భావ కవితల పాలవెల్లి.. ఆంధ్రా షెల్లీ

0
2

[దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిపై చంద్రకళ దీకొండ గారి ‘భావ కవితల పాలవెల్లి.. ఆంధ్రా షెల్లీ’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]ఒ[/dropcap]కప్పుడు కవిత్వమంటే పద్యరచనే. క్రమంగా ద్విపద, వచన కవిత్వం ఆ జాబితాలోకి చేరాయి. తెలుగు జనజీవనంలో 12వ శతాబ్దానికి పాట ఉనికి పాల్కురికి సోమనాథుని బసవ పురాణం కాలం నుంచి ఉన్నదని తెలుస్తోంది. అన్నమయ్య కాలం నుంచి పద కవితా విన్యాసం అందరి మెప్పుని పొందింది. రాగరంజితమైన పాట జన హృదయరంజితమైంది. క్షేత్రయ్య మువ్వగోపాల పదములు, హరికథలు, బుర్రకథలు, తోలుబొమ్మలాటలకు అనుగుణంగా పాటలొచ్చాయి. తదుపరి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఛాయాచిత్రాలుగా పరిణతి చెంది, మరింత రసరమ్యంగా, హృదయంగమంగా తయారై విస్తృత ప్రచార సాధనాలుగా, క్రమంగా దృశ్యకావ్యాలుగా మార్పు చెందాయి. ఆ నేపథ్యంలో భావకవులు ఖ్యాతినార్జించుకుని, ప్రేక్షకుల హృదయాల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్నాయి.

ఆ పరంపరలోని భావకవి,మనసున మల్లెల మధుర భావనలను సరళ,లాలిత్యమైన అచ్చతెనుగు పదజాలంతో సామాన్యుని మనోవీధిలో ఎగసి,ఎగిరించే శక్తి కృష్ణశాస్త్రికి కాక అన్యులకు అసాధ్యం!

ఆకాశవీధిలో హాయిగా ఎగిరే మేఘమాలికలను ప్రేమికుల నడుమ విరహసందేశాలుగా పంపగల అభినవ కాళిదాసు ఆయన! రాగాలు మల్లెపొదలై మదిలో విరిసి, పూలై పూసి చిరుగాలికి సౌరభాన్ని అందిస్తే, అది నలుదిక్కులా వెదజల్లి బ్రతుకంతా ప్రతి నిముషం పాటలాగా సాగాలని ఆశించడం అనుచితం కాదేమో!

నవంబర్ ఒకటో తేదీన,1897 లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపాలెంలో పండితవంశాన ఉదయించి, పిఠాపురంలో విద్యాభ్యాసం సాగించిన కృష్ణశాస్త్రి గారికి పువ్వు పుట్టగానే పరిమళించినట్లు కవిత్వ వాసన అబ్బింది. 1929 వ సంవత్సరంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని శాంతినికేతన్ వద్ద కలిసాక ఆ పరిమళం పైపైకి ఎగసి, ప్రపంచమంతా పాకి ‘ఆంధ్రా షెల్లీ’ బిరుదును సంపాదించి పెట్టింది. ఆంగ్ల సాహిత్యంలో అభిరుచి ఒక కారణం కావచ్చును.

ఆకాశవాణిలో చేరిన తర్వాత తెలుగు సాహిత్యమే వ్యాపకం కావడంతో మనస్ఫూర్తి అవిరళ కృషికి మార్గం సుగమమైంది.

ఆ రోజుల్లో బ్రహ్మసమాజ భావజాలానికాకర్షితుడై,ముఖ్యంగా బెంగాలీ ప్రముఖుల ఆదర్శాలకు ప్రభావితుడై వ్రాసిన పాటలు ఆకాశవాణిలో ప్రసారమైనవి.

కందుకూరి వీరేశలింగం, రఘుపతి వెంకటరత్నం నాయుడు గార్ల శిష్యరికంలో బ్రహ్మసమాజ ప్రభావ గీతాలతో ప్రారంభించి, ఆకాశవాణి కొరకు దేశభక్తి గీతాలు, గేయ మాలికలు, గేయకృతులు, పద్య కవితలు, లలిత లాలిత్య గీతాలు, సంగీత రూపకాలు, పిల్లల పాటలు, తిరుప్పావై పాశురాలతో ప్రాచుర్యం గడించారు. రవీంద్ర కవిత్వానికి ఆయన అద్దిన భావతళుకులు ఎందరినో ఆకట్టుకున్నాయి. పద్యానికైనా, పాటకైనా, మరే సాహిత్య రూపమైనా, రూప వ్యవస్థ కంటే భావోన్నతే ముఖ్యమని ప్రకటించి, భావకవి అయ్యారు.

రవీంద్రుని గీతానికి కృష్ణశాస్త్రి గారి స్వేచ్ఛానువాదం

ఇచటనే నీ చరణపీఠి; ఇచటనే దరిద్రులందు బతితులందు క్షుద్రులందు

నీ పదములు కదలక నిలుచునోయి–

ఎంత వంచిన శిరమిది, హే ప్రభూ!

దరిద్రులందు బతితులందు క్షుద్రులందు

సాగు నీ పాదముల నందజాలదోయి—

నా ప్రణామమ్ము కరము వినమ్రమయ్యు!

విగత భూషణుడవై దీనవేషివై

దరిద్రులందు బతితులందు క్షుద్రులందు

నెపుడు నడయాడు నీచెంతకేగలేదు

నా యహంకార మెంతటిదోయి నాథ!

తోడునీడవై నెచ్చెలికాడవై

దరిద్రులందు బతితులందు క్షుద్రులందు

దడయుదువు నీవు;నీ సన్నిధానమునకు

నేనెన్నడేని రానోపునా యీ యెడంద!

బ్రహ్మసమాజపు ఆదర్శాల నీడలో  వ్రాసిన పాట

ఏ జాతి వాడవో బ్రాహ్మణుండవో

తేజమే చెడి దేవదేవు నడుగులను విడి!

బిగిసె సిగలో కులము,బిగిసె జంధ్యపు త్రాళ్ల!

సగము క్రుళ్ళితి కాని తెగదు తెగదంటావు?

వాడు వద్దంటావు మీదు క్రిందంటావు!

బీదసాదల ప్రభుని విడిచి మతమంటావు?

లోన చేయీకటి రొదలు, పైన ద్వేషపు గదులు

వేదకాలంనాటి వెలుగు నాదంటావు!

బ్రహ్మసమాజపు పోకడలు చూపుతూ, అణువణువున గుడి ఉంది-అందరిలో గుడి ఉంది-ప్రతి పురుగూ ఎగిరే దైవం-ప్రతి మనిషీ నడిచే దైవం అంటూ వ్రాసిన గీతంలో

శిథిలాలయమ్ములో శివుడు లేడోయి

ప్రాంగణమ్మున గంట పలుకు లేదోయి

దివ్యశంఖము గొంతు తెరువలేదోయి

పూజారి గుడినుండి పోవలేడోయి!

చిత్ర చిత్రపు పూలు చైత్ర మాసపు పూలు

ఊరూర నింటింట ఊరకే పూచాయి

పూజారి కొకటిని పూవు లేదోయి!

వాడవాడలా వాడె!జాడలన్నిటా వాడె!

ఇంటి ముంగిట వాడె!ఇంటింటిలో వాడె

శిథిలాలయమ్ములో శిలను సందిటబట్టి

పూజారి వానికై నిలిచియున్నాడోయి–

అతని పాటల్లో గల రాగ,తాళ పరిజ్ఞానం, వినేవారి నరనరాలను పట్టి, మనస్సులనూగించి, మరపురాని మధురగీతాలై ఎంతో పేరు తెచ్చిపెట్టాయి.

తిరుప్పావై పాశురాలలోని ప్రధాన అంశాన్ని పల్లవితో పొదిగి, తక్కిన భాగాన్ని అనుపల్లవిగా మార్చి, అమృతవల్లి సుందరం గారు శాస్త్రీయ సంగీత నిబద్ధతతో బాణీ సమకూర్చగా, ఆకాశవాణిలో ప్రసారమైన ఆ పాశురాలు ప్రజాదరణ పొందాయి.

మరో బ్రహ్మసమాజ సర్వజన హిత గీతం

నారాయణ నారాయణ అల్లా అల్లా

మా పాలిటి తండ్రీ నీ పిల్లలమేమెల్లా–

మతమన్నది నా కంటికి మసకైతే

మతమన్నది నా మనసుకు మబ్బైతే

మతం వద్దు,గితం వద్దు,మాయామర్మం వద్దు

ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే

కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే

మతం వద్దు,గతం వద్దు,మారణహోమం వద్దు!

తెలుగుతల్లికి మంగళం

నాకమందిన పగటివేళ

నరకమంటిన కారురేల

ఏకగతి తెలుగమ్మ నడిపిన

ఏకయంతకు మంగళమ్!

వేదవేదములన్ని తరచి

వాడ భేదములన్ని మరచి

స్వాదు ధర్మపథమ్ము పరచు

విశాలశీలకు మంగళం!

మనోవీధిని సంచరించే నీలినీడల ఛాయలు ఆమె కళ్ళలో ప్రతిబింబిస్తుంటే-గీత రూపాన్ని కూర్చుకుని–

ఊర్వశి కావ్యంలోని

ఆమె కన్నులు

ఆమె కన్నులలో ననంతాంబరపు నీలినీడలు కలవు

వినిర్మలంబు పూరా గంభీర శాంత కాసార చిత్ర

హృదయములలోని గాటంపు నిదురచాయలందు నెడనెడగ్రమ్ము

సంధ్యావసాన

సమయమున నీ పదపాదప శాఖికాగ్ర

పత్రకుటిల మార్గముల లోపల వసించు

ఇరుల గుసగుసల్ వానిలో నిపుడు నపుడు వినబడుచునుండు

మరికొన్ని వేళలందు

వానకారు మబ్బులమొయి వన్నె వెనుక

దాగు భాష్పమ్ములామె

నేత్రములలోన పొంచుచుండును

ఏదియొ అపూర్వ మధుర

రక్తి స్ఫురియించు

కానీ అర్థము కాని భావగీతమ్ములివి…

పాట పక్షి వంటిది-

మాట మనిషి వంటిది

అంటారు కృష్ణశాస్త్రి!

అతని పాండిత్యం కంటే ప్రతిభ నవనవోన్మేషంగా ఉంటుంది. పసిప్రాయంలోనే సమర్లకోటలో జరిగిన సాహిత్య సభలో గళం విప్పి, ఆశుకవిత్వం చెప్పి అందర్నీ ఆశ్చర్యచకితులను చేసిన ఆయన రాశి కంటే వాసికే ప్రాధాన్యతనిచ్చారు.

కాలము మారినప్పుడు కవిత్వం మారకుండునా అని నూతన భావాలకు కవాటాలు తెరిచిన భావప్రియుడు.

కృష్ణపక్షం, ప్రవాసము, ఊర్వశి, కన్నీరు, నిశ్రేణి, పల్లకి వంటి పద్య ఖండకావ్యాలు–ధనుర్మాసం, అరుణరథం వంటి నాటకాలు; శర్మిష్ట వంటి గేయ శ్రవణ నాటికలు, లలిత గీతాలు, జాతీయగీతం తరువాత అంతటి పేరుప్రఖ్యాతులు పొందిన జయజయజయ ప్రియభారత జనయిత్రీ, తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా వంటి దేశభక్తి గీతాలు, అనువాద కవితలు—మరెన్నింటినో రచించారు.

ప్రకృతి, ఆత్మాశ్రయ కవితలే కాక, హాస్యాన్ని పండించుటలో చతురులు. ఆ రోజుల్లో పుట్టి ఉంటే, బహుకాల దర్శనం, పుష్పలావికలు వంటి వ్యాసాలు వ్రాయుటలో సిద్ధహస్తులు.

నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు

నా ఇచ్ఛయే గాక నాకేటి వెఱపు

పక్షినయ్యెద చిన్న ఋక్షమయ్యెదను

మధుపమయ్యెద చందమామనయ్యెదను

మేఘమయ్యెద వింత మెరపునయ్యెదను”

అంటూ కృష్ణపక్షం లోని అన్వేషణంలో తన స్వేచ్ఛా ప్రియత్వాన్ని చాటారు.

తిమిరలత తారకా కుసుమములదాల్చ

కర్కశశిలయు నవజీవ కళలదేర

మ్రోడు  మోకు  చివురులెత్తి మురువుసూప

జగమునిండా స్వేచ్ఛాగాన ఝరులనింతు!!

అంటూ

దట్టమైన చీకటి తారక తానై,లోకాన్ని వెలుగులో చైతన్యవంతం చేస్తానని చాటారు.

నాకుగాదులు లేవు నాకుషస్సులు లేవు

నేను హేమంత కృష్ణానంత శర్వరిని అంటూ గంభీరమైన తన గానంతో పలువురు భావకవుల కవనాలను ఊరూరా తిరిగి, ప్రచారం చేసి, భావకవిత్వ నిరసనకారుల నోళ్లు కట్టారు.

కృష్ణశాస్త్రి విరచిత ప్రఖ్యాత కవితా పంక్తులు కొన్ని

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?

చంద్రికలనేల వెదజల్లు చందమామ?

ఏల సలిలంబు పారు?గాడ్పేల విసరు?

ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

———(ఏల ప్రేమింతును!)

తలిరాకు జొమ్పముల సం

దుల త్రోవల నేలవాలు తుహినకిరణ కో

మల రేఖవొ!పువుదీపవొ!

వెలదీ, యెవ్వతీవు నీ పవిటపీ వనిలోన్?

———-(అన్వేషణము)

ఎలదేటి చిరుపాట సెలయేటి కెరటాల

బడిపోవు విరికన్నె వలపు వోలె

తీయని మల్లెపూదేనె సోనలపైని

దూగాడు తలిరాకు దొన్నె వోలె

తొలిప్రొద్దు తెమ్మెర త్రోవలో పయనమై

పరువెత్తు కోయిల పాటవోలె

వెల్లువలై పారు వెలది వెన్నెలలోన

మునిగిపోయిన మబ్బుతునుక వోలె

చిరుత తొలకరి వానగా,చిన్ని సొనగ

పొంగిపొరలెడు కాల్వగా,నింగికెగయు

కడలిగా పిల్లగ్రోవిని వెడలు వింత

తీయదనముల లీనమైపోయె నెడద

——-(కృష్ణపక్షము లోని అన్వేషణ ఖండిక)

మధోదయంలో మంచి ముహూర్తం-మాధవీలతకు పెళ్ళీ-పెళ్ళీ

మాధవి పెళ్లికి మల్లె మాలతీ మందారం పేరంటాళ్ళూ

కొమ్మకొమ్మకో సన్నాయి-రెమ్మరెమ్మకో గవాయి

కొమ్మా రెమ్మా కలసిమెలసీ-మామిడి గుబురంతా ఒకటే హాయి

నందనవనమే పందిరి అయితే-మసృణ కిసలయ మంటపమైతే

మనసు కుసుమాలే మావికలైతే-మాధవీలతకు మాధవదేవుడు మంగళసూత్రం కడతాడూ

—-కృష్ణశాస్త్రి గారి మేనకోడళ్లు వింజమూరి సీత, అనసూయలు బాణీ కట్టి పాడారు.

1964 లో ఈ కవిగాయకుని స్వరపేటిక మూగవోయిన వేళ–

ముసలితనంలో మూగతనం భయంకరం-శిథిలమందిరంలో అంధకారంలాగున

అంత లజ్జా విషాద దురంత భార సహనమున కోర్వలేని ఈ పాడుబ్రతుకు

కానీ మూగవోయిన నా గళమ్మునను గూడ-నిదురవోయిన సెలయేటి రొదలు గలవు

అని ముందెన్నడో వ్రాసుకున్నది నిజం చేస్తూ ఎన్నో పాటలు వ్రాసారు.

——- ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి

కవిత్వం ఒక ఆల్కెమీ-దాని రహస్యం కవికే తెలుసు

కాళిదాసుకు తెలుసు-పెద్దన్నకు తెలుసు

కృష్ణశాస్త్రికి తెలుసు-శ్రీ శ్రీ కి తెలుసు

——- తిలక్

ధనుర్మాసం,అరుణరథం—

నాటకాలు

శర్మిష్ట–గేయ,శ్రవణ నాటికలు

ప్రాచీన, నవీన, ప్రగతివాదాల త్రివేణీ సంగమం ఆయన రచన.

అమృతవీణ గేయమాలికలు

ఒదిగిన మనసునా ఒదిగిన భావమూ

కదిపేదెవ్వరో–కదిపేదెవ్వరో

//ఒదిగిన//

ఆ—-ఆ—–ఆ—-

కదిపేదెవ్వరో-కరపేదెవ్వరో

కరగని మనసునా కదలని తీగెను

కదిపేదెవ్వరో-కదిపేదెవ్వరో

//ఒదిగిన//

హృదయము రాయిగా

గళమున రేయిగా

కదలని దీనుని

గతి యిక ఎవ్వరో

నాకై ప్రాణము  గానము తానై

నడిపేదెవ్వరో-నడిపేదెవ్వరో

ఆ—–ఆ—–ఆ—-

కదిపేదెవ్వరో-కరపేదెవ్వరో

//ఒదిగిన//

వెన్నెలరీతి ఆహ్లాదగీతం

రెల్లుపూల పానుపు పైన

జల్లు జల్లులుగా ఎవరో చల్లినారమ్మా

వెన్నెల చల్లినారమ్మా //రెల్లు//

కరిగే పాల కడవలపైన నురుగు నురుగులుగా

మరిగే రాధ మనస్సుపైన తారక తరకలుగా

ఎవరో పరచినారమ్మా-వెన్నెల పరచినారమ్మా //రెల్లు//

కడిమి తోపుల నడిమి బారుల

ఇసుక బైళుల మిసిమి దారుల

రాసి రాసులుగా

ఎవరో పోసినారమ్మా-వెన్నెల పోసినారమ్మా //రెల్లు//

ఇక్షురసార్ణవం

వేచి చూడడంలో బాధ-ఆనందం

అలికిడైతే చాలు ఆశతో నా కనులు

వెదకేను నలుదిశలు అతనెమొ అనుకునీ

కమ్మతావులతోడ నెమ్మదిగ ననుచేరి

నీలిముంగురులతో గాలి ఊయలలూగ

వెదకేను నలుదిశలు అతనేమొ అనుకొనీ//అలికిడైతే//

2)

కనులు మూసి నేను కలత నిద్దురపోవ

జాజిపూవుల మాల జారి చెక్కిలి తాక

వెదకేను నలుదిశలు అతనేమొ అనుకొనీ//అలికిడైతే//

3)

రోజాలు కోయగా తోటలోనికి పోగ

కొంటె ముల్లొకటి నా కొంగు చివరను లాగ

వెదకేను నలుదిశలు అతనేమొ అనుకొనీ //అలికిడైతే//

ఏను మరణించుచున్నాను.ఇట నశించు

నా కొఱకు చెమ్మగిల్లిన నయనమ్ము లేదు–

అందుకే వెళ్లిపోతున్నాను భువి నుండి దివికి

ఇక దిగిరాను దిగిరాను దివి నుండి భువికి

అంటూ సుప్రశాంత సుందర తీరాలకు ప్రవాసిగా వెళ్లిపోయిన కృష్ణశాస్త్రి గారిని ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

ఆయన బాధ ప్రపంచానికి బాధ అన్న చలం మాటల వెనుక ఆంతర్యాన్ని గ్రహిద్దాం!

ఆకులు రాలని, పూలు వాడని నిత్య వసంతోదయం అంటూ విమర్శకుల ప్రశంసలు పొందారు.

ఆకాశపు నొసట పొడుచు అరుణారుణ తార

ఏకాకి నిశీధి నొడుచు తరుణ కాంతిధార

జయపతాక!యువ పతాక!వియదాపగ వెడలు నౌక

ధగధగా స్వతంత్ విభాతాకాశము

నొసట పొడుచు అరుణారుణ తార

——- (మంగళకాహళి

సుభాష్ చంద్రబోస్ పై ఉత్తేజపూరిత గీతం)

ముందున్నది యువ మహాయుగం అంటూ

విద్యార్థి ఉద్యమకారుల కుద్దీపన కలిగించిన అభ్యుదయ భావాలు ఆయనవి.

ట్రంకు పెట్టెలనిండా నోటుబుక్కులు నిండి ఉండేవని వారి అబ్బాయి, ప్రఖ్యాత చిత్రకారులు బుజ్జాయి

సాహితీవేత్త సుబ్బరాయశాస్త్రి శ్రీశ్రీతో అన్నారు.

“ఆంధ్రదేశపు నిలువుటద్దం బద్దలైంది. షెల్లీ మళ్లీ మరణించాడు. వసంతం వాడిపోయింది” అని శ్రీశ్రీ నివాళులర్పించారు.

భావ కవితల పాలవెల్లి ఆంధ్రా షెల్లీ

అతనిని బంధువులు వెలివేసినా.. హరిజనోద్ధరణకై అడుగులు వేసారు. సంఘ సంస్కర్తయై కళావంతులకు వివాహాలు జరిపించారు.

లాలిత్యం, సారళ్యం, ప్రకృతి సౌందర్యం, సౌకుమార్యం కలిగిన తలిరాకు జొన్పములు, తుహిన కిరణపువుదీవలు జాబిలికూన వంటి అచ్చ తెనుగు పదాలతో కూడిన ఇక్షురసార్ణవ కవిత్వంతో, తేనెల తేటల మాటలతో “మంగళ కాహళి”  నూది  జయ జయ జయ ప్రియభారతి జనయిత్రీ అంటూ తెలుగు తల్లి సిగపాయలమందారాలను తురిమి మెడ చుట్టూ గులాబీల హారాన్ని అలంకరించారు.

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు

నా ఇచ్ఛయె గాక నాకేటి వెరపు

అంటూ సింహం జూలు వంటి తన జుట్టు నెగరేసి వక్కాణించారు.

మల్లెల వేళ, వెన్నెల మాసం అంటూ అటుదిటుగా వ్రాసినా.. తొందర పడిన కోయిల కదా అంటూ దీటుగా సమర్థించారు.

అతను శోక భీకర లోకైక వాసి

అతని జీవితం ఉగాదులు,ఉషస్సులు లేని కృష్ణపక్షం

ఆకులో ఆకై, పూవులో పూవై ప్రకృతి సౌందర్య ఆస్వాదనలో మోయలేని హాయిని మోస్తూ తిరిగే,గుండె గుబులైపోయే

అతని బాధ ప్రపంచానికి బాధ!

అయితేనేం.. వ్రాసింది రాశిలో తక్కువైనా.. నాలుగు వందల కవుల మధ్య నిలిచిన పన్నెండుగురు మేటి పథ నిర్దేశకుల మధ్య మేటియై నిలిచిన కళాప్రపూర్ణుడు ఆయన!

మనసున మల్లెల మాలలూపే మల్లీశ్వరిపాటలతో సినిమా పాటలకు కావ్య గౌరవం కల్పించి…

ప్రతిరాత్రి వసంతరాత్రి

కుశలమా.. నీకు కుశలమేనా

పగలైతే దొరవేరా,చుక్కలతో చెప్పాలని, రాకోయి అనుకోని అతిథి వంటి లలిత శృంగార గీతాలను,

మావిచిగురు తినగానే, గోరింట పూచింది కొమ్మ లేకుండా, మేడంటే మేడ కాదు, గట్టు కాడ ఎవరో, చాలులే నిదురపో జాబిలికూన, సడి చేయకో గాలి వంటి మధుర గీతాలను..

రానిక నీ కోసం, దూరాన దూరాన తారాదీపం, “నా దారి ఎడారి” వంటి గుండె గుబులైపోయే, నిప్పుల వేదన ను తలపించే విషాద గీతాలను…

అడుగడుగున గుడి ఉంది, ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు, కొలువైతివా రంగశాయి, ముందు తెలిసెనా ప్రభూ, “ఘనా ఘన సుందర” వంటి ఘనమైన భక్తి గీతాలను రచించిన పద్మభూషణుడు!

కాల విహంగ పక్షముల దేలియాడి

తారకామణులతో తారయై మెరసి

మాయమయ్యెదనుగా మధుర గానమున అంటూ

పదిలంగా అల్లుకున్న పొదరింటిని విడిచి

బ్రతుకంతా ప్రతి నిమిషం పాడుకునే పాటలను మనకందించి..

మన మనసులలో

ఆరకుండా వెలిగే కార్తీకదీపమై

నిలిచిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here