Site icon Sanchika

ఆశల హరివిల్లే పూసే మబ్బులకావల Beyond the clouds!

[box type=’note’ fontsize=’16’] “ముద్దుగా, అందంగా, అమాయకంగా వుండే ఆ పిల్లలే జీవితం పట్ల ప్రేమను, భరోసాను, ఆశను కలిగించే ఇంద్రచాపాలు” అంటూ “బియాండ్ ది క్లౌడ్స్” సినిమాని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]

[dropcap]ఇ[/dropcap]రాన్ దర్శకుడు మజిది మజిదిపేరు నేను విన్నది అతని చిత్రం “Children of Heaven కు ఆస్కర్ నామినేషన్ వచ్చినప్పుడు. ఆ చిత్రం నేను చూడలేదు. అడపా దడపా అతని పేరు వింటూనే వున్నా. ఇన్నాళ్ళకి “Beyond the clouds” తో ఆ కోరిక తీరింది.

అందమైన చిత్రం. హృదయాన్ని మెలిపెట్టే కథ. మరచిపోలేని కథనం. తమ అమాయకత్వంతో మెమ్మల్ని బుట్టలో పడేసే ఆ చిన్న పిల్లలు. చిత్రం గొప్పగా వున్నదా లేదా అని తూనిక రాళ్ళు తీసుకుని కూర్చోకుండా, వో అందమైన అనుభూతిని, కొంత దిగులునూ ఇంటికి మోసుకెళ్ళడానికి తప్పకుండా చూడాలి దీన్ని.

ముంబై నగరంలో అందమైన ఫ్లైవోవర్లు, కార్ల రద్దీ, వెలిగిపోతున్న వాణిజ్య కటౌట్లతో మొదలయ్యే చిత్రం, నెమ్మదిగా ఆ కెమెరా ఆ బ్రిడ్జి కింద వున్న బీద ప్రపంచాన్ని ఫోకస్ చేయడంతో మనకు దర్శకుని దృష్టికోణం అర్థమైపోతుంది. ఆమిర్ (ఇషాన్ ఖట్టర్), తార (మాళవికా మోహనన్) అక్కా తమ్ముళ్ళు. బీదరికంలో పుట్టి రకరకాల వెతలతో తలపడుతున్న వీరి కథ కలచి వేస్తుంది. తార భర్త తాగుబోతు, తిరుగుబోతు, భార్యను కొడుతుంటాడు. ఆమిర్ డబ్బు కోసం మాదక ద్రవ్యాలను బట్వాడా చేస్తుంటాడు రిస్కు తీసుకుని. కొన్నాళ్ళు ఈ పని చేసి, తగినంత డబ్బు సమకూరాక మానేసి చక్కగా బతకాలన్నది అతని కల. అతని కలను చిద్రం చేస్తూ వొక సారి పోలీసులు అతన్ని పట్టుకోవడానికి వల పన్నుతారు. అతి కష్టం మీద తప్పించుకుని తన దగ్గరున్న ఆ డ్రగ్ పేకెట్టుని అక్కదగ్గర దాచిపెట్టమని పరిగెడుతాడు. ఆ పరిసరాలలోనే వుంటున్న అక్షి (“పార్”, “మా భూమి” లాంటి చిత్రాలు తీసిన గౌతం ఘోస్) అతన్ని దాచిపెట్టి రక్షిస్తాడు. అయితే అతని కన్నెప్పుడూ తార మీదే వుంటుంది. ఇటు తమ్ముడిని రక్షించి, అటు అక్క దగ్గరనుంచి ఆ పేకెట్టుని దొంగలించి, ఆమెను బలవంతం చేయబోతాడు. స్వీయరక్షణకోసం ఆమె చేతికందిన రాయితో అతని మాడు పగలగొడుతుంది. స్పృహ కోల్పోయిన అతన్ని ఆసుపత్రికి, హత్యానేరం మీద ఆమెను జైలుకి తీసుకెళ్తారు. ఇప్పుడు అక్కను విడిపించడం యెలా అన్నది ఆమిర్ కు యెదురైన అదనపు సమస్య. అక్షి చనిపోతే అక్క జీవితాంతం జైల్లో మగ్గాలి. అందుకే అక్షి చనిపోకూడదని ఆమిర్ అయిష్టంగానే, కోపంగానే అతనికి సేవలు చేస్తాడు, మందులవీ తెచ్చి పెట్టడం ద్వారా. వొక రోజున ఆసుపత్రికి వస్తారు అక్షి పిల్లలు, అతని తల్లీనూ. తమిళులు. వేరే దిక్కు లేదు, దస్కమూ లేదు. మళ్ళీ అయిష్టంగానే ఆమిర్ వాళ్ళ సంరక్షణా భారం కూడా నెత్తినేసుకుంటాడు. అక్కడ జైల్లో హత్యానేరం మీద శిక్ష అనుభవిస్తున్న వో స్త్రీ (తానిష్టా చటర్జీ) తన యేడెనిమిదేళ్ళ కొడుకుతో వుంటుంది. ఆ అబ్బాయికి ఆర్నెల్లప్పుడు పడింది ఆమెకు శిక్ష. పుట్టి చంద్రుడిని చూసి యెరుగడు ఆ అబ్బాయి. ఆ జైలు గోడల మధ్య తార కూ ఆ అబ్బాయికీ మధ్య స్నేహం కుదురుతుంది. అస్వస్థతో వున్న ఆ పిల్లవాడి తల్లి చనిపోవడంతో ఇక తనే ఆ అబ్బాయికి యేకైక దిక్కవుతుంది. ఆ జైలులోనే తాన్నిస్తా చటర్జీ లా తను కూడా చనిపోతుందేమో అన్న భయం పట్టుకుంటుంది తారకు. “నేను చనిపోను, నేను చనిపోదలచలేదు” అని గట్టిగా యేడుస్తుంది, రుత్విక్ ఘటక్ “మేఘే ఢకా తారా” లో నీతా (సుప్రియా చౌధరి) లాగా. కాని అంత impressiveగా కాదు. అక్కడ అక్షి చనిపోతాడు. ఇటు ఆ అబ్బాయికి చందమామ కథ చెబుతుంటే చందమామ అంటే యేమిటి అని అడుగుతాడా పిల్లోడు తారని. నువ్వెప్పుడూ చూడలేదా, ఈ రోజు నేను చూపిస్తాను అంటుంది తార. రహస్యంగా డాబా వరకూ వెళ్ళి చందమామను చూడడానికి తన చెవి రింగును లంచమిస్తుంది జైలరుకు. దాన్ని తీసుకున్న ఆ జైలరు తార చేస్తున్న పనికి మనసులో మార్పు వచ్చి ఆ బంగారు రింగును మరలా ఆమె కోసం పెట్టేస్తుంది. వర్షపు రాత్రి చంద్రుడూ కనపడడు. రోజుకొక రంగు చూపిస్తున్న జీవితం. చివర్న ముంబై వీధుల్లో హోలీ ఆడుకుంటున్న ప్రజల మధ్యనుంచి ఆమిర్ వెళ్ళడంతో ముగుస్తుంది కథ.

మజిది మజిది కథ కషాని తో కలిసి వ్రాశాడు. చాలా చోట్ల కుంటుపడినా, వూహకందే మలుపులున్నా మొత్తం మీద బాగుంది. కొన్ని సన్నివేశాలు గుర్తుండిపోతాయి. కథనం కేవలం దృశ్యపరంగా, పరిమిత సంభాషణలతో వున్నా, ఫ్లాష్బేక్ అవసరం వచ్చిన రెండు సందర్భాలున్నాయి. వొకసారి అక్కా తమ్ముళ్ళు వొకరినొకరు తప్పుపట్టడం, సంభాషించుకోవడం ద్వారా కథ చెబుతాడు. మరో సారి ఆసుపత్రిలో అక్షి తలగడ తీసుకుని అతని మంచం కిందే పడుకుని అతనితో సంభాషిస్తుంటాడు ఆమిర్. ఈ రెండు తప్ప మిగతా కథంతా సినెమా ద్వారానే. చాలా యేళ్ళ తర్వాత ఆమిర్ పోలీసులనుంచి తప్పించుకుంటూ పరిగెడుతూ తన అక్క దగ్గరికి వెళ్ళడం, అక్క ఇంట్లో వున్న ఆమిర్ కి రాత్రిళ్ళు యెవరెవరో తలుపు తడుతుంటే తన అక్క చాటున వ్యభిచారం చేస్తుందని తెలియడం …. ఇలాంటివి చాలా చాలా వున్నాయి. ఇక్కడ అవన్ని వ్రాయడం చూడబోయే ప్రేక్షకుడిపట్ల అన్యాయమే అవుతుంది. అనిల్ మెహతా సినెమేటోగ్రఫీ చాలా బాగుంది. రెహమాన్ సంగీతమూ బాగుంది. అందరి నటనా బాగుంది. ముఖ్యంగా ఇషాన్ ఖట్టర్ ది. ఇతని మొదటి చిత్రమే అయినా గొప్ప నటనతో మన ముందుకొచ్చాడు. ఇతని నుంచి చాలా ఆశలున్నాయి. ఇతను నీలిమా అజీం (నటి, పంకజ్ కపూర్ మొదటి భార్య) కొడుకు. తర్వాత చెప్పుకోవాల్సింది ఆ ముసలామె పాత్ర చేసిన GVశారద. విగ్రహం లాగా నిలబడిపోయి గుచ్చి గుచ్చి చూసే కళ్ళతో ఆమె యెదురైనప్పుడల్లా ఆమిర్ మాత్రమే కాదు మనం కూడా భుజాలు తడుముకుంటాము. ఆ తర్వాత అతి ముఖ్యంగా చెప్పాల్సింది ఆ పిల్లల నటన. ముద్దుగా, అందంగా, అమాయకంగా వుండే ఆ పిల్లలే జీవితం పట్ల ప్రేమను, భరోసాను, ఆశను కలిగించే ఇంద్రచాపాలు. వాళ్ళను కాపాడుకోవడానికి ఆ అక్కాతమ్ముళ్ళు పడే తాపత్రయమే, మనలోనూ. అదే చెబుతుంది చివరిలో ఆ హోలీ సంబరం.

నాకు సందర్భం వస్తే చాలు సత్యజిత్ రాయ్ పూనుతాడు. యెంత మానుకుందామనుకున్నా కూడా. యేం పర్లేదు, ఈ దర్శకుడు కూడా రాయ్ అభిమాని. పథేర్ పాంచాలిలో రైలును చూడలేకపోయిన దుర్గ, ఇందులో యెప్పుడూ చంద్రుడిని చూసి యెరుగని పిల్లవాడు; అందులో ముసలామెగా చేసిన చున్నిబాలాదేవి తన పట్ల జరుగుతున్న అన్యాయాన్ని వెక్కిరింతలతో, గొణుక్కోవడంతో, అలిగి తన మూట యెత్తుకుని చుట్టం ఇంటికి వెళ్ళిపోవడంతో వ్యక్త పరిస్తే, ఇందులో G V శారద కదలకుండానే, తీక్షణమైన అదే సమయంలో నిస్సహాయతను ప్రకటించే కళ్ళతో చేస్తుంది. అసలు ఆ ముగ్గురు (శారద ఇద్దరు పిల్లలు) వున్న దృశ్యాలు చాలా శక్తివంతంగా వుంటాయి. ముగ్గురూ నిరాశ్రితులు, అటు ఆమిర్ కి ఇటు ప్రేక్షకుడికీ మౌనంగానే నిస్సహాయంగా ప్రశ్నలు వేస్తారు.

ఇంతా చెప్పాక మనకు అప్పుడెప్పుడో మీరా నాయిర్ తీసిన “సలాం బాంబే” గుర్తు రాక మానదు. బంబై రాత్ కీ బాహోం మెఁ లాంటి యెన్నో కథలందించిన కె ఎ అబ్బాస్ ది రొమాంటిక్ శైలి అలవాటు పడ్డ జనానికి ముంబై నగరపు చీకటి కోణాలను తెరకెక్కించి వొక benchmark వేసి పెట్టింది. అది అందుకుంది అని చెప్పను కాని ఇది కూడా మంచి సినెమా, మిస్ కాకూడని సినెమా a touching human document అని తప్పకుండా అంటాను.

Exit mobile version