Site icon Sanchika

దిశా నిర్దేశం చేసే భారతీయ యోగులు

[ది 25.9.2022 న సంచిక-స్వాధ్యాయ, తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ‘శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ – రచనలు – విశ్లేషణ’ సాహిత్య సభలో – ‘భారతీయ యోగులు’ పుస్తకంపై ప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి తమిరిశ జానకి చేసిన విశ్లేషణ]

[dropcap]ఆ[/dropcap]ధ్యాత్మికత, ఆత్మస్థైర్యం, వివేకం, విచక్షణా జ్ఞానం, సహృదయత ఇవన్నీ కలిస్తే ఏమవుతుంది.. యల్లాప్రగడ సంధ్య అవుతుంది. ఔను. నా దృష్టిలో అంతే. పూర్వజన్మ పుణ్యఫలమేదో ఆమెకి ఈ జన్మలో మరింత పుణ్యాన్ని ఇచ్చిందనే చెప్పుకోవాలి. సంధ్యగారి చేతుల్లో రూపుదిద్దుకున్న రచనలు అన్నీ కూడా పాఠకుల మనసుల్లో పరిమళాలు నింపే రచనలే. తరిగిపోయే పరిమళాలు కాదు. పదికాలాల పాటు నిలిచిపోయే మనోవికాస సౌరభాలు అవి.

ఆమె రచనల గురించి మాట్లాడాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఆమెని అందుకోవడం చాలా కష్టం. ఈనాటి ఆధునిక సమాజం ఎటువంటి పోకడలు పోతోందో మనందరికీ తెలుసు. ఇది పరుగుల ప్రపంచమే తప్ప పది నిమిషాలైనా తన వ్యక్తిత్వాన్నితను పరికించుకునే సమయం గానీ, తన అడుగులు సవ్యంగా పడుతున్నాయా బురదలో పడుతున్నాయా వెనక వచ్చేవారిని కూడా ఆ బురదలోకి పడేస్తున్నాయా అని ఆలోచించే విచక్షణా ఙ్ఞానంగానీ కరువైపోయిన కాలం ఇది.

ఇటువంటి పరిస్థితుల్లో మహానుభావులైన యోగుల గురించి తెలుసుకోవలసిన అవసరం  ఎంతైనా ఉంది.

ఒకరా ఇద్దరా నలభైఅయిదుమంది భారతీయ యోగుల గురించి వ్యాసాలు రాయడమంటే మాటలు కాదు. అంతటి బృహత్కార్యాన్ని చేపట్టి చూపించిన రచయిత్రికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.

శ్రీ శంకర భగవత్పాదులు, త్రైలింగస్వామి మొదలుకొని అవధూత శ్రీ చిమటం అమ్మ, కాశిరెడ్డి నాయన వరకూ అధ్యయనం చేసి పాఠకులకు అందించారు ఈ రచయిత్రి.

అగుపించని విద్వన్మూర్తుల సాంగత్యం, అదృశ్య సద్గురువుల సాంగత్యం ఎవరికైనా లభించాలీ అంటే వారిని గురించిన పుస్తకాలు పదేపదే అధ్యయనం చెయ్యాలి.

రచయిత్రి సంధ్యా యల్లాప్రగడ అధ్యయనం చేయడంలో నిష్ణాతురాలయ్యారని ఘంటాపథంగా చెప్తుంది ఆమె రాసిన భారతీయ యోగులు అనే ఈ పుస్తకం.

గురువులు శ్రీ బాబు దేవీదాస్ రావుగారికి భక్తిపూర్వకంగా ఈ పుస్తకాన్నిఅంకితం ఇచ్చారు రచయిత్రి.

మహానుభావులు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామివారు, శ్రీ కుప్పా వేంకటకృష్ణమూర్తి గారు తమ ఆశీస్సులు రచయిత్రికి అందిస్తూ రెండు మాటలు చెప్పడం ఈ పుస్తకానికి మరింత విలువను చేకూర్చాయి.

యోగుల చరిత్రలు చదవడంవలన జీవితంలో మనకు మంచిమార్గం కనపడుతుంది అంటారు రచయిత్రి. నిజమే కదా. గమ్యమేమిటో తెలిసినా అక్కడికి చేరుకునే మార్గం మనకు తెలియకపోతే ఫలితం ఏమి ఉంటుంది. ఎలా చేరుకోగలం. యోగుల చరిత్రలు మనకు దిశా నిర్దేశం చేయగలవు. దానివల్ల మనకు మనోధైర్యం లభించగలదు. మనోధైర్యం అంటూ ఉంటే ప్రశాంతంగా జీవితాన్నిసాగించగలడు మనిషి.

వంచనలు, మోసాలు, కుతంత్రాలు పెరిగిపోతున్న నేటి సమాజంలో మార్పు రావాలి అంటే మహానుభావులైన యోగుల చరిత్రలు తెలుసుకోవడం గానీ చదవడం గానీ చెయ్యాలి ఈ తరంవారు. వారికి అర్థమయ్యే రీతిలో సులభశైలిలో సరళంగా రాయాలి రచయితలు.

సంధ్యా యల్లాప్రగడ గారు రాసిన భారతీయ యోగులు అనే ఈ పుస్తకం ఆ కోవలోకి చెందినదే అని చెప్పడంలో సందేహం లేదు.

ఏ వ్యక్తికైనా యోగిపుంగవులపై నమ్మకం కలగాలీ అంటే వారివారి భక్తి మాత్రమే దానికి దోహదం చేస్తుంది అంటారు రచయిత్రి. ఔను.. మనసా వాచా కర్మణా మనిషికి నమ్మకం, భక్తీ ఈ రెండూ ఉంటేనే గురువు రూపంలో భగవంతుని ఆశీస్సులు అందుకోగలుగుతాడు.

ఈ రచయిత్రిలో ఉన్న పట్టుదల ఏకాగ్రత గమనిస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే తాను రచించే యోగుల చరిత్రలు చూసి “ఇవన్నీ నువ్వు నమ్ముతావా” అని మిత్రులు ఒకరు అడిగినప్పుడు అందుకేగా నేను వారి గురించి చదువుతాను, వారిని గురించి రాస్తాను అని స్థిరమైన సమాధానం ఇచ్చారట ఆమె.

నలభైఅయిదు యోగిపుంగవుల్లో ఒకరైన శ్రీ ఎక్కిరాల భరద్వాజగారు చెప్పిన మాటలు మనసుకి హత్తుకుపోతాయి. “మనలో ఉన్నఆధ్యాత్మిక శక్తి లోకానికి తెలియనివ్వకూడదు. ఎవరికైనా రాబోయే ఆపదలు మనం తొలగజెయ్యవచ్చు కానీ మనం తొలిగించినట్టు వారికి తెలియకూడదు.” ఎంత గొప్పగా చెప్పారో కదా. అదే మనమైతే నలుగురికీ తెలియాలని  తహతహలాడిపోతాం. తెలిసేదాకా నిద్రపట్టదు. అందుకే మనం మామూలు మనుషులం. వారు యోగిపుంగవులు అయ్యారు.

పదిమందీ వారి చుట్టూ చేరతారుగానీ వారు పదిమంది వెంటా పడిపోవడానికి పాకులాడరు. వారిలోని ఆధ్యాత్మిక ప్రతిభ తమకి మాత్రమే కాదు వారిని నమ్మినవారికి కూడా వెలుగు చూపిస్తుంది.

కేరళలో మహమ్మదీయ కుటుంబంలో జన్మించిన శ్రీఎమ్ అనే గురువుని ఎంతో ప్రయత్నం చేసిన మీదట గానీ కలుసుకోలేకపోయానని రచయిత్రి చెప్పిన మాటల్లో ఆమె నిబద్ధత, పరిశ్రమ తేటతెల్లమవుతున్నాయి.

ప్రతి సమస్యా మనలను ఆ భగవంతునికి మరింతగా దగ్గరకు తీసుకుని వెళ్ళేందుకే అంటారు శ్రీ ఎమ్.

క్రియాయోగా అన్నింటికీ సమాధానం అని చెప్తారు.

కస్తూరిమృగం తననుండి వచ్చే సువాసనలను తాను గుర్తించలేనట్లే మనుషులు తమలోని పరమాత్మను గుర్తించలేకపోతున్నారని అంటారు. నిజమేకదా. సాధారణ మనుషులం అందరం కూడా కష్టాలు వచ్చినప్పుడు కన్నీరు పెట్టడం, సుఖాలలో సంతోషపడిపోవడం జరుగుతుంది. ఆ రెండు దశలలోనూ ఒకేలా ఉండగలగడం, పరమాత్ముని లీలలుగా భావించి మనసు కుదుటపరుచుకోవడం, బాధనీ సంతోషాన్నీ ఒకేలా స్వీకరించగలగడం యోగులకే సాధ్యపడుతుంది.

‘నిగ్రహము ఉండటం కోసమే విగ్రహము’ అని ఒక్క మాటలో చెప్పింది జిల్లేళ్ళమూడి అమ్మ. ‘కాలువ నిండా నీరు ఉన్నా దాహం తీర్చుకోవటానికి రేవు కావాలి. ఆలయం రేవు వంటిది’ అని గొప్ప ఉపమానం చెప్పిన అమ్మ మాటల్లో కాదనలేని సత్యం దాగిఉంది.

మేధావులు ఎందరినో ఆశ్చర్యచకితుల్నిచేసిన మాత మరొకరున్నారు.ఆమె శ్రీ శారదామాత. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉండటం వలన మనసూ శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటాయని మంచిమాట చెప్పేవారు ఆమె. అశ్రద్ధ చేయకుండా ప్రతిరోజూ ధ్యానం చేయమని హితవు పలికేవారు.

ఇతరుల్లో తప్పులు వెతుకుతూ ఉండేవారికి మనశ్శాంతి కరువు అవుతుంది. అందుకని  ఆ పని మానేసి తమలో ఉన్న తప్పులు తాము సవరించుకోవడం సరిదిద్దుకోవడం చేయమని బోధించేవారు.

1895లో జన్మించిన శ్రీ జిడ్డు కృష్ణమూర్తిగారికి చిన్నవయసులోనే మద్రాసులో వారింటికి దగ్గర్లోనే ఉన్న దివ్యఙ్ఞాన సమాజంలో గురువుగారిచేత దీక్ష ఇప్పించడం జరిగింది. ఆయనకు కొన్నిదివ్యమైన అనుభూతులు కలుగతుండడమే కాక, యోగశక్తులు, రోగాలను నయంచేసే శక్తి కూడా ఉండేది. దివ్యఙ్ఞానసమాజము World Teacher గా కృష్ణమూర్తిగారి పేరును  ప్రకటించినా కూడా ఆయన ఆ పదవిని అంగీకరించలేదు.

ఆయన సిద్ధాంతాలు కొంత వేరే విధంగా ఉన్నా కూడా స్పష్టంగా మాత్రం ఉంటాయి అంటారు రచయిత్రి. ప్రాచీన భారతీయుల జీవనవిధానం స్వచ్ఛమైనది అని చెప్పిన వ్యక్తి జిడ్డు కృష్ణమూర్తి. విరాగి, విశ్వబోధకుడు, జీవనమార్గదర్శి అయిన జిడ్డు కృష్ణమూర్తి మతప్రచారం సత్యవినాశనానికి దారి తీస్తుందని ధైర్యంగా చెప్పారట.

మన భారతదేశం ఒక పుణ్యస్థలం. ఇక్కడ ఎందరో యోగులు తమ జన్మచరితార్ధకం చేసుకున్నారు. ఇతరులకోసం వారు చేసిన హితబోధలు మనం మర్చిపోకూడదు. వారి జీవిత విశేషాలు తెలుసుకోవడంవలన మంచిమార్గానికి బాట వేసుకునే ప్రయత్నం కొంచెమైనా చేసుకోగలుగుతాము. మార్గం బాగుంటే నడక సాఫీగా సాగుతుంది కదా. నడక సాఫీగా సాగితే జీవనపయనంలో ప్రశాంతత లభిస్తుంది. ఏ వ్యక్తికైనా బ్రతుకులో కావలసినది అదేగా. మనశ్శాంతిలేని బ్రతుకు జీవితంలా ఉండదు పోరాటంలా ఉంటుంది. అంతకంటే దుర్భరమైన స్థితి మరొకటి లేదు. ఆధ్యాత్మికతకి దూరంగా ఉండేవాళ్ళు కూడా భారతీయ యోగుల గురించి చదవాలి. మహర్షులు, మునీశ్వరులు, యోగులతో ప్రసిద్ధి పొందిన మన భారతదేశం ప్రపంచ దేశాలన్నిటిలో ప్రఖ్యాతి పొందినదన్న విషయం మరచిపోకూడదు.

రచయిత్రి సంధ్యా యల్లాప్రగడ ‘భారతీయ యోగులు అనే ఈ పుస్తకాన్ని ప్రచురించినందుకు అభినందనలతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

Exit mobile version