Site icon Sanchika

భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-2

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-2: అనుభవకవి – కంచెర్ల గోపన్న

[dropcap]భా[/dropcap]రతీయ కవిత్వమును డాక్టర్ బాడాల రామకవి గారు 1) ఆశ్రమ కవిత 2) ఆశ్రయ కవిత 3) అనుభవ కవిత అనీ 3 తీరులుగా చెప్పారు.

తాను నవ్మిన దైవమును తప్ప రాజులను కీర్తించలేనని ధిక్కరించిన అన్నమయ్య కారాగారవాసం అనుభవించాడు. రాజ ద్రవ్యమును దేవాలయాల నిర్మాణానికి, దీవునికి అంగరంగ వైభవాలతో కైంకర్యం చేసిన రామదాసు కారాగారవాసం అనుభవించాడు. అలాగే రాజాశ్రయం కోసం ఉబలాటపడిన త్యాగయ్య అన్నగారు, త్యాగయ్య నిరాకరించడం ఆయన కోపానికి గురి అయ్యడు. ఈ రకంగా రాజు కొలువును ఆశ్రయించినవారు, ఆశ్రయించనివారు అతి, మిత, సమయాన, అవసర వాదులు ఉన్నారు. దీని కనుగుణంగా ఫలం, ప్రతిఫలం అనుభవిస్తునే ఉన్నారు.

అట్టి అనుభవ కవిత వ్రాసిన వారిలో కంచెర్ల గోపన్న అనే భద్రాచల రామదాసు ఒకడు. 17వ శతాబ్దం మధ్య భాగంలో ఉన్నవాడు.

మన జానపదులలో బాగా ఆదరాభిమానాలు చూరగొన్న భక్తి సాహిత్యం సంకీర్తన వాఙ్మయంకు పోటీగానే వుంది. తూము నరసింహ దాసు, పరాంకుశదాసు, నిట్టల ప్రకాశదాసు, రాకమచెర్ల వెంకటదాసు, తాడంకి వేంకటదాసు, ఎడ్ల రామదాసు, పోతులూరి వీరబ్రహ్మం, దూదేకుల సిద్దయ్య వంటి వారు కీర్తనలు పాడుతూ జీవనం సాగించేవారు.

వీరు వ్రాసిన పాటల పుస్తకాలు కూడా అసంఖ్యాకంగా అచ్చయినవి.

యిలా చూస్తే ప్రచురించని రచనలు చాలా వున్నాయి. సేకరించినవి తక్కువే అయినా లక్షోపలక్షలు మౌఖిక ప్రచారంలో ఉన్నవి అనంతాలు అని చెప్పవచ్చు.

~

ఈ భక్తి సాహిత్యంతో రామదాసు ఒకరు. పండితుల చేత భక్తుడనీ, ప్రజల చేత మహానుభావుడనీ, పామరుల చేత దేవుడనీ, అన్ని వర్గాల వారి చేత ఆదరించబడ్డాడు భద్రాచల రామదాసు. ఆయన జీవిత చరిత్ర రచనల ద్వారా తల్లిదండ్రులు, గురువుల పేర్ల వంటి స్వల్ప ఆధారాలు తప్ప చారిత్రక ఆధారాలు, ఖచ్చితమైన శాసనాలు లభించలేదు. సాహిత్యులకు మాత్రం దాసరథి శతకాన్ని అనుసరించి కంచెర్ల గోపన్న ఆత్రేయస గోత్రజుడు, నియోగి యైన లింగన మూర్తికి పుత్రుడు, రఘునాధ భట్టాచార్యులకు శిష్యుడు. కీర్తనలను అనుసరించి ఆయన తల్లి పేరు కామమ్మ, జన్మస్థలం నేలకొండపల్లి.

రామదాసు రచనలు:

కాల గర్భంలో కలిసిపోయినవి పోగా, లభ్యమైన రచనలు

సంక్షిప్త వివరణ:

దాశరథి శతకంలో గోపన్న గారి ఆర్తి, శరణాగతి, దాసభక్తి కనిపిస్తుంది. ఆయన అనుభూతి అంతా అక్షర రూపం దాల్చింది. అది ధారాశుద్ధినీ, శబ్దాలంకార ప్రియత్వమును, లోకోక్తి చమత్కృతినీ పాటించి పండితుల మెప్పు పొందింది.

ఉదాహరణకి ఈ ఉత్పలమాల చూడండి:

ముప్పున కాలకింకరులు ముంగిటవచ్చిన వేళ, రోగముల్
గొప్పరమైనచో గఫము కుత్తుక నిండినవేళ, బాంధవుల్
గప్పినవేళ, మీస్మరణ గల్గునొ గల్గదొ నాటి కిప్పుడే
తప్పకచేతు మీభజన దాశరథీ కరుణాపయోనిధీ

~

ఇదే భావం కులశేఖరాళ్వారుల ముకుందమాలలోని

“కృష్ణ! త్వదీయ పదపంకజ పంజరాంతం
అద్యైనమే విశతు మానస రాజహంసః
ప్రాణ ప్రయాణ సమయే కఫ వాత పిత్తైః
కంఠావరోధన విధౌ స్మరణం కుతస్తే”

 అనే శ్లోకం లోని భావాన్ని గుర్తుచేస్తుంది.

~

శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా
చార జవంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠ ము
న్నారయభద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో
ద్ధారకుడైన విష్ణుడవు దాశరథీ కరుణాపయోనిధీ

అనే ఉత్పలమాల పద్యం సీతారాములకు లక్ష్మీనారాయణులకు అభేదం తెలుపుతూ గోరన్న విష్ణుభక్తి పారవశ్యాన్ని చెబుతుంది. అలాగే చాలా పద్యాలు.

ఇలా చాలా పద్యాలు ప్రాచుర్యంలో వున్నవి.

రామదాసుగారు రచించిన చూర్ణికకు ‘చతుర్వింశతి నామ ప్రతిపాదక చూర్ణిక’ అని పేరు. మహా విష్ణువుకున్న కేశవాది చతుర్వింశతి నామాలను శ్రీరామచంద్రుని పరంగా చెప్పుతూ రామాయణం సంగ్రహంగా వర్ణించటం చేత దానికి ఆ పేరు వచ్చింది.

“శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండ భాండ
దాండోపదండ మండల సాందోత్దీపిత సగుణ నిర్గుణాతీత
సచ్చిదానంద పరాత్పర తారక బ్రహ్మాఖ్య దశదిశా
ప్రకాశం, సకల చరాచరాధీశం కమల సంభవ
సచీధవ ప్రముఖ నిఖిల వృందారక వృంద వంద్యమాన
సందీప్త దివ్యచరణారవిందం, శ్రీ ముకున్దమ్।
తుష్ట నిగ్రహ శిష్ట పరిపాలనోత్కట కపట నాటక సూత్ర
చరిత్రాతి చిత్ర బహువిధావతారం, శ్రీ రఘువీరమ్।
కౌసల్యా దశరథ మనోరథానంద కందళిత
నిరూఢ క్రీడా విలోలన శైశవం శ్రీ కేశవమ్।
విశ్వామిత్ర యజ్ఞ విఘ్న కారణోత్కట తాటకాచర సుబాహుబాహుబల
విదలన బాణప్రవీణ పారాయణం శ్రీమన్నారాయణమ్।
నిజపాద జలజ ఘనస్పర్శనీయ శిలారూప శాప
వికృత గౌతమ సతీ వినుత మహీధవం, శ్రీ మాధవమ్।”

అంటూ ప్రారంభమై –

“అయోధ్యా నగర పట్టాభిషేక విశేష మహోత్సవ
నిరంతర దిగంత విశ్రాంత హారహీర కర్పూర పయః
పారావార భారత వాణీ కుందేందు మందాకినీ
చందన సురదేను శరదంబు తాలీవర ధంపోలి శత
దానాశ్వ శుభకీర్తిఃశ్ షడాక్షర పాండు భూత సభా
విభ్రాజమాన నిఖిల భువనైక యశః సాంద్రం శ్రీ ఉపేన్ద్రమ్।
భక్తజన సంరక్షణ దీక్షా కటాక్ష శోభాద్య సముత్తరిం శ్రీ హరిమ్।
కేశవాది చతుర్వింశతి నామ గర్భ
సందర్పిత నిజ గథార్గీకృత మేధా వర్తిష్ణుం శ్రీ కృష్ణమ్।
సర్వ సుపర్వ పార్వతీ హృదయ కమల తారక బ్రహ్మనామం
సంపూర్ణకామం పవతరణాను కన సాంద్రం
భవజనిత భయోఃఛేదః ఛిద్రమఛిద్రం భక్తజన మనోరథోన్నిద్రం,
భద్రాచల రామభద్రం రామదాస ప్రసన్నం భజేహం భజేహం।”

అంటూ ముగిసే –

ఈ దీర్ఘ సమాస భూయిష్ట రచనని భద్రాచల దేవాలయంలో ఏకాంత సేవ సందర్భంగా మాత్రం చదువుతారు. దీని ద్వారా రామదాసు పాండిత్యం తెలుస్తుంది.

కీర్తనలు:

ఆయన కీర్తనలు ఆర్తినీ, సుఖదుఃఖాలను, భక్తి భావాలని ప్రస్ఫుటం చేస్తాయి.

రామదాసు కీర్తి త్యాగరాయల వారికి పూర్వమే దక్షిణాదిన వ్యాపించింది అనడానికి స్వయంగా త్యాగరాయల వారే సాక్ష్యం. త్యాగయ్య గారు ఆయన కీర్తనలలో చాలా చోట్ల రామదాసు గారిని స్మరించారు.

ఉదాహరణ 1: కీరవాణి రాగం – ఆది తాళం

“కలిగియుంటే గదా కల్గును కామితఫలదాయక” అనే కీర్తనలో – చరణంలో –

‘భాగవతాగ్రేసరులగు నారద

ప్రహ్లాద పరాశర రామదాసులు

బాగుగ శ్రీరఘురాముని పదముల

భక్తిఁ జేసినరీతి త్యాగరాజుని కిపుడు’ – అని

ఉదాహరణ 2: శంకరంభరణం – చాపు తాళం

“బుద్ధిరాదు బుద్ధిరాదు పెద్దల సుద్దులు వినక” అనే కీర్తనలో చివరి చరణంలో

‘యోగము లభ్యసించిన భోగములెంతో కల్గిన

త్యాగరాజనుతుఁడౌ రామ దాసుల చెలిమి సేయక’ – అని

ఉదాహరణ 3: జీవగాంధారి రాగం ఆది తాళం

“క్షీరసాగరశయన నన్ను చింతలఁ బెట్టవలెనా రామ” అనే కీర్తనలో చరణంలో

‘నారీమణికిఁ జీరలిచ్చినది నాఁడే నే విన్నానురా

ధీరుఁడౌ రామదాసుని బంధము – దీర్చినది విన్నానురా

నీరజాక్షికై నీరధి దాటిన – నీ కీర్తిని విన్నానురా

తారకనామ త్యాగరాజనుత – దయతో నేలుకోరా రామా’ – అని

ఉదాహరణ 4: సారంగ రాగం ఆది తాళం

“ఏమి దోవ? పల్కుమా! యికను నే నెందు పోదు? శ్రీరామ!” అనే కీర్తనలో – అనుపల్లవిలో

‘రామదాసు వలెనైతే సీతా

భామ మందలించును తన – కే  గతీ’ – అని

అలాగే ఇంకా తాను రచించిన ‘ప్రహ్లాద భక్తవిజయమ’నే యక్షగానం ప్రారంభంలో మొదటి పద్యంలో ‘శ్రీరామ చంద్రుని’, రెండవ పద్యంలో ‘విశ్వక్సేనుని’, మూడవ పద్యంలో ‘వాణి’ని, నాల్గవ పద్యంలో ‘నారదుని’, ఐదవ పద్యంతో ‘తులసీదాసు’ను, ఆరవ పద్యంలో ‘పురందరదాసు’ని, ఏడవ పద్యంలో ‘భద్రాచల రామదాసు’ని స్తుతించారు.

మంచాల జగన్నాధరావు గారు స్వరాలు కూర్చిన రామదాసు కీర్తనలు 137 లో – 16 సంస్కృతం; 12 – తెలుగులో ఉన్నవి. ( 75 సంస్కృత కీర్తనలలో 8 శ్రీరామపరంగా, 4 గోపాల పరంగా, 2 ఆంజనేయపరంగా, ఒకటి శివ పరంగా ఉన్నాయి.)

రామరాసు కీర్తనల సాహిత్యం:

కబీరుదాసు తారక మంత్రోపదేశం చేసినటు చెబుతారు. కానీ కబీరుదాసు రామదాసు కంటే చాలా పూర్వుడు. మరెవరో యోగియో (లేక) రఘునాధ భట్టాచార్యులు అయిఉండవచ్చు.

  1. ప॥ తారక మంత్రము కోరిన దొరికిను (ధన్యాసి రాగం – అది తాళం). భక్తియే మోక్షసాధనం – ప్రేమ రూపమైన భక్తి ముక్తి రూపమైన బ్రహ్మానందమే అని; అలాగే మతానికి సంబందించిన బాహ్య శుచినీ, నిష్ఠను, అడంబరమును, నిరాకరించే భావాలు కనబడతాయి.
  2. ప॥ శ్రీరాముల దివ్యనామస్మరణ చేయుచున్న (సావేరిరాగం – ఏక తాళం). ఈ కీర్తనలోని భావాలు మానవతావాదులమని చెప్పుకునే వారికి మతం అంటే ఇష్టం లేని వారికి నచ్చవచ్చు
  3. ప॥ ఆశపుట్టె శ్రీరాములతో ఆహా నే పుట్టనైతి (ఆనందభైరవి – ఏక తాళం). శ్రీరామచంద్రుని కాలంలో పుట్టకపోతిని గదా అని రామదాసు పరితపించిన గేయం కోమలకర భావానికి ఉదాహరణ. దీని ముద్రాంకిత చరణంలో లుప్తమైనట్లు తెలుస్తుంది.
  4. ప॥ శ్రీరామ నామం మరువాం మరువాం (నాదనామక్రియ – చాపు తాళం). దీనిలో నవవిధ భక్తులున్నాయి.
  5. ప॥ కోదండరామ కోదండరామ కోదండరామ కోట్యర్కధామ (నాదనామక్రియ – ఏక తాళం). ఇది 25 చరణాలు గల దీర్ఘ గేయం. రామదాసుగారి కొడుకు రఘురాముడనే బాలుడు స్పృహ తప్పినాడే కాని మరణించలేదు.
  6. ప॥ తక్కువేమి మనకు రాముండొక్కడుండువరకు (సౌరాష్ట్ర – ఆది తాళం). ఇది దశావతారాల స్తోత్రం చేసే కీర్తన.

దీనికీ – నారద భక్తి సూత్రాలలో

‘యత్ ప్రాప్య న కించిద్వాంఛతి న శోచతి న ద్వేష్టి న రమతే నోత్సాహీ భవతి’ (5) –

అలాగే

‘ఏతీరుగ నను దయజూచెదవో యినవంశోత్తమరామా’ (నాదనామక్రియ – ఆది తాళం); ‘ఏమిర రామ నావల్ల నేర మేమిరా రామ’ (నాదనామక్రియ – ఆది తాళం); ‘సీతారామస్వామి నే జేసిన నేరంబేమి’ (సావేరి – ఆది తాళం); ‘పలుకే బంగారమాయెనా కోదండపాణి’ (ఆనందభైరవి – రూపక తాళం); ‘చరణములే నమ్మితి నీదివ్యచరణములే నమ్మితి’ (కాపీ – ఆది తాళం); ‘గరుడగమన రారా నను నీ కరుణనేలుకోరా’ (యమునాకల్యాణి – ఆది తాళం); ‘ఇన్నికల్గి మీరూరకున్న నేనెవరివాడనౌదు రామ’ (కల్యాణి – ఆది తాళం) మొదలైన కీర్తనలలో నారద భక్తి సూత్రాలలోని ‘యద్ జ్ఞాత్వామత్తో భవతి స్తబ్ధో భవతి ఆత్మారామో భవతి’ (6) అనే సూత్రానికి లక్ష్య లక్షణ సమన్వయం కుదురుతున్నది.

విషయ వివేచన దృష్ట్యా రామదాసుగారి కీర్తనలను ఈ క్రింది విధంగా విభజించవచ్చు:

1) నామ గుణ కీర్తనలు 2) ఆత్మ నివేదకములు 3) తాత్త్వికము

1) నామ గుణ కీర్తనలు:

నామ గుణ కీర్తనలు అంటే భగన్నామములను భగవద్గుణ ను సంధానమును అవతార లీలలను నోరారా కీర్తించేవి. ఇందులో చాలా భాగం నామగుణ కీర్తనమే కనుక భావాంశం అనగా కవిత్వాంశం కొంచెం తక్కువగా ఉంటుంది. అయినా భక్తులకు ఇవి ప్రీతిపాత్రములే.

ఉదాహరణలు:

2) ఆత్మ నివేదకములు:

ఇవి భక్తి జ్ఞాన వైరాగ్య భావములకు ఆర్తికీ ఆలవాలములు. రామదాసుగారి సుఖదుఃఖాలు, తనను భగవంతుడు రక్షించలేదనే బాధ కోపం, విసుగు ఉపాలంభనం మొదలగు భావాలతో కూడిన ఈ కీర్తనలలో కవిత్వం పాలు హెచ్చు.

ఉదాహరణలు:

3. తాత్విక కీర్తనలు:

వీటిలో కవిత్వం పాలు చాలా తక్కువ. ఇవి లోక తత్వమునో, వేదంతమునో, సామాజిక వాస్తవమునో, మార్మికతనో, తిరుగుబాటునో ప్రబోధించే కీర్తనలు.

ఉదాహరణలు:

~

కాలక్రమమును అనుసరించి కూడా రామదాసు గారి కీర్తనలను 1) తొలి కీర్తనలనీ (ఎక్కువగా నామగుణములును చాటే కీర్తనలు) 2) బందికానా కీర్తనలనీ (ఉద్రేకాన్ని చాటే కీర్తనలు) 3) మలి కీర్తనలనీ (కారాగార విముక్తులై భద్రాచలంలో చరమ జీతం గడుపుతూ పాడుకొన్నవి) అని విభజించవచ్చు.

నిర్వాత దీపం వలె, నిస్తరంగా, సముద్రం లాగా రామదాసు భక్తి పరిపక్వతను చాటే కీర్తనలు ఇవి.

ఒక్క ముక్కలో కీర్తనల ప్రాశస్త్యం చెప్పుకోవాలంటే పద్య కృతుల్లో పోతన గారి భాగవతం ఎటువంటిదో రామదాసు కీర్తనలు అటువంటివి. పోతన్నగారిది అద్వైత రామ భక్తి, రామదాసుగారిది విశిష్టాద్వైత రామ భక్తి.

(తెలుగులో తొలి సమాస కవులు అన్న పుస్తకం ఈ రచనకి ఆధారం).

(ఇంకా ఉంది)

Exit mobile version