Site icon Sanchika

భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-20

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-19: కొన్ని రాగాలు – లక్షణాలు – కీర్తనల ఉదాహరణలు – 3వ భాగం

5. కాంభోజి:

ఇది 28వ మేళకర్త యైన ‘హరికాంభోజి’లో జన్యం. షాడవ సంపూర్ణ, భాషాంగ రాగము.

ఆరోహణం: స రి గ మ ప ద స

అవరోహణం: స ని ద ప మ గ రి స

కా॥నిషాదము. అన్య స్వరము ‘స ని ప ద స’ అను ప్రయోగంలో కా॥ని॥ అన్య స్వరము. కాంభోజి సుప్రసిద్ద కర్ణాటక రాగములలో ఒకటి. మిగుల గంభీరమైన రక్తి రాగము. మిక్కివ ప్రచారము గల రాగము. త్రిస్థాయి రాగము. అందరికి తెలిసిన గల రాగము. విస్తరించి ఆలాపన చేయుటకు తగిన రాగము. ఆరోహణలో నిషాదము లేదు. ఈ రాగంలో అనేక రచనలు కలవు. పూర్వము ఈ రాగమును ‘కాంబోడి’ అని పిలిచేవారు. ఈ రాగములో దాదాపు అన్నియు రాగచ్చాయా స్వరములే. గ్రహములుగా స, ప, ద, ని లు; న్యాస స్వరములుగా స గ మ ప ద, రంజకముగా వుండును, మ గ ప ద స, ప ద మా మ గ గా స ని ప ద స etc, కొన్ని రంజక ప్రయోగములు.

తమిళ సంగీతములో ఆధార స్వరసప్తకముగా ‘హరికాంభోజి’ నియమింపబడినది. దీనిని ‘శంబా’ అని చెప్పిరి. ఒక జనక రాగము కన్నా, దాని జన్యరాగములే ప్రఖ్యాతి గాంచిన రాగములు వున్నవనుటకు కాంభోజి, శ్రీ, మద్యమావతి, ముఖారి మొదలగునవి ఉదాహరణముగా చెప్పవచ్చు.

సంగీత మకరందము, సంగీత సమయ సారము, సంగీత రత్నాకరం, స్వర మేళ కళానిధి, రాగ విబోధము, చతుర్దండి ప్రకాశిక, సంగీత సారామృతం మున్నగు గ్రంథములలో కాంభోజి రాగము మేళముగా ప్రముఖ స్థానం అలంకరించినది.

72 మేళములను ప్రస్తరించిన వేంకటమఖి, కాంభోజిని 28వ మేళమునకు నిదర్శనముగా చెప్పెను. 72 మేళములకు క్రమముగా నామకరణం చేయబడినపుడు కూడా 28వ మేళము కేదారగౌళయై కాంభోజి దాని జన్యముగా చెప్పబడినది. భాషాంగ రాగము మేళముగా చెప్పుట సమంజసం కాదు. అందుకనే 28వ మేళము కేదారగౌళగా చెప్పబడి కటపయాది కొరకు, ‘హరికేదారగౌళ’ అని చెప్పబడినది. కాంభోజి దాని జన్యమైనది. క్రమ, సంపూర్ణ మేళ పట్టిక అగు కనకాంగి-రత్నాంగి పట్టికలో 28వ మేళము ‘హరికాంభోజి’ అని, కాంభోజి దాని జన్యముగా చెప్పబడినది.

కాంభోజి లోని నిషాదము గురించి రామామాత్యులు, వేంకటమఖి మధ్య భేదాభిప్రాయములు కలవు.

రామామాత్యులు కాంభోజి రాగమునకు కా॥ ని॥ అనగా, వేంకటమఖి కాంభోజి రాగమునకు కా+ కై॥ ని॥ అనిరి. తర్జన భర్జనలు, భేదాభిప్రాయములు కలవు.

కాంభోజి రాగములో తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలు ఎన్నియో కలవు. పురందర దాస, రామదాస, క్షేత్రజ్ఞులు, త్రిమూర్తులకు పూర్వమున్న వాగ్గేయకారులు కూడా ‘కాంభోజి’ని వాడిరి.

కాంభోజి ఏకాన్య స్వర భాషాంగ రాగము.

కా॥ని॥ అంత అవకాశం లేదని ఈ క్రింద రచనల బట్టి తెలియును.

ఉదాహరణ:

  1. ‘మరి మరి నిన్నే’ కీర్తనలో ‘మనసున’ అను చోట
  2. దీక్షితుల ‘కాశీ విశ్వేశ్వర’ అనే కృతి యొక్క పల్లవి చివర

కాంభోజి నయ రాగం, శుద్ధ రాగం, ఉత్తమ రాగం. బహురస ప్రధాన రాగం., సార్వకాలిక రాగం, ఘన రాగం. వివిధ కాల ప్రమాణములలో పాడదగిన రాగము. తిల్లాన రచన తప్ప మిగిలిన సంగీత రచనలన్నీఈ రాగములలో ప్రచారంలో వున్నవి.

కొన్ని ముఖ్య రచనలు:

  1. ఇంత చలము – ఆట – తాళవర్ణం – పల్లవి గోపాలయ్యర్
  2. తరుణి నిన్ను – ఆది – ఫిడేలు పొన్నుస్వామి
  3. ఎవరి మాట – ఆది – త్యాగరాజు
  4. మరి మరి నిన్నే – ఆది – త్యాగరాజు
  5. ఓ రంగశాయి – ఆది – త్యాగరాజు
  6. మా జానకి – ఆది – త్యాగరాజు
  7. శ్రీ సుబ్రహ్మణ్యాయ – రూపక – దీక్షితులు
  8. కైలాసనాధీన – రూపక – దీక్షితులు
  9. కమలాంబికాయ (నవా వర్ణ కీర్తన) – రూపక – దీక్షితులు
  10. కొనియాడిన నా పై – ఆది – వీణ కుప్పయ్యర్

~

శ్రీ సుబ్రహ్మణాయ – సాహిత్యం

పల్లవి:

శ్రీ సుబ్రహ్మణ్యాయ నమస్తే నమస్తే

మనసిజ కోటి కోటి లావణ్యాయ దీన శరణ్యాయ

అనుపల్లవి:

భూసురాది సమస్త జన పూజితాబ్జ చరణాయ

వాసుకి తక్షకాది సర్ప స్వరూప ధరణాయ

వాసవాది సకల దేవ వందితాయ వరేణ్యాయ

దాస జనాభీష్ట ప్రద దక్షతరాగ్రగణ్యాయ

చరణం:

తారక సింహ ముఖ శూర పద్మాసుర సంహర్త్రే

తాపత్రయ హరణ నిపుణ తత్వోపదేశ కర్త్రే

ధీర నుత గురు గుహాయ అజ్ఞాన ధ్వాంత సవిత్రే

విజయ వల్లీ భర్త్రే శక్త్యాయుధ ధర్త్రే

(మధ్యమ కాల సాహిత్యం)

ధీరాయ నత విధాత్రే దేవ రాజ జామాత్రే

భూతాది భువన భోక్త్రే భోగ మోక్ష ప్రదాత్రే

~

పల్లవి అర్ధం:

శ్రీ సుబ్రహ్మణ్యాయ = శ్రీ శ్రీ సుబ్రహ్మణ్యమునకు

నమః తే = నమస్కారము నీకు

నమః తే = నమస్కారము నీకు

మనసిజ = మన్మథుడు

కోటి కోటి = కోటానుకోట్లుగా

లావణ్యాయ= అందము కలవానికి

దీన శరణ్యాయ = దీనులకు శరణము అయినవానికి

అనుపల్లవి (అర్థం):

భూసుర = బ్రాహ్మణులు;

ఆది = మొదలైన;

సమస్తజన = అందరి జనుల చేత

పూజిత = పూజింపబడిన

అబ్జ = కమలము వంటి

చరణాయ = పాదములు కల వానికి

వాసుకి= వాసుకి అను సర్పము

తక్షక = తక్షకుడు

ఆది = మొదలైన

సర్ప స్వరూప = పాముల యొక్క స్వరూపము

ధరణాయ = ధరించువానికి

వాసవాది = వాసుదేవ మొదలైన

సకల దేవ = అందరు దేవతల చేత

వందిత = నమస్కరించబడిన

అబ్జ = కమలము వంటి

వరేణ్యాయ = శ్రేష్ఠమైన

దాసజన = దాసుల యొక్క సమూహముల

అభీష్ట = కోరికలను

ప్రద = ఇచ్చునటువంటి

దక్షక = దక్షత కలుగుటలో

ఆతుర = కుతూహలము

అగ్రగణ్యాయ = శ్రేష్ఠుడు

చరణం అర్థం:

తారక సింహముఖ = తారకుడు, సింహముఖుడు

సూర = మొదలైన సూరులను

పద్మాసుర = పద్మాసురుని

సంహార = చంపిన వానిని

తాపత్రయ = ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములను మూడు తాపములను

హరణ నిపుణ = నశింప చేయుటలో నేర్పు కలిగిన

తత్వ = పరమసత్యమగు

ఉపదేశ కర్త్రే = ఉపదేశము చేయువానికి

ధీరనుత = ధీరుల చేత పొగడబడిన

గురుగుహాయ = గురువైన సుబ్రహ్మణేశ్వరుని

అజ్ఞానాధ్వాంత = అజ్ఞానమను చీకటికి

సవిత్రే = సూర్యని వంటి వానికి

విజయ వల్లీ భర్త్రే = విజయ వల్లీ యొక్క భర్తకు

శక్త్యాయుధ ధర్త్రే = శక్తి అను ఆయుధమును ధరించు వానికి

ధీరాయ =ధీరునకు

నతః= నమస్కరించు వానికి

విధాత్రే = శుభములు ఇచ్చు వానికి

దేవరాజ = ఇంద్రునకు

జామాత్రే = అల్లుడైన వానికి

భూరాది = భూమి మొదలైన

భువన భోక్త్రే = లోకములు అనుభవించు

భోగ మోక్ష ప్రదాత్రే = భోగములు, మోక్షములు ఇచ్చువానికి

~

కైలాసనాథేనా – సాహిత్యం:

ఫల్లవి:

కైలాస నాథేన సంరక్షితోహం

కైవల్య ప్రద నిపుణతరేణ శ్రీ

అనుపల్లవి:

కైలాస గిరి విహారేణ శైల రాజాత్మజా మోహాకారేణ

చరణం:

సద్గతిదాయక అంభోజ చరణేన

చారు శరశ్చంద్ర కళాధరణేన

(మధ్యమకాల సాహిత్యం)

సద్గురు గుహ సన్నుత పదేన

సత్య జ్ఞానానందేన సనకాది సంశయ హరణేన

చిదానంద హృదయ స్థితేన

6. కల్యాణి:

ఆదిమ మానవుడికి తెలిసిన ప్రథమ ప్రతిమధ్య రాగం కల్యాణి. మధ్యమ గ్రామము యొక్క గాంధార మూర్ఛన, శంకరాభరణము యొక్క ప్రతి మధ్యమ మేళము. 72 మేళములలో ఏదేని ఒక శుద్ధ మధ్యమ మేళములలో మధ్యమమును గ్రహ భేదం చేసిన యెడల దాని యొక్క ప్రతి మధ్యమ మేళమే లభంచుటకు ధీరశంకరాభరణం మేళ మొక్కటే నిదర్శనము.

శంకరాభరణం యొక్క మధ్యమ మూర్ఛన మేచకల్యాణి అగును. హిందుస్థానిలో యమన్ కల్యణి. హిందుస్థాని సంగీతము లోని కల్యాణి రాగములో చాలా రకములున్నాయి. ఉదా: భూప్ కల్యాణి, శ్యామ్ కల్యాణి మున్నగున్నవి.

అభిప్రాయములు:

  1. వేంకటమఖి కూడా తన ‘చతుర్దండి ప్రకాశిక’లో తాను చెప్పిన 19 పూర్వ ప్రసిద్ధ (or) కల్పిత మేళములలో కల్యాణి రాగమును పేర్కొన్నప్పట్టికి, కల్యాణీ మరియు పంతువరాళి రాగములు దేశ్య రాగములని; గీత, ఆలాప, ఠాయి, ప్రబంధములకు తగినది కాదని; ఈ రాగముల యొక్క లక్షల వివరములను చెప్పుట మానివేసెను.
  2. రామామాత్యుల ‘స్వర మేళ కళానిధి’లోనూ కల్యాణి లేదు.
  3. కానీ, సోమనాథుని ‘రాగవిబోధము’లో కల్యాణి రాగము గురించి చెప్పబడినది.
  4. క్రీ.శ. 1660 వ సంవత్సరంలో రచింపబడిన అహోబలుని ‘సంగీత పారిజాత’ గ్రంథములలో ఈ రాగ ప్రస్తావన కలదు.
  5. తుళజేంద్రుల 21వ మేళములో కూడా కల్యాణి రాగము గురించి చెప్పినప్పటికిని, లక్షణ వివరములు మనకు దొరకలేదు.

~

‘సంగీత సారామృత’ గ్రంధములో మోహన కల్యాణి అనే రాగము కనిపించుచున్నది.

ప్రథమ కనకాంబరి పట్టికలో 65వ మేళము కల్యాణి. ఇదియే ద్వితీయ కనకాంబరి పట్టికలో శాంత కల్యాణి అయినది.

ఆరోహణం: స రి గ మ ప ద ని స

అవరోహణం: స ని ద ప మ గ రి స

కల్యాణి రాగములలో ‘రి’ విశేష న్యాసం – శంకరాభరణంలో ‘గ’  విశేష న్యాసం. గ, రి ఈ రాగములో ఎల్లప్పుడు, ఒక సూక్ష్మ పరిణామముతో కూడిన గమకము లోనే పాడవలెను. ఈ రాగంలో ‘రి’ కి కంపనము లేదు. ఈ రాగంలో ‘గ ద ప – రి ప మ – గ ని ద – ప మ గ రి ద – గ మ ద ప’ – మున్నగు దాటు ప్రయోగములు రంజకములు. జీవ ప్రయోగములు.  శంకరాభరణంలో ధైవతమును – రిదగ, గద, గప, రిప – మున్నగు దాటు స్వరములను నిరాకరించి పాడవలెను. శంకరాభరణంలో ధైవతమును గ్రహ, న్యాస స్వరములుగా ప్రయోగించుట అనవసరం. ఈ రాగంలో అన్ని రాగాచ్భాయ స్వరములు. త్రిస్థాయి. భావపూరితముగా విస్తరించుటకు యోగ్యమైన రాగం. ఇది ఒక ఘన రాగం – నయరాగం, దేశ రాగం కూడా. ఈ రాగమును జాగ్రత్తగా పాడవలెను. లేనిచో దేశ్య రాగమగుటకు అవకాశమున్నది.

నిండు పాండిత్యం గల రాగం. గాన రసప్రధాన రాగం. గీతము మొదలు తిల్లానా వరకు అన్ని సంగీత రచనలకు సరిపోవు రాగం. అన్ని కాల ప్రమాణములలో పాడదగిన రాగం. గాంధార, మధ్యమములను కేంద్ర స్వరములుగా పెట్టుకొని ఈ రాగమును చౌకకాలములో పాడినచో, యమునా కల్యాణి రాగమే స్ఫురించును. వర్జ్య ప్రయోగములు యింపుగా వుండును.

పంచ స్వర మార్ఛనా కారక మేళం.

‘రి’ తో హరి కాంభోజి

‘గ’ తో నఠభైరవి

‘ప’ తో ధీర శంకరాభరణం

‘ద’ తో ఖరహర ప్రియ

‘ని’ తో హనుమ తోడి మేళములు లభించును (స, మ – విడువ వలెను).

కొన్ని ముఖ్య రచనలు:

  1. కమలజదళ- గీతం- త్రిపుట తాళం
  2. సా; ని స రి సా – జతిస్వరం – గీతం
  3. వనజాక్షిరో – ఆది తాళ వర్ణం
  4. వనజాక్షి – ఆట తాళం – మూలై వడం రంగస్వామి

~

త్యాగయ్య గారి కృతులు:

  1. నిధి చాలా సుఖమా – చాపు తాళం
  2. ఏతావునరా – ఆది
  3. సుందరి నీ దివ్య రూపం – ఆది
  4. అమ్మ రావమ్మా – ఖండచాపు
  5. కారువేల్పులు నీకు సరి కారు
  6. శివే పాహిమాం

దీక్షితుల వారి కృతులు:

  1. భజరే చిత బాలాంబికాం – మిశ్ర ఏకతాళం
  2. కమలాంబాం భజరే – ఆది
  3. అభయాంబ – ఆది

శ్యామశాస్త్రి గారి కృతిలు:

  1. తల్లి నిన్ను నెరనమ్మినాను వినవే – మిశ్రం
  2. బిరాన వరాలిచ్చి
  3. హిమాద్రి సుతే
  4. నిను వినా గతిగాన జగాన – సుబ్బరాయ శాస్త్రి
  5. సరస్వతి నన్నెపుడు – తిరువత్తియూర్ త్యాగయ్య
  6. పాహిమాం శ్రీ వాగీశ్వరి – స్వాతి తిరునాళ్
  7. పంకజ లోచన – స్వాతి తిరునాళ్
  8. బిరాన బ్రోవ యిదే – పంచనదయ్యర్
  9. నిజ దాస – పట్నం సుబ్రమణ్యం అయ్యర్
  10. ఇద్దరి సందున – క్షేత్రయ్య పదము
  11. ఎంతటి కులుకే – ధర్మపురి సుబ్బరాయర్ జావళి

~

సంచారం:

పమగారిస – సనిరిసనిద – నిరిగారి – పమగమరి – గుమపా – పమపదా – నిదపమ – గమపదనిస – దనిసరీ గమ గరిస – దగరిసనిద – రిసనిదపమగారి – గమప గారిస.

~

నిధి చాలా సుఖమో – సాహిత్యం:

పల్లవి:

నిధి చాల సుఖమా

రాముని సన్నిధి సేవ సుఖమా

నిజముగ పల్కు మనసా

అనుపల్లవి:

దధి నవనీత క్షీరములు రుచియో

దాశరథి ధ్యాన భజన సుధా రసము రుచియో

చరణం:

దమ శమమను గంగా స్నానము సుఖమా

కర్దమ దుర్విషయ కూప స్నానము సుఖమా

మమతా బంధన యుత నర స్తుతి సుఖమా

సుమతి త్యాగరాజ నుతుని కీర్తన సుఖమా

ప్రతిపదార్థం:

నిధి = ధనము

చాలా సుఖమా = ఎక్కువ సుఖమా

రాముని = శ్రీరాముని

సన్నిధి సేవ = చరణ సేవ

సుఖమా= సుఖమా

నిజముగ = సత్యము

పల్కు మనసా = చెప్పుము మనసా

దధీ నవనీత క్షీరములు = పెరుగు, వెన్న, పాలు

రుచియో = రుచో

దాశరథి = దశరథ తనయుడైన శ్రీరాముని

ధ్యాన = ధ్యానమందలి

భజన = కీర్తించుట

సుధారసము = అమృతము

రుచియో = రుచో

దమ = బాహ్యేంద్రియ నిగ్రహము

శమమన్న = మనోనిగ్రహము అనబడు

గంగాస్నానము = గంగాస్నానము

సుఖమా = సుఖమా

కర్దమ = బురద (అనబడు)

దుర్విషయా = చెడు విషయములనబడు

కూపస్నానము = (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము అను) బురదతో నిండిన నూతి స్నానము

సుఖమా = సుఖమా

మమతా బంధన యుత = నాది అను భావముతో కూడిన

నర స్తుతి = నరుని స్తుతించుట

సుఖమా = సుఖమా

సుమతి = మంచి మనస్సు కల్గిన

త్యాగరాజనుతుని = త్యాగరాజుచే స్తుతింపబడు పరమాత్ముని

కీర్తన = కీర్తన (కీర్తించుట)

సుఖమా = సుఖమా.

(ఇంకా ఉంది)

Exit mobile version