[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]
అధ్యాయం-1: గురు ప్రాముఖ్యత
[dropcap]త[/dropcap]ల్లి, తండ్రి, గురువులని ప్రత్యక్ష దైవాలుగా శాస్త్రాలు పేర్కొన్నాయి. వీరికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ప్రతినిధిత్వం ఇవ్వబడింది. తల్లి జన్మనిచ్చి సృష్టికర్త స్థానం పొందుతుంది. తండ్రి పోషణ బాధ్యత వహించడం చేత విష్ణువుకి ప్రతీక. గురువు వ్యక్తి లోని దుష్ట సంస్కారాలను తొలిగించడం వల్ల శివ స్వరూపుడు. అత్మ, పరమాత్మ ఐక్యతా సూత్రమైన గురువు మార్గదర్శకుడు.
గురువుతో శిషుని సంబంధం గాఢమయ్యే కొద్ది గురువు శిష్యుని దోషాలను తొలగిస్తాడు. ఆ బంధం హృదయగతం.
ఉదాహరణకి వాహనం నడిపేటప్పుడు మార్గమధ్యంలో వాహనం చెడిపోతే మెకానిక్ దగ్గరకు తీసుకెళతాం. జీవితం అనే బండిని బాగు చేసుకోలేనప్పుడు దానిని సద్గురువు దగ్గరికి తీసుకెళ్ళాలి. జీవనరథంలోని భయం, చాంచల్యపు చక్రాలను తీసేసి ధైర్యం, నిబ్బరమనే చక్రాలు అమరుస్తారు.
గురుభక్తికి ప్రధానమైన 8 సోపానాలు చాలా అవసరం. అవి సత్సంగం; శ్రద్ధ; సేవ; కీర్తనం; దృఢ విశ్వాసం; సత్కర్మం; సమభావం; నిశ్చలత.
భగవంతుని నివాసం:
గుణ సంకీర్తన చేసే భక్తులు ఉన్న చోటే భగవంతుడు నివసిస్తాడు.
దీక్ష అంటే:
గురు కృప, శిష్యుని శ్రద్ద, కలయిక. గురువు ప్రేమ, శిష్యుని ఆత్మసమర్పణ. అదే దీక్ష. వీటి ద్వారా శక్తి, జ్ఞాన దానం, శిష్యుని అజ్ఞానం, పాపాల క్షయం, పాప విముక్తి. ఇది తొలగక పోతే పూర్ణత్వం కలుగదు.
గురువు హృదయం భూమిలా విశాలం. అది కఠినం కాదు. సానుభూతి మయం. గురువుకు తన విజ్ఞానం, అనుభవాన్ని అప్పగించే కళ తెలుసు. గురువులో సృష్టికర్త నివసిస్తాడు. ఆత్మ- పరమాత్మకు మధ్య గురువు, గురువు ద్వారా పరమాత్మ అవతరిస్తాడు.
ఒక చిన్న కథనం:
ఒక గురువు శిష్యునికి ఆశ్రయమిచ్చాడు. చాలా కాలం గడిచింది. శిష్యుడు ఇంటికి తిరిగి వెళ్ళే సమయం ఆసన్నమైంది. ఒక రోజు సాయంకాలం శిష్యుడు గురువు దగ్గర కూర్చుని చదువుతుంటే చీకటి పడే వేళయింది. శిష్యుడు వెళ్ళే గుడికి ఆలోచనలో ఉన్నాడు. చీకట్లో గుడి మెట్లు కనపడవు. దీపం అడిగి తీసుకోవాలని అనుకున్నాడు. గురువు దీపం ఇచ్చాడు. గుడికి చేరి ఒక మెట్టు ఎక్కగానే గురువు దీపాన్ని ఆపివేశాడు. అప్పుడు శిష్యుడు, “స్వామీ! ఇలా చేసేరేమిటి? చీకట్లో ముందుకు ఎలా వెళ్ళగలను?” అని అడిగాడు.
అప్పుడు గురువు అతనికి జీవితార్థం వివరించాడు. “ఒక మెట్టు ఎక్కిన వాడివి స్వతహాగా తక్కిన మెట్లు ఎక్కగలవు. దీపపు వెలుగును ఆశ్రయించడం కంటే చీకటిలో నడవడం ఉత్తమం. అపుడు నీలోనే ఒక దీపం వెలుగుతుంది. చీకట్లో తడబడటం, కిందపడడం వంటి అసౌకర్యాల ద్వారా నీ ఆత్మ వెలుగును అన్వేషించి తెలుసుకొంటుంది. ఈ దీపపు వెలుగు వల్ల నీవు కిందపడకుండా ఎక్కగలిగినా, నీ ఆత్మ తప్పిపోతుంది. అందుకే దీపం ఆర్పివేశాను” అని గురువు అన్నారు. ఇది విన్న శిష్యుని జ్ఞాన చక్షువు తెరచుకుంది. నిర్భయంగా ముందుకు నడిచి గమ్యం చేరాడు.
సద్గురువును ఆశ్రయిస్తే, అతనే భగవంతుని దగ్గరకు చేర్చుతాడు.
అభిప్రాయాలు:
“నా ఆత్మే నాకు గురువు. భూదేవి నుంచి సహనాన్ని, నీటి నుంచి పారిశుద్ధ్య గుణాన్ని, గాలి నుండి నిస్సంగత్వాన్ని ఇలా మొత్తం 24 మంది గురువుల నుంచి జ్ఞాన సముపార్జన చేశాను” అని దత్తాత్రేయుడు ప్రకటించారు.
“ప్రతి మనిషిలోను ఉన్న ఆత్మ నిజమైన గురువు” అని ఓంకార స్వామి ప్రవచించారు.
అద్వైత శిఖామణి సదాశివ బ్రహ్మేంద్రులు “సద్గురు కృపా కటాక్షం వల్ల నేను బ్రహ్మన్ని కాగలిగాను. వేదాంత విజ్ఞానం కోసం సద్గురువును ఆశ్రయించడం అనివార్యమని ముండకోపనిషత్తు సూచిస్తుంది” అన్నారు.
“ఆత్మ ప్రబోధమే గురు ప్రబోధం” అని రమణ మహర్షి సూచించారు.
గురువులలో రకాలు:
- చదువు నేర్పే గురువు – సూచక గురువు
- కుల; ఆశ్రమ ధర్మాలు బోధించేవారు- వాచక గురువు
- మంత్రోపదేశం చేస్తే – బోధక గురువు
- జ్ఞాన మాగ్రం చూపేది – విహిత గురువు
- జీవ బ్రహ్మైక్యం బోధించేది – కారణ గురువు
- జీవాత్మ పరమాత్మ యోగాన్ని బోధించెది – పరమ గురువు
మానసికంగా శ్రద్ద, భక్తి అనే రెండు ఫలాలను గురువుకు సమర్పించాలి.
‘గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః’.
అటువంటి గురువుకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
దీపానికి గురువుకి మధ్య సంబంధం:
దీపానికి, గురువుకి చాలా దగ్గర సంబందం వుంది. దీపం మన లోపల జ్యోతి స్వరూపంగా వెలుగొందుతున పరమాత్మ. మానవుని శరీరం చిచ్చల గ్రంథి (చిత్ చల గ్రంథి = చిత్తం అనే కదిలె మది). వెలుగుల ముద్దగా, స్వయం ప్రకాశ జ్యోతిగా, సూర్య చంద్రులకు సైతం కాంతిని ప్రసాదించే స్వరూపం పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే హృదయాకాశంలో జ్యోతి స్వరూపంగా వెలుగొందుతున్న పరమాత్మ.
కళ్ళున్న దీపపు కలశం నుండి కాంతులు బయటకు వెదజల్లినట్లుగా మన లోపలి కాంతి జ్ఞానేంద్రియాల ద్వారా గుర్తింప చేసేవాడు గురువు. మనలో వెలుగు పరమాత్మ.
నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తంజగత్
తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే॥
అని ఆదిశంకరులు స్తోత్రం చేసారు.
జీవిత సారం విజ్ఞాన దీపంలా ప్రకాశించాలి. భౌతికమైన దీపం మానసికమైన దీపం కావాలి. ఆ మానసిక దీపం ఆధ్యాత్మిక కాంతులు విరజిమ్మాలే గుండె గుడిలో వెలగాలి.
దీక్షలు – 4 రకాలు:
స్పర్శదీక్ష:
గురువుని తాకినంత మాత్రాననే శక్తి పొంది నిరంతర సాధనతో గురువుని మించిన శిష్యుడవుతాడు. కాశీలోని రామానందులకు పాదసేవ చేయడం ద్వారా కబీర్ రామ తారక మంత్ర దీక్ష పొందాడు. వివేకానందులకు రామకృష్ణులూ ఇలాగే దీక్ష నిచ్చినట్లు చెబుతారు.
ధ్యాన దీక్ష:
గురువు దూరంగా ఉంటునే ధ్యానం చేసి శిష్యడికి ఉద్ధరణ శక్తిని ప్రసాదిస్తాడు. 14వ శతాబ్దానికి చెందిన శృంగేరి జగద్గురువులు విద్యాతీర్థులు సమాధి తరువాత విద్యారణ్యులకు దర్శనమిచ్చినట్లు కథనం. సిద్ధప్పకు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కూడా ఇలాగే దీక్ష ఇచ్చారు.
దృగ్దీక్ష:
గురువు తన దృష్టి తోనే శిష్యునికి దీక్షనిస్తాడు. ఆదిగురువు దక్షిణామూర్తి మౌనంగా ఉంటునే సనక సనందాదులకు బోధ చేశాడు. భగవాన్ రమణులు కూడా ఇలాగే మౌనోపదేశం చేసేవారు.
మంత్ర దీక్ష:
శిష్యుడికి మంత్రోపదేశం చేసి ముక్తి మార్గం సందర్శనం చేయిస్తారు. జీవన్ముక్తికి, ఆత్మ సాక్షాత్కారానికి శిష్యులకు గురువులు మంత్ర దీక్షలు ఇస్తారు.
గుణనిధి కథ:
యజ్ఞదత్తుడి కుమారుడు గుణనిధి – తండ్రి వెళ్ళగొట్టగా శివాలయంలో తల దాచుకున్నాడు. భక్తులతో పాటు భజన, ఉపవాసాలు చేశాడు. గర్భగుడిలో ప్రసాదాలను దాచి వుంచగా వాటిని దొంగిలించడానికి మాసిన చొక్కా చింపి ఒత్తి చేసి దీపాన్ని వెలిగించాడు. ఆ పుణ్యం వల్ల మరుజన్మలో ‘అరిందముడు’ అనే పేరుతో కళింగ చక్రవర్తిగా జన్మించాడు. నిత్య దీపారాదనలు జరిగేలా శాసనం చేసాడు. 10 సంవత్సరాలు కాశీ నగరంలో తపస్సు చేశాడు. ఆ పుణ్యఫలంతో అతడే ‘కుబేరుడు’ అయ్యాడు. పార్వతీదేవి – దీపస్తంభంగా, శివుడు – ఒత్తిగా, అందులో పోసిన తైలం భక్తి, అలా అరిషడ్వర్గాలు ఆ సెగలో మాడిపోయాయి.
ముగింపు:
“నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం।
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరామ్॥”
(చీకటి = గు; శబ్దం అంధకారం; రు=తన్నివారణం. తొలగించునది – అనగా ప్రకాశం. అజ్ఞానం తొలగించి జ్ఞానమనే వెలుగు చూపించువారు)
“వట విటపి సమీపే భూమిభాగే నిషణ్ణం
సకలముని జనానాం ఙ్ఞానదాతారమారాత్।
త్రిభువన గురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి॥”
శ్రీ దక్షిణామూర్తి జ్ఞాన ప్రదాత, ఆదిగురువు, జగద్గురువు. అలాంటి వారందరికి నమస్కారం. విద్యార్థులు అందరు స్మరించుకోదగ్గ శ్లోకాలు.
(ఇంకా ఉంది)