Site icon Sanchika

భావ ప్రకటన-1

[మాయా ఏంజిలో రచించిన ‘Communication 1’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(ఒక ప్రేమబంధపు ఆది, అంతం రెండూ కనిపిస్తాయీ కవితలో!!)

~

[dropcap]ఆ[/dropcap]మె అతడి నుంచి
ఒక ప్రేమికుడిచ్చే ముద్దును కోరుకుంది
ఓ జంటరాత్రులను కోరుకుంది
చిక్కటి వృక్షాల మధ్య
పారే నీటి అంచులలోను
వాళ్ళు ఒకరినొకరు అల్లుకుపోయారు

వంపు తిరిగిన నెలవంక కురిసే
కాంతి సంవత్సరాల దూరాన్ని
ఆమెకి గుర్తు చేస్తూ
అతడు గ్రీస్ గురించి మాట్లాడాడు
ఒకప్పటి పార్థినాన్ ఆలయం గురించి
క్లియోపాత్రా సుందర విలాస నౌకావిహారం
గురించి ఎన్నో మాట్లాడాడు

ఆకాశపు అంచుల నుంచి
ఉప్పుమయమైన సముద్రపు లోతుల దాకా
ఆమె పాద నర్తన చెలరేగిపోయింది

అతడింకా
పోప్ ని, బెర్నార్డ్ షా ని ఉటంకించాడు
‘కాచర్ ఇన్ ది రై’నవల గురించీ మాట్లాడాడు
•••
ఆమె తన చెప్పుల జతని పోగొట్టుకుంది
నర్తించే కాలివేళ్ళు నిర్జీవమై ఎండిపోయాయి
తర్వాత ఆమె
తన కనుబొమలను పూర్తిగా తుడిచేసుకుంది

ఎండిపోయి పొడిబారిన కళ్ళతో
ఆమె తన గదిలోకి నడిచింది
తన తల్లితో స్పష్టంగా ఇలా చెప్పింది
“అతడు చెప్పినదంతా నాకర్థమయింది
అతడన్నాడు – తాను ఇంకొకరిని ప్రేమిస్తున్నానని..”

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ

 

Exit mobile version