుండి బైటికి వచ్చి మళ్ళీ తన రోడ్డు పక్కన పుస్తకం షాపు దగ్గరకు వెళ్ళి వ్యాపారం మొదలెడుతాడు. ఇదే అధ్యాయంలో శంకర అనే టీనేజి కుర్రవాని కథ కూడా ఉంది. బ్రాహ్మణ తండ్రికి, తక్కువ కులం స్త్రీకు పుట్టిన శంకర చిన్నప్పటి నుండి కులం ఎలా తనను ఆడిస్తుందో చూస్తూ పెరుగుతాడు. అతనిలో లోకం పట్ల ఎంతో కోపం ఉంటుంది. అల్లరి పిల్లవాడిగా మారతాడు. నత్తి ఉన్న తన కెమిస్ట్రీ సర్‌ను ఏడిపించడానికి క్లాసులో బాంబ్ పెడతాడు. చివరకు అవమానంతో ఏడుస్తున్న ఆ అధ్యాపకునిలో తనను తాను చూసుకుని పశ్చాత్తాప పడతాడు.
రెండవ రోజు అనే అధ్యాయంలోనే డి మెల్లో అనె ఒక టీచర్ కథ కూడా ఉంది. ఒక స్టూడెంట్ అంటే అతనికి చాలా అభిమానం. సమాజంలో చెడు అంటని పవిత్రమైన పిల్లవాడిగా అ ఆబ్బాయి మిగిలిపోవాలని అతని కోరిక. పిల్లలలోని అన్ని వికృతాలను చూసి ఆ పిల్లల మధ్య ఈ అబ్బాయి ఆణిముత్యంగా నిలవాలని కోరుకుంటాడు. కాని ఆ అబ్బాయి కూడా సమాజంలో మకిలీ అంటించుకోవడానికి ఇష్టపడుతున్నాడని దాని పట్ల ఆకర్షితుడవుతున్నాడని తెలుసుకుని భరించలేక గుండె ఆగి మరణిస్తాడు.
మూడవ రోజు అనే అధ్యాయంలో గురురాజ్ కామత్ అనే ఒక జర్నలిస్ట్ కథ కనిపిస్తుంది. నిజాయితీపరుడు ధైర్యవంతుడైన అతనంటే అందరికీ గౌరవం. చాలా సూటిగా, ధైర్యంగా నిజాన్ని అందిస్తాడని అతనికి పేరు. కాని ఒక రోజు, ఒక రాత్రి వాచ్‌మన్‌ని కలిసిన తరువాత గురురాజ్‌కు తాను సత్యం అనుకుంటున్నది సత్యం కాదని, అందరికీ సత్యం తెలుసని కాని ఎవ్వరూ నిజం మాట్లాడరని, డబ్బు, పరపతి సమాజంలో ప్రతి ఒక్క సంఘటనను ప్రభావితం చేస్తున్నాయని, మనకు నిజం అని తెలిసేవన్నీ అబద్దాలని తాను అన్ని రోజులు ఆ అబద్ధాలనే నిజమని నమ్మి వాటినే ప్రచారం చేస్తున్నానని తెలుసుకుంటాడు. ఇక అప్పుడు నిజమైన వార్తలను అందించాలని నిజాలను మాత్రమే రాయాలని నిజాలను వెలికితీయడం మొదలెడతాడు. ఆ పని మొదలెట్టిన మరుక్షణం అతను అందరికీ విరోధి అవుతాడు. చివరకు పిచ్చివాడిగా మిగిలిపోతాడు. అబద్దం ఇచ్చే రక్షణ మనిషికి నిజం ఇవ్వదని చెప్పే కథ ఇది.
నాలుగవ రోజు అనే అధ్యాయంలో, ఒక రోజు కూలి కథ కనిపిస్తుంది. అతనికి ఇద్దరు పిల్లలు. అతనో పచ్చి తాగుబోతు. అతని కూతురికి తండ్రి అంటే పిచ్చ ప్రేమ, అతనికోసం ఏదైనా చేయడానికి సిద్దం. ఆ అమ్మాయి ప్రేమను ఆసరాగా తీసుకుని ఒక రోజు ఆ తండ్రి ఆ బిడ్డలిద్దరిని వీధిలో అడుక్కొని తనకు మత్తు మందు తెచ్చివమని అడుగుతాడు. తండ్రి సంతోషం కోసం ఏదైనా చేసే ఆ అమ్మాయి రోజంతా అడుక్కుని కొన్ని కిలోమీటర్లు నడిచి తండ్రి చెప్పిన చోటుకు వెళ్ళి ఆ మత్తు మందు తెచ్చి ఇస్తుంది. కాని ఇంత చేసినా ఆ కూతురికి ఆఖరికి దక్కేవి తండ్రి తన్నులు, తన కన్నీళ్ళే. వ్యసనపరుడైన తండ్రి వద్ద పిల్లలకు మిగిలే ఒంటరితనాన్ని చెప్పే కథ ఇది.
ఐదవ రోజు అనే అధ్యాయంలో ఒక అవివాహిత బ్రాహ్మణ వంటమనిషి జయమ్మ పరిచయం అవుతుంది. పేదరికం వల్ల ఆమెకు పెళ్ళి కాదు. ఆమె అన్న వదినలు ఆమెను ఇతరల ఇంట్లో వంటకి పెడతారు. ఆ డబ్బు వాళ్ళు తీసుకుంటారు. జయమ్మకు తాను బ్రాహ్మణ స్త్రీనని కొంచేం అహం ఎక్కువ. తాము చాలా పవిత్రులమని ఆమె నమ్మకం. అయితే ఒక తక్కువ జాతి పనిమనిషితో కలిసి పని చేస్తూ ముందు బాధపడినా ఆమె వద్ధ మాత్రమే జయమ్మ కొంత ప్రేమ పొందుతుంది. ఆ అమ్మాయి పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయాక జయమ్మ ఆమె పని కూడా తానే చేస్తుంది. చివరకు ఆ ఇల్లు వదిలి పెట్టవలసి వచ్చినప్పుడు తాను సేవ చేసిన వాళ్ళూ, తన సంపాదన తింటున్న తన కుటుంబం ఎవ్వరికీ తన గోడు అక్కరలేదని, తన కులం తనకు ఇచ్చిందేమీ లేదని అర్థం అవుతుంది. పగిలిన ఒక బంతిని తన మేనల్లుడి కోసం దొంగతనం చేస్తూ ఆ పాపం వల్లనయినా మరో జన్మలో మరో మతస్తురాలిగానో, తక్కువ కులం లోనో పుట్టి ఆనందించవచ్చని సంతోషిస్తుంది.
ఈ అధ్యాయంలోనే మరో కథ జార్జ్ అనే ఒక దోమల మందు చల్లే వ్యక్తిది. తమ వీధిలోమందు చల్లుతూ ధనవంతురాలైన ఒక స్త్రీని చూసి ఆమె పట్ల ఆకర్షణ పెంచుకుంటాడు జార్జ్. ఆమె వద్ద ఉండాలని, ఆమె ఇంట తోటపనికి చేరి, డ్రైవర్‌గా మారి చివరకు తన చెల్లెలిని ఆ ఇంట వంట మనిషిగా చేర్చి ఆ ఇంట ఉండడానికి అలవాటు పడతాడు. కాని ఒక రోజు తాగి వచ్చాడని అతన్ని అప్పటి దాకా ఉపయోగించుకున్న ఆ ఇల్లాలు ఒక్క రోజులో అతన్ని ఉద్యోగంలో నుండి తీసి వేసి అతను ఒక సంవత్సరం పాటు నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని కూల్చి వేస్తుంది. ఎంత యజమానికి చేరిక అయినా అతని జీవితం యజమానుల దయపై ఆధారపడే బానిస జీవితం అని తెలియ జేస్తుంది. మనుష్యుల మధ్య ఉన్న ఆర్ధిక వ్యత్యాసాలను అధిగమించడం జరగని పని అని జార్జ్ అర్థం చేసుకుంటాడు.
ఆరవ రోజు కథలో రోడ్డు పక్కన మందులు అమ్మే రత్నాకర శెట్టి పరిచయం అవుతాడు. అతనికి పెళ్ళికి వచ్చిన కూతుళ్ళు ముగ్గురు. మొదటి అమ్మాయి పెళ్ళి చూపులకు వచ్చిన అబ్బాయికి సుఖవ్యాదులున్నాయని అతను కనిపెడతాడు. అయితే పెళ్ళి కాదనుకున్నా ఆ అబ్బాయికి సహాయపడవలసిన స్థితి వస్తుంది. తాను అమ్మే మందులు సుఖవ్యాదులను నయం చేయవని, బ్రతకడానికి తాను అబద్దాలను ఆడుతున్నానని ఆ అబ్బాయికి అర్థం అయేలా చెప్పి, చివరకు ఒక డాక్టర్ దగ్గరకు స్వయంగా తీసుకువెళతాడు. వృత్తి ప్రవృత్తి మధ్య వైరం చర్చించే కథ ఇది.
ఇదే కథలో గిరిధర రావు కామిని అనే దంపతులు పరిచయం అవుతారు. పిల్లలు లేని వీరు స్నేహితులను ఆదరించడం ఒక ముఖ్యమైన పనిగా పెట్టుకుంటారు. ఊరికి దూరంగా అడవి ప్రాంతంలా ఉండే చోట ప్రకృతి మధ్య వారు తమ జీవితంలోని ఒంటరితనాన్ని, లోటును పూరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆధునీకరణ పేరుతో ఆ ప్రాంతంలోని చెట్లన్నీ నరికేయడవం వలన ఆ అడవి మాయమవుతుంది. ఇలాంటి ఎందరికో ఓదార్పు ఇచ్చే పరిసరాలు మాయమయి ఒక నిస్సారమైన నగరం మిగులుతుంది. పకృతి మధ్య జీవిస్తూ తమ జీవితానికో అర్థం కోసం ప్రయత్నీంచే మనుష్యులను మర్చిపోతున్న ఆధునిక ప్రపంచ వైఖరిని చర్చించే కథ ఇది.
ఏడవ రోజు కథలో మురళి అనే కమ్యునిస్టు ఉద్యమకారుడు కనిపిస్తాడు. జీవితాంతం ప్రజల శ్రేయస్సు కోసం ముందు కాంగ్రెసు తరువాత లెఫ్టిస్టు ఉద్యమాల పట్ల ఆకర్షితుడయి పెళ్ళి కూడా మర్చిపోయి జీవించే ఒంటరి అతను. ఒకసారి పార్టీ ఆఫీసుకు ఒక వితంతువు తన పెళ్ళికావల్సిన కూతురుతో వస్తుంది. ఆమె భర్త ఒక రైతు. అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఇలాంటి వారికి గవర్నమెంటు ఇచ్చే ఆర్థిక సహాయం కోసం ప్రయత్నించడంలో సహాయం ఆశించి ఆమె మురళి వద్దకు వస్తుంది. ఆమె కూతుర్ని చూసి మురళి ప్రేమిస్తాడు, వివాహం చేసుకోవాలనుకుంటాడు. అవసరానికి మించి ఆ తల్లి కూతుళ్ళకు సహాయపడతాడు. కాని 52 ఏళ్ళ అతనికి తన కూతురిని ఇవ్వడానికి ఆ తల్లి ఇష్టపడదు, ఊరివాళ్ళూ అతన్ని హేళన చేస్తారు. మురళి చివరకు స్వార్థపరుడుగా మారతాడు, ఆ తల్లీ కూతుర్లను ముప్పు తిప్పలు పెట్టి తన దారికి తెచ్చుకునే ప్రయత్నం మొదలెడతాడు. అప్పటి దాకా ప్రజల మనిషిగా ఉన్న అతనిలో అనుకోకుండా తలెత్తిన ఆ మరో రూపం మనిషి జీవితంలో అసహాయ స్థితిని చూపిస్తుంది. ఎప్పుడు ఎవరు ఎలా మారతారో చెప్పలేని విధంగా మానవ జీవితాలుంటాయి అన్న మాట ఈ కథ ద్వారా మరో సారి అర్థం అవుతుంది.
అరవింద్ అడిగా రచనా శైలిలో ఒక పదునుంటుంది. మానవ జీవితాలను ఆక్రమించుకుని ఉన్న స్వార్థాన్ని మంచితనం వెనుక ముసుగుల్ని ఆయన సూటిగా ప్రశ్నిస్తారు. మానవుల మధ్య ఉన్న కుల, మత, ఆర్థిక భేధాలను అతను అసహ్యించుకుంటాడు. వీటి మధ్య నలిగిపోతున్న సామాన్య మానవుడు ప్రదర్శించే కోపాన్ని అసహనాన్ని తనదైన శైలిలో బలపరుస్తాడు. సమాజంలో ఈ అన్యాయం పట్ల రచయితలో అంతర్లీనంగా ఉన్న కోపం అతని పాత్రల కోపాన్ని న్యాయబద్దం చేసే ప్రయత్నం చేస్తుంది. అతని దృష్టిలో సమాజం మనిషిని తయారు చేస్తుంది. అతని ప్రవర్తనను నిర్దేశిస్తుంది. మానవ తప్పిదాలకు సమాజం జవాబుదారి కావాలి. ఈ భావాన్ని అతని పాత్రలన్నీ ప్రదర్శిస్తాయి. పరిస్థితులకు బానిసలయిన అతని పాత్రల ద్వారా సమాజాన్ని తన రచనలో చూపే ప్రయత్నం రచయిత ప్రతీ రచనలో కనిపిస్తుంది. ఆ పాత్రల కోపాన్ని, తప్పుల్నీ వాటి వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకొమ్మనే వేదన అతని రచనలో ఎక్కువగా ఉంటుంది. అందుకే అతని రచనలు చదివి మనం గాయపడతాం. అవి మనల్ని వెక్కిరిస్తాయి, బాధపెడతాయి, అలాగే మనుష్యులపై అభిప్రాయాలు ఏర్పరుచుకోబోయే ముందు ఆలోచించమని అర్థిస్తాయి.