Site icon Sanchika

భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-22

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-19: కొన్ని రాగాలు – లక్షణాలు – కీర్తనల ఉదాహరణలు – 5వ భాగం

9. శ్రీరంజని:

శ్రీరంజని అనేది 22వ మేళకర్త రాగం అయిన ఖరహరప్రియ యొక్క జన్య రాగం. ఇది ఉపాంగ రాగము.

ఆరోహణ: స రి గ మ ద ని స

అవరోహాణ: స ని ద మ గ రి స

శ్రీరంజనిని మొదటిసారిగా తుళజేంద్రుల ‘సంగీత సారామృత’ గ్రంథంలో శ్రీరాగ మేళము యొక్క జన్యముగా చెప్పెను. త్యాగరాజ స్వామి వారిచే ఈ రాగము ప్రచారము లోకి తీసుకుని రాబడెను. కానీ త్రిమూర్తులకు పూర్వము ప్రసిద్ధి చెందిన వాగ్గేయకారులును, ‘అష్టోత్తరశతరాగతాళమాలిక’ను ప్రసాదించిన గురువు

ఆయిన రామస్వామి దీక్షితార్ ఈ రాగమందు ఒక చౌక వర్ణమును రచించి వున్నారు. ఎత్తుగడ స్వరములో నొకదానిని రామస్వామి దీక్షితులు, మరొక దానిని శ్యామశాస్త్రులు, ఇంకొక దానిని ముత్తుస్వామి దీక్షితులు రచించినట్లు ప్రతీతి. దీనికి సుబ్బరామ దీక్షితుల ‘సంగీత సంప్రదాయ ప్రదర్శిని’ గ్రంథమే ఆధారము.

శ్రీరంజని గమక వరిక రక్తి రాగముని నిషాదము ఒక్కటి ఈ రాగంలో చక్కని కంపిత స్వరం. గాంధారము కూడ దీని సంవాది స్వరము కనుక కంపితముగా పల్కుటకు అవకాశమున్నది. కానీ ఈ రెండింటిని ఎల్లప్పుడు గమక వరిక భావముతోనే పాడ వలెనను నియమము లేదు. అనేక సందర్భములలో ఈ గాంధార, నిషాదములు కూడా స్వల్ప కంపనము తోనే పాడవచ్చును.

రి, మ, ద కంపనము లేదనియే చెప్పవచ్చు. ఈ రాగములో జంట, దాటు, ఆహత, ప్రత్యాహత ప్రయోగములు ఎక్కువగా ప్రకాశించును.

ఈ రాగములో అల్ప పంచమము వినిపించుటకు అవకాశము లేకపోలేదు. దీనిని బట్టి ఈ రాగములో అల్ప పంచమ ప్రయోగముకు అవకాశము కలదని నిశ్చయించుటయు అసమంజసం కాదు. ఆహత, ప్రత్యాహత ప్రయోగములలో జంట, పంచముము ప్రయోగములలో స్ఫురించకుండా పాడుటయే ధర్మము.

వివిధ కాల ప్రమాణములలో ఈ రాగమును పాడవచ్చు. గాన రస ప్రధాన రాగము . నవరసము లన్నియు ప్రదర్శించుటకు వీలైన రాగమని చెప్పవచ్చు. త్యాగరాజస్వామి ఈ విషయమును సూచిస్తూ ‘నవరస యుతకృతి’ అని సొగసుగా ‘మృదంగ తాళము’ అను కృతిని ఈ రాగమునందే రచించినది గమనింపవలెను.

సార్వకాలిక రాగము. చౌక, పద, తాన వర్ణము మరియు కృతులు తప్ప ఇతర సంగీత రచనలకు అవకాశము లేదు.

ఈ రాగములో ధైవతము తప్ప మిగిలిన స్వరములలో గ్రహ భేదము చేసినచో చక్కని కొన్ని రాగములు వినిపించుచున్నవి. ఏ స్వరమును గ్రహభేదము చేసినను లక్ష్యంలో వాడుటకు వీలగు రాగము శ్రీరంజని. దీనికి దగ్గర సంబంధము గల దేశ రాగము ‘భాగేశ్రీ’. భాగేశ్రీ రాగములో అచ్చటచ్చట పంచమము స్పురించును. విస్తార ఆలాపనకు వీలైన రాగం. రామస్వామి దీక్షితుల వారి చౌక వర్ణము, త్యాగరాజస్వామి వారి ‘మాఱుబల్కకున్నా వేమిరా’, దీక్షితుల వారి ‘శ్రీ దుందుర్గే శివ సంసర్గే’ మున్నగు కీర్తనలు ఈ రాగము లోని ముఖ్యమైన రచనలు.

~

పల్లవి:

మాఱుబల్కకున్నా వేమిరా – మా మనోరమణ ॥మా॥

అనుపల్లవి:

జార చోర భజన జేసితినా – సాకేతవదన ॥మా॥

చరణము(లు):

దూరభారమందు నా హృద – యారవిందమందు నెలకొన్న

దారి నెఱిఁగి సంతసిల్లినట్టి – త్యాగరాజనుత ॥మా॥

10. శహన:

ఇది 28వ మేళకర్త హరికాంభోజిలో జన్యం. వక్ర సంపూర్ణ ఉపాంగ రాగము.

ఆరోహణ: స రి గ మ ప మ దా ని సా

అవరోహణ: స ని ద ప మ గ మ రీ గ రి స

కరుణ రస ప్రధాన రాగము. త్రిస్థాయి రాగము. అనేక రచనలు కలిగిన రాగము. దీర్ఘ గాంధారము కొన్ని ప్రయోగములతో కొంత తక్కువగా పలుకుటచే ఇందు సాధారణ గాంధారం కలదని, అందువలన అది 22 ఖరహరప్రియ జన్యమని, అం॥గా॥ అన్య స్వరము అని, కావున ఇది భాషాంగ రాగము అని ఒక అభిప్రాయము ఉండెడిది. కాని ఇది ఉపాంగ రాగముగనె నిర్ధారణ చేయబడినది. రి గ ద ని రాగాచ్ఛాయ స్వరములు. గ్రహ న్యాస స్వరములుగా అన్నియు బాగుండును.

నవవిధ భక్తి మార్గములలో ఒకటి అయిన వందనమును ‘వందనం రఘునందన’ అనే కీర్తన – తాగయ్య తన ‘ప్రహ్లాద భక్తి విజయము’లో చక్కగా వెల్లడించెను. జంట, దాటు, ఆహత, ప్రత్యాహత ప్రయోగముల కన్నా ఏకస్వర ప్రయోగమే బాగుండును, ఈ రాగములో ‘రి గ మ పద ని స రి’ ఒక విశేష సంచారం. సార్వకాలిక రాగం. ఉత్తమ రాగము.

సుప్రసిద్ధ రచనలు:

  1. రాగలక్షణ గీతము. – పైడాల గురుమూర్తి శాస్త్రి
  2. వర్ణములు – కరుణింప – ఆది – వీణకుప్పయ్యర్; ఎవరేమి భోదన చేసిరో – ఖండ – పట్నం సుబ్రమణ్యం అయ్యర్; ఏమి ఆనతిచ్చేవో – రూపక- త్యాగరాజు

కృతులు:

సంచారం:

రీగమ రీగరిసా – రిసనిస దా – ని సరీ – రిగమపమ దాద- దనిరిసనిసదా – నీ దపమ దనిసా – నిసరిగమ పమ గమరీ  గరిసా నిరిసని సదా – నీ ద ప మ గ మరీ – రి గ రి సా – ని స ద ని ద ప మ ద ని సా.

దీక్షితార్ కృతి: రామకృష్ణేన – రాగం శహాన – తాళం ఆది

పల్లవి:

రామకృష్ణేన సంరక్షితోహం

రామాయణ భాగవత ప్రియేన

అనుపల్లవి:

ఉమాపతి వాణీపతి మహితేన

కౌసల్యా యశోదా బాలేన

చరణం:

అయోధ్యా ద్వారకా సుసదనేన

అమరేశ గురు గుహాది విదితేన

జయ సీతాలక్ష్మీ మోహితేన

జననాది ముక్తి ప్రద చరణేన

మాయా మారీచ కంస హతేన

మానిత విభీషణాక్రూరేణ

పయోనిధి చంద్రేణ భరత

బలరామ సోదరేణ ప్రకట కీర్తనేన

వ్యా: తృతీయా విభక్తి.

ఈ కృతిలో రామకృష్ణేన సంరక్షితోహం – రామకృష్ణునిచే సంరక్షింపబడితిని అని, రాముడు, కృష్ణుడు ఒక్కరే అన్న భావం – క్రమాలంకారముగా, రాముని, దశరథ రాముని; వసుదేవ నందనుడైన శ్రీకృష్ణుని, కౌసల్యా యశోద సుతేన, అయోధ్య, ద్వారకావాసుచే; సీతాలక్ష్మిచే మోహింపబడిన వానిచే; మారీచ, కంసుని సంహారలించేన వానిచే; భరతునకు బలరాముని సోదరునిచే; విభీషణుడు, అక్రూరునిచే కొనియాడబడిన వానిచే, రామాయణ మందలి రాముని; భాగవతమందలి – శ్రీ కృష్ణుని భక్తిగా వర్ణించి కొనియాడిరి.

(ఇంకా ఉంది)

Exit mobile version