భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-4

0
2

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-4: సర్వమానవాళికి సంతోషదాయ సర్వరోగ నివారిణి – సంగీతామృతం

ఉపోద్ఘాతం:

[dropcap]మ[/dropcap]నిషిని మనీషిని చేసెది మతం. వివిధ గుణగణాల నిష్పత్తుల తేడాయే మతం. (a) బ్రాహ్మణులు (b) క్షత్రియులు (c) వైశ్యులు (d) శూద్రులు అని వర్గీకరించారు (ఉపనిషత్ చంధో శాస్త్ర ప్రకారం).

గుణాల నిష్పత్తుల బట్టి ఆ వర్గీకరణ జరిగింది. ఇది చెయ్యి, అది చెయ్యద్దు అని చెప్పడం శాస్త్రం అవుతుంది. సంగీతం అమరం. మతం పరిమితం. సంఘాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళేది సంగీతం.

సృష్టికి ప్రతిసృష్టి చేయుట కష్టం. జీవితం సృష్టించబడలేదు. సంగీతానికి ఉనికి వుంది. నిశబ్దాన్ని సృష్టించలేము. ఏది ఉందో అదే నిశ్శబ్దం. (Silence can’t be created, what existed is silence) నిశబ్దంలో శబ్దం వుంది. సంగీతము, మతము పరిమితమైన, అది ఆ పరిమితానికి మించినది. ధ్యేయం అపరిమితం, వర్తమానమే వర్తమానం (Present in present). అదే పూర్ణం (లేదా) పరిపూర్ణం.

“యేనకేన ప్రకారేణ యస్య కస్యాపి దేహినః

సంతోషం జనయేత్ ప్రాజ్ఞః తదేవేశ్వర పూజనమ్” (ఈశ్వరారాధనమ్)

~

“శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః”

సంగీతంలో ప్రతి దృక్పథం, కోణం అందమైనదే. ప్రపంచం మొత్తం అందమైనది.

జానపదంలో కూడా స్త్రీ, గ్రామ దేవతల మీద పాటలు ఉన్నాయి. ఉదా॥ ఎల్లమ్మ, మల్లమ్మ, చిన్నమ్మ, పెద్దమ్మ, మైసమ్మ, కులదేవతలు మొదలగువారు. పురాణాల ఆవిర్భావానికి మూలం జానపదం. సూర్యచంధ్రులు, గ్రహాలు, నక్షత్రాలు, చెట్లు, పుట్టలు, జంతువులు, నదీనదాలు, అలౌకిక వాతావరణము, మూఢనమ్మకాలు, దేవతా వ్యక్తుల ప్రాధాన్యం – జానపదుల సంగీతానికి మూలం. ఆర్య, ద్రావిడ, గొండు, కోయ, యానాది, చెంచు, నాగ, యక్షాది జాతుల సమ్మేళనమే నేటి మన జాతి కలయిక.

అనాగరిక, ఆటవిక జాతుల వారు 35 తెగలు వున్నారు. అలాంటి వారు నాగరికత సంస్కృతి, విద్య, మొదలగునవి లేక ఇంకా చీకటి లోనే యున్నారు.

అంతర్లీనమైన దివ్యశక్తియే ప్రకటితమైతే అది వెలుగు. వెలుగు యొక్క రూప ప్రదర్శనను బహిర్గతం చేసేది నీడ. అగ్ని నీలపురంగుతో వుండి వెలుగు నిచ్చేది. అగ్నికి అది ఆధారం. చాలా దేవుళ్ళు నీలపు కాంతితో వున్నారు అనేదానికి కారణం, ధరిత్రి ఆ రంగు కల్గినది కావడమే. సూర్యుడి కాంతిని ప్రసరింపజేసే కేంద్రం వెనుక వున్నది కూడా నీలపు కాంతులు వెదజల్లేదే. భగవంతుడే.

***

సంప్రదాయం అనే శబ్దానికి గురు పరంపరా ప్రాప్తం అని అర్థం. ఇది విషయానికే గాక అన్ని విద్యలకు వుంది. శాస్త్రాలకి, మతాలకి, అచారాలకి వుంది. సంప్రదాయం లేకపోతే ప్రతివాడు ‘ఇతి కర్తవ్యతా మూఢుడై’ కూర్చుంటాడు.

సంగీతం సంప్రదాయంలో ఒక పెద్ద దిక్కు. మిగతా శాస్త్రాలలో కళల విషయంలో లేదు. సంస్కృత కావ్య విషయం – వాల్మీకి రామాయణం. ప్రప్రథమం. దానిని అనుసరించి కాళిదాసాది కావ్య గ్రంథాలు, చంధ్యోలంకారాది విషయాలు కావ్య కళ లోని సంప్రదాయాలు మనకు గోచరిస్తాయి. కానీ సంగీతానికి అగమ్య గోచర స్థితి ఏర్పడింది. అగమ్యం నుంచి నుంచి గమ్యస్థితికి చేరాలంటే చాలా అలోచించాలి, ఎవరు దీనికి కర్త? త్యాగయ్య గారా? అనుకుంటే –

‘భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదాదులు’

అలాగే

‘రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు’

అని చెప్పారు.

సంప్రదాయ ప్రవర్తకుడను తనే అని చెప్పలేదు. కాకపోయినా త్యాగయ్యగారు విశిష్ట సంప్రదాయకర్త, ఉత్తమ వాగ్గేయకారుడు, భావుకుడు, నారద భావ మర్మజ్ఞుడు, రసికుడు, స్వరార్ణవ మంథనుడు, క్రాంతదర్శి – ఇత్యాది విషయములు అనుభవము ద్వారా మనం తెలుసుకోవచ్చు.

శాస్త్ర వాక్యం:

‘సామవేదాదిదం గీతం సంజగ్రహ పితామహః’ అన్నది శాస్త్ర వాక్యం.

‘అనంతావైరాగారి’ ఋషులు రాగములకు అంతులేదు అని నిర్ణయించిరి.

‘రంజకః స్వర సందర్భో రాగ ఇత్య భిదేయతే’ అన్నారు. అంటే – రంజక స్వరాల కూర్పే రాగాలు అని అర్థం.

ఆత్మను ఆత్మారాముని యందు నిలపటం – ‘ఆత్మని ఏవ అత్మానా తుష్టం’ (భగవద్గీత).

‘ఆత్మన్యేవ రమతే’ అనే వాక్యాల లక్షణం – ఆత్మ జ్ఞానుల పరంగా జ్ఞాన యోగ లక్షణం.

‘ఆనందమే పరం బ్రహ్మ లక్షణం’. ‘ఆనందోబ్రహ్మ’ అని శ్రుతి వాక్యము. సత్, చిత్, ఆనంద లక్షణమైన పరం బ్రహ్మను హృదయాకాశమందు గుర్తించమని, ‘యో వేద నిహితం గుహాయాం’ అని ఉపనిషత్తు బోధిస్తుంది.

అందుకే త్యాగరాజు తన హృదయమందు ‘వాగేశానందనుండు’ అని సెలవిచ్చారు.

దైవ గుణ గానమే సంగీతమునకు అసలైన పరమార్థం, సిసలైన పరమావధి.

ఈ జగుత్తు అననది జీవుని సృష్టియా (లేక) – ఈశ్వర సృష్టియా? ఆ సృష్టి సత్యమా? కల్పితమా? కల్పనమైతే ఆధారమేమి? అది ఎలా జరిగింది? దానికి ప్రమాణమేమి, ఇత్యాది ప్రశ్నలు వుదయించును. త్యాగయ్య సమాధానం శ్లోకంలో వివరించారు. దాని తాత్పర్యం ఇక్కడ ఉదహరిస్తున్నా.

  1. ఆత్మ స్వప్రకాశం, అవ్యక్తము, అనాద్యానంతమైనది, కార్య కారణముల నుండి సనాతనమై ప్రకృతిని ప్రేరేపించుచుండును.
  2. ఆ ఆత్మనే జీవాత్మ అని యజ్ఞలు తలచి మోహ పాశాకృష్టులై – కన్నులుండియు
  3. లేని వారి వలె, స్వస్వరూప బ్రహ్మను తెలియరు. భ్రమచే దృశ్యమే సత్యమని అంతకు భిన్నమసత్యమని – చేపలు ఎరకు ఆశించి గాలమునకు తగిలినట్టు
  4. మనస్సు కల్పించుకొన్న ఎండమావుల నీటి కురికి దాహోపశాంతి నొందక ఆయాసపడిన చందముగ – ప్రాణులే సంసారమును కల్పించుకొందురు.
  5. అజ్ఞాన కారణముగ బ్రహ్మముపై జగత్తు కల్పింపబడినది. బ్రహ్మవేత్త అవిద్యకు అతీతుడు. సంసారం తొలగినను బ్రహ్మము తొలిగిపోదు – భ్రమా కారణ
  6. ఈ సంసారం ఇది బ్రహ్మము అనుట కాధారము సత్యము, ఆనందములు ఉన్నది, ప్రియమైనది. ప్రకాశమైన తను జీవ వాక్యములే ప్రమాణములు.

~

త్యాగరాజు – త్యాగబ్రహ్మ; బ్రహ్మ – సృష్టికర్త; త్యాగయ్య – గేయవాక్కర్త; వాల్మీకికి పూర్వము నారదోపదేశం. రామ భక్తి నిధి. సంస్కృత సాహిత్యకర్త. ఆది కవి. అట్లే త్యాగయ్య కృతి శత నిర్మాణములే రామ మహిమ చాటి చెప్పినది. కాశీ పండితుడు గ్రహించుకొని పాడుచుండ, త్యాగయ్య గారు శ్రీ రాముని సన్నిధిలో చేరి, ‘ఎందరో మహనుభావులు’. తన్మయుడై పాడెను.

ఆలోచనా సాధనం లేదా మహా చేతన మూలం ఏమిటన్నది పరిశీలిద్దాం. ఆదిలో స్వచ్ఛమైన, సానుకూలమైన శక్తిగా ‘శూన్యం’ ఉండేదనీ మన పురాతన గ్రంథాలు నిశ్చయంగా చెప్పాయి. ఈ శూన్యం, అనంతతత్వముల కలయిక వల్లనే ‘పూర్ణత్వం’ అన్నది సిద్ధించింది. మహోన్నతమూ, పరిపూర్ణ స్వచ్ఛతతో కూడిన చైతన్యమై యుగాలుగా, ప్రాణాలుగా, స్తబ్ధ పదార్థంగా అవతరించినప్పుడే సృష్టి ఏర్పడుతుంది అని మన పురాతన గ్రంథాలు స్పష్టంగా చెప్పాయి.

సృష్టికి మూలమైన ప్రాథమిక కదలిక ‘కల్లోలం’తో కలుగుతుంది. మహానారాయణుడి నాభి (విష్ణు నాభి) నుంచి కమలం ఉద్భవించింది.

ఆ కమలంలో సృష్టి కారకుడైన బ్రహ్మ నాలుగు ముఖాలతో ఆశీనుడై ఉన్నాడని పురాణ గ్రంథాలు పేర్కొన్నాయి. ప్రతి ఒక ముఖం నాలుగు వేదాలలో ఒక్కోక్క వేదానికి ప్రతిరూపం. బ్రహ్మ నుండి రెండు ప్రాథమిక శక్తులు (ఆద్యశక్తులు) ఉద్భవించాయి. ఇవి ఒక దానిని మరొకటి హరించలేని శక్తులు. ఒకటి కనబడే, స్పష్టమైన, గ్రహించదగ్గ సృష్టి యావత్తుకూ జనని అయిన సావిత్రి. మరొకటి మౌలిక స్పృహ లేదా విశ్వమూల యోచన అయిన గాయత్రి. ఈ విశ్వమూల యోచనయే ప్లాటో, ‘భావాల ప్రపంచం’గా పేర్కొన్నాడు.

ఆదిలో ఓంకారం (శబ్దము) పుట్టింది. ఇది శక్తి, ఇంధనాదులుగా, పదార్థ మూలాలుగా, అచేతన పదార్థంగా భౌతిక రూపాలను ఆపాదించుకొంది.

సమస్త సృష్టిని రెండు మౌలిక విభాగాలుగా సంభావించవచ్చు. అవి నాదము, రూపము. వేదాల ప్రకారం దృగ్గోచరమైన ఏ సృష్టి కంటే ముందు శబ్దం పుట్టింది. ఇది శాశ్వతమై నాదం అవుతుంది. ఈ నాద ప్రణవాన్ని స్వరక్ష, స్వరలోక అని ఇంకా అనేక విభాగాలుగా విభజించి దీని భావం మనస్ (లేదా) మనః (ధ్యానము) అన్నది ఏ సాఫల్యం కంటె ముందుంటుంది.

ఉదా: మహాభారతంలో అంతఃచైతన్యం మౌలికం అన్న విషయాన్ని తీసుకుందాం. మహాభారతంలో వృద్ధ హనుమంతుని భీముడు కలుసుకుంటాడు. హనుమంతుడు తన దివ్య జ్ఞానాన్ని భీమునికి చెప్పాడు. కృత, తదనంతర యుగంలో ఆహారం కోసం ఎవరు భూమిని దున్నడు, భావానికి, ఆలోచనకి  ఉన్న శక్తితో ప్రతీదీ సొంతం చేసుకుంటాడు అని చెప్పాడు.

స్వచ్ఛమైన చేతనలో అంతర్నిబిడమైన మంత్రం క్రొత్త సృష్టిని సంకల్పించగలదు (లేదా) ఉన్న సృష్టిని లుప్తం చేయగలదు.

సత్వ గుణము ద్వారా అపూర్వ సృష్టి – ఈ చరాచర ప్రపంచం ఏర్పడుతుంది. మానవుడు సంతత ప్రవృత్తి కలవాడు. రాజసము వలన అపూర్వం, ఆనందములు పుట్టవు. అనాహతంలో ఆహత నాదం. అహతం అనగా శ్రుతి, స్పర, రాగాది రూపముల వివర్తము (పరిణామము). వాటికి మూలం ఆహత నాదం (తంబురనాదం). అలాగే కాలానికి స్వరూపం లేదు. కాని లయ. తాళ – గతి మొ॥ రూపంలో ఆకారమే కన్పిస్తుంది. మూలాధార ధ్యానమే నిధి ధ్యాస అగును. దానినే ధ్యానించాలి. విక్షేపమే అనంత సృష్టికి హేతువు. ఈ హేతువు మూలాధారమునే ధ్యానించునపుడు నశించును.

సృష్టిని అరికట్టగలమా? సాధ్యమా? జ్ఞానికి మాత్రమే సాధ్యము. జ్ఞానియే జీవన్ముక్తుడు.

జీవన్ముక్తికి జిజ్ఞాసతో సద్గురువు నాశ్రయించి శ్రవణం- మననం-నిధి ధ్యాసములు ఆచరించుట ముఖ్యం.

నిధి ధ్యాసము చేసెటప్పుడు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు నిగ్రహించాలి. అపుడే నాదబ్రహ్మ గోచరిస్తుంది, దానికి ప్రేరకం వుండదు. స్వయం ప్రకాశమై యుండును. అపుడు ధ్యానం చేయగా నాద బ్రహ్మ యొక్క సంగీత సృష్టి-స్థితి-లయ-ఆవరణ, విక్షేపములు మొదలగునవి తెలుస్తాయి.

వీనికి హేతువులైన రాజస- తామస గుణాలు పోతాయి. గుణం శుద్ధి అవుతుంది.

‘సత్వ’ గుణం వృద్ధి అవుతుంది.

తద్వారా శాంతి, సుఖ ఆనందాలు కల్గుతాయి. ఈ స్థితిలోనే సంగీతము వృద్ధి చెందుతుంది. దీనికి ఆధారం ‘పాతంజలి యోగసూత్రాలు’.

నిత్యావసరాలు తీర్చే కర్మ యోగం ఎందుకు ఓటమి పాలయింది, సమాజం మనుగడకు అత్యవసరమైన వ్యవసాయం, వస్తూత్పత్తి, వినిమయం మొదలగు అసలు కర్మకాండ అంతా క్రమక్రమంగా శ్రామిక వర్గంపై పడవేసి, సాంస్కృతికులు వాటిని లాంఛన ప్రాయంగా, భౌతికాతీత ఆశయాలతో యాగాది క్రతువుల్లో చొప్పి, ధార్మిక కర్మకాండగా మలచారు.

ఉదా: ఉపనయనాల్లో మట్టి మూకుళ్ళలో నవధాన్యాలు పెంచడమే.

సార్వజనీన ప్రాముఖ్యం తగ్గింది. విడిపోతున్న మానవ సమాజాన్ని ఏకముఖంగా నడిపించేందుకు విశ్వాస కేంద్రీకరణం అవసరం. అదే ఉత్తర భారతాన్ని భక్తి ఉద్యమ ప్రవాహంగాను, దక్షిణాన్ని శైవ, వైష్ణవ ప్రపత్తి మరో సాగరంగా ముంచెత్తింది. త్యాగరాజు, అద్వైత తత్వాన్ని జత చేసి రామ భక్తి రసానుభూతి, భక్తి సంప్రదాయాల సమన్వయమే దీని లక్ష్యం.

‘చండమార్తాండ మధ్యమండలమునను చెలంగుచు ఉండేది రాముఁడొకడు’

‘తామసాది గుణరహితుఁడు ధర్మాత్ముడు, సర్వసముడు, క్షేమకరుఁడు త్యాగరాజ చిత్తహితు’డట

‘చీమలో బ్రహ్మలో శివకేశవాది’ సర్వ దేవతలలో తానే ప్రేమతో ప్రత్యక్షమౌతాడట.

‘యే యధా మాం ప్రపద్యంతే తాం స్తధైవ. భజామ్యహం’ – శ్రీరామ దైవతాన్ని’ఎంత రానీ తనకెంత పోనీ’ తాము విడువలేదుట.

(హరికాంభోజి రాగంలో ఆర్ష సంప్రదాయ ప్రకారం చేశారు. చూచారు కూడా)

మనం స్వామికి తనువుచే వందన మొనరిస్తున్నామా? చనువున నామ కీర్తన చేస్తున్నామా? (లేక) మనసున తలచి మైమరిచి యున్నామా అని (ఖరహారప్రియ రాగంలో) త్యాగయ్య అనుభవాలు అడిగారు.

సంగీత జ్ఞానం వల్ల, ఏది న్యాయమో, ఏది కాదో తెలిసి పోతుందట. అంటే సంగీతం హృదయ స్పందనకు సంబంధించిన విద్య కావడం వల్ల, సాధకుడు ఎదుటివారి పరిస్థితులను సానుభూతితో పరిశీలించగలడన్న మాట.

ఈశ్వరుని ఫంచ ముఖముల నుండి రి, గ, మ, ద, ని – లు ఉద్భవించగా పార్వతి అమ్మవారు వాటికి స, ప, కలుపగా సప్తస్వరాలై సంగీతానికి ఉపాధి అయ్యాయి. పరమేశ్వరుని తేజస్సుకు ప్రకృతి మాత ఉపాధి కల్పించగా సర్వ సృష్టి జరిగినట్లు.

ఆత్మ పలకదలచి మనస్సును ప్రేరేపిస్తుంది. మనస్సు దేహంలోని అగ్నిని ప్రవేశిస్తుంది. అగ్ని బ్రహ్మ గ్రంథి లోని వ్యాకోచింప చేస్తుంది.

వాయువు క్రమంగా ఊర్ధ్వగతి చెందుతుంది. నాభి, హృత్, కంఠ, రసన, నాసాదులతో అతి సూక్ష్మ, పుష్ట, అపుష్ట కృత్రిమ పరిణామంతో నాదాన్ని వెలువరిస్తుంది.

(జగన్మోహిని రాగం. త్యాగరాజు ‘శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనసా’ కీర్తనకు ఉదాహరణ).

నాదాన్ని ఉపాసించే శంకర నారాయణులు, విధులు వెలశారంటే వేదోద్ధారులై, వేదాతీతులై, తంత్రీ లయ స్వర రాగ విలోలురై స్వతంత్రులై విశ్వమంతా నిండి ఉన్నారుట.

‘Simple living and high thinking’ అన్నట్టు ‘రూకలు పదివేలున్న చేరెడు నూకలు గతి’ అట; కోకలు వెయ్యున్నా కట్టుకొనుట కొకటే నట. సారతరుని హరిని త్యాగరాజ సన్నుతుని మరవకే మనసా ‘మరువకే మనసా’ అన్నారు (త్యాగయ్య – తోడి కృతిలో).

శాంతము లేక సౌఖ్యము లేదు ఎంతటి వ్యక్తికైనా. అస్థిరమైన ఈ శరీరం ఉండగానే దీనితో ‘ఆధ్యాత్మిక ఔన్నత్యం సాధించుకోవలె’ అని ఎందుకో ఈ కలి మానవులకు  తెలియదు అని వాపోతారు త్యాగయ్యగారు (మోహన రాగ కృతిలో).

  1. ప్రకృతి= వృక్షము
  2. సుఖము – దుఃఖం = వృక్షమునకు ఫలములు
  3. సత్వరజస్తమములు = వృక్షానికి వేళ్ళు
  4. ధర్మార్థ కామ మోక్షములు = వృక్ష పోషణకై నీరు; శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణములు
  5. ఫంచ జ్ఞానేంద్రియములు = వృక్షము వృద్ధి చేయుటకు హేతు భూతములు (ఊడలు)
  6. షడూర్ములు – వృక్షమునకు స్వభావములు
  7. సప్త ధాతువులు = వృక్షమునకు పొరలు
  8. పంచ భూతములు (మనోబుధ్యాంహరములు ఈ ఎనిమిది) = వృక్షమునకు ప్రంగలు (కొమ్మల మూల సందులు)
  9. నేత్రములు (శోతములు, నాసారంధ్రులు, వక్త్రము, గుదము, నవరంధ్రములు) (నవద్వారములతో సహా) = వృక్షమునకు తొర్రలు
  10. దశవిద వాయువులు = వృక్షానికి ఆకులు

~

శ్రీరాముని రాజకీయ చతురతను ఎత్తి చూపుతూ, కాపీనారాయణి రాగ కృతిలో- శ్రీరాముడు సామ, దాన, భేద, దండ ఉపాయాలు క్రమంగా రావణునిపై ప్రయోగించి రాచకార్యాన్ని సాధించారు.

త్యాగయ్య మాత్రం ఒక గొప్ప రాచకార్యం సాధించాడు తన ముఖారి కృతిలో. సుజనులంతా సద్భజనులు చెయ్యడం చూచి యమధర్మరాజు తన లోకానికి శిక్షకై వచ్చేవారు లేరని చింతాక్రాంతుడై వున్నాడట, ఘోర నరకాల నుండి తప్పించే తారక నామం ఒకటుండగా. కానీ దారి తెలియని వారైనా తన లోకానికి వచ్చిపడతారేమో అంటే వాళ్ళు కూడా త్యాగయ్య సంకీర్తనలు పాడుతుని తప్పించుకుపోతున్నారుట.

జాతీయత (లేక) జాతి సమైక్యతను వృద్ధి చెందింపగల ఉత్తమోత్తమ సాధనము బృందగానాలు అని చెప్పచ్చు. అధిక సంఖ్యాకులు గాయకులు గానము చేయుటయే బృందగానం. ఒకే జాతికి చెందిన ప్రాణులు ఉద్వేగము తోనో ఉల్లాసము తోనో చేయు ధ్వనులు నిర్ణీత అంతరములతో వీనుల తాకినపుడు, మన మనస్సుకు స్పురించు భావన ఆ జాతి యొక్క సమైక్యత మాత్రమే. సుఖదుఃఖాత్మక అనుభూతుల స్పందనలు, సర్వజీవరాశులకును అనివార్యము.

అయితే ఒకే రకంగా స్పందింపగల ప్రాణుల జాతి సమైక్యత అను భావము మనకు ప్రకటింపబడునది మాత్రము ఈ బృందగానం ద్వారానే.

భావమును ప్రకటించు భాషను సాధనముగా పొందినది మానవ జాతి మాత్రమే.

పరస్పరావగాహనము, అన్యోన్యాశ్రితతను పెంపొందించి జాతి ఉద్ధరణకు ప్రయత్నించునప్పుడు జాతి జనులందరు ఏకబిగిని ఒందించు సాధనే బృందగానము. ఇది పరంపర. మానవులకు ప్రకృతి ప్రసాదించిన వరమే అయినా సాంఘిక ప్రయోజనములపై వాటిని వాడుకొను పద్ధతి మానవుని భావన సాధన మాత్రమే.

వాల్మీకి ఆశ్రమమున రామాయణ గానము బృందగానమే. గోప భామలు, కృష్ణ లీలా తత్వమును గానము చేసినది కూడా బృందగానమే. గురుకులంలో వేదాద్యయనమున కూడా సాయపడిన ప్రక్రియ బృందగానమే.

ఈ గానములు ప్రచారము, మత సమైక్యత, జాతీయ భావన, దేశ భక్తి మున్నగు వానిని జనులలో బలీయముగా నాటుకొనుటకై చేయు సాధనముగా మారినది. స్వాతంత్రోద్యమ సమయమున ఈ బృందగానములను విప్లవవాదులు తమ సాధనములుగా వాడుకొనిరి. అదే బృందగానముల అంతర్లీనమయిన శక్తి జాతి ఉద్ధరణకు ఎంతయో అవసరము.

బ్రహ్మ తమో గుణం (అజ్ఞానము నందలి) సృష్టి, జడ పదార్థములు

రజో గుణం (కొంచెం జ్ఞానము) నందలి సృష్టి సర్పాదులు

సత్వ గుణము (బాగా జ్ఞానము) నందలి సృష్టి మానవులు

ఈ క్రమాన్ని అనుసరించే వాటి వాటి జ్ఞానావస్థలు ఉంటాయి. అందరి మానవులకు సంగీతము రంజనకరమే అని చెప్పాలి. అన్ని దేశములందును వర్ధిల్లును.

ఆనందమనే బ్రహ్మ పదార్థము నుండి జీవమనే చైతన్యంగా సముద్భవించిన వివేకవంతుడైన ఈ మనిషి తాను తిరిగి మనీషిగా ఆ బ్రహ్మానందమందే లయమగు పారమార్థిక మోక్షమునకు గాను, అనాహత నాదమందలి దివ్యానుభూతినే నివేదనా సాధనంగా చేసుకుని ఇహపరముల కతీతంగా ముక్తిని పొందగలుగుతున్నాడు.

నాదమనే సంధి కూర్చి, ప్రతిస్పందనా స్ఫురిత రక్తికి, పరిత్యాగ ప్రదమైన ముక్తికీ; సమాగమమైన నివేదనే నాదానంత సాధనము.

ఓంకారమనే సర్వం బ్రహ్మమయమైన తాదాత్మ్య స్థితి యందు నీ నా తారతమ్య రహిత చిత్తవ్రుత్తి సమావిర్భవించిన ఈ జీవాత్మ, ఆ పరమాత్మ యందు నిర్గుణత్వ సాధనంగా ఏకీభవించగల ధ్యాన నిమ్నగత నెలకొనుటయే నివేదనా నాదమందలి ఆంత్యర్యము.

ముగింపు:

మతం ఏ ఒక్కరికి విడివిడిగా వుండే భావన కాదు. మతం.. సర్వమతం.

అందరు అనుసరించే మంచి నడవడిక, సత్ ప్రవర్తనయే మతం.

‘సర్వమానవాళికి- సంతోషదాయని మతం’

‘సర్వ రోగ దోష నివారిణి – సంగీతం’.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here