[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]
అధ్యాయం-13: వివిధ రాగాలలో ‘గణపతి దేవ కృతులు’ – వాటి రాగ లక్షణాలు – మొదటి భాగం
[dropcap]వి[/dropcap]విధ రాగాలలో ‘గణపతి’ స్వామి గురించి శ్రీ ముత్తు స్వామి దీక్షితార్ రచనలు – విశ్లేషణ (త్యాగరాజ కృతుల ఉదాహరణతో).
గౌళ రాగం – 15 mela; తాళం – త్రిశ్ర త్రిపుట
ప॥ శ్రీ మహాగణపతి రవతు మాం సిద్ధి వినాయకో మాతంగ ముఖ
ఆరోహణ: స రి గ మ రి మ ప ని స
అవరోహణ: స ని ప మ గ మ రి స
రాగ-విశ్లేషణ:
ఈ కృతిలో విఘ్నేశ్వరుని సగుణమూర్తిని, ఆపాదమస్తకము ఫాద, కర, ముఖ, ఉదర, వస్త్ర, భూషణాయుధములు, మహిమతో ఇహ భోగము లొసగి చివరకు మోక్ష మొసగుతాడనీ ధ్యానించిరి. కానీ గౌళ, దేశ్యము ఒకానొక జాతి కఠినము, బిగ్గరమైనది. ఇది తెనుగు పదము. గాన రాగ నామంలో చేర్చలేదు.
~
హంసధ్వని – 29 Mela: తాళం – ఆది తాళం
ప॥ వాతాపి గణపతిం భజే హం వారణాస్యం వరప్రదం
ఆరోహణ: స రి గ ప ని స
అవరోహణ: స ని ప గ రి స
రాగ-విశ్లేషణ:
ఈ కృతిలో ఉచ్ఛ్వాసనిశ్వాస రూపమైన హంస నుండి ఉత్పన్నమైన నాద రూపుని, హంసధ్వని రాగంలో రచించుట, 5 ప్రాణములకు ఆధారమైన గణనాధుని 5 స్వరములు గల ఔడవ రాగములో వుండడం, అంతర గాంధార రూపునీ, వాతాపి గణపతిని అంతర గాంధార స్వరంలో ప్రారంభించడం, భూతాది సంసేవిత చరణం అన్ని, అ॥ ప ॥ పంచభూతములచే సేవించబడువాడనీ, పంచమ స్వరమున ప్రారంభించటం మొదలగు రహస్య విశేషములు వున్నాయి.
‘గ’ అను అక్షరము గతికి గమనమునకు సంకేతం. త్యాగయ్యగారు ‘ఆశుగ సంభవుడు’ అన్నారు. ఆశు – వేగముగా; గచ్చతేతి – నడచువాడు. ఆశుగతి = వాయు దేవుడు. ఆయన కుమారుడు ఆంజనేయుడు. గాన గం, గః, గత, గమనములు ఇవి అన్నియు సంకేతములు
~
ఆర్ద్ర దేశి రాగం 15 mela; తాళం – ఝంప
ఆరోహణ: స రి గ మ ప ద స ని స
అవరోహణ: స ద ప మ గ రి స
పల్లవి:
శ్రీ గణేశాత్ పరం చిత్త నహి రే రే
శివాది షట్-త్రింశత్-తత్వ స్వరూపిణః
అనుపల్లవి:
వాగాది పంచక వ్యాపార రహిత –
హృదయాకాశ సంస్థితాత్-యోగి రాజార్చితాత్
చరణం:
మాతంగ వదనాత్-ఉమా రుద్ర దర్శితాత్
భూత భౌతిక విశ్వ పూజిత కళేబరాత్
శ్వేతార్క సుమ ధరాత్ స్వేతర వివర్జితాత్
పీతాంబరావృతాత్ బ్రహ్మాద్యుపాసితాత్
(మధ్యమ కాల సాహిత్యమ్)
భూతాది నుత పదాంభోజాత్-శివాత్మజాత్
శీతాంశు ధర పరమ శివ గురు గుహాగ్రజాత్
అర్థం: మంగళప్రదుడైన గణపతి కంటే వేరైనది ఏది లేదు. ప్రపంచానికి ఆధారతత్వములు 36; 24 గుగా వర్ణించారు. చతుర్వింశతి, షట్-త్రింశతి తత్వములు. 36 తత్వవివరణ శివ, శక్తి సదాశివ, ఈశ్వర, శుద్దవిద్యా, మాయా, కళా, అవిద్య, రంగ కాల, నియతి, పురుష, ప్రకృతి, అహంకార, బుద్ది, మన, శ్రోత్ర, త్వక్, చక్షు, జిహ్వ, ఘ్రాణ, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థ, శబ్ద, స్పర్శ రూప, రస, గంధ, ఆకాశ, వాయు, అగ్ని, ఆపః, పృథివి; ఇవి శివాది షట్-త్రింశతి తత్వములు. ఈ 36 తత్వముల స్వరూపి కన్న వాగాది పంచక వ్యాఫారము లేకుండ – చర్మము, నేత్రములు, చెవులు, నాలుక, ముక్కు – ఇవి పని చేయకుండ ఆపినచో మనస్సు హృదయమందున్న మూర్తిపై నిలుస్తాయి. అటువంటి హృదయమందున వానికంటె, యోగమునందు సిద్ధి నందిన వారి చేత అర్చింపబడు వాని కంటే (సనక సనంద నాదులు) ఇంతవరకు నిర్గుణ తత్వరూపము. ఏనుగు ముఖము గల వాని కన్న, పార్వతీ పరమేశ్వరులచే చూడబడు వానికన్న పంచభూత మయమైన భౌతిక ప్రపంచంతో కూడిన ఈ విశ్వంలో పూజింపబడు సుగుణ రూపునికన్న, తెల్ల జిల్లేడు పూవును ధరించిన వాని కన్న స్వ, పర భేదము లేని వాడు, పసుపు పచ్చని వస్త్రము ధరించిన వాని కన్న, బ్రహ్మదులచేత ఉపాసించబడు వానికన్న భూతాదినుత పదాంభోజాత్ అంటే పంచభూతములు మరియం ‘ఏకోవిష్ణుః మహాద్భూతం’ అన్నారు కాబట్టి విష్ణ్వాదుల చేత కొనియాడబడిన పాదపద్మములు గల వాని కన్న, శివుని ఆత్మజుడు కుమారుని కన్న, చంద్రుని ధరించిన పరమశివుని కుమారుడైన గురుగుహునకు అగ్రజుడు, అన్న యైన గణపతి కన్న వేరు లేరు లేరని ఘంటాపథంగా, గణపత్యుపనిషత్తు, గణేశ తాపిన్యుపనిషత్తుల సారమంతయు ఈ కృతి యందు దీక్షితులు తెలియ చేసారు.
~
నట నారాయణి రాగం 28 Mela జన్య; తాళం – ఆది తాళం
ఆరోహణ: స రి మ ప ని ద ని స
అవరోహణ: స ని ద ప మ గ రి గ రి స
పల్లవి:
మహా గణ పతే పాలయాశు మాం
మాయా-మయ వల్లభా పతే శ్రీ
అనుపల్లవి:
మహా నట నారాయణీ నందన
మానిత దేవ దేవకీ నందన
మధ్యమ కాల సాహిత్యం:
మహేశ్వర గురు గుహ భక్త చందన
మాతంగ వదనేంద్రాది వందన
అర్థం: మహాగణపతి వేగమే పాలించు. లోకనాయక రంగమున, నటించు నారాయణుని సోదరి, నారాయణీ కుమార, పార్వతీ తనయం, దేవకీ నందనుచే పూజింపబడిన దేవ – అను సంబోధనలతో, రాగ నామముతో, చరణము లేకుండ పల్లవి, మధ్యమ కాల సాహిత్యంతో కూడిన రచన.
~
జంజుతి రాగం 28 Mela జన్య; తాళం – ఏకతాళం
ఆరోహణ: ద స రి గ మ ప ద ని (భాషాంగ రాగం)
అవరోహణ: ద ప మ గ రి స ని ద ప ద స
ప॥ గణేశ కుమార పాహిమాం గజముఖ
అర్థం: షోడశ గణపతులలో ‘కుమార గణపతి’ని వర్ణించారు.
~
వేగవాహిని రాగం 16 Mela జన్యం; తాళం – రూపక తాళం
ప॥ వినాయక విఘ్ననాశక మాం తారయ దయానిధే
అర్థం: రవి, శశి, వహ్ని నేత్ర, పవనాత్మజ, రామమిత్ర అను పదములు, వేగవాహినీ రాగము నామము కూర్పులు గమనించ దగినవి.
~
ఈశామనోహరి రాగం 28 Mela జన్యం; తాళం – రూపక తాళం
ప॥ శ్రీ గణనాథం భజరే చిత్త పరాశక్తి యుతం
సాదారణంగా వల్ల పల్లవి, అనుపల్లవి ఒక ప్రాస; చరణం వేరొక ప్రాసలో వుంటుంది. కానీ ఈ కృతి అంతా ఒకే ప్రాసలో వుంటుంది. చిత్తమునందు పరాశక్తిని కూడినవాడు, చిత్ ప్రకాశం, సహస్రార కమల మందుండు వాడని, ఈశ్వరుని మనసుకు ఆనందం కలిగించువాడు గాన ఈశమనోహర రాగంలో ఈ కృతి రచించారు.
~
కళ్యాణి రాగం 65 mela; తాళం – రూపక తాళం
ప॥ గణపతే మహామతే గౌరి కుమార మాం పాహి
అర్థం: గొప్ప మతి గల గణపతే, గౌరీ కుమార నన్ను రక్షించుము. విశేషణ పదములు, అణిమాది అష్టైశ్వర్యముల నొసగువాడు, గురుగుహునిచే పూజింపబడు వాడు; సూర్య, చంద్రాగ్నినేత్ర మొదలైన పదములతో రచించిరి. ఈ విధంగా దీక్షితులవారు గణపతి, మూల తత్వమును, నిర్గుణ, సగుణ, రూప, నామ, గుణ భేదములతో గాన, ఉపాసన, యోగ, మంత్ర, తంత్ర విషయములను, గాణాపత్య మత సంప్రదాయములను సవివరంగా గొప్పగా 26 కృతులలో వర్ణించిరి.
~
తోడి రాగం 8 mela; తాళం – రూపక తాళం
ప॥ మహాగణపతిం వందే మాధవాద్యమర బృందం
అర్థం: కపిల వర్ణము. త్రిపుర సంహార సమయమున త్రిమూర్తుల చేత అర్పించబడిన వాడు, దేవతా బృందముతో కూడిన మహాగణపతికి, నమస్కరించుచున్నాను. తోడి = తెనుగు పదం.. తెనుగువారి రాగం. తోడి, తోడు, సహాయం వెంట అని అర్థము గాన రాగనామము లేదు.
~
మోహన రాగం 28 Mela Janya; తాళం – ఆదితాళం
ప॥ రక్త గణపతిం భజేహం రత్న సింహాసన పతిం సురపతిం
అర్థం: సిందూర గణపతి అందురు. మోహనకరం అని రాగ నామమును కూర్చిరి. ఇందు ఫ్రభావం, విభావం, స్వభావం, వైభవం పదములు మనించవచ్చు.
~
ఆరభి రాగం 29 Mela Janya; తాళం – త్రిపుట
ఆరోహణ: స రి మ ప ద స
అవరోహణ: స ని ద ప మ గ రి స
ప॥ గణ రాజేన సంరక్షితోహం, మణిమండిత చారునిటలే, గుణిజన నుత పల్లవ పదేన
అర్థం: ప్రారంభ దశ లోని రచన – సామాన్య రచన. దైవ గుర్వనుగ్రహంచే రచించబడిన విశేష రచనగా చెప్పవచ్చు.
~
వరాళి రాగం; ఖండ చాపు తాళం.
ప॥ లంబోదరాయ నమస్తే
చరణం:
కుంభజ పూజితాయ ఇభ వదన వరదాయ
అర్థం: ఇది కూడా సామాన్య రచన – గణపతి విశేషణాలతో కూడినది.
~
మధ్యమావతి రాగం – ఆది తాళం
పల్లవి:
వినాయకుని వలెను బ్రోవవే, నిను
వినా వేల్పు లెవరమ్మ?
అనుపల్లవి:
అనాథరక్షకి శ్రీకామాక్షి సుజనాఘమో
చని శంకరి జనని
చరణము:
పురాన దయచే గిరాలు మాకుని
కి రాజేసి బ్రోచు రాజధరి త్యా
గరాజుని హృదయ సరోజ మేలే
మురారి సోదరి పరాశక్తి నను
అర్థం: కామాక్షి దేవి దయతో మూకునికి (మూగవానికి) మాటనిచ్చినది. చరణంలో వుంది. అలాగే పాడేటప్పుడు అనుపల్లవిలో ‘సుజనాఘ మోచని’ అనే చోట ‘సుజనా’ అనే దానిని ఆవృత్తం మొదటికి లాగి పాడటం పద్ధతి కాదు. ‘సరోజమేలే’ వద్ద కూడా ఏదో పాడతాం. అది కూడా సరియైన పద్ధతి కాదు.
పల్లవిలో వినా – వినా; అనుపల్లవిలో అనా – జనా, చరణంలో పురా, కిరా, గరా, మురా – అనే ప్రయోగాలు యమకం (శబ్దాలంకారం) లాటానుప్రాసం.
~
నాట రాగం – ఆది తాళం (పాపట్ల లక్ష్మీకాంతయ్య గారు)
పల్లవి:
ప్రణవ స్వరూపా పాలయమాం ప్రణతార్తి హర పరాత్పరా
అనుపల్లవి:
అణోరణీయాం మహతో మహీయ నిర్గుణానంద స్వరూపా పాపహర
ముక్తాయి
పనిపప – మగ – మపమమ – గమపనిపమ
పమగమా మమరి రిస సని సా
మరినిసాస – పమరి సాస – నిపపమ
గమపా నిపమగ – రిగమ పమారారి;
పసాసనిప – మమరిసా – మరిస – సరి
గమపదానిసని – పదానిసా;
రిగామ మరిస – నిసరిరిసని – పదనిస
సరినిస – నిస . దనిస . దని. గమపదని
చరణం:
సదానందమయ సచ్చిదాకారా
స్వయం ప్రకాశా చిద్విలాస॥
యాదాద్రి నిలయ ఆగమ వేద్య బు
దార్తి హర లక్ష్మీకాంత వినుత పద
ముక్తాయి స్వరం + ప్రణవస్వరూప పాలయాం
80 సంవత్సరాల వెనుక యాదగిరి సంస్థాన విద్యాంసులుగా, జంత్ర గాత్ర విద్వాంసులుగా ప్రసిద్ధి గాంచిన పాపట్ల లక్ష్మీకాంతయ్య గారి కృతి. నాట అని రాగం వున్నా చలనాటగా వుంచి చిట్ట స్వరంతో కూడిన రచన,
~
కనకాంగి రాగం; తాళం – ఆది తాళం (త్యాగయ్య రచన)
పల్లవి:
శ్రీ గణనాథం భజామ్యహం
శ్రీకరం చింతితార్థ ఫలదం
అనుపల్లవి:
శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం
శ్రీ కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం
చరణం:
రంజిత నాటక రంగ తోషణం
శింజిత వర మణి మయ భూషణం
ఆంజనేయావతారం సుభాషణం
కుంజర ముఖం త్యాగరాజ పోషణం
***
రాగాల లక్షణాలు – ప్రస్తావించిన కీర్తనలు
- గౌళ
- హంసధ్వని
- ఆర్ద్రదేశి
- నటనారాయణి
- జంఝాతి
- ఈశామనోహరి
- కళ్యాణి
- తోడి
- మోహన
- ఆరభి
- వరాళి
- మధ్యమావతి
- నాట
- కనకాంగి
***
1. గౌళ రాగ లక్షణాలు
ఆరోహణ: స రి గ మ రి మ ప ని స
అవరోహణ: సనిపమగమరిస – (సంగ్రహ చూడామణి గ్రంథము)
~
స్వర స్థానాలు:
స రి మ ప ని స
స ని ప మ రి గ మ రి స (15 mela Janya గా చెబుతారు. 72 Mela ప్రకారంగా వేంకటమఖి)
- షాడవ (రాగాధ్యయంలో)
- రిషభము గ్రహ, న్యాస, స్వరాలు, అంశ స్వరంగా) చెబుతున్నప్పుడు వేంకటమఖి ‘గౌళ’ రాగాన్ని పేర్కన్నాడు
- పంచరత్న కృతిలో ‘దుడుకుగల’ కీర్తన లోని ‘సకల భూతముల యందు’ అను చరణంలో, ‘మది లేక పోయిన’ అను చోట వచ్చును. (స రి గా మ రి రి స స – అన్న ప్రయోగం). కొందరు స రి మా మ రి రి స స – అని పాడుతారు.
- అలాగే దీక్షితుల కృతి – శ్రీ మహా గణపతిం – పాటలో ప మ, గ మ రి స – ప్రయోగాలు ఎక్కువగా వాడారు
- స రి గ మ రి స, ప మ గ మ రి స – ప్రయోగాలకి చక్కని అవకాశం వుందని చెప్పచ్చు.
- దీర్ఘ గాంధారం చాలా అరుదు.
- త్యాగయ్యగారు కూడా (స రి గా మరి రిస) చెప్పలేకపోయిన అన్న ప్రయోగంతో ఒక్కసారి వాడారు.
- వక్రరాగం. ఏక స్వర ప్రయోగ సంచారములతో ప్రవేశించు రాగం.
- రి రి మ మ ప ప ని ని – మ మ ప ప ని ని – స స – జంట ప్రయోగాలు
- రిమమ పనినిస – సని నిపపమ- నిప పమ మరి – ప్రత్యాహత ప్రయోగాలు రంజకాలు
- విషభము, షడ్జమముతో జేరి పలికితే ‘ఏకశృతి’ రిషభ పరిమాణం: షడ్జ వర్జ్య ప్రయోగాలలో అది ‘ద్విశృతి రిషభమే’.
- రి, మని – రాగాచ్ఛాయా స్వరములు.
- గాంధారాన్ని జంట, ఆహత, ప్రత్యాహత ప్రయోగాలలో, న్యాసము పాడుటకు అవకాశం లేదు.
- గాంధారము దుర్బల స్వరము.
- పంచమము ఒకటే ప్రధాన న్యాస స్వరం (Resting note)
- పాండిత్య రాగం. ఉత్తమ తెగకు సంబంధం (రామామాత్యుని ప్రకారం)
- మధ్యమ కాల ప్రధానరాంగం – త్రిస్థాయి.
- మంద్రస్థాయి రిషభము నుండి తారస్థాయి మధ్యమము వరకు వ్యాపించి వుంటుంది.
- ఈ రాగం శుభకర రాగం; సార్వకాలిక రాగం. గానరస ప్రధాన రాగం.
- గానరసమే సంగీతానంద రసం ..
- నవ రసములకు చెందినది కాదు.
- సంగీతజ్ఞుల కల్పనయే.
- ఈ రాగంలో వాగ్గేయకారులు చాలా రచనలు చేసారు.
***
2. హంసధ్వని రాగ లక్షణాలు
ఆరోహణ: స రి గ ప ని స
అవరోహణ: స ని ప గ రి స
- కర్ణాటక, హిందుస్థానీ సంగీతంలో ప్రసిద్ధ రాగం
- ఔడవ రాగం.. 29 ధీర శంకరాభరణంలో జన్య
- రామస్వామి దీక్షితార్ – ముత్తుస్వామి దీక్షితార్ తండ్రిగారు కనిపెట్టినట్లు చెబుతారు.
- చతుశ్రుతి రిషభము, అంతర గాంధారం, పంచమము, కాకలి నిషాదం స్వరస్థానాలు.
- మ, ద – వర్జ్య స్వరాలు
- జంట ప్రయోగాలు, దాటు వరుస ప్రయోగాలు (గగపపనినిపప) (నిగరిగసరి) మరిసరిసనిప
- కచేరీలలో మొట్టమొదట ఈ రాగంతో రచనలు పాడుతారు.
- ఆలాపనకి, స్వర ప్రస్తారానికి మంచి అవకాశం వున్న రాగం.
***
3. ఆర్ద్ర దేశి రాగ లక్షణాలు
ఆరోహణ: స రి గ ప ద స ని స
అవరోహణ: స ద ప మ గ రి స
- వక్ర, సంఫూర్ణ, షాడ రాగం
- 15 మాయామాళవ గౌళ Mela లో జన్యం
- అవరోహణలో ‘ని’ వర్జ్యం.
- స్వరస్థానాలు – షడ్జ/శుద్ధ రిషభము, అంతర గాంధారం, శుద్ధ మద్యమం, పంచమం, శుద్ధ దైవతం, కాకలి నిషాదం
- సర్వకాలిక రాగం ఉపాంగం
- గగగరిస, దదసనిస – చక్కటి ప్రయాగాలు
- ‘ఆర్ద్ర దేశిక’ అని కూడా అంటారు
- Minor popular raga – ఒక్క రచన వుంది. ‘శ్రీ గణేశాత్ పరం చిత్త న హి రే రే’ – ఝుంప తాళం దీక్షితార్ రచన.
(ఇంకా ఉంది)