Site icon Sanchika

భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-30

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-19: కొన్ని రాగాలు – లక్షణాలు – కీర్తనల ఉదాహరణలు – 13వ భాగం

28. నాయకి:

ఆరోహణ: స రి మ ప ద ప సా

అవరోహణ: స నీ ద ప మ రి గా రి స

ఉభయ వక్రరాగం. వక్ర, ఔడవ సంపూర్ణ రాగం. ఆరోహణలో గ ని వర్జము. ఉపాంగ రాగం – ప ద ప స – ప ద నీ దీ ప స  – ప మ రి గా రి స – రి మ ప ద ద – ప ద – ప ద ని ద నీ ద ప ద ప దా ద ప – మ రీ – రంజక ప్రయోగములు.

దీనికి దగ్గరైన మరియొక రాగం దర్బారు. నాయకి – దీక్షితుల వారి కృతిలో చౌక కాలంలోను, త్యాగరాజస్వామి వారి ‘నీ భజన గాన’ కృతి మధ్యమ కాలములోను ప్రకాశించుచున్నవి. అటులనే దర్బారును సూచించు ప్రత్యేక ప్రయోగములు వేరు. భావమే వేరు. కాల ప్రమాణమే వేరు. ని, గ జంట దర్బారు జీవములు.

దర్బారు మధ్యమ కాల ప్రధాన రాగము. త్యాగయ్య ‘నా భజన గాన’ కీర్తనలో ఒక స్థాయి భావములో ఒక స్థాయి భావములో అమర్చిన ఒక జారులో నాయకి సంపూర్ణముగా ధ్వనించుచున్నది.

రి, ద,ని ప్రధాన జీవ స్వరములు, న్యాస స్వరములు. గ, ని- జీవస్వరములు. ‘సరసిజాక్ష’ అనే ఖండజాతి త్రిపుట తాళ వర్ణ రచన. త్యాగయ్య, దీక్షితుల వారి కృతులు ఈ రాగములో గల సుప్రసిద్ద లక్ష్యములు. భావ పూరిత రాగము. శృంగార, భక్తి రస, ప్రధాన రాగము. చౌక కాల ప్రధాన రాగమే అయినపట్టికి పైన పేర్కొన్న తాన వర్ణములను తాగయ్యగారి మధ్యమ కాల కృతులలోను ఈ రాగము మొక్క భావము ఉత్కృష్టము గానే ప్రదర్శింపబడినది. సంపూర్ణ పాండిత్యముల గల రాగము. ఛాయా ప్రధాన రాగము.

~

శ్రీరంగక్షేత్రమందున్న రంగనాథ కృతి (ముత్తుస్వామి దీక్షితార్):

పల్లవి:
రంగ నాయకం భావయే
రంగ నాయకీ సమేతం శ్రీ
అనుపల్లవి:
అంగజ తాతం అనంతం అతీతం
అజేంద్రాద్యమర నుతం సతతం
(మధ్యమ కాల సాహిత్యం)
ఉత్తుంగ విహంగ తురంగం
కృపాపాంగం రమాంతరంగం
చరణం:
ప్రణవాకార దివ్య విమానం
ప్రహ్లాదాది భక్తాభిమానం
గణ పతి సమాన విష్వక్సేనం
గజ తురగ పదాతి సేనం
దిన మణి కుల భవ రాఘవారాధనం
మామక విదేహ ముక్తి సాధనం
(మధ్యమ కాల సాహిత్యం)
మణి-మయ సదనం శశి వదనం
ఫణి పతి శయనం పద్మ నయనం
అగణిత సు-గుణ గణ నత విభీషణం
ఘన-తర కౌస్తుభ మణి విభూషణం
గుణి జన కృత వేద పారాయణం
గురు గుహ ముదిత నారాయణం

వ్యాఖ్యానం: ద్వితీయా విభక్తి

శ్రీరంగనాయకుని శ్రీరంగనాయకితో కూడియున్న వానిని భావింతును. మన్మథుని తండ్రిని, అనంతుని అతీతుని, బ్రహ్మ ఇంద్రాది దేవతలచే నుతింపబడు వానిని, ఎత్తైన గరుత్మంతుని గుఱ్ఱముగా వాహనము గలవానినీ, దయా వీక్షణములు గల వానిని, లక్ష్మీదేవి హృదయమందున్న వానిని, ప్రహ్లాదుడు మొదలైన భక్తుల యందని అభిమానము గల వానిని, వినాయకునితో సమానమైన విశ్వక్సేనుని, సూర్య వంశమంద్భువంచిన రామచంద్రుని చేత నారాధింపబడిన వానిని, నాకు దేహము ఉండగానే ముక్తిని యొసగిన వానినీ, ఆదిశేషునిపై శయనించు వానిని మొదలగు విశేషణములతో నొప్పుచున్న నారాయణుని భావించుచున్నాను. ఆ రంగనాయకీ సమేత – అను పదమున నాయకీ రాగనామము కూర్చిరి.

శ్రీ రంగక్షేత్రము పురాతనమైనదనీ, రామునిచే నారాధిధింపబడినవాడనుటలో క్షేత్ర మహిమను తెలియజేసిరి.

29. ఆహిరి:

ఆహిరి పురాతన రాగం. దీనికి ‘ఆహరి’ అని కూడా పేరు కలదు. స్వాతి తిరునాళ్ వారి, ‘పన్నగేంద్ర శయన’ అను రాగమాలికలో, ఆహరిగాక్షి అని రాగముద్ర సూచింప బడినది. అన్నమాచార్యుని రచనలు అనేకములు ఈ రాగములో కలవు. వేంకటమఖి తన 19 పూర్వ ప్రసిద్ధ మేళములు (లేక) కల్పిత మేళములలో ‘ఆహిరి’ని పేర్కొనెను,

ఆహిరి తోడి జన్యమని, వకుళాభరణము జన్యమని చెప్పుదురు. 8 హనుమతోడిలో జన్యం.

భావపూరితమైన రాగం. శుభప్రదమైన రాగము. చౌక కాల ప్రధాన రాగం.

ఆరోహణ:- స రి స గా మ ప ద ని స

అవరోహణ: స ని ద ద ని దా ప మ గ రి స

తమిళ పణ్ లలో ఆహిరిని ‘శ్రీకామరం’ అందురు.

ఆహిరిలో, గాంధార, దైవతములు మరియు నిషాదము రాగచ్ఛాయ స్వరములు. విస్తార ఆలాపనకు వీలు లేని రాగము.

పూల పాన్సు మీద (దివ్య నామ సంకీర్తన) ‘ఆ దయ శ్రీ రఘువర’ మరియు ‘చల్లరే’ త్యాగయ్య కృతి; దీక్షితులు ‘కమలాంబ’ నవావర్ణ కృతి; శ్యామశాస్త్రుల ‘మాయమ్మమని’; నారాయణ తీర్థుల ‘వీక్షేహం పాలమూర్తిం’ ముఖ్య రచనలు.

~

కుసుమాకర విమానారూఢాం – దీక్షితార్ కృతి

పల్లవి:
కుసుమాకర విమానారూఢాం
కుంద ముకుళ రదనాం వందేऽహం
అనుపల్లవి:
భాసమాన కామేశ్వరానందాం
భక్త జనాది మంగళ ప్రదాం
చరణం:
వాసుదేవ నుత వీథి విటంకాం
వాణీశ వందిత వర శాకాం
వాసవాది గురు గుహ సంతోషాం
విచిత్ర వీథి ప్రవేశ వేషామ్

వ్యాఖ్యానం: ద్వితీయా విభక్తి.

పుష్పములతో అలంకరింపబడిన విమానము అధిరోహించిన మల్లె మొగ్గలవలె తెల్లనైన పలువరసగల, మంగళ ప్రదురాలైన అందమైన, విచిత్రమైన వేషమును ధరించి, విమానారూఢమై ఊరేగింపు ఉత్సవమునకు వెడలిన కామేశ్వరునకు ఆనందము గూర్చు తల్లికి నేను నమస్కరించుచున్నానని ప్రార్థించిరి.

(సమాప్తం)

Exit mobile version