Site icon Sanchika

భారతీయ సాంప్రదాయాలు – విద్వాంసులు – రాగాలు-5

[వివిధ భారతీయ సాంప్రదాయాల గురించి, విద్వాంసుల గురించి, రాగాల గురించి ఈ రచనలో విశ్లేషిస్తున్నారు డా. సి. ఉమా ప్రసాద్.]

అధ్యాయం-5: వాసుదేవ తత్వం

[dropcap]శ్రీ [/dropcap]కృష్ణుడు దేవకి గర్భ సంభూతుడు మాత్రమే కాదు. యశోదా గర్భ సంభూతుడు కూడా.

దేవకి వసుదేవులకు నంద యశోదలకు శ్రీమన్నారాయమణుడు తానిచ్చిన వరాలను అనుసరించి రెండు చోట్ల ఆయన ఆవిర్భవించాడు. యశోద జన్మ నామం ‘దేవకి’ అనేది.

ద్వే నామ్నీ నంద-భార్యాయా యశోదా దేవకీతి కా – యశోద ఇద్దర్ని కన్నది. మొదట సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ కృష్ణుణ్ణి, ఆ తర్వాత అంబికా నామికమైన యోగమాయను.

వసుదేవ సుతః శ్రీమాన్ వాసుదేవోఖిలత్మని నందసుతే రాజన్ ఘనే సౌదామనీయథా (శ్రీకృష్ణ యా).

చతుర్భుజుడైన వాసుదేవుడు ద్విభుజరూపుడైన నందాత్మజునిలో వేషంలో మెరుపులాగా విలీనమయ్యాడు.

తద్బ్రహ్మ కృష్ణ మోరైక్యాత్అని శ్రీ యామున ముని వాక్యం కూడా ఇందుకు సాక్ష్యం.

అందుచేత శ్రీకృష్ణుడు పూర్ణ బ్రహ్మ, పూర్ణపురుషోత్తమ ప్రభువని శ్రీ శంకర భగవత్పాది మహాత్ములందరు శ్రీకృష్ణుని భజించారు.

గీతలో శ్రీ కృష్ణ భగవానుడు ‘జన్మ కర్మ చ మే దివ్యమ్’ అనడం కూడా విశేషమై వుంది అనడంలో సందేహం లేదు.

శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని ధ్యానించటం పరిపాటి. అవతారాలలో శ్రీకృష్ణావతారం పరిపూర్ణావతారమనీ, ఆయనే పరబ్రహ్మ స్వరూపుడని, సంప్రదాయం చెబుతుంది. కర్షయతి ఇతి కృష్ణః – జీవాత్మలను ఆకర్షించే పరతత్వం కృష్ణుడు.

స చాత్మా స పరం బ్రహ్మ కృష్ణ ఇత్యభిధీయతే

కృషి స్తద్భక్తి వచనో నశ్చ త ద్దాస్య వాచకః

భక్తి దాస్య ప్రదాతా యః స చ కృష్ణః ప్రకీర్తితః

కృషిశ్చ సర్వవచనో నకారో బీజ మేవచ

స కృష్ణః సర్వసృష్టాదౌ సిసృక్షున్నేక ఏవచ (8వ స్కందం 2-22)

అని దేవీ భాగవతం శ్రీకృష్ణ తత్వాన్ని వ్యాఖ్యానించింది.

కృష్ణుడంటే ఆత్మ. పరబ్రహ్మ. ‘కృషి’ ధాతువునకు ‘భక్తి’ అని అర్థం ఉంది. ‘న’ అనేది ‘దాస్యం’ అనే అర్థం వస్తుంది. భక్తి దాస్యాన్ని ఇచ్చేవాడు కృష్ణుడు.

శ్రీ కృష్ణుడు సర్వలోక స్రష్ట. అతడు త్రిమతాతీతమైన ఏకతత్త్వం.

కృష్ణ శబ్దో హి యోగరూఢ్యా గోలోకవాసి దేవతాయాం రూఢః

కేవల యోగార్థ మాదాయ తు పరమాత్మని ప్రయుక్తః

అని నీలకంఠ వ్యాఖ్య.

కృష్ణ శబ్దం గోలోకం లోని దేవత అనే అర్థంలో స్థిరపడింది.

గోలోకమంటే – ఇంద్రియ వృత్తుల సమూహం. కృష్ణ శబ్దం పరమాత్మ అనే అర్థంలో ప్రయుక్తం.

బ్రహ్మం సత్యం, నిత్యం. బ్రహ్మమునకు శక్తికి భేదం లేదు. ఉత్పత్తి కాలంలో ఆ రెండు భిన్నంగా కనపడతాయి కాని అది కల్పితం. పురుషుని లాగానే శక్తి నిర్గుణమై జగమంతా వ్యాపించి ఉంటుంది. నిజానికి ఆ ఇరువురు ఏకరూపులే. ‘సంభవామి యుగే యుగే’ అని ప్రకటించి భగవంతుడు అవతరించేటప్పుడు శక్తి పురుష ద్వంద్వ ప్రవృత్తిని భజిస్తాడు.

ఒకటి రెండుగా భాసించి, ఆ రెండు కలిసి ఒకటిగా జీవించినట్లు తోపింప జేయుటకు సృష్టి రహస్యం.  అవతార తత్త్వం. అదే శ్రీ కృష్ణావతారం.

దేవి భాగవతంలో శ్రీ కృష్ణతత్వం, దేవి తత్వం విశిష్టంగా చెప్పబడింది. దేవి తనకూ బ్రహ్మమునకు అభేదాన్ని చాటి చెప్పింది.

వసుదేవుడు యశోద ప్రక్కన బాలకృష్ణుని పడుకోబెట్టి ఆమె చెంగట నున్న బాలికను చేటలో పెట్టుకొని రావటం ప్రసిద్ధ ఘట్టం. ఆ బాలిక కంసునికి దుర్గాకృతిలో ప్రత్యక్షమై భగవంతుడు అవతరించాడని సత్యాన్ని ప్రకటించంది. అవతరించేటప్పుడు అఖండమైన పరతత్త్వం – ప్రకృతి పురుష తత్వంగా విభక్తమౌతుంది. అవతరించి ఆ తత్వాలు రెండు ఒకటిగా కలిసి జీవిస్తాయి.

గోకులాచార్యుడు, శాండిల్య మహాముని, బిక్షాకృతిలో శివుడు, యదుకులాచార్యుడు, గర్గ మహామని, వృషభానుడు వీరందరు జ్ఞానులు. వీరు క్రమంగా శ్రీ కృష్ణ పరమాత్మ మొక్క రూప, గుణ, నామ, తత్వ విభూతులను ఆవిష్కరించి వాసుదేవ తత్త్వమును దర్శింప చేస్తారు.

4 స్త్రీ ప్రవృత్తులు –

ప్రతీకలు.

(ఇంకా ఉంది)

Exit mobile version